= పేదలకు అందని ఎస్సీ కార్పొరేషన్ రుణాలు
= ఖరారు కాని బ్యాంకు సబ్సిడీ
= అయోమయంలో లబ్ధిదారులు
నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు సబ్సిడీ రుణాల కోసం ఏడు నెలలుగా ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో 2013-14 సంవత్సరం కింద 8,605 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని ఎస్సీ కార్పొరేషన్ లక్ష్యంగా నిర్ణయించింది.
ఈ మేరకు గత సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 20 వరకు ఎస్సీ, బీసీ, కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖలకు చెందిన అధికారులు, మండల స్థాయిల్లోని వివిధ బ్యాంకుల అధికారులు, మండల ప్రజాపరిషత్ అధికారులు, వరంగల్ ప్లానిటోరియంలో నిర్వహించిన జాయింట్ స్క్రీనింగ్‌లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌కు 600లకు పైగా లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకొచ్చారు.
అయితే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ ఇంకా ఖరారు కాలేదు. ఏటా ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే బ్యాంకులు లబ్ధిదారులకు లింకేజీ రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చేవి. అయితే ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు సబ్సిడీని ఖరారు చేస్తుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈ ఏడాది నుంచి భూమి లేని నిరుపేద దళిత మహిళలకు అర ఎకరం నుంచి ఎకరం వరకు రూ.5 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా ఒక్క లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వం రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేసిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తూ యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో మొదలైన ఆందోళన మూలంగా రుణాల పంపిణీ మరింత ఆలస్యమవుతోంది. దీంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రుణాల కోసం వచ్చే దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.
కాని ఈ ఏడాది అక్టోబర్‌లోకి అడుగిడినా రుణాలు పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఈ ఏడాది టార్గెట్ ఎలా పూర్తవుతుందని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మదన పడుతున్నారు. లబ్ధిదారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారుల ఆందోళనకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే సందేహలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందా అనే విషయంపై అటు లబ్ధిదారులు, ఇటు అధికారులకు సందిగ్ధంలో పడ్డారు.
ఏడు నెలలుగా ఎదురుచూపులు..!
Published Fri, Oct 11 2013 3:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement