
సాక్షి, ఢిల్లీ: దేశ జనాభాలో ముస్లింలు దాదాపు 15 శాతం ఉన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్స్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని చెప్పారు.
‘‘ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 13 స్పష్టం చేసింది. నాన్ ముస్లింలను వక్ఫ్ కమిటీలలో ఎలా చేరుస్తారు. మైనారిటీలు టీడీపీ వాదనలను సమర్థించరు. చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు. వక్ఫ్ విషయంలో ముస్లింలకు అండగా నిలబడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.