planetarium
-
వినీలాకాశంలో విహరించేలా..
సాక్షి, విశాఖపట్నం: కైలాసగిరి.. మరింత శోభాయమానంగా రూపుదిద్దుకోనుంది. వినీలాకాశాన్ని నేలకు తీసుకొచ్చేలా అంతర్జాతీయ స్థాయి ప్లానిటోరియం నిర్మాణం కైలాసగిరికి మణిహారంలా మారనుంది. దీనికోసం ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసిన వీఎంఆర్డీఏ.. సరికొత్త డిజైన్‌తో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అందాల విశాఖ నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడూ కైలాసగిరిని సందర్శిస్తాడు. విదేశాల నుంచి వచ్చే 10 మంది పర్యాటకుల్లో.. 8 మంది కైలాసగిరిని సందర్శిస్తుంటారని పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. గిరిపై నుంచి చూస్తే.. సాగర నగరి సొగసులు.. వయ్యారాలు ఒలకబోస్తున్న తీరం సోయగాలు మనసును కట్టిపడేస్తాయి. అలాంటి కైలాసగిరిపై వినూత్న ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్తులో విభిన్న పర్యాటక సొబగులద్దుకునేందుకు సిద్ధమవుతోంది. టూరిజం ఐకాన్‌గా కైలాసగిరిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కైలాసగిరి అభివృద్ధికి పూర్తి స్థాయి ప్రణాళికల్ని వీఎంఆర్డీఏ సిద్ధం చేసింది. తారలు దిగివచ్చి.. తళుక్కున కనిపిస్తే.. సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాసగిరిపై నుంచి విశాఖను చూస్తే.. సుందరంగా కనిపిస్తుంది. ఆకాశం అందినట్లుగా ఉంటుంది. మరి ఆ నింగిని తాకుతూ.. నక్షత్రాల మధ్య విహరించే అవకాశం వస్తే.. ఎంతో బావుంటుంది కదా.. ఆ స్వప్నం సాకారం చేసే ప్రాజెక్టు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయి సక్షత్రశాల నిర్మాణానికి కైలాసగిరి సిద్ధమవుతోంది. రూ.37 కోట్ల వ్యయంతో ప్లానిటోరియం నిర్మించేందుకు వీఎంఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందు కోసం 7 ఎకరాల స్థలాన్ని కొండపై గుర్తించింది. హైబ్రిడ్ ప్రొజెక్షన్లు, 3డీ డిజిటల్ ప్రొజెక్టర్‌తో 200 మంది కూర్చొని వీక్షించేలా ప్లానిటోరియం నిర్మించనున్నారు. ప్రదర్శన ప్రారంభమైన వెంటనే నక్షత్రాల నడుమ మనం విహరించే అనుభూతిని 3డీ టెక్నాలజీ కలిగించనుంది. కేవలం ప్లానిటోరియం మాత్రమే కాకుండా... గ్రహాలు, నక్షత్రాలు, సౌరమండలం, ఉపగ్రహాలు.. ఇలా.. సౌర కుటుంబంలోని ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించేలా చుట్టూ వివరాలు తెలుసుకునేలా చిత్రాలు, వివరాలు ఏర్పాటు చెయ్యనున్నారు. అంతర్జాతీయ హంగులతో.. ‘పదే పదే నిర్మించం కదా.. అందుకే.. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు ప్రయత్నించండి..’’ ప్లానిటోరియం నిర్మాణంపై వీఎంఆర్డీఏ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్లానిటోరియం నిర్మించేందుకు వివిధ అంతర్జాతీయ స్థాయి నక్షత్రశాలల్ని అధికారులు పరిశీలించారు. మంగుళూరులోని పిలుకుల ప్రాంతీయ సైన్స్ సెంటర్ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో మొదటి త్రీడీ ప్లానిటోరియంమైన మంగుళూరు కేంద్రాన్ని కొద్ది నెలల క్రితం వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు బృందం పరిశీలించింది. సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ తీరుని సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మంగుళూరుకి మించి అంతర్జాతీయ హంగులతో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. త్రీడీ షో తో పాటు.. ప్లానిటోరియంలో కాఫీ షాప్, సావనీర్ షాపింగ్‌ని ఏర్పాటు చేయనున్నారు. కొత్త అనుభూతి అందించనున్న త్రీడీ ప్రొజెక్షన్ షో డిజైన్ కోసం కసరత్తు కైలాసగిరిపై నిర్మించనున్న ప్లానిటోరియంను సరికొత్త డిజైన్‌లో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం.. ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనకు కోల్‌కతా ఎన్సీఎస్ఎం డైరెక్టర్ జనరల్ అరిజిత్ దుత్తాచౌదరి నేతృత్వంలో నలుగురు నిపుణుల బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ డీపీఆర్, డిజైన్ల రూపకల్పనకు కైలాసగిరిపై ప్లానిటోరియం నిర్మాణానికి అనువైన స్థల గుర్తింపుతో పాటు కావాల్సిన పరికరాలు, ఐకానిక్ బిల్డింగ్, ఇతర సాంకేతికాంశాల విషయాలపై సూచనలు చేసింది. ఆ కమిటీ సూచించిన అంశాల ప్రకారం ప్లానిటోరియం డిజైన్ల కోసం వీఎంఆర్డీఏ పోటీ నిర్వహించింది. అర్హత గల ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి డిజైన్లను ఆహా్వనించింది. 66 ఆర్కిటెక్ట్ సంస్థలు పోటీ పడ్డాయి. 13 సంస్థలు మాత్రమే డిజైన్లు, ఇతర పత్రాలు సమరి్పంచాయి. వీటిలో ప్రథమ బహుమతి పొందిన స్టూడియో ఎమర్జెన్స్ సంస్థ రూపొందించిన డిజైన్ని ఎంపిక చేసి.. దాని తరహాలో ప్లానిటోరియం నిర్మించాలని నిర్ణయించారు. నిపుణుల కమిటీ సూచనలతో... ప్రాథమికంగా డిజైన్‌ను ఎంపిక చేసినప్పటికీ.. దీని సాధ్యాసాధ్యాలపై వీఎంఆర్డీఏ తీవ్ర కసరత్తు చేస్తోంది. డిజైన్‌లో మార్పులు చేర్పులు, ఇంజినీరింగ్ స్ట్రక్చరల్ వ్యవహారాలపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లతో త్వరలోనే కమిటీ వేయనుంది. వీరంతా.. ఈ డిజైన్‌లో మార్పులు చేసి.. ప్లానిటోరియంకు తుది రూపు తీసుకురానున్నారు. గొప్ప అనుభూతిని అందించేలా... కైలాసగిరిపైకి వచ్చే సందర్శకులకు గొప్ప అనుభూతిని అందించే విధంగా ప్లానిటోరియం నిర్మించాలని సీఎం సూచించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా డిజైన్ల కోసం పోటీ నిర్వహించాం. ఎంపిక చేసిన డిజైన్‌లో మార్పులు చేర్పుల్ని నిపుణుల కమిటీ ద్వారా ఫైనలైజ్ చేస్తాం. దేశీయ సందర్శకులే కాకుండా.. అంతర్జాతీయ పర్యాటకులకూ సరికొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయతి్నస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో ప్లానిటోరియంలు ఉండొచ్చు. కానీ.. కైలాసగిరిపై ఏర్పాటుకానున్న ప్లానిటోరియం వాటన్నింటికంటే విభిన్నమైందిగా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతం. – పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
షో బంద్!
=రూ.35 లక్షల్లేక తాళం వేశారు =కనీస ప్రయత్నం చేయని కార్పొరేషన్ అధికారులు =అంతరిక్ష విజ్ఞానానికి నోచుకోని విద్యార్థులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : కేవలం రూ.35 లక్షల్లేక... ప్రతాపరుద్ర ప్లానిటోరియం మూతపడింది. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో... అంతరిక్ష విజ్ఞానాన్ని అందరి కళ్లకు కట్టించే ప్రదర్శనశాల మూలనపడింది. వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం పక్కనే ప్రతాపరుద్ర ప్లానిటోరియం ఉంది. గోళాకారంలోని మినీ ప్రొజెక్షన్ స్క్రీన్... 90 సీట్లు... ఆరు ఏసీలు... ఒక జనరేటర్‌తో పాటు అద్భుతమైన భవనం ఇందులోని ప్రత్యేకతలు. అచ్చంగా మినీ థియేటర్‌ను పోలిన ఈ ప్లానిటోరియం ఇప్పుడు వెలవెలబోతోంది. పాత ప్రొజెక్టర్ పాడై పోవడంతో రూ.35 లక్షల నుంచి రూ.70 లక్షల ఖర్చుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ప్రొజెక్టర్ కొనలేక పోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. మూడేళ్ళుగా ఈ ప్లానిటోరియంలో షోలు నడవడం లేదు. అంతరిక్ష యానానికి సర్కారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తుంటే... ఈ ప్లానిటోరియం పునరుద్ధరించేందుకు కార్పొరేషన్ అధికారులు కనీస ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ముప్పై ఏళ్ళ కిందట మున్సిపాలిటీ అధికారులు, ఉద్యోగులందరూ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించి ఈ ప్లానిటోరియం భవనాన్ని నిర్మించారు. దివంగత ప్రధాని నర్సింహారావు 1982లో కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్లానిటోరియం వెలిసింది. ఆయన చొరవతో హిందుజా అనే ప్రైవేటు కంపెనీ ప్రొజెక్టర్‌ను బహుమతిగా అందజేసింది. దాదాపు రూ.42 లక్షల వ్యయంతో ఈ ప్లానిటోరియం నిర్మించి అదే ఏడాదిలో ప్రారంభించారు. 90 సీట్ల సామర్థ్యమున్న ఈ ప్రదర్శన శాలలో గరిష్టంగా రోజుకు పది షోలు నడుస్తుండేవి. ఒక్కొక్కరికి పది రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజుతో షోలు ప్రదర్శించే వారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల నుంచి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ ప్లానిటోరియంలో షోలు చూసేందుకు తరలివచ్చిన సందర్భాలున్నాయి. రోజుకు కనీసం రూ. 3000 నుంచి రూ. 9000 వరకు కార్పొరేషన్‌కు ఆదాయంగా వచ్చేది. నాలుగేళ్ళ కిందట హిందూజా ప్రొజెక్టర్ రిపేర్లతో మూలన పడింది. అది పనికి రాదని తేలిపోవడంతో ఆడిటోరియంలోనే పక్కన పడేశారు. ప్రత్యామ్నాయంగా రెండేళ్ల పాటు ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా షోలు నడిపించారు. ఎల్సీడీ ప్రొజెక్టర్ కూడా మైనర్ రిపేర్లకు గురై పనిచేయకపోవడంతో దానిని కూడా పక్కన పడేశారు. రవికిరణ్‌రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై ఈ ప్లానిటోరియం డెరైక్టర్‌గా నియమించారు. ఆయన కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. 25 సంవత్సరాలపాటు ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేసిన కార్పొరేషన్ ఉద్యోగి సదారెడ్డి.. అక్కడ తనకు పని కరువై ఇప్పుడు టౌన్ ప్లానింగ్‌లో చైన్మన్గా పనిచేస్తున్నాడు. ఇప్పటికీ ముగ్గురు వాచ్మెన్, ఒక స్వీపర్ ఈ ప్లానిటోరియంలో కాపలాగా ఉంటున్నారు. అధునాతన ప్రదర్శన శాలలో ఉండాల్సిన హంగులన్నీ ఉన్న ఈ ప్రదర్శన శాలను కాకతీయ ఉత్సవాల్లో భాగంగానైనా... మళ్లీ తెరిపిస్తారా.. లేదా వేచి చూడాల్సిందే. -
ఏడు నెలలుగా ఎదురుచూపులు..!
= పేదలకు అందని ఎస్సీ కార్పొరేషన్ రుణాలు = ఖరారు కాని బ్యాంకు సబ్సిడీ = అయోమయంలో లబ్ధిదారులు నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు సబ్సిడీ రుణాల కోసం ఏడు నెలలుగా ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో 2013-14 సంవత్సరం కింద 8,605 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని ఎస్సీ కార్పొరేషన్ లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు గత సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 20 వరకు ఎస్సీ, బీసీ, కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖలకు చెందిన అధికారులు, మండల స్థాయిల్లోని వివిధ బ్యాంకుల అధికారులు, మండల ప్రజాపరిషత్ అధికారులు, వరంగల్ ప్లానిటోరియంలో నిర్వహించిన జాయింట్ స్క్రీనింగ్‌లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌కు 600లకు పైగా లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకొచ్చారు. అయితే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ ఇంకా ఖరారు కాలేదు. ఏటా ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే బ్యాంకులు లబ్ధిదారులకు లింకేజీ రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చేవి. అయితే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు సబ్సిడీని ఖరారు చేస్తుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈ ఏడాది నుంచి భూమి లేని నిరుపేద దళిత మహిళలకు అర ఎకరం నుంచి ఎకరం వరకు రూ.5 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా ఒక్క లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వం రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేసిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తూ యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో మొదలైన ఆందోళన మూలంగా రుణాల పంపిణీ మరింత ఆలస్యమవుతోంది. దీంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రుణాల కోసం వచ్చే దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కాని ఈ ఏడాది అక్టోబర్‌లోకి అడుగిడినా రుణాలు పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఈ ఏడాది టార్గెట్ ఎలా పూర్తవుతుందని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మదన పడుతున్నారు. లబ్ధిదారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారుల ఆందోళనకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే సందేహలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందా అనే విషయంపై అటు లబ్ధిదారులు, ఇటు అధికారులకు సందిగ్ధంలో పడ్డారు.