=రూ.35 లక్షల్లేక తాళం వేశారు
=కనీస ప్రయత్నం చేయని కార్పొరేషన్ అధికారులు
=అంతరిక్ష విజ్ఞానానికి నోచుకోని విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కేవలం రూ.35 లక్షల్లేక... ప్రతాపరుద్ర ప్లానిటోరియం మూతపడింది. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో... అంతరిక్ష విజ్ఞానాన్ని అందరి కళ్లకు కట్టించే ప్రదర్శనశాల మూలనపడింది. వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం పక్కనే ప్రతాపరుద్ర ప్లానిటోరియం ఉంది. గోళాకారంలోని మినీ ప్రొజెక్షన్ స్క్రీన్... 90 సీట్లు... ఆరు ఏసీలు... ఒక జనరేటర్‌తో పాటు అద్భుతమైన భవనం ఇందులోని ప్రత్యేకతలు.
అచ్చంగా మినీ థియేటర్‌ను పోలిన ఈ ప్లానిటోరియం ఇప్పుడు వెలవెలబోతోంది. పాత ప్రొజెక్టర్ పాడై పోవడంతో రూ.35 లక్షల నుంచి రూ.70 లక్షల ఖర్చుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ప్రొజెక్టర్ కొనలేక పోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. మూడేళ్ళుగా ఈ ప్లానిటోరియంలో షోలు నడవడం లేదు. అంతరిక్ష యానానికి సర్కారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తుంటే... ఈ ప్లానిటోరియం పునరుద్ధరించేందుకు కార్పొరేషన్ అధికారులు కనీస ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ముప్పై ఏళ్ళ కిందట మున్సిపాలిటీ అధికారులు, ఉద్యోగులందరూ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించి ఈ ప్లానిటోరియం భవనాన్ని నిర్మించారు.
దివంగత ప్రధాని నర్సింహారావు 1982లో కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్లానిటోరియం వెలిసింది. ఆయన చొరవతో హిందుజా అనే ప్రైవేటు కంపెనీ ప్రొజెక్టర్‌ను బహుమతిగా అందజేసింది. దాదాపు రూ.42 లక్షల వ్యయంతో ఈ ప్లానిటోరియం నిర్మించి అదే ఏడాదిలో ప్రారంభించారు. 90 సీట్ల సామర్థ్యమున్న ఈ ప్రదర్శన శాలలో గరిష్టంగా రోజుకు పది షోలు నడుస్తుండేవి. ఒక్కొక్కరికి పది రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజుతో షోలు ప్రదర్శించే వారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల నుంచి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ ప్లానిటోరియంలో షోలు చూసేందుకు తరలివచ్చిన సందర్భాలున్నాయి.
రోజుకు కనీసం రూ. 3000 నుంచి రూ. 9000 వరకు కార్పొరేషన్‌కు ఆదాయంగా వచ్చేది. నాలుగేళ్ళ కిందట హిందూజా ప్రొజెక్టర్ రిపేర్లతో మూలన పడింది. అది పనికి రాదని తేలిపోవడంతో ఆడిటోరియంలోనే పక్కన పడేశారు. ప్రత్యామ్నాయంగా రెండేళ్ల పాటు ఎల్‌సీడీ ప్రొజెక్టర్ ద్వారా షోలు నడిపించారు. ఎల్‌సీడీ ప్రొజెక్టర్ కూడా మైనర్ రిపేర్లకు గురై పనిచేయకపోవడంతో దానిని కూడా పక్కన పడేశారు. రవికిరణ్‌రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై ఈ ప్లానిటోరియం డెరైక్టర్‌గా నియమించారు.
ఆయన కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. 25 సంవత్సరాలపాటు ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేసిన కార్పొరేషన్ ఉద్యోగి సదారెడ్డి.. అక్కడ తనకు పని కరువై ఇప్పుడు టౌన్ ప్లానింగ్‌లో చైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటికీ ముగ్గురు వాచ్‌మెన్, ఒక స్వీపర్ ఈ ప్లానిటోరియంలో కాపలాగా ఉంటున్నారు. అధునాతన ప్రదర్శన శాలలో ఉండాల్సిన హంగులన్నీ ఉన్న ఈ ప్రదర్శన శాలను కాకతీయ ఉత్సవాల్లో భాగంగానైనా... మళ్లీ తెరిపిస్తారా.. లేదా వేచి చూడాల్సిందే.
షో బంద్!
Published Thu, Nov 21 2013 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement
Advertisement