Corporation officials
-
దోచుకో..దాచుకో
నెల్లూరు సిటీ: కార్పొరేషన్లో అధికారులు, సిబ్బంది కుమ్మక్కై గుట్టుచప్పుడుగా దోపిడీ పాలన సాగిస్తున్నారు. భవనాలకు సంబంధించి ఏ అనుమతి కోసమైన కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే పీల్చిపిప్పిచేస్తున్నారు. లెట్రిన్సీట్ల కనెక్షన్ల మంజూరుకు సైతం కమర్షియల్ భవన యజామానుల నుంచి ఇంజినీరింగ్ అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్ల ఉన్నాయి. ఇందులో 17 డివిజన్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాలు, కమర్షియల్ ప్రాంతాల్లో డ్రైనేజీ అసిస్మెంట్లు ఉన్నాయి. మొత్తం 727 అసిస్మెంట్లు ఉండగా ఏటా కార్పొరేషన్‌కు రూ.40లక్షలు పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చే సమయంలో ఇంజినీరింగ్ అధికారులు..పన్నులు వేసే సమయంలో రెవెన్యూ అధికారులు దోపిడీకి తెరతీస్తున్నారు. ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏటా సుమారు రూ.2కోట్ల మేర కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో రూ.500కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. అయితే ఇంకా డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. డబ్బులు ఇస్తే సరి..లేకపోతే చుక్కలే కార్పొరేషన్ పరిధిలో ఇళ్లు, కాంప్లెక్స్‌లు నిర్మించుకున్న సమయంలో డ్రైనేజీ వ్యవస్థను ఆయా భవన యజమానులు ఏర్పాటు చేసుకోవాలి. కార్పొరేషన్ పరిధిలో అధిక సంఖ్యలో భవన యజమానులు సెప్టిక్‌ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్ని ప్రధాన, కమర్షియల్ ప్రాంతాల్లో కార్పొరేషన్‌కు సంబంధించిన మరుగుదొడ్ల పైపులైన్ ఉంది. ఆయా ప్రాంతాల్లోని భవన యజమానులు కార్పొరేషన్ పైపులైన్‌కు మరుగుదొడ్లను కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలంటే కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి కనెక్షన్ ఇస్తారు. 17 డివిజన్లకు గానూ ఒక ఏఈ, ఇద్దరు మేస్త్రీలు ఈ వ్యవహారం చూస్తున్నారు. అయితే ఇంజినీరింగ్ అధికారులు పైప్‌లైన్ కనెక్షన్‌కు భవన యజమానుల నుంచి రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే కొర్రీలు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారు. పైప్‌లైన్‌ను రిపేర్లు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. సమస్య ఎదురైనా ఆలస్యంగా మరమ్మతులు చేస్తున్నారు. దీంతో భవన యజమానులు తప్పని పరిస్థితుల్లో ఇంజినీరింగ్ అధికారులు అడిగిన మొత్తాన్ని ఇస్తున్నారు. ఏటా రూ.2కోట్ల మేర నష్టం ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు తమ ఆదాయం కోసం కార్పొరేషన్‌కు ఆదాయ వనరులకు గండి కొడుతున్నారు. ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై హాస్పిటల్స్, కాంప్లెక్స్‌లు, లాడ్జీలు, భారీ భవనాల మరుగుదొడ్ల(లెట్రిన్ సీట్లు) కనెక్షన్ల లెక్కల్లో తేడాలు చూపుతున్నారు. ఏటా డ్రైనేజీ కనెక్షన్ల రూపంలో కార్పొరేషన్‌కు కేవలం రూ.40లక్షల మేర మాత్రమే ఆదాయం వస్తోంది. ప్రస్తుతం డ్రైనేజీ పన్నుల రూపంలో దాదాపు రూ.3కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. లెక్కలు తారుమారు చేయడంతో రూ.2కోట్ల మేర కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం రాకుండాపోతుంది. ఇదే అదనుగా రెవెన్యూ అధికారులు ఏటా భవన యజమానుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అంతా మేము చూసుకుంటాం ఇంజినీరింగ్ అధికారులు లెట్రిన్ సీట్లకు పైప్‌లైన్ ఏర్పాటు చేసే సమయంలో పన్నులు తక్కువ వచ్చేలా తాము చూసుకుంటామని భవన యజమానుల నుంచి భారీగా డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు తాము చెప్పినట్లు నడుచుకుంటారని, లెట్రిన్‌సీట్లు లెక్కలు తాము చేసిందే ఫైనల్ అని చెప్పొకొస్తున్నారు. ఈ విధంగా ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు కార్పొరేషన్‌కు రావాల్సిన పన్నుల వసూళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కార్పొరేషన్ అనుమతులు, పైపులైన్ల కనెక్షన్ల కోసం ఉద్యోగులకు నగదు చెల్లించొద్దు. ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. –అలీంబాషా, కార్పొరేషన్ కమిషనర్ కొన్ని అక్రమ ఘటనలు ♦ నగరంలోని పొగతోటలోని ఓ ఆస్పత్రిలో భవన యజమాని వద్ద ఇంజినీరింగ్ అధికారులు భారీగా వసూలు చేసి 30 లెట్రిన్ సీట్లు ఉంటే కేవలం ఏడు లెట్రిన్‌సీట్లు ఉన్నట్లు పన్నుల లెక్కల్లో చూపించారు. ♦ ఇటీవల తిప్పరాజువారివీధి ఇళ్లు నిర్మించుకున్న ఓ భవన యజమాని డ్రైనేజీ పైప్‌లైన్‌కు కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకోగా కనెక్షన్ల మంజూరుకు ఇంజనీరింగ్ అధికారులు రూ.30వేలు వసూలు చేశారు. ♦ ట్రంకురోడ్డులో కమర్షియల్ భవనం నిర్మించిన యజమాని వద్ద ఇంజనీరింగ్ అధికారులు రూ.50వేలు డిమాండ్ చేశారు. నగదు ఇవ్వకపోవడంతో కొర్రీలు పెట్టడంతో తప్పని పరిస్థితుల్లో ఇచ్చి చేయించుకున్నాడు. -
అద్దె భవనాలే ముద్దు
► కార్యాలయూలకు సొంత భవనాలు కరువు ► భవన నిర్మాణాలకు స్థలాలివ్వని రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు ► కీలక శాఖలన్నీ బాడుగ భవనాల్లోనే.. ► నగరంలోని విలువైన స్థలాలు అధికార పార్టీ నేతలకు ధారాదత్తం ► నోరు మెదపని ఉన్నతాధికారులు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయూలకు సొంత భవనాలు కరువయ్యూరుు. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే మగ్గుతున్నారుు. నెలనెలా వివిధ ప్రభుత్వ శాఖలు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని బాడుగల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. భవనాలు నిర్మించుకునేందుకు స్థలాన్ని అడిగినా.. రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు స్థలాలు చూపించే పరిస్థితి లేదు. దీంతో చేసేదేమి లేక అద్దె భవనాల్లోనే కార్యాలయాలను నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఖాళీస్థలాల్ని అక్రమార్కులు కబ్జా చేస్తున్నా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువైన అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెడుతున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం స్థలాలు చూపించకపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా కేంద్రంలో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల్లేవ్.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండే ఎక్సైజ్ ఒంగోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికీ సొంత భవనం లేదు. దీంతో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సైతం సొంత భవనం లేదు. ఈ మూడు భవనాలకే నెలకు రూ.50 వేలకుపైనే బాడుగ చెల్లిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, తూనికలు, కొలతలు, రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు సైతం సొంత భవనాల్లేక అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్-1, 2 కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయాలూ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఏపీఎంఐడీ కార్యాలయం పరిస్థితీ అదే. ఇక పురావస్తు శాఖ, కార్మికశాఖ, నె్రహూ యువ కేంద్రం, పరిశ్రమల ఇన్స్పెక్టర్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లింపు.. ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయానికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు తగ్గకుండా అద్దెలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా కేంద్రంలోని అద్దె భవనాల్లో నడుస్తున్న కార్యాలయాలకే నెలకు రూ.లక్షల్లోనే అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులు లేని చాలా శాఖలకు ప్రభుత్వం స్థలమిస్తే సొంత భవనాలను నిర్మించుకునే పరిస్థితి ఉంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది కాబట్టి నగర పరిధిలోనే ప్రధాన కార్యాలయాలకుస్థలాలివ్వాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి జిల్లా కార్యాలయంతో పాటు మండల కార్యాలయాలకు సైతం ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు ఇటీవల ప్రకటించారు. కానీ, ప్రభుత్వ కార్యాలయూలకు స్థలాల కేటారుుంపు ఊసెత్తలేదు. ఒంగోలు నగరంలోని విలువైన స్థలాలను రెవెన్యూ, ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వకుండా అధికార పార్టీ ముఖ్యనేతలకు ధారాదత్తం చేస్తున్నారు. ఇప్పటికే రూ.10 కోట్లు విలువైన బిలాల్‌నగర్ స్థలాన్ని నగరానికి చెందిన ముఖ్యనేత అనుచరులకు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గతంలో ఈ స్థలాన్ని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ కోసం అధికారులు అడిగారు. అప్పట్లో ఈ స్థలం ఓ సొసైటీకి పట్టా ఇచ్చి ఉండటంతో అధికారులు ససేమిరా అన్నారు. ఆ తర్వాత సొసైటీకి ఇచ్చిన పట్టాను రద్దు చేసి తాజాగా ఆ స్థలాన్ని నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అనుచరులకు కట్టబెట్టేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక అద్దంకి బస్టాండ్‌లో ఉన్న విలువైన స్థలాన్ని సైతం కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన పచ్చనేతకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. సదరు నేత స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సైతం చేపట్టారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సుజాతశర్మ స్పందించి ఆ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడారు. దిబ్బలరోడ్డు ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని ఓ నేత తనదంటూ ఏకంగా అధికారులకు భారీగా ముడుపులు అప్పగించి ఎన్ఓసీలు తెచ్చుకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ అవినీతి బయటపడటంతో జిల్లా కలెక్టర్ పలువురు రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ స్థలాన్ని సైతం నగర ముఖ్యనేత తన సమీప బంధువు హాస్పిటల్ కోసం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా గద్దలగుంటలోనూ ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా నగరంలోని విలువైన స్థలాలను పచ్చనేతలు వరుసపెట్టి కబ్జా చేసేస్తున్నారు. అందిన కాడికి దండుకొని కొందరు రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని విలువైన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడటంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాల్సి ఉంది. -
విజయవాడలో కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం
-
జనం సొమ్ముకు..పచ్చ టెండర్!
⇔ కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నేత కుమ్మక్కు ⇔ టెండర్లు లేకుండానే రూ.18 లక్షల పనులు ⇔ 60 శాతం పనులు అయిపోయిన తర్వాత టెండర్లకు ఆహ్వానం ⇔ గతంలోనూ టెండర్లు లేకుండా కోట్లాది రూపాయల పనులు ⇔ ఒంగోలు నగరపాలక సంస్థలో వింత పోకడ ⇔ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ⇔ అరుునా యథేచ్ఛగా అక్రమాలు ⇔ ప్రజల సొమ్ము టీడీపీ నేతల పాలు ⇔ కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పనులు చేపట్టడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ నేతలు, కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కై ముందు పనులు చేయించి ఆ తర్వాత టెండర్లు పిలుస్తూ వింత పోకడకు తెరలేపారు. కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకొని ప్రజాధనానికి గండి కొడుతున్నారు. గతంలోనూ కోట్లాది రూపాయల పనులకు సంబంధించి ఇదే తీరు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నా మున్సిపల్ అధికారులు, టీడీపీ నేతలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపి అందినకాడికి దండుకుంటున్నారు. అయినా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. చక్రం తిప్పిన షాడో ఎమ్మెల్యే.. ఒంగోలు నగరంలోని రామ్‌నగర్ 6 నుంచి 7వ లైను వరకు, 7వ లైను నుంచి 8వ లైను వరకు గ్రీన్‌బెల్టు పేరుతో కార్పొరేషన్ అభివృద్ధి పనులు చేపట్టింది. 6వ లైను పనుల కోసం రూ.8,46,494/-, 7వ లైను పనుల కోసం రూ.9,24,296/- కేటాయించారు. మొత్తంగా రెండు పనుల కోసం రూ.17,70,790/- కేటాయించారు. ఈ మొత్తం నగరపాలక సంస్థసాధారణ నిధుల నుండి కేటాయిస్తారు. గ్రీన్‌బెల్టులో భాగంగా రెండు రోడ్ల మధ్య మొక్కలు, గ్రీనరీ పెంచాల్సి ఉంది. దీనికి రక్షణగా ఇరువైపుల 6 అడుగుల ఎత్తున ఐరన్ పోల్స్‌ను ఏర్పాటు చేసి, ఐరన్ బాలీ (ఫెన్సింగ్)ను నిర్మించాల్సి ఉంది. ఈ పనుల కోసం మున్సిపల్ అధికారులు ఈ నెల 2న పేరుకు టెండర్లు పిలిచారు. 14వ తేదీన టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే నగరానికి చెందిన అధికార పార్టీ నేత ఆదేశం మేరకు ఆ పనులను ఆయన ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ కమిటీకి అప్పగించారు. కమిటీలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించే అనుచరుడు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా జోరుగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ అధికారులు టెండర్లు మాత్రం తెరవలేదు. పేరుకు టెండర్లు నిర్వహించి టెండర్ ఓపెన్ చేయకుండానే కాంట్రాక్టర్‌తో పనులు చేయించడం చూస్తే కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది. రెండు పనులకు సంబంధించి దాదాపు రూ.18 లక్షలు కేటాయించారు. టెండర్లలో పోటీ నిర్వహించి ఉంటే 20 శాతం తక్కువకు పనులు ఖరారు అయ్యేవి. ఈ లెక్కన దాదాపు రూ.4 లక్షలు ప్రజాధనం మిగిలేది. టెండర్లకు పోటీకి వచ్చే కాంట్రాక్టర్లను ఇప్పటికే ఆ పనులను వేరే కాంట్రాక్టర్లకు అప్పగించామని మీరు పోటీలో పాల్గొనవద్దని, కాదని పాల్గొంటే ఇబ్బందులు పడతారంటూ ఇంజినీరింగ్ విభాగం అధికారులే బెదిరించడం గమనార్హం. ముఖ్యనేత ఆదేశాలతో అక్రమాల వెల్లువ.. నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత ఆదేశాల మేరకు కార్పొరేషన్ అక్రమాలకు అడ్డేలేకుండా పోతుందన్న విమర్శలున్నాయి. ముఖ్యనేత (ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ కమిటీ) నగరపాలక సంస్థ కార్యాలయూల్లో మకాం వేసి అధికారులను శాసిస్తున్నారు. తాము చెప్పినట్టే నిధులు ఖర్చు చేయాలంటూ, తాను నిర్దేశించిన పనులనే చేపట్టాలంటూ శాసిస్తున్నారు. టెండర్లు లేకుండానే పనులు చేయిస్తున్నారు. కాదు, కూడదంటే బదిలీ చేసుకొని వెళ్లిపోమ్మని అధికారులతో బెదిరిస్తున్నారు. దోచుకుంటున్న నిధుల్లో పచ్చ నేతలకు 8 శాతం, అధికారులకు 4 శాతం వాటాగా పంచుకుంటున్నట్లు కొందరు మున్సిపల్ అధికారులే చెబుతుండటం గమనార్హం. గతంలోనూ ఇదే తీరు.. టెండర్లు ఖరారు కాకుండానే ముందుగా పనులను చేయించడం ఒంగోలు మున్సిపాలిటీలో ఆనవాయితీగా మారింది. గతంలో బాలకృష్ణాపురంలో రెండు సిమెంట్ రోడ్ల నిర్మాణం, గాంధీపార్కులో విద్యుత్ స్తంభాలు, బల్బుల ఏర్పాటు, కమ్మపాలెం స్మశానవాటిక ప్రహరీగోడ నిర్మాణం పనులు సైతం ముందుగా చేయించి తర్వాత టెండర్లు ఖరారు చేశారు. టెండర్లు లేకుండానే కోట్లాది రూపాయల పనులు గుట్టుచప్పుడు లేకుండానే నిర్వహించారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్.. ఒంగోలు మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. అయినా సరే ఇక్కడ అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండాపోతోంది. విలువైన మున్సిపల్ స్థలాలను కూలగొట్టి అధికార పార్టీ నేతలకు ధారాదత్తం చేస్తున్నారు. మరో వైపు బండ్లమిట్ట, పోతురాజుకాలువ ప్రాంతాల్లో పేదల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసి ఆ స్థలాలను సైతం అధికార పార్టీ నేతలకు అప్పగించే ప్రయత్నానికి దిగినా.. పాలనాధికారి మిన్నకుండిపోయారన్న విమర్శలున్నాయి. దీంతో పాటు టెండర్లు లేకుండా కోట్లాది రూపాయల పనులు నిర్వహిస్తూ అధికారులు, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నా ఉన్నతాధికారి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలున్నాయి. -
సెల్లార్ల కథ.. కంచికేనా!
♦ కన్నెత్తి చూడని కార్పొరేషన్ అధికారులు ♦ విచ్చలవిడిగా నిర్మాణాలు..ఆపై వ్యాపార సముదాయాలు.. ♦ కాసులిస్తే అన్ని ఓకే.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల ఉదాసీన వైఖరికి ముడుపుల వ్యవహారమే ప్రధాన కారణం. విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగి సెల్లార్లలో వ్యాపారాలు కొనసాగుతున్నాయంటే అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతోంది. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారంలో సెల్లార్ల బాగోతం జోరుగా కొనసాగుతోంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. కార్పొరేషన్‌లోని 50 డివిజన్ల పరిధిలోని వ్యాపార సముదాయ ప్రాంతాలు ఉన్న చోట ఈ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదీ పరిస్థితి : నగరంలోని హైదరాబాద్‌రోడ్డు, ఖలీల్‌వాడి, గాంధీచౌక్, వినాయక్‌నగర్, కంఠేశ్వర్, సుభాష్‌నగర్ ప్రాంతాల్లో సెల్లార్లలోనే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం వ్యాపార సముదాయం నిర్మాణం కావాలంటే తప్పనిసరిగా సెల్లార్ ఉండాలి. ఇందులో పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలి. కానీ.. ఇటీవల భవన నిర్మాణాలు, వ్యాపార సముదాయాల కోసం నిర్మించిన వాటిలో సెల్లార్లు వ్యాపార సముదాయాలుగా మారుతున్నాయి. ఇలాంటి వారికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వకూడదు. పైగా వాటిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇవి ఏమి పట్టించుకోని అధికారులు నిమ్మకుండిపోతున్నారు. ⇒ హైదరాబాద్ రోడ్డులోని ఓ ప్రముఖ వ్యాపార సముదాయం నిర్మాణం జరిగి రెండేళ్లు అవుతుంది. ఇందులో వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. పార్కింగ్ కోసం వదిలివేసి ఉండాల్సి ఉండగా ఇక్కడ అవి ఏమి పట్టించుకోకుండా వ్యాపార సముదాయాలు నెలకొన్నాయి. ⇒ పూలాంగ్ సమీపంలోని ఓ కార్పొరేట్ వ్యాపార సంస్థ కొనసాగుతోంది. దాని కింది భాగంలో సెల్లార్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతోంది. సెల్లార్లోనే అత్యవసర సేవ లు, ఓపీ సేవలు అం దిస్తున్నారు. పార్కింగ్ మాత్రం ప్రధాన రోడ్డుపైనే కొనసాగుతోంది. ఈ ఆస్పత్రి కొనసాగేందుకు ప్రధా న రోడ్డును ఆక్రమించి డ్రెరుునేజీని మూసి వేశారు. అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుకు అనుకుని మెట్ల నిర్మాణం చేపట్టారు. అయినా కార్పొరేషన్ అధికారులు మేల్కొనడం లేదు. ⇒ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి కొనసాగుతోంది. ఈ భవనం సెల్లార్ విభాగంలో అత్యవసర విభాగం కొనసాగిస్తున్నారు. సెల్లార్ కోసం వదిలి వేయూల్సి ఉండగా ఇక్కడ వైద్యసేవలు అందిస్తున్నారు. ⇒ వినాయక్‌నగర్‌లోని ఓ వ్యాపార సముదాయం కొనసాగుతోంది. ఈ నాలుగంతస్తుల భవనంలో సెల్లార్ కోసం మొదట వదిలి వేసిన ప్రస్తుతం సెల్లార్లో వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారు. డ్రెరుునేజీని అక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ⇒ బస్టాండ్ సమీపంలోని మరో కాంప్లెక్స్‌లో విచ్చలవిడిగా వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ కాంప్లెక్స్ ముందు రోజు వందలాది వాహనాలు పార్కింగ్ చేయడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాంప్లెక్స్‌లోని సెల్లార్ విభాగంలో వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. వీటిపై కనీసం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ⇒ బోధన్ రోడ్డులోని ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన కాంప్లెక్స్‌లో సెల్లార్ నిర్మించగా ఇక్కడ వ్యాపార స ముదాయలు కొనసాగుతున్నాయి. ఇక్కడ రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఈ భవనానికి మున్సిపల్ అనుమతి కూడా లేదు. ⇒ వీక్లీబజార్లోని అపార్టుమెంట్లో సెల్లార్లో వ్యాపా ర సముదాయంలో కొనసాగుతోంది. అందులో నివసిస్తున్న వారు కోర్టుకు ఎక్కడంతో కోర్టు ఆదేశాలతో ఈ నిర్మాణాలను కూల్చివేశారు. ⇒ ఖలీల్వాడిలో ప్రధానంగా 80 వరకు భవనాలు ఉన్నాయి. ఇందులో అన్నింటిలో ప్రైవేట్ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి సెల్లార్ల నిర్మాణాలు అందుబాటులో లేవు. ప్రతి భవన నిర్మాణం సెల్లార్ లేకుండానే కొనసాగింది. అతి తక్కువ స్థలంలో 3, 4 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ⇒ అపార్టుమెంట్ల నిర్మాణంలో ఇదే విధానం కొనసాగుతోంది. సెల్లార్ల నిర్మాణంలో వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి యజమానులు డబ్బులు దండుకుంటున్నారు. కార్పొరేషన్ అధికారులకు ముడుపులు అందిస్తూ తప్పించుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. -
పేదల బతుకులపై పిడుగు
♦ బండ్లమిట్టలో మరో విధ్వంసం ♦ పేదల ఇళ్లు కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు ♦ రోడ్డున పడిన 30 కుటుంబాలు 40 ఏళ్లుగా అక్కడే నివాసం ♦ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం ♦ శనివారం సాయంత్రం ఉన్నపళంగా ఇళ్లు కూల్చివేత ♦ అధికార పార్టీ మద్దతుదారుల నివాసాల జోలికి వెళ్లని వైనం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పచ్చ పార్టీ నేతలు బరితెగించారు. ఒంగోలు కార్పొరేషన్ అధికారులను అడ్డుపెట్టి పేదల ఇళ్లను కూలగొడుతూ సొంత లాభం చూసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి ఆర్థిక లబ్ధే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. మంగళవారం నగరంలోని బండ్లమిట్ట ప్రాంతంలో ముస్లిం పేదల ఇళ్లు, దుకాణాలను కూలగొట్టి కార్పొరేషన్ అధికారులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఊరచెరువులో బోటింగ్ ఏర్పాటు చేసుకొని తద్వారా ఆర్థిక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే బండ్లమిట్టలో ఇళ్లు, దుకాణాల కూల్చివేతకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధ్వంసం మరువక ముందే శనివారం మరోమారు బండ్లమిట్ట ఉత్తరప్రాంతంలోని 30కిపైగా పేదల ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూలగొట్టారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అధికారులు పోలీస్ బందోబస్తుల మధ్య జేసీబీని తీసుకెళ్లి ఇళ్లను ధ్వంసం చేశారు. బాధితులు లబోదిబోమంటూ అడ్డుపడ్డా అధికారులు ఖాతరు చేయలేదు. కేసులు పెట్టి స్టేషన్లో పెడతామంటూ వారిని బెదిరించారు. ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లు కూల్చి రోడ్డున పడవేస్తారా... అంటూ నెత్తీనోరు బాదుకున్నా.. అధికారులు కనికరించలేదు. 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. గూడు కోల్పోయి కట్టుబట్టలతో బయటపడిన వారి ఆవేదన వర్ణనాతీతం. వారి మొర ఆలకించే వారు కరువయ్యారు. ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకొని బాధితులు లబోదిబోమంటున్నారు. బుడబుక్కల సామాజికవర్గానికి చెందిన 30కిపైగా కుటుంబాలు 40 ఏళ్లుగా అక్కడే జీవనం సాగిస్తున్నారుు. ప్లాస్టిక్, చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని అమ్మి పొట్టపోసుకుంటున్నారు. కొందరు కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కూలి డబ్బులను పోగేసుకొని ఊరచెరువుకు ఉత్తర ప్రాంతంలో చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకున్నారు. ఒక్కసారిగా కార్పొరేషన్ అధికారులు జేసీబీ తెచ్చి ఇళ్లు కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలైన తమకు ఎక్కడో చోట ప్రత్యామ్నాయం చూపించి ఉంటే వెళ్లిపోయేవారమని, అలా చేయకుండా దౌర్జన్యంగా ఇళ్లు కూల్చడం ఏమిటని వారు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఓట్లు వేయించుకొని ఇప్పుడు అందరినీ రోడ్డుపాలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులు పెద్దలు, అధికార పార్టీ నేతల స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకొని వారి జోలికి వెళ్లడం లేదని బాధితులు ఆరోపించారు. కూలగొట్టిన ఇళ్ల సమీపంలోనే అధికార పార్టీకి చెందిన వారి రేకుల షెడ్లను మాత్రం కూలగొట్టకపోవడాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తాము ఇళ్లను కూల్చివేస్తున్నట్లు కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. -
ఇళ్లు కోల్పోయిన వారిని సత్వరమే ఆదుకోవాలి
► ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిటీ ఎమ్మెల్యే ► వర్ష బీభత్స ప్రాంతాల్లో పర్యటన నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వర్షాల కారణంగా ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారిని సత్వరమే ఆదుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడచిన రెండు రోజులుగా కురుస్తున వర్షాలకు 13,15 డివిజన్లలోని పలుప్రాంతాల్లో ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. గురువారం ఎమ్మెల్యే ఆయా డివిజన్లలో పర్యటించారు. వర్షాల కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇళ్లు కూలిపోవడంతో తెలిసిన వారి పంచన తలదాచుకుంటున్నామని పలువురు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. విద్యుత్, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక కార్పొరేటర్లు చొరవ తీసుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు పడిపోవడం, ఇళ్లు కూలిపోవడంతో కొంత మంది నిరాశ్రయులయ్యారని వారికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు పక్కాగృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, కర్తం ప్రతాప్‌రెడ్డి, ఎస్కే సుభాన్, శివప్రసాద్‌రెడ్డి, ముదిరెడ్డి లక్ష్మీరెడ్డి, ముడియాల దశరథరామిరెడ్డి, ఎస్కే మాబు, నాగూరు నాగార్జునరెడ్డి, శివ, రవి, వినయ్, ప్రసాద్‌రెడ్డి, కొండారెడ్డి, సగిలి జయరామిరెడ్డి, గూడూరు సురేంద్రరెడ్డి, సింగంశెట్టి అశోక్, పత్తి చంద్రశేఖర్, గంధం సుధీర్‌బాబు, సుబ్బారెడ్డి, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏటా రూ.కోటి ఎగనామం..!
► గుంటూరు నగరపాలక సంస్థఆదాయానికి భారీ గండి ► ప్రైవేట్ వ్యక్తులకు పరిపాలనాచార్జీల వసూలు బాధ్యత ► ఏడాదికి రూ. 3.78 లక్షలచెల్లింపుతో సరిపెడుతున్న వైనం ► బకాయిల సొమ్ము రూ.1.60కోట్లకు సైతం ఎసరు ► అందినకాడికి జేబులునింపుకొంటున్న ఘనులు ► ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులు సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల పనితీరు...కంచే చేను మేసిన చందంగా ఉంది. కార్పొరేషన్ ఆదాయాన్ని దారి మళ్లించి ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపుతున్నారు. ఫలితంగా ఏటా రూ. కోటికిపైగా ఆదాయానికి గండిపడుతోంది. అలాగే నగరపాలక సంస్థకు రావాల్సిన బకాయిలు రూ. 1.60 కోట్లు సైతం వారికే అప్పగించారు. నగరంలోని వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే చెత్త సేకరణకు గత ఏడాది అధికారులు టెండర్లు నిర్వహించారు. దీని కోసం నగరాన్ని మూడు జోన్లుగా విభజించి నెలకు ఒక్కొక్కరు రూ. 10,500 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. చెత్త సేకరించే ప్రైవేట్ వ్యక్తులు వాణిజ్య సముదాయాలు, టీ షాపులు, టిఫిన్ బండ్ల నుంచి నెలకు రూ.60 వసూలు చేసుకొనేలా గజిట్ రూపొందించారు. అయితే నగరంలోని విద్యాసంస్థల హాస్టళ్లు, ప్రైవేటు వసతి గృహాల నుంచి నగర పాలక సంస్థ ప్రతి సంవత్సరం పరిపాలనా చార్జీలను వసూలు చేస్తోంది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల వల్ల కొంత పారిశుధ్య సమస్య ఏర్పడుతుంది. దీనికోసం ప్రతి విద్యార్థి నుంచి రూ. 150 చొప్పున నగరపాలక సంస్థ పరిపాలనా చార్జీలను వసూలు చేస్తుంది. తద్వారా నగర పాలక సంస్థకు ఏటా రూ.కోటికిపైగా ఆదాయం వస్తుంది. అయితే వాణిజ్య సముదాయాలతో పాటు పరిపాలనా చార్జీలను వసూలు చేసుకొనే హక్కును సైతం ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. అయితే నగరపాలక సంస్థకు మూడు జోన్లకు కలిపి నెలకు రూ. 31,500 చొప్పున ఏడాదికి రూ. 3.78 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. పరిపాలనా చార్జీల పరంగాా నగరపాలక సంస్థకు రావాల్సిన రూ.కోటి ఆదాయం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి చేరుతుంది. దీంతో పాటు అంతకు ముందు హాస్టళ్ల నుంచి రావాల్సిన రూ. 1.60 కోట్లు బకాయిలను సైతం వదిలేయడంతో ప్రైవేటు వ్యక్తులే వసూలు చేసుకుని భారీగా లబ్ధి పొందుతున్నారు. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరి పరిపాలనా చార్జీల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు ఉన్నతాధికారులకు తెలియంది కాదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బకాయిల సంగతేంటి... పరిపాలనా చార్జీల విషయంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కార్పొరేషన్‌కు రావాల్సిన బకాయిలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. 2011లో రూ.9.90 లక్షలు, 2012లో రూ. 44.27 లక్షలు, 2013లో రూ. 51 లక్షలు, 2014లో రూ. 67.42 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి పరిపాలనా చార్జీలను యూజర్ చార్జీలుగా బదలాయించి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. అయితే వీరు నగరపాలక సంస్థకు ఎంత చెల్లిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. -
‘సజీవ సమాధి’పై అధ్యయన కమిటీ
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా మట్టి పెళ్లలు మీద పడడంతో ఏడుగురు సజీవ సమాధైన సంఘటనపై కార్పొరేషన్ అధికారులు నలుగురు సభ్యుల అధ్యయన కమిటీని నియమించారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ పాండురంగారావు, స్ట్రక్చర్ ఇంజినీర్లు ఆంజనేయప్రసాద్, వేణుప్రసన్న, జి.శ్రీనివాసరావుతో కమిటీ వేశారు. ఈ కమిటీతో పాటు డీఆర్వో నాగబాబు, నగరపాలక సంస్థ సీపీ ధనుంజయరెడ్డి తదితరులు మంగళవారం ప్రమాదం జరిగిన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. అనంతరం ప్రమాద స్థలానికి పశ్చిమ వైపు ఉన్న పంచ్ హోటల్‌తో పాటు ఐదు భవనాలకు ప్రమాదం జరుగుతుందేమోననే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటిల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. లేడీస్ హాస్టళ్లలోని విద్యార్థినులను సైతం పంపించేశారు. ల్యాబ్ నుంచి నివేదిక రాగానే భవనాల్లోకి మళ్లీ అనుమతించాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు. బుధవారం పంచ్ హోటల్ స్థలంలోని కొంత భాగాన్ని కూల్చివేయాలని నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులకు కమిటీ సూచించినట్లు తెలిసింది. గోడ కూలిన వైపు నిర్మాణ స్థలంలో రిటైనింగ్ వాల్ నిర్మించాలని కూడా సూచించింది. అయితే బిల్డర్‌తో పాటు, టెక్నికల్ పర్సన్, స్ట్రక్చరల్ ఇంజినీర్ల లెసైన్సు రద్దు చేస్తూ నగర కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో దీన్ని ఎవరు నిర్మించాలనే దానిపై చర్చించి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం కమిటీ నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశమై పలు విషయాలపై చర్చించింది. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి గుంటూరు నగరంలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు జీవో నంబరు 16 ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె వివరించారు. కార్మికులకు హెల్మెట్లు వంటి సేఫ్టీ వస్తువులను తప్పనిసరిగా అందించాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. -
చక..చకా.. అవుట్‌ఫాల్ డ్రెయిన్ పనులు
► పనులైపై డీసీపీ కాళీదాసు ఆరా..! ► త్వరగా పూర్తి చేసేందుకు వీఎంసీ చర్యలు చిట్టినగర్ : కేఎల్‌రావునగర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఓ వైపున రైల్వే అధికారులు డ్రెయిన్ వెంబడి తమ హద్దులను నిర్ణయించినప్పటికీ కార్పొరేషన్ వెనుకంజ వేయకుండా పనుల వేగం పెంచింది. పనుల తీరుపై కాంట్రాక్టర్‌తో పాటు కార్పొరేషన్ అధికారులపై మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగళవారం తెల్లవారే సరికి పనిముట్లు, అదనపు కార్మికులను రంగంలోకి దింపారు. ఈఈ ఓం ప్రకాష్, డీఈ కోటేశ్వరరావు పనులను పర్యవేక్షించడమే కాకుండా ఎప్పటికప్పుడు పనుల పురోగతిని కమిషనర్ మొబైల్‌కు ఫొటోల రూపంలో పంపుతూ కమిషనర్ ఆదేశాలను ఆచరణలో పెడుతున్నారు. మూడు పొక్లెయిన్లతోపాటు నీటిని తోడే మెషిన్లు పెట్టారు. గోతుల్లో బెడ్ ఏర్పాటు చేయడంతోపాటు సైడ్ వాల్స్ కోసం బాక్స్‌లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రైల్వే డీఆర్ఎం డ్రెయిన్ వద్దకు విచ్చేసి పనులను పరిశీలించే అవకాశం ఉందని తెలియడంతో కొత్తపేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రెయిన్ వద్దకు డీసీపీ కాళిదాసు డ్రెయిన్ నిర్మాణం వివాదస్పదంగా మారుతుండటంతో నగర డీసీపీ కాళీదాసు, వెస్ట్ ఏసీపీ జి.రామకృష్ణ అంబేద్కర్‌నగర్‌కు విచ్చేశారు. డ్రెయిన్ నిర్మాణం కోసం తీసిన గోతులు ఎవరి హద్దుల్లో ఉన్నాయనే వివరాలతోపాటు సోమవారం రైల్వే సిబ్బంది పాతిన గడ్డర్లను, సరిహద్దులను పరిశీలించారు. వీఎంసీ డీఈ కోటేశ్వరరావును వివరాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈఈ ఓం ప్రకాష్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం త్వరగా పనులు పూర్తి చేసేందుకు అవసరమైన సామాగ్రి, కూలీలను ఏర్పాటు చేయాలని సూచించారు. -
తవ్వేసి.... చంపేసి
►అభివృద్ధి పనుల పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ►తిరుపతిలో భవనం కూలి ►విద్యార్థిని మృతి మరొకరికి తీవ్ర గాయాలు ►అధికారుల నిర్లక్ష్యంతో కూలిన భవనం ►బాలిక మృతి మరో యువతికి తీవ్రగాయాలు ►తిరుపతి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం ►బలైపోయింది. అభివృద్ధి పనుల పేరుతో నగరంలో కాలువల పునఃనిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సున్నపు వీధిలో ఇష్టారాజ్యంగా జేసీబీలతో తవ్వేశారు. కొన్ని చోట్ల భవనాలకు వేసిన పునాదులూ ఊడిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఓ చోట పాత భవనం పేకమేడలా కూలిపోయింది. దీని శిథిలాల కింద పడి ఓ విద్యార్థిని ప్రాణాలు విడిచింది. మరో విద్యార్థిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. తిరుపతి క్రైం: తిరుపతి నగర పాలక సంస్థ కాలువ నిర్మాణానికి తవ్విన గుంతల వల్ల బుధవారం సున్నపు వీధిలో భవనం కూలిపోయింది. దాని కింద పడి బాలిక మృతిచెందింది. ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మురళీకృష్ణ కథనం మేరకు.. తిరుపతి సున్నపువీధిలో మురుగు కాలువలు నిర్మించేందుకు నెల రోజులుగా జేసీబీతో గుంతలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి సున్నపు వీధిలో కాలువ పనులను ఇంటి పునాదుల పక్కనే చేపట్టారు. అదేవీధిలో రెండు అంతస్తుల భవనంలో లత కూతుళ్లు గిరీష్మ(18), నిహారిక (15), వారి సమీప బంధువువైన బాలిక ఉంటున్నారు. కింద ఫ్లోర్లో పండ్ల దుకాణాం ఉంది. బుధవారం తెల్లవారుజామున భవనం ఒక పక్కకు ఒరిగిపోయింది. భవనంపై ఉన్న లతను, ఆమె సమీప బంధువుల బాలికను స్థానికులు నిచ్చెన ద్వారా కిందకు దించారు. అకస్మాత్తుగా ఆ పాతభవనం కూలిపోయింది. భవన శిథిలాల కింద గిరీష్మ, నిహారిక ఇరక్కుపోయారు. సమాచారం అందుకున్న ఈస్ట్ సీఐ రాంకిషోర్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, అగ్నిమాపక అధికారి శంకర్ ప్రసాద్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జేసీబీతో భవన శిథిలాలను తొలగించారు. గిరీష్మ, నిహారికను రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహారిక మృతిచెందింది. ఆమె తండ్రి గతంలో చనిపోయాడు. తల్లి లత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటోంది. గిరీష్మ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిహారిక ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసింది. నిహారిక మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. గాయపడిన గిరీష్మాను మొదటగా రుయాకు, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత వేలూరు స్విమ్స్‌కు తరలించారు. భవనం వెనుక నివాసముంటున్న మృతురాలు నిహారిక తాతయ్య మునికృష్ణయ్య, నానమ్మ పద్మావతి అందులోనే ఇరుక్కుపోయారు. అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది శిథిలాలను తొలగించి వృద్ధులను కాపాడారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమ నాయుడు, జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్, నగర పాలక కమిషనర్ వినయ్‌చంద్, అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి, అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై అగ్నిమాపక, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. శిథిలాలను తొలగించి వెంటనే కాలువలో కాంక్రీట్‌తో నింపాలని అధికారులు ఆదేశించారు. పురాతన భవనాల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయాలి చెప్పారు. సంఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదికను హోంమంత్రి చిన్నరాజప్పకు పంపించాలని అధికారులు ఆదేశించారు. మృతుల కుటుంబాలను అదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. నగర పాలక సంస్థ అధికారులు ఎటువంటి సూచన లేకుండా లోతుగా కాలువలు తవ్వడంతోనే భవనం కూలిపోయిందని స్థానికులు ఆరోపించారు. ఈ సంఘటనపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మాదంటే మాది..
► కార్పొరేషన్ స్థలం తమదంటూ కోర్టుకెళ్లిన కొందరు ► 60 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని నగర పాలక సంస్థకు కోర్టు నోటీసులు ► తమ వద్ద పత్రాలు ఉన్నాయంటున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు నెల్లూరు, సిటీ : 5.27 ఎకరాల ఆ స్థలం విలువ రూ.50 కోట్లు. ఇది తమదంటే తమదని ఓ వర్గం, కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఈ భూ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తోంది. నగర పాలక సంస్థ అధికారుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం మాగుంట లేఅవుట్. 1995 సంవత్సరంలో ఇక్కడ కొందరు 151 ఎకరాలను 8 డివిజన్లుగా చేసి లేఅవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం నగర పాలక సంస్థకు 10 శాతం చొప్పున 15 ఎకరాలు అప్పగించారు. ఇందులో అప్పటి మున్సిపల్ అధికారులు కంచె వేసి కార్పొరేషన్‌కు చెందిన స్థలంగా బోర్డు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం 18 మంది 15 ఎకరాల్లోని 5.27 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై అప్పటి కమిషనర్ చక్రధర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో చక్రధర్‌బాబు బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే స్థలం తమదని చెబుతున్న వారు స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని కోర్టును ఆశ్రయించారు. చక్రదర్‌బాబు తర్వాత వచ్చిన కమిషనర్ దీని గురించి పట్టించుకోలేదు. ఇటీవల కమిషనర్‌గా వచ్చిన వెంకటేశ్వర్లు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నాలుగో నగర పోలీసులకు 18 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే కోర్టు ఆస్థలం 18 మందిదేనని తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కార్పొరేషన్ అధికారులకు సూచించింది. అయితే టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థలం వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని కార్పొరేషన్ వర్గాల్లో విస్త్రతంగా చర్చ జరుగుతోంది. పత్రాలు ఉన్నాయి : ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయి. త్వరలోనే పూర్తి ఆధారాలు కోర్టుకు అందజేస్తాం - వెంకటేశ్వర్లు, కమిషనర్, నెల్లూరు నగర పాలక సంస్థ -
పంపులో కంపు
కుళాయిల్లో కలుషిత నీటి సరఫరా పట్టించుకోని నగరపాలకులు గగ్గోలు పెడుతున్న ప్రజానీకం జోరందుకున్న మినరల్ వాటర్ వ్యాపారం రాజధాని నగరంలో ప్రజారోగ్యానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. శుద్ధమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా కావాల్సిన పంపుల్లో కంపు నీరు వస్తోంది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఏ కుళాయి తిప్పినా మురికినీరే వస్తోందని జనం గగ్గోలు పెడుతున్నారు. నీటి పన్నును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు నాణ్యమైన నీరివ్వడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా మినరల్ వాటర్ విక్రేతలు జేబులు నింపుకొంటున్నారు. విజయవాడ సెంట్రల్ : ఇటీవలి కాలంలో విజయవాడ నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా మంచినీటి సమస్యే కనిపిస్తోంది. గతంలో సర్కిల్-3కి మాత్రమే పరిమితమైన సమస్య ఇప్పుడు 1, 2 సర్కిళ్లకు పాకింది. బాడవపేట, నెహ్రూనగర్, క్రీస్తురాజపురం, గుణదల, అంబేద్కర్‌నగర్, సున్నపుబట్టీల సెంటర్, పటమట, ఎల్ఐసీ కాలనీ, సింగ్‌నగర్, పాయకాపురం, వైఎస్సార్ కాలనీ, భవానీపురం ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని 103కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం సమస్య అంత తీవ్రంగా లేదని కొట్టిపారేస్తున్నారు. నీటి సరఫరా కోసం ఏడాదికి రూ.32.40 కోట్లను నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యమైన నీరు ప్రజలకు అందడం లేదు. రామలింగేశ్వరనగర్లో రూ. 25 కోట్లతో నిర్మించిన 10 ఎంజీడీ ప్లాంట్ అధ్వానంగా మారింది. ప్లాంట్ నుంచి విడుదలయ్యే మంచి నీటిలో మురుగునీరు మిళితం కావడంతో ఆ ప్లాంట్ పరిధిలోని నాలుగు లక్షల మంది ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో రక్షి త నీటి సరఫరా పథకాల కోసం రూ.110 కోట్లు కేటాయించారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. తోడేస్తున్నారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారుల లెక్కల ప్రకారం 164 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీరు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ లేని విధంగా నీటిని సరఫరా చేస్తున్నామన్నది అధికారుల వాదన. నగర ప్రజల అవసరాల్లో 60 శాతం నీటిని కృష్ణానది నుంచి, 40 శాతం బోర్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణానదిలో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగుల నుంచి 7.1 అడుగులకు తగ్గింది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద మోటార్ల ద్వారా నీటిని తోడేయడంతో లీకేజీలు ఉన్న ప్రాంతాల్లో మురుగునీరు కలుస్తోంది. రా వాటర్ ట్రీట్మెంట్ సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. పూర్తికాని ఇంటర్ కనెక్షన్లు రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం, బ్రిడ్జిల ఏర్పాటు నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా సర్కిల్-1 పరిధిలో పైప్‌లైన్ మార్చేందుకు రూ.18 కోట్లతో పనులు చేపట్టారు. మూడు నెలలుగా పనులు సాగుతున్నాయి. ఇంటర్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తికాలే దు. వన్‌టౌన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసినప్పుడు కొద్ది రోజుల పాటు ఈ సమస్య ఉంటుందని అధికారులు సమర్ధించుకుంటున్నారు. పట్టించుకోవడం లేదు హెడ్ వాటర్ వర్క్స్‌లోని 5, 8, 11, 16 ఎంజీడీ ప్లాంట్ల ద్వారా రోజుకు 40 ఎంజీడీ సామర్థ్యానికి గాను 36 ఎంజీడీ నీటిని సరఫరా చేస్తున్నారు. గంగిరెద్దుల దిబ్బ వద్ద 10 ఎంజీడీ ప్లాంట్ ద్వారా రోజుకు 2.50 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు 62 రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కుళాయిల ద్వారా తరచు మురుగునీరు సరఫరా కావడంతో ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. మినరల్ వాటర్‌కు రోజుకు కనిష్టంగా రూ.10 చొప్పున ఖర్చుచేయాల్సి వస్తోందంటున్నారు. తాగునీరు కలుషితమవుతోందని ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో సైతం పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు తాగునీటి కొరత, కలుషితం సమస్యలపై గళమెత్తారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు లేదు. తాగలేం బాబోయ్ మా ప్రాంతంలో కుళాయిల నుంచి వచ్చే నీటిని చూస్తుంటే భయమేస్తోంది. కనీసం కాచుకుని తాగేందుకు కూడా పనికిరాకుండా ఉన్నాయి. ఎంతసేపు ఎదురుచూసినా నీళ్లు మురికిగానే వస్తుండడంతో ఏం చేయాలో తోచడం లేదు. ఈ నీటిని తాగితే రోగాలబారిన పడడం ఖాయం. నగరపాలక సంస్థ అధికారులు ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలి. - మోపిదేవి కోకిల, చుట్టుగుంట చర్యలు చేపడతాం నగరంలో కలుషిత నీటి సమస్య అంత పెద్దగా ఏమీ లేదు. స్పష్టమైన ఫిర్యాదులు ఉంటే చర్యలు చేపడతాం. సర్కిల్-1 పరిధిలో పైప్‌లైన్ పనులు పూర్తికావొచ్చాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందించాం. పలు ప్రాంతాల్లో కొత్తగా 9 బోర్లు వేస్తున్నాం. కార్పొరేటర్ల సూచన మేరకు మరో 20 బోర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం. - ఎం.ఎ.షుకూర్, ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ స్నానం చేయాలంటే భయమేస్తోంది.. నాలుగు రోజులుగా కుళాయిల నుంచి మురుగునీరు వస్తోంది. ఈ నీటితో స్నానం చేయాలంటే భయంగా ఉంది. తాగునీటి కోసం వాటర్ క్యాన్లు కొనుగోలు చేసి వాడుతున్నాం. ఇటీవల మా పక్కింటి కుళాయిలో నీటితో పాటు పురుగులు కూడా వచ్చాయి. -కాకర్ల పద్మ, మధురానగర్ పన్ను వసూళ్లలో ఫస్ట్.. ముక్కుపిండి మరీ పన్నులు వసూలుచేయడంలో ముందుండే అధికారులు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో వెనుకబడిపోతున్నారు. గ్రౌండ్ వాటర్ ఉన్న వారు ఆ నీటిని వాడుకుంటుండగా.. కృష్ణా నీటిపైనే ఆధారపడిన మాలాంటి వాళ్లం స్వచ్ఛమైన నీరు ఎప్పుడు వస్తుందో తెలియక అవస్థలు పడుతున్నాం. - మేరుగ ప్రీతి, ముత్యాలంపాడు లీకులే అధికం కొండపైకి ఏర్పాటు చేసిన పైపులైన్ల ద్వారా నీరు అంతగా చేరడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన పైపులైన్లు పాతవి కావటంతో నీరు లీకుల ద్వారా వృథా అవుతోంది. నీళ్లకోసం ఇళ్లలోని మహిళలు ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన కుళాయి నుంచి బిందెలతో తెచ్చుకుంటున్నారు. - కోటయ్య, గుణదల అన్నీ నలకలే వస్తున్నాయి తాగునీటిలో నలకలు అధికంగా వస్తున్నాయి. అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఈ ప్రాంతంలో నూతన పైపులైన్లను ఏర్పాటు చేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. - ఉమామహేశ్వరరావు, గంగిరెద్దులదిబ్బ -
అక్రమార్కులకు అండ!
♦ కార్పొరేషన్ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు ♦ ఫిర్యాదు చేసినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ♦ హైకోర్టు ఉత్తర్వులు సైతం అమలు చేయడంలో నిర్లక్ష్యం ♦ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకోని వైనం సాక్షి ప్రతినిధి, కడప : అక్రమార్కులకు అండగా నిలవడమే లక్ష్యమని కార్పొరే షన్ అధికారులు వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. నిర్మాణపు అనుమతులు లేకపోయినా టౌన్ ప్లానింగ్ విభాగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో చేతులు బరువెక్కుతే చాలనే రీతిలో వ్యవహరిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు నాగరాజుపేటలో తాజాగా చోటుచేసుకున్న ఘటన రూఢీ చేస్తోంది. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేసినా చలనం లేదు. హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వైనమిది. నగరంలోని నాగరాజుపేటకు చెందిన అబ్దుల్రౌవుఫ్ డోర్ నెంబర్ 2/392 పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గృహ నిర్మాణం చేపట్టాడు. ఎలాంటి అనుమతులు లేకుండా తన గృహానికి ఆటంకం కల్గిస్తూ నిర్మాణం చేపట్టారని న్యాయవాది ఎం బాలదస్తగిరిరెడ్డి కార్పొరేషన్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం వారికి ఫిర్యాదు చేశారు. ఏమాత్రం స్పందన లేకపోవడంతో నోటీసు జారీ చేశారు. ఆపై హైకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఆ మేరకు హైకోర్టు ఈనెల 15న ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాలను ఆపాల్సిందిగా మున్సిపాలిటిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఏకైక కారణం టౌన్ ప్లానింగ్‌లో కీలకంగా ఉన్న అధికారికి నిర్మాణం సాగిస్తున్న వ్యక్తి సన్నిహితుడు కావడమేనని తెలుస్తోంది. పైగా పెద్ద ఎత్తున చేతులు తడిపినట్లు సమాచారం. అందువల్లే ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయినట్లు తెలిసింది. హైకోర్టు ఉత్తర్వులను సైతం టౌన్ ప్లానింగ్ అధికారులు ఖాతరు చేయడం లేదని బాధితుడు నాగదస్తగిరిరెడ్డి వాపోతున్నారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి సిటీ ప్లానర్ శైలజ వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు, హైకోర్టు ఉత్తర్వులు అందాయని, ఆ మేరకు ఇప్పటికే రెండు నోటీసులు జారీ చేశామని చెప్పారు. చర్యలు తీసుకోవడంలో ఆలస్యమైన మాట వాస్తవమేనని, త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఏటీఎంలు పెడితే డబ్బొస్తుంది!
ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు డబ్బుకు కటకటగా ఉంది. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ భారమవుతోందట. సాధారణంగా టాయిలెట్ల బయటివైపు బిల్‌బోర్డులు పెట్టి ప్రకటనల కోసం వాటికి అద్దెకివ్వడం సాధారణమే. అలాకాకుండా ఈ టాయిలెట్ల ద్వారా ఇంకా అదనపు ఆదాయం సంపాదించాలని ఆలోచించిన కార్పొరేషన్ అధికారులకు ఓ ఐడియా వచ్చింది. కొత్తగా కట్టబోయే 150 పబ్లిక్ టాయిలెట్లలో ఏటీఎంలు ఏర్పాటు చేయడానికి వీలుగా గదులు పెడతారట. వీటిని ఆసక్తి చూపిన బ్యాంకులకు అద్దెకిచ్చి ఆదాయం పొందుతామని మేయర్ రవీంద్ర యాదవ్ చెప్పారు. టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉంటే సరి... లేకపోతే మాత్రం కంపుకొట్టే ఏటీఎంలలో డబ్బులు తీసుకునేందుకు జనం ముందుకొస్తారా? కార్పొరేషన్ మరో ఆలోచన కూడా చేస్తోంది. మున్సిపల్ స్కూళ్ల ప్రాంగణాల్లోని కొంతభాగాన్ని ఏటీఎం కేంద్రాలు, కోచింగ్ సెంటర్లకు అద్దెకివ్వాలని ప్రతిపాదనలు రూపొందిస్తోంది. -
ఇంద్రకీలాద్రికి మరో సొరంగం
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిలో మరో సొరంగం తవ్వనున్నారు. ఇప్పటికే చిట్టినగర్‌లో ఒక సొరంగ మార్గం ఉండగా, తాజాగా నగరం నుంచి కుమ్మరిపాలెం మీదుగా తుళ్లూరుకు మెట్రోరైలు మార్గం వేసేందుకు ఇంద్రకీలాద్రిని తవ్వి సరికొత్త సొరంగం ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సొరంగానికి సమాంతరంగానే ఈ కొత్త సొరంగం తవ్వే అవకాశాలు ఉన్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టు ఫేజ్-2లో ఈ పనులు ప్రారంభిస్తారని తెలిసింది. తొలుత నగరంలోని బందరురోడ్డు, ఏలూరురోడ్డులోనే మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టారు. ఇదే తరహాలో ఇంద్రకీలాద్రి వద్ద జాతీయ రహదారిపై మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టాలని అధికారులు భావించారు. అయితే, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల మెట్రో ప్రాజెక్టు సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్లే సొరంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇంద్రకీలాద్రిపై అనేకమంది పేద, మధ్య తరగతి కుటుంబాలు జీవిస్తున్నందున వారికి ఎక్కువ నష్టం కలగకుండా కొండకు ఇటువైపు నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వరకు మెట్రోరైలు వెళ్లేందుకు వీలుగా సొరంగం తవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. కుమ్మరిపాలెం సెంటర్ నుంచి భవానీపురం, ఇబ్రహీంపట్నం, చెవిటికల్లు.. అక్కడి నుంచి కృష్ణానది మీదుగా అమరావతి, తుళ్లూరును కలుపుతూ ఫేజ్-2లో ఈ మెట్రోరైలు మార్గాన్ని వేస్తారు. ట్రాన్స్‌కో సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ విజయవాడ, గంగూరు, గుణదలలోని 132/33 కేవీ సబ్స్టేషన్ల నుంచి మెట్రోరైలుకు కావాల్సిన విద్యుత్‌ను తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు తమను సంప్రదించారని ఏపీ ట్రాన్స్‌కో అధికారులు చెప్పారు. రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ వద్ద, పెనమలూరు, గుణదల కాల్వగట్లపైన మెట్రో ట్రాక్షన్ సబ్స్టేషన్లు నిర్మిస్తారు. ఏపీ ట్రాన్స్‌కో సబ్స్టేషన్ల నుంచి మెట్రో ట్రాక్షన్ సబ్స్టేషన్లకు విద్యుత్ కనెక్షన్లు తీసుకుని అక్కడి నుంచి రైలు నడపడానికి ఉపయోగించుకుంటారు. అండర్ గ్రౌండ్ కేబుల్ రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ పక్కనే మెట్రో ట్రాక్షన్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు స్థలం లభించింది. పెనమలూరులోనూ, గుణదల కాల్వ గట్లపైనా ఈ ట్రాక్షన్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సబ్స్టేషన్లకు ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన గంగూరు, గుణదల సబ్‌స్టేషన్‌కు దూరం చాలా ఉండటంతో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలని మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. దీనికోసం ట్రాన్స్‌కో అధికారులు సలహా, అనుమతులు అడిగినట్లు తెలిసింది. భవానీపురంలో మరో సబ్‌స్టేషన్ మెట్రోరైలు ప్రాజెక్టు ఫేజ్-2లో సొరంగం వేసి కుమ్మరిపాలెం సెంటర్, భవానీపురం, ఇబ్రహీంపట్నం మీదుగా రాజధానికి రైలు మార్గం వేస్తే.. ఆయా మార్గాల్లోనూ విద్యుత్‌ను ఏపీ ట్రాన్స్‌కో అందించాల్సి ఉంటుంది. దీంతోపాటు భవానీపురం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలను తీర్చాలనే ఉద్దేశంలో ట్రాన్స్‌కో అధికారులు భవానీపురంలో మరో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. -
నగరాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
- వారానికో రోజు సమీక్ష - కొండ ప్రాంతవాసులకు పట్టాలు - పేదలకు 20వేల పక్కా ఇళ్లు - చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ప్లాంట్ - కార్పొరేషన్ అధికారులతో చంద్రబాబు - నగరపాలక సంస్థ అధికారులతో సీఎం భేటీ - ఇంకా పలు నిర్ణయాలు సాక్షి, విజయవాడ : ‘ఒక్క అమరావతే కాదు, విజయవాడ, గుంటూరు నగరాలను బాగా అభివృద్ధి చెందాలి. ఇందుకు కావాల్సిన అనుమతులను ఇప్పిస్తాం. ఇక్కడ ఫైల్స్ పెండింగ్‌లో ఉండకుండా తక్షణం క్లియర్ చేయిస్తా. నగరాభివృద్ధిపై వారానికి ఒకరోజు సమీక్ష నిర్వహిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, అధికారులకు హామీ ఇచ్చారు. తన పేషీలోని అధికారులకు ఫోన్ చేసి ఇక నుంచి విజయవాడ నుంచి వచ్చే ఫైల్స్ తక్షణం క్లియర్ చేయమంటూ ఆదేశించారు. గురువారం రాత్రి నగరంలోనే బస చేసిన చంద్రబాబు శుక్రవారం ఉదయం బస్సులోనే నగరపాలకసంస్థ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. ఇక నుంచి అప్పడప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా చే స్తుంటానని హెచ్చరించారు. ఈనెల 26వ తేదిన మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని సూచించారు. కొండ ప్రాంతవాసులకు పట్టాలు నగరపాలకసంస్థ అధికారులతో మాట్లాడుతూ కొండప్రాంతాల్లో నివసించే పేదలందరికీ పట్టాలిచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న ఇళ్లను గుర్తించి, అక్కడనుంచి కొండ పైకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో పేదలకు 20వేల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మహేంద్ర కంపెనీ ముందుకు వచ్చిందని, ల్యాండ్ పూలింగ్‌లో స్థలం సేకరించి, వారి చేత కట్టిస్తానని చంద్రబాబు తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు సీఆర్డీఏ పరిధిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. డంపింగ్ యార్డుకు కేటాయించిన 20 ఎకరాల స్థలం వేరే అవసరాలకు వాడుకోవాలని సూచిం చారు. కాల్వల బ్యూటిఫికేషన్ చేయాలని, కాల్వగట్లపై నివసించేవారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఖాళీ చేయించాలని సూచించారు. భవానీద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి తాను ప్రైవేటు కంపెనీలతో సంప్రదిస్తున్నట్లు అధికారులకు వివరించారు. సిబార్ డిస్నీల్యాండ్ స్థలం గురించి మాట్లాడుతూ దాని యజమానులతో సంప్రదించాలని అక్కడ మరో ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని సూచిం చారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగులరమణారావు, కమిషనర్ వీరపాండ్యన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ నగరపాలకసంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు. జీ+2కు ‘మార్టిగేజ్ రద్దు’ 250 గజాలు లోపు భవననిర్మాణాలకు జీ+2 ఇళ్లు నిర్మించుకునేందుకు ‘మార్టిగేజ్’ చేయాల్సిన అవసరం లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులకు సూచించారు. వర్షపు నీరు వెళ్లేందుకు నగరంలో సరైన వ్యవస్థ లేనందున దానికి కావాల్సిన డీపీఆర్‌లు తయారు చేయాలని సూచించారు. విజయవాడ(తూర్పు, సెంట్రల్) నియోజకవర్గంలో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటుకు కావాల్సిన టెండర్లు పిలవాలని, వాటికి కావాల్సిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. -
దటీజ్ కార్పొరేషన్!
నెల్లూరు(విద్య) : విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు పాఠశాలల్లో టీచర్ల సంఖ్య ఉండేలా చూడాల్సిన కార్పొరేషన్ అధికారులు అనాలోచితంగా వ్యవహరించారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవసరమైన చోట కాకుండా అవసరం లేని చోట వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట డిప్యుటేషన్ వేశారని విమర్శలొస్తున్నాయి. ఇటీవల కార్పొరేషన్ స్కూల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు మంత్రి నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైస్కూల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్లు, డిప్యుటేషన్లపై తక్షణమే భర్తీచేయాలని ఆదేశాలిచ్చారు. అయితే కార్పొరేషన్లో విద్యాశాఖ చూసే అధికారులు జాబితాను రూపొందించారు. అయితే వారి అవగాహన రాహిత్యంతో జాబితాలో పలుపొరపాట్లు జరిగాయి. తప్పులు తడకగా ఉన్న జాబితాను కార్పొరేషన్ అధికారులు అలానే విడుదల చేయడంతో అనవసరమైన చోట్లకు టీచర్ల డిప్యుటేషన్లు జరిగిపోయాయి. 15 ఉన్నత పాఠశాలల్లో 6,913 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం సరాసరిన ప్రతి 30 మంది విద్యార్థులకు కనీసం ఒక్క టీచర్ ఉండేలా చూడాల్సి ఉంది. అయితే హైస్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టును గుర్తించి వారిని డిప్యుటేషన్‌పై పంపాల్సిన కార్పొరేషన్ అధికారులు ఆ పనిచేయకుండా ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు వేశారు. మేనేజర్, కోఆర్డినేటర్ల సమన్వయలోపం, అనుభవరాహిత్యం కలిసి కమిషనర్‌ను సైతం తప్పుదోవ పట్టించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడక.... నగరంలోని ఎంజీనగర్ ఉన్నత పాఠశాలలో ముగ్గురు సోషల్ టీచర్లు ఉండగా, మరో టీచర్‌ను డిప్యుటేషన్‌పై వేశారు. దీంతో అక్కడ నలుగురు టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఈ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ అవసరమైంది. వెంకటేశ్వరపురంలో 698 మంది విద్యార్థులు ఉంటే ఒకే ఒక సోషల్ టీచర్ ఉన్నారు. ఆర్ఎస్ఆర్ హైస్కూల్లో 493 మంది విద్యార్థులకు ఒక సోషల్ టీచరే ఉంది. బీవీఎస్ హైస్కూల్లో 444 మందికి ఒక సోషల్ టీచరే... ఇలా వెంకటేశ్వరపురం కార్పొరేషన్ పాఠశాలలో 698 మంది విద్యార్థులకు ఒక సోషల్ టీచర్ ఉండగా, ఎంజీనగర్ హైస్కూల్ 214 మందికే నలుగురు సోషల్ ఉపాధ్యాయులు ఉన్నారు. మూలాపేట రామయ్యబడిలో 185 మంది విద్యార్థులకు హిందీ టీచర్ ఒక్కరే. ఆ టీచర్‌ను ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేశారు. ఉపాధ్యాయులు అవసరంలేని ఆ ప్రాథమిక పాఠశాలకు అదనంగా ఇద్దరు టీచర్లను డిప్యుటేషన్‌పై పంపారు. ఇవి కార్పొరేషన్లో తప్పులతడకగా రూపొందించిన డిప్యుటేషన్ల జాబితాకు కొన్ని ఉదాహరణలు. హైస్కూల్లో ఖాళీలు... తెలుగు-2, లెక్కలు-4, ఫిజిక్స్-3, సోషల్-5, బయాలజీ-3 ఖాళీలు ఉన్నాయి. ప్రమోషన్లకు అర్హులైన వారు ఒక్కో సబ్జెక్టులో 3 నుంచి 5 మంది టీచర్లు ఉన్నారు. ఈ మొత్తం 18 ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తే డిప్యుటేషన్లు అవసరం లేదు. ఇలాకాకుండా డిప్యుటేషన్ల పేరుతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను హైస్కూళ్లకు పంపడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉండదని విద్యావేత్తల అభిప్రాయం. వందల సంఖ్యలో విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై హైస్కూల్‌కు పంపడంవల్ల ఆయా పాఠశాలలు రాబోయే రోజుల్లో నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 50 ప్రాథమిక పాఠశాలల్లో 5,169 మంది విద్యార్థులు ఉండగా 204 మంది టీచర్లకుగాను 165 మందే పనిచేస్తున్నారు. తాజాగా వెలువడిన డీఎస్సీ ద్వారా 37 తెలుగు ఎస్జీటీలు, 7 ఉర్దూ ఎస్జీటీలను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మిగిలిన పోస్టులకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకుంటే అసలు సమస్యే ఉండదని టీచర్ల అభిప్రాయం. అలాకాకుండా ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైస్కూల్లో క్షేత్రస్థాయిలో ఏయే సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని తెలుసుకొని ఆయా సబ్జెక్టులకు టీచర్లను నియమిస్తే బాగుం టుందనే వారి అభిప్రాయం. ఇప్పటికే ఈ సమస్యను గుర్తించి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కేఎన్ఆర్ పాఠశాలను దత్తత తీసుకున్నారు. 10 మంది విద్యావలంటీర్లను సొంత నిధులతో ఏర్పాటు చేశారు. సిటీ పరిధిలో సిటీ ఎమ్మెల్యే 10 హైస్కూళ్లకు 20 మంది విద్యావలంటీర్లను సొంత నిధులతోఏర్పాటు చేశారు. ఇలా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ పాఠశాలలపై శ్రద్ధ తీసుకుంటుంటే.. కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ కార్పొరేషన్ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతా మా ఇష్టం..
ఆగని ‘కళ్యాణలక్ష్మి’ కబ్జా నిబంధనలు హుష్‌కాకి కార్పొరేషన్ అధికారుల నిద్రమత్తు పార్కింగ్ కోసం నాలాపై స్లాబ్ నిర్మాణం విమర్శలు వెల్లువెత్తుతున్న వైనం హన్మకొండ : వరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతు న్న పనుల్లో పారదర్శకత లోపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలను కార్పొరేషన్ అధికారులు తమ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలకు కళ్యాణలక్ష్మి షాపిం గ్‌మాల్ ఎదుట ఉన్న నాలాపై జరుగుతున్న స్లాబ్ నిర్మాణమే అద్దం పడుతోంది. కేవలం పద్దెనిమిది రోజుల వ్యవధిలోనే బల్దియా అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. హన్మకొండ న గర నడిబొడ్డున ‘కళ్యాణలక్ష్మి నాలా స్లాబ్’ వ్యవహారంపై బల్దియా అధికారులు స్పందించిన తీరు ఇలా ఉంది. ఆగష్టు 2వ తేదీ.. ఫండ్ యువర్ సిటీలో నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ వ్య క్తులు నగరంలో ఏదైనా పని చేపట్టాలంటే ముందుగా నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్పొరేష న్ బహిరంగ నోటీసులు జారీ చేస్తుంది. సదరు పనిపై ప్ర జాభిప్రాయ సేకరణ కూడా ఉంటుంది. అభ్యంతరాలు, సూచనలు పరిశీలించి అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తాం. అనుమతి ఇస్తేనే నిర్మాణాలు జరపాలి. అనుమతి రాకుండా నిర్మాణం చేపడితే కూల్చివేస్తాం. కళ్యాణలక్ష్మి షా పింగ్ మాల్ ఎదురు నాలాపై నిర్మాణం కోసం కొందరు దరఖాస్తు చేశారు. అయితే అనుమతి ఇవ్వకముందే పను లు ప్రారంభించినందున నిర్మాణాన్ని నిలిపివేశాం. ఆగష్టు 20వ తేదీ.. ఫండ్ యువర్సిటీ కార్యక్రమంలో భాగంగా కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ ఎదురు నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందు కు బల్దియా కమిషనర్ సువర్ణపండాదాస్ అనుమతించారు. దాని ప్రకారమే వారు నిర్మాణం చేపడుతున్నారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్‌కు వెళ్లే దారి నిత్యం ర ద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఉన్న కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం తమ దుకాణానికి వచ్చే కస్టమర్లు వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టింది. దీంతో ట్రాఫిక్ సమస్య లు పెరుగుతాయని తెలిసినా పట్టించుకోకుండా తమ వ్యా పారం సాఫీగా సాగితే చాలనే విధంగా 2012లో సదరు యాజమాన్యం స్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి కలెక్టర్ రాహుల్బొ జ్జా, మునిసిపల్ కమిషనర్ వివేక్‌యాదవ్ యాజమాన్యం పై కన్నెర్ర జేశారు. అనంతరం అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చి వేయించారు. ఇదిలా ఉండగా, సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యం మరోసారి పనులు ప్రారంభించింది. కాగా, ఈ నిర్మాణంపై నగర పాలక సంస్థ సిటీ ప్లానింగ్ అధికారి రమేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరగా... ఫండ్ యువర్ సిటీ పథకం ద్వారా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందుకు కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టి అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత సంతృప్తి చెందినేతే నిర్మాణానికి అనుమతి ఇస్తామ ని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యా నికి కార్పొరేషన్ అనుమతి రాకముందే నిర్మాణం ప్రారంభించినందున పనులు నిలిపేశామని చెప్పారు. కాగా, సరిగ్గా పద్దెనిమిది రోజుల తర్వాత కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం నాలాపై తిరిగి స్లాబ్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకుండా... ఎవరి నుంచి అభ్యంతరాలు స్వీకరిం చకుం డా పనులు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ నిర్మాణంపై సిటీ ప్లానింగ్ అధికారిని ‘సాక్షి’ మరోసారి వివరణ అడగగా... ప్రజాభిప్రాయ సేకరణ.. అభ్యంతరాల స్వీకరణపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కమిషనర్ సువర్ణపండాదాస్ అ నుమతి ప్రకారమే పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
ఎలివేటెడ్ రోడ్డుగా జీఎంఎల్‌ఆర్
సాక్షి, ముంబై : గోరేగావ్-ములుండ్ లింక్‌రోడ్ (జీఎంఎల్‌ఆర్) పూర్తిగా ఎలవేటెడ్‌గా నిర్మించనున్నారు. అయితే ఈ మార్గాన్ని తొలుత రోడ్డు మార్గంగా నిర్మించాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ భావించింది. అరేకాలనీ మీదుగా ఈ మార్గం వెళుతుండడంతో రోడ్డు నిర్మాణంలో భాగంగా 1,100 చెట్లను నరకాల్సి వచ్చింది. దీంతో పచ్చదనం కోల్పోవద్దన్న ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎలవేటెడ్ మార్గంగా నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకు గాను రూ.1,300 కోట్లు ఖర్చు అవుతున్నట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించిన సలహాదారులు తమ నివేదికను ఇటేవల సమర్పించారు. ఇటీవల బీఎంసీ గోరేగావ్‌లోని అరేరోడ్ను వెడల్పు చేసేందుకు ప్రతిపాదించింది. గోరేగావ్ నుంచి సాకివిహార్ వరకు నాలుగు లేన్ల దారిగా, తర్వాత ఇక్కడి నుంచి ములుండ్ వరకు ఎలవేటెడ్‌గా నిర్మించాలని నిశ్చయించింది. అయితే పర్యావరణ ప్రేమికులు ఈ ప్లాన్‌ను పూర్తిగా వ్యతిరేకించారు. ఇందులో భాగంగా అరేరోడ్ వద్ద దాదాపు 1,100 చెట్లను నరికి వేయాల్సి వచ్చింది. అంతేకాకుండా జంతువుల కదలికకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడ్డారు. కాగా, పర్యావరణ పరిరక్షణతోపాటు జంతువులకు కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ అడిషనల్ కమిషనర్, రోడ్ల విభాగపు అధికారి ఎస్వీఆర్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తుది డైజన్కు సంబంధించిన పనులు నిర్వహిస్తున్నారు. అయితే అరెకాలనీలో మొత్తంగా టన్నెల్‌ను నిర్మించాల్సిందిగా పర్యావరణ ప్రేమికులు సూచించారు. కానీ కార్పోరేషన్ అధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. టన్నెల్‌ను నిర్మించే బదులు ఎలవెటెడ్ను నిర్మించడం ద్వారా నిర్మాణ వ్యయం తగ్గించవచ్చని అధికారి అభిప్రాయపడ్డారు. ఈ గోరేగావ్-ములుండ్ లింక్‌రోడ్ నిర్మాణం నగరంలో 5వ ఈస్ట్, వెస్ట్‌ను కలుపుతుందని ఆయన తెలిపారు. 14 కి.మీ. రోడ్డు అరేకాలని, సాకివిహార్, భాందూప్ కాంప్లెక్స్ మీదుగా వెళ్లి ములుండ్‌లోని ఎల్బీఎస్ మార్గ్‌కు కలుస్తుంది. ఈ కొత్త ప్రణాళికపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలివేటెడ్ రోడ్ నిర్మాణంతో పిల్లర్లు ఇప్పుడు ఉన్న రోడ్డు కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయని, దీంతో అరే కాలనీలో రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని సామాజిక కార్యకర్త బీజు అగస్టీన్ డిమాండ్ చేశారు. -
దండుకునేందుకే..
అనంతపురం కార్పొరేషన్ : అభివృద్ధి పనుల నిర్వహణకు షార్ట్ టెండర్లు పిలిచే అవకాశం ఉన్నా.. అనంతపురం నగర కార్పొరేషన్ అధికారులు శాఖా పరంగా చేసేందుకే మొగ్గు చూపడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో రూ.40 లక్షల పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టడంతో నిధులు దండుకునేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పురపాలక సంఘాల్లో తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం వంటి అత్యవసర విభాగాలకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో లేదా శాఖా పరంగా చేపడతారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పనులు అత్యవసరంగా చేయాల్సి వస్తే షార్ట్ టెండర్ పద్ధతి అవలంబిస్తారు. ప్రస్తుతం రూ. 35 లక్షల వ్యయం కాగల డివైడర్ల మరమ్మతు, రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు, ట్రాఫిక్ ఐల్యాండ్‌కు గ్రిల్స్ ఏర్పాటుతోపాటు, రూ.5 లక్షల వ్యయంతో వంకల్లో పూడిక తీసేపనులు ప్రారంభించారు. ఈ పనుల్లో షార్ట్ టెండర్ పద్ధతి పాటించే అవకాశం ఉన్నా శాఖాపరంగా నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అన్ని పనులనూ ఇదే పద్ధతిలో చేశారా అంటే అదీ లేదు. కొన్ని పనులను శాఖాపరంగా చేసేందుకు అనుమతిస్తూనే, మరి కొన్నింటికి షార్ట్ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రోడ్ల మరమ్మతులకు సంబంధించిన ప్యాచ్వర్క్ల్లో, వంకల్లో పూడికతీసే పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. -
ఆక్రమణలకు ఆనం అండ
నెల్లూరు నగరం ఆక్రమణలకు అడ్డాగా మారింది. ఆక్రమణదారులకు ఆనం సోదరుల అండే అర్హత అయింది. మరోవైపు ఆనం సోదరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆక్రమణలను అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు కోట్లు కొల్లగొడుతున్నారు. పర్యవసానంగా సింహపురిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఏదైనా పని కోసం నగరంలోనికి వెళ్లాలంటే ఎన్ని గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. జనాన్ని ఉద్దరించడానికే పుట్టామని గొప్పలు చెప్పే ఆనం సోదరులు నగరం ఆక్రమణల సంగతి పట్టించుకోక పోవడం విశేషం. నిర్మాణ దశలో పార్కింగ్ ప్లేస్‌లు చూపించి యజమానులు ప్లాన్ అప్రూవల్ పొందుతున్నారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టి కార్పొరేషన్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి నిర్మాణ సమయంలో పార్కింగ్‌లకు ఎగనామం పెడుతున్నారు. ఉదాహరణకు గ్రౌండ్ప్లోర్ను పార్కింగ్‌కు చూపించి ఆ తర్వాత వాటిని షాపింగ్ మాల్స్‌గా మారుస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో సైతం గ్రౌండ్‌ప్లోర్‌లో రూములు నిర్మించి పార్కింగ్ లేకుం డా చేస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన కనకమహల్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, ట్రంకురోడ్డు, పెద్దబజారు, బాలాజీనగర్ తది తర ప్రాంతాల్లో నిర్మించిన అపార్ట్మెంట్లు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు, మాల్స్, కల్యాణ మండపాల్లో 95 శాతం నిర్మాణాలకు పార్కింగులు లే వు. దీంతో ఇక్కడికి వచ్చే వారు వాహనాలను ప్రధానరోడ్లపై పెట్టాల్సి వస్తోంది. ఈ కారణంగా నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో నగరం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. పర్యవసానంగా ప్రమాదాలు పెరుతుండటంతో పాటు తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు. కార్పొరేషన్ అధికారుల అవినీతి పుణ్యమాని నగరం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంద కోట్లకు పైనే అవినీతి జరిగినట్టు తెలుప్తోంది. అవినీతి నిరోధకశాఖ దాడుల్లో ఇది బయటపడింది. గ తంలో నెల్లూరుకు వచ్చిన అప్పటి పురపాలక శాఖామంత్రి మహీధర్‌రెడ్డి సైతం టౌన్‌ప్లానిం గ్ అక్రమాలపై అధికారులను చీవాట్లు పెట్టిన విషయం విదితమే. అక్రమ నిర్మాణాలకు కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, నెలరోజుల్లోపు అన్ని రెక్టిఫై చేసుకోవాలని మంత్రి కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. అయినా ఇవేవీ పట్టని ఘనత వహించిన కార్పొరేషన్ అధికారులు అందినకాడికి ముడుపులు దండుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి స్థానిక అధికారుల అక్రమాలకు అడ్డుకట్టవేసి నగరంలో అక్రమ నిర్మాణాలకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.అధికారిక లెక్కలప్రకారం కార్పొరేషన్లో 11 షాపింగ్‌మాల్స్, 233 కాంప్లెక్స్‌లు, 31 కల్యాణ మండపాలు ఉన్నాయి. వీటిలో 95 శాతం వాటికి పార్కింగ్ స్థలాలు లేవు. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని కార్పొరేషన్ అధికారు లు కళ్లు మూసుకోవడంతో అక్రమ నిర్మాణాల కు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో ఇంటి నిర్మాణాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, క ల్యాణమండపాలు అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టాలంటే కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి. నిబంధనల మేరకు కచ్చితంగా పైవాటిని నిర్మించే సమయంలో పార్కింగ్ స్థలం కేటాయించడం తప్పనిసరి. ప్లాన్అప్రూవల్లోనే పార్కింగ్ స్థలాన్ని కచ్చితంగా చూపించాలి. అప్పుడే అధికారులు అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఏకంగా విలువైన ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రయివేటు స్థలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలలో కలిపేసుకుంటున్నారు. బాధితులు ఫి ర్యాదులు చేసినా పట్టించుకొనేవారులేరు. ఈ లెక్కన కార్పొరేషన్లో వందకోట్లకు పైనే అవి నీతి జరిగింది. ఈ విషయం ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో బయటపడినట్లు సమాచారం. నగరంలోని మాగుంట లేఔట్లో 60 అడుగుల మేర ఉన్న విలువైన రోడ్డు స్థలాన్ని అధికార పార్టీ అండదండలున్న కొందరు ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. డాక్యుమెంటరీ ప్రకారం 11.11 అంకణాల స్థలం ఉండగా 17.33 అంకణాల్లో నిర్మాణం చేపట్టారు. సెట్‌బ్యాక్ వదలక పోవడంతో పాటు రెండువైపులా ప్రభుత్వ, ప్రయివేటు స్థలాన్ని ఆక్రమించారు. అంతేకాక బిల్డర్ జీప్లస్ వన్‌కు దరఖాస్తు చేసి జీప్లస్ ఫోర్ ( 5 అంతస్తులు) నిర్మాణం చేపట్టారు. తమ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టాడంటూ బాధితుడు, రిటైర్డ్ ఇరిగేషన్ అధికారి నెల్లూరు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తొలుత విచారించిన అధికారులు ఇది అక్రమ నిర్మాణమేనని, తాము అనుమతులు మంజూరు చేయలేదంటూ చేతులు దులుపుకున్నారే తప్ప చర్యలు తీసుకోలేదు. అధికారులు సరిగ్గా స్పందించక పోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణంపై కోర్టు స్టే మంజూరు చేసింది. నిర్మాణాలను తొలగించిన తర్వాతే అనుమతులివ్వాలంటూ ఆదేశాలిచ్చింది. ఏం జరిగిందో తెలియదు కాని అక్రమ నిర్మాణం ఆగలేదు. బిల్డర్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. బాధితులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. భారీ ముడుపులతో అధికారులకు ఎర భారీ ఎత్తున ముడుపులు ముట్టడంతోనే అధికారులు మిన్నకుండి పోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓప్రముఖ ఫ్యాన్సీషాప్స్ అధినేత కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాడు. నిబంధనల మేరకు కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన ప్లాన్‌లో గ్రౌండ్ ప్లోర్‌ను పార్కింగ్‌కు ఇస్తున్నట్టు చూపించాడు. అనుమతి వచ్చేసింది. అసలే ఆర్టీసీ కూడలి.. అంత విలువైన స్థలాన్ని పార్కింగ్‌కు వదిలితే ఏమొస్తుందని భావించి కార్పొరేషన్ అధికారుల చేతులు బలంగా తడిపాడు. పార్కింగ్ స్థలం మాయమైంది. దానిస్థానంలో షాపింగ్ మాల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు వాహనాలన్నీ రోడ్లపైనే. ఒక్క షాపింగ్ మాల్సేకాదు నగరంలో ప్రధాన కూడళ్లలోని కల్యాణమండపాలు, అపార్ట్మెంట్లు,షాపింగ్‌కాంప్లెక్స్‌లు... వేటికీ పార్కింగ్ స్థలాలు లేవు. నెల్లూరు కార్పొరేషన్ అక్రమ కట్టడాలు,నోపార్కింగ్లకు నిలయంగా మారింది. దీంతో వాహనాలన్నీ రోడ్లపైనే. పర్యవసానంగా నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఆనం సోదరులు మాత్రం పట్టించు కోలేదు. -
అయ్యోర్ల పదోన్నతుల్లో అక్రమాలు
సాక్షి, నెల్లూరు: నగరపాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలకు అంతేలేదు. అందినకాడికి దండుకుని అధికారులు ఇష్టారాజ్యంగా పదోన్నతులు కల్పించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలను సైతం కార్పొరేషన్ అధికారులు ఖాతరు చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీనికి అనేక ఉదాహరణలున్నాయి. 2008 నుంచి సీనియార్టీ జా బితాలో అన్నీ తప్పులు తడకలే. 2009లో ఈ జాబితాను అనుసరించి అనర్హులకు అక్రమ పదోన్నతులు ఇచ్చారు. వివిధ సబ్జెక్టుల్లో భారీ స్థాయిలో జరిగిన ఈ అక్రమ పదోన్నతులపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. సీనియార్టీ జాబితా, ప్రమోషన్లపై బాధితులకు న్యాయం చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్ అధికారులు లంచాల మత్తులో పడి హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదు. ఉదాహరణకు 2009లో ఫిజిక్స్‌లో స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్ల జాబితాలో ఐదుగురు ఉంటే అందులో ముగ్గురు మాత్రమే సీనియార్టీ జాబితాకు అర్హులు. మిగిలిన ఇద్దరు అనర్హులు. ఈ ఇద్దరికీ సాంఘిక సంక్షేమశాఖలో హెచ్డబ్ల్యూఓలుగా పదోన్నతి కల్పించారు. ఇందుకోసం భారీగా అధికారులు ముడుపులు తీసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల్లో కొందరు కోర్టును ఆశ్రయించారు. 2006లో కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం శాశ్వత ఉద్యోగులుగా విలీనమైన కార్పొరేషన్ ఉపాధ్యాయులకు అక్రమ డిప్యుటేషన్ చూపి సాంఘిక సంక్షేమ శాఖలో పదోన్నతి కల్పించారు. ఈ ఉద్యోగులకు డిప్యుటేషన్లో ఉన్నప్పుడు 12.5 శాతం ఇంటి అద్దెకు బదులు 20 శాతం చెల్లించారు. 2006, జూన్ 14న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో విలీనమైన ఈ ఉద్యోగులకు జీతభత్యాలు నగర పాలక సంస్థే చెల్లించింది. సుమారు రూ.6 లక్షలను సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించడంపై ఉన్నతాధికారులకు పలుమార్లు బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీనికి తోడు వీరి ఇంక్రిమెంట్లలో కూడా అధికారులు చేతి వాటం ప్రదర్శించారు. ఎస్జీటీ కేడర్‌లో రూ.6195-రూ.13,945 వేతన శ్రేణి ఉన్న వారికి ప్రధానోపాధ్యాయ శ్రేణిలో ఇంక్రిమెంట్‌ను రూ.18,030-రూ.43,630 మంజూరు చేశారు. 16 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేయక పోయినప్పటికీ 16 సంవత్సరాల టైమ్ స్కేలును మంజూరు చేయడంలో అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలయ్యాయి. చివరకు వార్డెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అక్రమ నియామకాన్ని రద్దు చేస్తూ న్యాయస్థానం ఓఏఎన్ఓ 1496/2010లో ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్ అధికారులు ఆ ఉత్తర్వులను సాంఘిక సంక్షేమ శాఖకు ఇంత వరకు పంపలేదు. నాలుగేళ్లుగా ఈ అక్రమ నియామకాల రద్దును కార్పొరేషన్ అధికారులు తొక్కి పెడుతున్నారు. అక్రమ పదోన్నతులను రద్దు చేయాలని, వారికి చెల్లించిన ఇంటి అద్దె, జీత భత్యాలను రికవరీ చేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోక పోవడం గమనార్హం. కార్పొరేషన్లో పనిచేస్తూ అక్రమ పదోన్నతులు పొంది, సాంఘిక సంక్షేమ శాఖలో విలీనమైనప్పటికీ కార్పొరేషన్ నుంచే జీతాలు పొందుతున్న వీరిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కోర్టు ఆదేశాలను పక్కదోవ పట్టిస్తూ వారికి కొమ్ము కాయడం వెనక లక్షల్లో చేతులు మారినట్టు బాధితులు ఫిర్యాదు చేయడంతో పాటు వివరాల కోసం సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. నాలుగేళ్లైనా ఆర్టీఏ చట్టం ప్రకారం సమాచారం ఇవ్వడానికి అధికారులు సుముఖంగా లేరు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సీనియార్టీ జాబితాలో అక్రమాలకు బలైపోయిన అర్హులు 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల పని తీరుపై ఉన్నత స్థాయి అధికారులు విచారించి బాధితులకు న్యాయం చేయాల్సి ఉంది. -
రోగులపై లేదు దయ
రోజుకు 3.5 లక్షల లీటర్ల కొరత చేతులెత్తేసిన కార్పొరేషన్ అధికారులు మరుగునపడిన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం బాత్రూమ్లు, టాయిలెట్లలో నీళ్లు రాక నరకం తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: పేదోళ్ల పెద్దాస్పత్రికి నీటికష్టాలు మొదల య్యాయి. 24 వైద్య విభాగాలకు నీళ్లు రావడం లేదు. వార్డుల్లోని టాయిలెట్ల కొళాయిల్లో నీళ్లురాక రోగులు, వారి సహాయకులు నరకయాతన పడుతున్నారు. రుయా ఆస్పత్రికి చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం, పొటి ్టశ్రీరాములు నెల్లూరు జిల్లాలతోపాటు తమిళనాడు రాష్ట్రం నుంచి రెం డు వేల మందికి పైగా రోగులు వస్తుంటారు. రోజుకు వెయ్యి మందికి పైగా ఇన్‌పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. వీరందరికీ నిత్యం సుమారు 5.5 లక్షల లీటర్ల నీళ్లు అవసరం. 1.9 లక్షల లీటర్ల నీళ్లుమాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోజుకు సుమారు 3.6 లక్షల లీటర్ల నీటి కొరత ఏర్పడుతోంది. అందుబాటులో ఉన్న నీటిని నిల్వచేసే సంపుల నిర్వహణ గాలికొదిలేశారు. ఆస్పత్రిలోని ‘బర్న్స్’వార్డుకు ఎదురుగా ఉన్న సంప్‌లో లక్ష లీటర్ల నీటిని, ఐడీహెచ్ వార్డుకు సమీపంలోని సంప్‌లో 20 వేల లీటర్ల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. 70 వేల లీటర్ల నీటిని మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. బర్న్స్ వార్డుకు ఎదురుగా ఉన్న ప్రధాన సంప్‌నకు పక్కనే మురుగునీరు ప్రవహిస్తోంది. రెండు సంప్ల నుంచి వివిధ వార్డులకు సరఫరా చేసే పైప్లైన్లు తుప్పుపట్టి పోయాయి. ఓవర్‌హెడ్ ట్యాంకులన్నీ ప్రతిపాదనలకే పరిమితం రుయా ఆస్పత్రిలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం నాలుగేళ్లుగా ప్రతిపాదనల దశ దాటనంటోంది. 2008 డిసెంబర్లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి రుయా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి కావాల్సిన నిధులను హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్(హెచ్డీఎఫ్) నుంచి మంజూరు చేశారు. ఆయన మరణానంతరం ట్యాంకుల నిర్మాణ పనులను గాలికొదిలేశారు. నాలుగేళ్లు గడిచిపోతున్నా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి అతీగతీ లేకుండా పోయింది. ఆరోగ్య విభాగం అధికారులు రెండు, మూడుసార్లు పంపి న ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయిలో మోక్షం కరువయింది. మరమ్మతులకు నోచుకోని బోర్లు ఆస్పత్రిలోని 7 నీటి బోర్లలో ఇప్పటికే 4 బోర్లు నీళ్లులేక ఎండిపోయాయి. ఆ బోర్లను డీపెనింగ్ చేస్తే కొంతవరకైనా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ బోర్ల మరమ్మతుల గురించి దాదాపు రెండేళ్లుగా అధికారులు పట్టించుకోవడం లేదు. {పస్తుతం అరకొరగా 3 బోర్లు పనిచేస్తున్నాయి. పాలకుల హామీలు నీటిమూటలుగానే మారుతున్నాయి. చేతులెత్తేసిన కార్పొరేషన్ రుయాకు అవసరమైన నీటిని పూర్తిస్థాయిలో అందించాల్సిన కార్పొరేషన్ అధికారులు చేతులెత్తేశారు. కార్పొరేషన్‌కు నెలవారీగా నిధులు చెల్లించినా ఫలితం లేకపోతోంది. రెండ్రోజులకోసారి కార్పొరేషన్ నుంచి సరఫరా అవుతున్న నీళ్లు ఏ మూలకూ చాలడం లేదు. -
షో బంద్!
=రూ.35 లక్షల్లేక తాళం వేశారు =కనీస ప్రయత్నం చేయని కార్పొరేషన్ అధికారులు =అంతరిక్ష విజ్ఞానానికి నోచుకోని విద్యార్థులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : కేవలం రూ.35 లక్షల్లేక... ప్రతాపరుద్ర ప్లానిటోరియం మూతపడింది. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో... అంతరిక్ష విజ్ఞానాన్ని అందరి కళ్లకు కట్టించే ప్రదర్శనశాల మూలనపడింది. వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం పక్కనే ప్రతాపరుద్ర ప్లానిటోరియం ఉంది. గోళాకారంలోని మినీ ప్రొజెక్షన్ స్క్రీన్... 90 సీట్లు... ఆరు ఏసీలు... ఒక జనరేటర్‌తో పాటు అద్భుతమైన భవనం ఇందులోని ప్రత్యేకతలు. అచ్చంగా మినీ థియేటర్‌ను పోలిన ఈ ప్లానిటోరియం ఇప్పుడు వెలవెలబోతోంది. పాత ప్రొజెక్టర్ పాడై పోవడంతో రూ.35 లక్షల నుంచి రూ.70 లక్షల ఖర్చుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ప్రొజెక్టర్ కొనలేక పోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. మూడేళ్ళుగా ఈ ప్లానిటోరియంలో షోలు నడవడం లేదు. అంతరిక్ష యానానికి సర్కారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తుంటే... ఈ ప్లానిటోరియం పునరుద్ధరించేందుకు కార్పొరేషన్ అధికారులు కనీస ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ముప్పై ఏళ్ళ కిందట మున్సిపాలిటీ అధికారులు, ఉద్యోగులందరూ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించి ఈ ప్లానిటోరియం భవనాన్ని నిర్మించారు. దివంగత ప్రధాని నర్సింహారావు 1982లో కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్లానిటోరియం వెలిసింది. ఆయన చొరవతో హిందుజా అనే ప్రైవేటు కంపెనీ ప్రొజెక్టర్‌ను బహుమతిగా అందజేసింది. దాదాపు రూ.42 లక్షల వ్యయంతో ఈ ప్లానిటోరియం నిర్మించి అదే ఏడాదిలో ప్రారంభించారు. 90 సీట్ల సామర్థ్యమున్న ఈ ప్రదర్శన శాలలో గరిష్టంగా రోజుకు పది షోలు నడుస్తుండేవి. ఒక్కొక్కరికి పది రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజుతో షోలు ప్రదర్శించే వారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల నుంచి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ ప్లానిటోరియంలో షోలు చూసేందుకు తరలివచ్చిన సందర్భాలున్నాయి. రోజుకు కనీసం రూ. 3000 నుంచి రూ. 9000 వరకు కార్పొరేషన్‌కు ఆదాయంగా వచ్చేది. నాలుగేళ్ళ కిందట హిందూజా ప్రొజెక్టర్ రిపేర్లతో మూలన పడింది. అది పనికి రాదని తేలిపోవడంతో ఆడిటోరియంలోనే పక్కన పడేశారు. ప్రత్యామ్నాయంగా రెండేళ్ల పాటు ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా షోలు నడిపించారు. ఎల్సీడీ ప్రొజెక్టర్ కూడా మైనర్ రిపేర్లకు గురై పనిచేయకపోవడంతో దానిని కూడా పక్కన పడేశారు. రవికిరణ్‌రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై ఈ ప్లానిటోరియం డెరైక్టర్‌గా నియమించారు. ఆయన కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. 25 సంవత్సరాలపాటు ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేసిన కార్పొరేషన్ ఉద్యోగి సదారెడ్డి.. అక్కడ తనకు పని కరువై ఇప్పుడు టౌన్ ప్లానింగ్‌లో చైన్మన్గా పనిచేస్తున్నాడు. ఇప్పటికీ ముగ్గురు వాచ్మెన్, ఒక స్వీపర్ ఈ ప్లానిటోరియంలో కాపలాగా ఉంటున్నారు. అధునాతన ప్రదర్శన శాలలో ఉండాల్సిన హంగులన్నీ ఉన్న ఈ ప్రదర్శన శాలను కాకతీయ ఉత్సవాల్లో భాగంగానైనా... మళ్లీ తెరిపిస్తారా.. లేదా వేచి చూడాల్సిందే.