సాక్షి, తూ.గో: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాకినాడ కలెక్టరేట్‌లో తొలిసారి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, రాపాక వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ నేపథ్యంలో రైతు రుణాల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ‘కౌలు రైతులకు సహాయం చేయకపోతే భగవంతుడు క్షమించడు. కౌలు రైతులకు ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందించలేకపోతున్నాయి. మన ప్రభుత్వంలో కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది’ అని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కౌలు రైతుల కోసం రెవెన్యూ శాఖ నూతన ప్రభుత్వంలో ఒక డాక్యుమెంట్ తయారు చేసి, రైతుల పక్షాన నిలుస్తామన్నారు. కార్పోరేషన్ లోన్లు మంజూరు అయిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయాలన్నారు. రీపేమెంట్ విషయంలో ఇబ్బందులు వస్తే ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment