
వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలిరోజు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య
చట్టాన్ని సవాల్‌చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ..
మరో 71 పిటిషన్లూ దాఖలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్ఫ్(సవరణ) చట్టం,2025ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ తొలిరోజే సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్లకు కాస్తంత ఊరట కల్గించేలా వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలంగా ముస్లిం మత, దాతృత్వ కార్యక్రమాలతో సంబంధముండి వక్ఫ్ అ«దీనంలో ఉన్న ఆస్తులను(వక్ఫ్ బై యూజర్) ఇకమీదటా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమా ర్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ దిశగా ఉత్తర్వులు, ఆదేశాలు ఇవ్వడానికంటే ముందు ఈ పిటిషన్లపై పూర్తిగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ‘‘ ఆస్తులు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వక్ఫ్ అ«దీనంలో ఉన్నాయా? రిజిస్ట్రర్ డాక్యుమెంట్లతో వక్ఫ్ కు దఖలుపడ్డాయా? అనేది తేలకుండానే ‘వక్ఫ్ బై యూజర్’ అనే నిబంధనను తొలగించలేం. ఎక్స్–అఫీషియో సభ్యులు మినహా వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లలో అందరూ ముస్లింలే సభ్యులుగా ఉండాలి’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.
వక్ఫ్(సవరణ)చట్టం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ దాఖలైన డజన్లకొద్దీ పిటిషన్లను బుధవారం విచారించడం మొదలెట్టాక తొలుత వీటిని హైకోర్టుకు బదలాయించాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఈ ఆలోచనపై పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్, హుజేఫా అహ్మదీ, వైఎస్సార్‌సీపీ తరఫున వాదించిన ఎస్.నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావంచూపగల ఈ కేసులను సుప్రీంకోర్టులోనే విచారించాలని కపిల్ సిబల్ గట్టిగా వాదించారు. తర్వాత కోర్టు కేసును గురువారం మధ్యాహ్నానికి వాయిదావేసింది.
ఆనాటి ఆస్తులకు పత్రాలుంటాయా?
వక్ఫ్ ఆస్తిగా నమోదుచేయాలంటే వాటి డాక్యుమెంట్లు కచి్చతంగా సమర్పించాలంటూ చట్టంలోని సెక్షన్ 2ఏలో పేర్కొనడంపై సీజేఐ జస్టిస్ ఖన్నా అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీలోని జామా మసీదునే ఉదాహరణగా తీసుకుందాం. వందల ఏళ్లుగా వాళ్ల అ«దీనంలో ఉన్న ఇలాంటి పాత ఆస్తులకు రిజిస్టర్ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా?. అలాంటి ఆస్తులకు డాక్యుమెంట్లు వాళ్ల దగ్గర ఉంటాయా? ’’ అని సీజేఐ.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు.
గతాన్ని మీరు మార్చలేరు అని కేంద్రానుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ వక్ఫ్ ఆస్తుల్లో కొన్ని దురి్వనియోగం అయిన మాట వాస్తవమే. అంతమాత్రాన దాన్ని సాకుగా చూపి ‘వక్ఫ్ బై యూజ్’ నిబంధనను తొలగిస్తామంటే కొత్త సమస్యలొస్తాయి. వక్ఫ్ బై యూజర్‌ను కోర్టులు గతంలోనే ధృవీకరించాయి. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు, నిర్ణయాలను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రాతిపదికను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వక్ఫ్ చట్టం తమకొద్దని చాలా మంది ముస్లింలు చెబుతున్నారని తుషార్ మెహతా చెప్పగా కోర్టు కలుగజేసుకుని ‘‘ అయితే మీరు హిందూ దాతృత్వ ట్రస్టుల్లోనూ ముస్లింలను సభ్యులుగా చేరుస్తామని చెప్పదల్చుకున్నారా?’’ అని సూటి ప్రశ్న వేసింది. ‘‘ వక్ఫ్ చట్టంపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ 38 సార్లు సమావేశమైంది. ఏకంగా 98.2 లక్షల మెమోరండంలను కమిటీ పరిశీలించింది. తర్వాతే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది’’ అని మెహతా చెప్పుకొచ్చారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ ఇక్కడ రెండు విషయాలు తేలాలి.
ఈ కేసులన్నింటినీ హైకోర్టుకు బదలాయించాలా? లేదంటే అసలు మీరు సుప్రీంకోర్టు ద్వారా ఏం ఆశిస్తున్నారు? ఏం వాదించాలనుకుంటున్నారు? అంటూ కేంద్రంంతోపాటు పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు. ‘‘ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం ఆందోళనకరం.
ఓవైపు ఈ అంశం కోర్టుల పరిధిలో పరిశీలనలో ఉండగా మరోవైపు ఆందోళనలు,హింస చెలరేగడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది’’ అని అన్నారు. వెంటనే తుషార్ మెహతా కలుగజేసుకుని ‘‘ఇలా ఆందోళనలు చేయడం ద్వారా వ్యవస్థపై వాళ్లు తీవ్రమైన ఒత్తిడిని తేద్దామని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఎవరు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నారు? మాకైతే అర్థంకావట్లేదు’’ అని సిబల్ బదులిచ్చారు. ‘‘ సానుకూల అంశాలపైనా చర్చిద్దాం’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.
ఏ ప్రాతిపదికన ముస్లింగా నిర్ధారిస్తారు?
పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదించారు. ‘‘ నేను ముస్లింనా కాదా అనే విషయాన్ని ఏ రకంగా కేంద్రం నిర్ధారిస్తుంది?. ఇతను వక్ఫ్‌కు ఆస్తిని, ఇతరత్రాలను దానంగా ఇవ్వడానికి అర్హుడు అని కేంద్రం ఎలా నిర్ధారించుకుంటుంది?. గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వాళ్లే దానం ఇవ్వాలని చెప్పే హక్కు కేంద్రానికి ఎక్కడిది?’’ అని కోర్టులో సిబల్ వాదించారు. దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న ‘వక్ఫ్ బై యూజర్’ను ఏకపక్షంగా తొలగించకూడదని లాయర్ హుజేఫా అహ్మదీ కోరారు.
వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, సమస్థ కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, తదితరులు మొత్తంగా 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీచేయకుండా ముందస్తుగా కేంద్రం ఏప్రిల్ 8వ తేదీన కెవియట్ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో పటిషన్ల విచారణ మొదలుకాకుండానే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తాత్కాలిక ఉత్తర్వులురాకుండా అడ్డుకోగలిగింది.
కేంద్రానికి సుప్రీంకోర్టు సంధించిన కీలక ప్రశ్నలు
⇒ ముస్లిమేతరులూ వక్ఫ్ బోర్డుల్లో ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తోంది. మరి హిందూ ఆలయాల నిర్వహణ బాధ్యతలు చూసే ట్రస్టుల్లో ముస్లింలను సభ్యులుగా కేంద్రప్రభుత్వం అనుమతిస్తుందా?
⇒ బ్రిటిషర్లు రానంతవరకు భారత్‌లో భూములకు రిజి్రస్టేషనే లేదు. కొన్ని మసీదులను 14వ, 15వ శతాబ్దంలో నిర్మించారు. వాటికి సేల్‌డీడ్ లాంటివి తేవడం అసాధ్యం. శతాబ్దాలుగా వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్న మసీదులు, ఇతర ఆస్తుల హక్కుల పత్రాలు, డాక్యుమెంట్లను ముస్లింలు ఇప్పుడెలా తీసుకురాగలరు?
⇒ విచారణ, దర్యాప్తు పూర్తిచేసి అధీకృత అధికారి నిర్ధారించనంతవరకు సంబంధిత ఆస్తి వక్ఫ్‌ది కాదు అని ప్రభుత్వం చెబుతోంది. అలా నిర్ధారణ సాధ్యంకాని ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందుతాయా?
⇒ వక్ఫ్(సవరణ)చట్టం,2025 అమల్లోకి రాకముందు వరకు వక్ఫ్ బై యూజర్ నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు అది మనుగడలో లేదంటారా?
⇒ గతంలో కొన్ని ఆస్తులు వక్ఫ్ ఆస్తులేనని కోర్టు తీర్పులే స్పష్టంచేస్తున్నాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 2ఏతో ప్రభుత్వం ఆ తీర్పులను చెల్లనివిగా మారుస్తోందా?