పోలవరం ఎత్తు తగ్గింపుతో రాష్ట్రానికి విఘాతం | YSRCP MP Pilli Subhash Chandra Bose Comments On Polavaram Project Height In Parliament, More Details Inside | Sakshi
Sakshi News home page

పోలవరం ఎత్తు తగ్గింపుతో రాష్ట్రానికి విఘాతం

Published Tue, Feb 11 2025 5:26 AM | Last Updated on Tue, Feb 11 2025 11:23 AM

YSRCP MP Pilli Subhash Chandra Bose on Polavaram Project Hight in Parliment

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్ణీత ఎత్తును తగ్గించాలన్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యు­డు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి వంటిది. దాని నిల్వ సామర్థ్యాన్ని ఏమాత్రం తగ్గించినా అది రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల ఎత్తు నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే దాని నిల్వ ఏకంగా 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది.

ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.5,936 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును 2026లోగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. ముందస్తు వరదలు, కోవిడ్‌ వల్ల వచ్చిన అవాంతరాలతో కొంత ప్రతికూలత ఉన్నా.. సీఎం జగన్‌ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల్లో గణనీయ పురోగతి జరిగింది. స్పిల్‌వే, స్పిల్‌ చానల్, కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతాంశంగా తీసుకుని పూర్తిచేసేందుకు కృషిచేయాలి’ అని కోరారు.  

రాష్ట్రంలో 21,054 ఎంఎస్‌ఎంఈలు
రాష్ట్రంలో 21,054 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) రిజిస్టర్‌ అయినట్లు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

రాష్ట్రంలో లక్షా 90 వేల 777 జల వనరులున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి.. వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొదటి గణన నివేదిక ప్రకారం 3,920 జల వనరులు ఆక్రమణకు గురైనట్టు తెలిపారు.  

విమాన ప్రయాణికులకు సరసమైన ధరలో భోజ­నాన్ని అందించేందుకు కలకత్తా విమానాశ్రయంలో ‘ఉడాన్‌ యాత్రి కేఫ్‌’ను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌మోహల్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో 99.72శాతం మంది తమ తమ ఇళ్లలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకున్నట్టు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement