Bankers meeting
-
Andhra Pradesh చక్కని చదువు.. సొంతిల్లు
సాక్షి, అమరావతి: విద్య, గృహ నిర్మాణ రంగాలు సామాజిక ఆర్థిక ప్రగతిలో కీలకమని, ఈ రెండు రంగాల పట్ల బ్యాంకింగ్ రంగం మరింత సానుకూల దృక్పథంతో.. అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. శుక్రవారం తన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన 222వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది ఎంత మేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నారు.. ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారో వివరిస్తూ మార్గ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో బ్యాంకింగ్ వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించిందని, ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందని ప్రశంసించారు. అయితే విద్య, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయి కన్నా రుణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. విద్యా రంగానికి కేవలం 42.91 శాతం, గృహ నిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని.. సామాజిక–ఆర్థిక ప్రగతిలో ఈ రెండు కీలక రంగాలు అయినందున బ్యాంకింగ్ రంగం వీటి పట్ల మరింత సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ గృహ నిర్మాణాలకు ఊతమివ్వాలి ► 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ప్రభుత్వమే ఈ ఇళ్ల స్థలాలు సేకరించి, లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ ఏప్రిల్‌లో మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నాం. వీటితో కలిపి దాదాపు 25 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీలు సబ్సిడీ ధరలకు అందిస్తోంది. వీటికి అదనంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.35 వేలు రుణం 3 శాతం వడ్డీతో అందించాలని బ్యాంకులతో చర్చించాం. ఈ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ► ఈ ఇళ్ల లబ్ధిదారులందరూ మహిళలే. వారి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రూ.35 వేల రుణం తీసుకోని వారికి త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నాం. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటే.. స్టీల్, సిమెంట్ వినియోగం వల్ల గ్రామీణ ఆర్థిక రంగ అభివృద్ధికి గణనీయమైన ఊతమొస్తుంది. మొత్తం 30.75 లక్షల ఇళ్ల నిర్మాణం జరగబోతుంది. ఇలా కడుతున్న ఒక్కో ఇంటి మార్కెట్ విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండబోతుంది. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ రంగానికి బ్యాంకులు మరింతగా సహకరించాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులకు మరింత బాసట ► వ్యవసాయ రంగంలో స్వల్ప కాలిక పంట రుణాల విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో 83.36 శాతానికి చేరుకున్నాం. వంద శాతానికి చేరుకోక పోవడంపై దృష్టి పెట్టి ఎస్ఎల్బీసీ సరైన చర్యలు తీసుకోవాలి. ► కౌలు రైతుల రుణాలకు సంబంధించి 2022 డిసెంబర్ వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించాం. 1,63,811 మంది కౌలు రైతు ఖాతాలకు మాత్రమే క్రెడిట్‌ను పొడిగించారు. కౌలు రైతుల రుణాల లక్ష్యం రూ.4,000 కోట్లు కాగా, మొదటి 9 నెలల్లో కేవలం రూ.1,126 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈ దృష్ట్యా వీరికి బ్యాంకులు మరింత బాసటగా నిలవాలి. ► రాష్ట్రంలో సాగయ్యే ప్రతి ఎకరా భూమికి ఇ–క్రాపింగ్ చేస్తున్నాం. డిజిటల్, ఫిజికల్ రశీదులు కూడా ఇస్తున్నాం. సాగు చేసే రైతు పేరు, విస్తీర్ణం, సాగు చేసిన పంట వివరాలన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా తోడుగా నిలిచే ఆర్బీకే వ్యవస్థ రాష్ట్రంలో సమర్థవంతంగా పని చేస్తోంది. ► కౌలు రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నాం. భూ యజమానుల హక్కులకు భంగం లేకుండా కౌలు చేసుకునేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన పత్రాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాం. అందువల్ల కౌలు రైతులకు రుణాల విషయంలో బ్యాంకులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ వడ్డీతో మహిళలకు రుణాలు ► మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ విషయంలో బ్యాంకులు పునః పరిశీలన చేయాలి. మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తున్నారు. కానీ వారికిచ్చే రుణాలపై అధిక వడ్డీ వేస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి, తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా చూడాలి. ► ఈ వడ్డీ రేట్లను పర్యవేక్షించడానికి.. అధికారులు, బ్యాంకర్లు కలిసి సమావేశం కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. దాదాపు కోటి మందికి పైగా మహిళలు ఉన్న ఈ రంగంలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ రంగంలో ఇప్పుడు ఎన్పీఏలు లేరు. వీరిపట్ల బ్యాంకులు ఉదారతతో ఉండాలి. సున్నా వడ్డీ, చేయూత, ఆసరా వంటి పథకాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. జూలైలో జగనన్న తోడు ► చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారి అవసరాలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.10,000 చొప్పున రుణాలు అందిస్తూ.. వీటిపై వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకూ 25 లక్షల మంది రుణాలు పొందారు. ► వీరికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్ రంగం కూడా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. జగనన్న తోడు తదుపరి దశను 2023 జూలైలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ► ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్, యూనియన్ బ్యాంకు ఎండీ అండ్ సీఈఓ ఏ.మణిమేకలై, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్ కుమార్, నాబార్డు సీజీఎం ఎం ఆర్ గోపాల్, ఆర్బీఐ డీజీఎం వికాస్ జైస్వాల్, పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు. డిజిటల్ లైబ్రరీలకు సహకరించాలి ► సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు నిర్మించాం. ప్రతి ఊళ్లో ఇంగ్లిష్ మీడియం స్కూలు, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. అక్కడే డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్‌తో వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించనున్నాం. కంప్యూటర్లు, వర్క్ ఫ్రం హోం సౌలభ్యంతో డిజిటల్ లైబ్రరీలు గ్రామాల స్వరూపాన్ని మార్చబోతున్నాయి. వీటి నిర్మాణానికి నాబార్డు, బ్యాంకులు సహకరించాల్సిన అవసరం ఉంది. ► యువతీ యువకులను సుశిక్షితంగా తయారు చేసేందుకు, వారికి ఉపాధి కల్పనను మెరుగు పరిచేందుకు ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పాఠ్య ప్రణాళిక, కోర్సుల బోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్దేశించేందుకు ఒక యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమాలకు బ్యాంకులు బాసటగా నిలవాలి. గత ఏడాది లక్ష్యం మేరకు రుణాలు : ఎస్ఎల్బీసీ వెల్లడి ► ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపు ఇచ్చాం. మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కంటే ఎక్కువ రుణాలు ఇచ్చాం. ప్రాథమిక రంగానికి 2022–23 రుణ ప్రణాళిక లక్ష్యం రూ.2,35,680 కోట్లు కాగా, రూ.2,34,442 కోట్ల రుణాలు ఇచ్చాం. 99.47 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. ► వ్యవసాయ రంగానికి రుణాల లక్ష్యం రూ.1,64,740 కోట్లు కాగా 1,72,225 కోట్లతో 104.54 శాతం మేర ఇచ్చాం. ఎంఎస్ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ.50,100 కోట్లు కాగా, రూ.53,149 కోట్లతో 106.09 శాతం ఇచ్చాం. ► ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ.1,63,903 కోట్లు ఇచ్చాం. దాదాపుగా రెట్టింపు స్థాయిలో 195.59 శాతం మేర ఇచ్చాం. -
కౌలు రైతులు, చేనేత సంఘాలకు రుణ సాయాన్నిపెంచండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటిపై కూడా బ్యాంకర్లు దృష్టి సారించాలన్నారు. కౌలు రైతులకు సహకారాన్ని అందించాలని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాలకు రుణ సహాయాన్ని పెంచాలన్నారు. చిన్న పరిశ్రమల పునరుద్ధరణ కోసం వైఎస్సార్ నవోదయం కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బ్యాంకర్లను కోరారు. దీనికోసం బ్యాంకర్లు, పరిశ్రమల శాఖ మధ్య మరింత సమన్వయం, పర్యవేక్షణ అవసరమన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. దీనిపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించాం ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించామని, ఇందుకు సహకరించిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి ధన్యవాదాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) చైర్మన్ పకీరిసామి చెప్పారు. వార్షిక రుణప్రణాళిక మేరకు సెప్టెంబర్ 2019 నాటికి వివిధ ప్రాధాన్య రంగాల్లో నిర్దేశించిన రూ.1,69,200 కోట్లకు గాను రూ.94,531 కోట్లు (55.87 శాతం) రుణాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఇదే కాలానికి వ్యవసాయ రంగంలో రూ.1,15,000 కోట్లకు గాను, రూ.65,577 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈ కింద నిర్దేశించిన రూ.36 వేల కోట్ల లక్ష్యానికి గాను రూ.25,020 కోట్ల (69.60 శాతం) రుణాలు ఇచ్చామని వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతోదాస్ తెలిపారు. కౌలు రైతులకు రుణాలు ఆశించినంతగా ఇవ్వలేదని, అనుకున్న లక్ష్యం మేరకు ఇవ్వాల్సిందేనని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కౌలు రైతుల చట్టాన్ని తెచ్చిందని, బ్యాంకులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన వెంటనే ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని అందించాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను నెల రోజుల్లో రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. కాగా, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖల్లో అనుకున్న దానికన్నా రుణాలు తక్కువగా ఇచ్చారని, బ్యాంకులు దీనిపై దృష్టిపెట్టాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ కోరారు. -
నవరత్నాలకు ఊతమివ్వండి
ఈ మధ్యకాలంలో పత్రికల్లో హెడ్డింగులు చూస్తూనే ఉన్నారు.. మేము తీసుకున్న చర్యలన్నీ సదుద్దేశంతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉంది. అనవసర వ్యయాలను తగ్గిస్తున్నాం. ప్రాధాన్యతల ప్రకారం ముందుకు వెళ్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలన్నీ పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, ఆక్సిజన్ లాంటి వీటికి బ్యాంకర్లు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రైతులు, ఆటోలు.. ట్యాక్సీలు నడుపుకుంటున్న వారికి, మత్స్యకారులకు, చేనేతలకు, అగ్రిగోల్డ్ బాధితులకు, కొత్తగా లా పూర్తి చేసిన వారికి.. ఇలా వివిధ వర్గాల వారికి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్లకు పైగా నగదు సాయం చేశామని స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద ఈ నెలలో సుమారు రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు దాని ప్రభావం సమాజంలోని అట్టడుగు వర్గాలపైనే ఉంటుందని, ఈ పథకాల ద్వారా ఆ వర్గాల వారికి ఆక్సిజన్ అందించగలిగామన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు బదిలీ రూపంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాల వారికి చేరవేయడానికి ఉద్దేశించిన అన్ ఇంకంబర్డ్ ఖాతాలు అందించడంలో బ్యాంకులు చక్కటి సహకారాన్ని అందించాయన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలిగామని చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయని, రైతు భరోసాతో రైతులను ఆదుకున్నామని, వ్యవసాయ రంగం బాగుండడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకూ రుణాలు ఇవ్వండి కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని ఎస్ఎల్బీసీ లెక్కలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బ్యాంకర్లు, ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేద్దామని కోరారు. కౌలు రైతుల కోసం ఒక చట్టాన్ని తీసుకు వచ్చామని, ఈ చట్టం పూర్తి పారదర్శకంగా ఉందని చెప్పారు. ఈ చట్టం ద్వారా రైతుల హక్కులను పరిరక్షిస్తూనే 11 నెలలకు సాగు ఒప్పందానికి వీలు కల్పిస్తోందన్నారు. రైతులు హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని అవగాహన కల్పించాల్సిందిగా సీఎం సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ చైతన్యం, అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉందని, 10 నుంచి 12 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ప్రతి పథకాన్ని పారదర్శక విధానంలో వివక్ష, అవినీతికి తావు లేకుండా అందిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారని, వీరిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ నాటికి 11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ నాటికి గ్రామ సచివాలయాల పక్కనే దాదాపు 11 వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. శిక్షణ కేంద్రంలా, రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేలా ఈ కేంద్రాలు పని చేస్తాయని, వీటికి ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇస్తుందని స్పష్టం చేశారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై ఇక్కడ శిక్షణ ఇస్తారని, రైతుల ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా కూడా భవిష్యత్తులో పని చేస్తాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఇంటర్నెట్ సౌకర్యంతో అనుసంధానిస్తామని, తద్వారా డిజిటలైజేషన్ పెరుగుతుందని చెప్పారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారని, వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. వీరందరికీ గుర్తింపు కార్డులతో రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. తద్వారా దాదాపు 12 లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ నవోదయం కింద ఖాతాల పునర్ వ్యవస్థీకరణపై కూడా దృష్టి పెట్టాలని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో రాష్ట్రం 12వ ర్యాంకులో ఉందని చెబుతున్నారని, ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని సీఎం సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిపై దృష్టి పెడతామన్నారు. రైతులు, మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే రైతులకు, మహిళా సంఘాలకు సకాలంలో రుణాలివ్వాలని సీఎం బ్యాంకర్లను కోరారు. వడ్డీ చెల్లింపు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహిళలు, రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో రుణాలు ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై వివిధ జిల్లాల్లో వేసే వడ్డీల్లో వ్యత్యాసం ఉందని, 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో 12 శాతం ఉందని, ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ కింద పెట్టిన బకాయిలు రూ.648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని బ్యాంకులు పదే పదే తన దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందిస్తున్నానని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా బ్యాంకర్లు దృష్టి పెట్టాలని సీఎం కోరారు. మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి.. మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డేటా ప్రకారం శ్రీశైలం వద్ద కృష్ణాలో వచ్చిన నీళ్లు 47 సంవత్సరాల సగటు 1,200 టీఎంసీలుండగా గత 10 ఏళ్లలో అది 600 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. గత 5 ఏళ్లలో అయితే ఏకంగా 400 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరో వైపు గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయన్నారు. గోదావరి మిగులు జలాలను వాడుకోవాల్సి ఉందని, 62 శాతం ప్రజలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, వీటికి బ్యాంకర్లందరూ సహాయం అందించాలని సీఎం కోరారు. స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పునరుద్ధరణ నాడు – నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, మొత్తం 45 వేల స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను బాగు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఇందు కోసం దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అడుగు వేస్తున్నామన్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతున్నామని సీఎం వివరించారు. వచ్చే నాలుగైదేళ్లలో విద్యాపరంగా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వారిని ఆదుకోకపోతే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. అందుకే ప్రభుత్వం, బ్యాంకులు ఒకతాటిపైకి వచ్చి మరిన్ని కార్యక్రమాలు చేయగలగాలి. ఉగాది నాటికి సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ.. మొత్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ప్రతి ఏటా 6 లక్షల చొప్పున ఇళ్లు కడతాం. తద్వారా సిమెంట్, ఐరన్, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయి. పారిశ్రామిక వృద్ధి సాధ్యమవుతుంది. -
కౌలు రైతులకు అండగా ఉంటాం: ఉప ముఖ్యమంత్రి
సాక్షి, తూ.గో: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాకినాడ కలెక్టరేట్లో తొలిసారి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, రాపాక వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ నేపథ్యంలో రైతు రుణాల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ‘కౌలు రైతులకు సహాయం చేయకపోతే భగవంతుడు క్షమించడు. కౌలు రైతులకు ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందించలేకపోతున్నాయి. మన ప్రభుత్వంలో కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది’ అని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కౌలు రైతుల కోసం రెవెన్యూ శాఖ నూతన ప్రభుత్వంలో ఒక డాక్యుమెంట్ తయారు చేసి, రైతుల పక్షాన నిలుస్తామన్నారు. కార్పోరేషన్ లోన్లు మంజూరు అయిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయాలన్నారు. రీపేమెంట్ విషయంలో ఇబ్బందులు వస్తే ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. -
ఒకటో తారీఖు అంటేనే భయం వేస్తోంది..
సాక్షి, అమరావతి : ఒకటో తారీఖు వస్తుందంటే భయపడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న నగదు కొరత సమస్యపై ముఖ్యమంత్రి బ్యాంకు అధికారులతో చర్చించారు. ఒకటో తేది వస్తే భయం వేస్తోందని, ఒక్క ఫించన్ల కోసమే రూ.450 కోట్లు కావాలన్నారు. ఎందుకు రాష్ట్రంలో నగదు లభించడం లేదంటూ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. బ్యాంకుల తీరుతో ప్రజల్లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. ఏ బ్యాంకు అయినా ఇబ్బందుల్లలో ఉంటే డిపాజిట్లర డబ్బు వాడుకుంటాం అనే సంకేతాలను ప్రజల్లోకి పంపారని, అందువల్లే ఈ సమస్యలు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీఎన్బీ కుప్పకూలడంతో ప్రతిఒక్కరిలో భయం పట్టుకుందని, అది తొలగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగిన పలు ప్రశ్నలుకు బ్యాంకు అధికారులు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 85శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని తెలిపారు. డిపాజిట్లుగా వస్తున్న నగదు నాలుగోవంతుకు పడిపోయిందని వెల్లడించారు. ప్రజలు వినియోగదారులు తీసుకున్న డబ్బులో చాలా వరకు ఖర్చు చేయడంలేదని, అందుచేతనే నగదుకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని బ్యాంకర్లు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఐదు వందల కోట్లు నేరుగా ప్రింటింగ్ నుంచి రాష్ట్రానికి వస్తున్నాయని బ్యాంకు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. -
కేంద్రం ఏం చేద్దామనుకుంటోంది : యనమల
సాక్షి, అమరావతి : ఆంధధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారుల సమావేశం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల బ్యాంకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని, ఏటీఎంలు మూతపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండటంలేదని.. కనీసం వెయ్యి రూపాయలు కూడా దొరకడం లేదన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నగదు కొరతతో రియల్ఎస్టేట్ రంగం పడిపోయిందని, ఎకనామిక్ యాక్టివిటి జరగడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వృద్ధిరేటు శాతం తగ్గిపోయిందని, భవిష్యత్తులో మనీ సర్క్యూలేషన్ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల వస్తాయని యనమల అన్నారు. రాష్ట్రంలో చాలా వరకు ఏటీఎంలు మూతపడ్డాయని, ప్రజలు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని యనమల అభిప్రాయపడ్డారు. నగదు కొరతపై చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. నల్లధనాన్ని అరికడతామని నాడు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని, కానీ అది పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా నోట్ల రద్దు వల్ల ఇతరత్రా సమస్యలు అనేకం తలెత్తాయిని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2వేల నోట్లు కనిపించకుండా పోయాయని, కనీసం వందనోట్లు కూడా ఎక్కడ దొరకడం లేదంటూ యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు డబ్బు సర్క్యులేషన్లో ఉంటేనే ఆర్ధిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు స్థంభిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వాలపై పడుతోందని, బ్యాంకుల్లో నగదు లేమిని నివారించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఏం చేద్దామనుకుంటుందో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి యనమల వ్యాఖ్యలతో బ్యాంకు అధికారులు విభేదించారు. ఆర్బీఐ నుంచి వేల కోట్లు విలువ చేసే కొత్త నోట్లు అందించామని తెలియచేశారు. -
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయాలి
విజయవాడ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయటంలో అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్యాంకు అధికారులను కోరారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన బ్యాంకు అధికారులు, సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రస్తుతం మంజూరు చేస్తున్న రుణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రబీపంటను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే రైతులకు రుణాలు మంజూరు చేయటానికి కసరత్తు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు త్వరితగతిన రుణాలను మంజూరు చేయాలన్నారు. పెద్ద నోట్లు రద్దు అనంతరం గత నెల రోజులుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకులకు వచ్చిన నగదు, ఎంత మొత్తం డిపాజిట్ అయింది, ఏటీఎంలలో ఎంత మొత్తం పంపిణీ జరిగిందనే సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకు అధికారులను మంత్రి కోరారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో నగదు రహిత చెల్లింపులపై చేపట్టిన చర్యలను వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్, పి.జె.చంద్రశేఖర్, బి.నాగేశ్వరరావు, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, కనకదుర్గగుడి ఈవో సూర్యకుమారి, సబ్‌కలెక్టర్ సలోని సిదాన, ఎల్.డి.ఎం. జి.వెంకటేశ్వరరెడ్డి వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
బ్యాంకర్లపై చంద్రబాబు అసహనం
-
బ్యాంకర్లపై సీఎం అసహనం
-
బ్యాంకర్లపై సీఎం అసహనం
అమరావతి: పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు, అధికారులతో జరిపిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మూడు వారాలు గడిచినా ఇప్పటికీ ఏటీఎంలు, బ్యాంకుల ముందు నిలబడి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతునే ఉన్నారన్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ఉదయం, సాయంత్రం సమీక్షిస్తున్నా బ్యాంకర్ల సహాయ నిరాకరణ, వైఫల్యం వల్ల ప్రజల దృష్టిలో నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చిన్న నోట్ల పంపిణీ జరగడం లేదని, ఏపీ నుంచి డిపాజిట్లు పెద్ద ఎత్తున జమ అవుతుండగా నగదు ఉపసంహరణకు మాత్రం చాలా తక్కువ మొత్తాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. 20 రోజులైనా బ్యాంకర్ల దగ్గర సెంట్రల్ సర్వర్ నుంచి కచ్చితమైన సమాచార లభ్యత లేదని, అన్ని బ్యాంకుల్ని సమన్వయం చేసుకోవాల్సిన ఆర్బీఐ ఈ కీలక సమయంలో ప్రధాన భూమిక పోషించాలని, అది జరగడం లేదని సీఎం అన్నారు. ఈ ఉదాశీనతను ఇక సహించేది లేదన్నారు. రోజూ నిర్వహిస్తున్న అత్యవసర సమావేశాలకు లీడ్ బ్యాంకర్లే సక్రమంగా రావడంలేదు... వచ్చిన ప్రతినిధుల దగ్గర కచ్చితమైన సమాచారం ఉండటంలేదు.. డేటా లేనప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రయోజనం ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ మిషన్ల అందుబాటు, చిన్న నోట్ల అందుబాటులో రియల్‌టైం డేటా ఇవ్వడం లేదని సీఎం అన్నారు. కాగా, ఈ రోజు రాష్ట్రంలో 500 నోట్లు రూ. 95 కోట్లు వరకు ఉన్నాయని, వంద నోట్లు 62 కోట్లు, 2000 నోట్లు 1320 కోట్లు, 20 రూపాయల నోట్లు 8 కోట్లు, 10 రూపాయల నోట్లు రూ.2.6 కోట్లు ఉన్నాయని ముఖ్యమంత్రికి బ్యాంకర్లు వివరించారు. -
ఇకపై నగదు రహిత లావాదేవీలు
- బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు - పింఛన్లు సహా లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే - రాబోయే రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్‌కు మళ్లాలి సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీనికోసం విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, నరేగా సూపర్వైజర్లను వినియోగించుకోవాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలను పెంచేందుకు ఆర్బీఐకి, కేంద్రానికి ఐదు సూచనలతో లేఖ రాయనున్నట్లు తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ (ఎస్ఎల్బీసీ)తో సోమవారం సీఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ బ్యాంకు అధికారుల నుంచి వాస్తవ సమాచారం రావడం లేదన్నారు. ఆన్లైన్, కార్డులపై వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలను డిసెంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులే చార్జీలు తగ్గించాలన్నారు. ఫిజికల్ కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ వినియోగంపై చార్జీలు తక్కువ ఉండాలని, ఇందుకు అనుగుణంగా బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల నుంచి ఖాతాల్లోనే పెన్షన్లు వచ్చే నెల నుంచి వృద్ధాప్య, వింతతు పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందరికీ రూపే కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. త్వరలో రైతుబజార్లు, పెట్రోల్‌బంకులు, సినిమాహాళ్లు వంటి వాటిల్లో కూడా కార్డుల ద్వారానే లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మరింత నగదు వస్తుందన్న నమ్మకం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని సీఎం అన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌వైపు మళ్లండి రాబోయే రోజుల్లో ప్రజలు మొబైల్ బ్యాంకింగ్‌వైపు మొగ్గుచూపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై ఏపీ జెన్కో నెలకొల్పిన ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 వేల నోటు వల్ల ప్రయోజనం లేదన్నారు. వ్యవసాయంవల్ల ఎక్కువ ఆదాయం రాదని, అందువల్ల అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం దుకాణాల్లో స్వైప్ యంత్రాలు.. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లోనూ స్వైప్ యంత్రాలను అందుబాటులో ఉంచుతామని బాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు ఇబ్బందులు ఎదుర్కొనేందుకు క్యాష్, రూపీ, మొబైల్ బ్యాంకింగ్ వంటి మూడు విధానాలను అమలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ 10న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు పనులను ప్రారంభించనున్నామని చెప్పారు. కాగా, బ్యాంకుల పరిమితులు, ఏటీఎంలలో నగదు లేక జనం ఇబ్బంది పడుతుంటే.. పింఛన్లు సహా అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా నిర్వహిస్తామని సీఎం చెప్పడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ఒక్కటీ అడగొద్దు
‘లక్షల్లో రుణాలు మిమ్మల్ని ఎవరిమ్మన్నారు. మీరు ఇష్టమొచ్చినట్టు ఇవ్వడం వల్లే ఇప్పుడు రుణమాఫీ అమలు చేయలేకపోతున్నా..ఈసారి స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఇవ్వండి..లేకుంటే మీకే ఇబ్బంది.’ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవీ.. మీ అవసరాల కోసం ఇష్టమొచ్చినట్టుగా రుణాలు తీసుకుంటారు..ఇప్పుడు బకాయిలు చెల్లించమంటే నోరెళ్లబెడతారు..మాఫీ వంకతో బకాయిలు చెల్లించడం లేదు..మీకు కొత్త రుణాలు కావాలా? జిల్లాలో ఓ బ్యాంకరు రైతులనుద్దేశించి అన్న మాటలు. సాక్షి, విశాఖపట్నం: ఇవి చాలు అన్నదాతల పట్ల ప్రభుత్వానికి..బ్యాంకర్లకు ఉన్న దృక్పథాన్ని అర్థం చేసుకోడానికి. ఎన్నికల్లో రూ.87వేల కోట్ల రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తానంటూ రైతులను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష నిబంధనలతో ఆ మాఫీ కాస్తా ఐదువేల కోట్లకు కుదించేశారు. మాఫీ మాట దేవుడెరుగు..కొత్త రుణాలైనా ఇప్పించండి మహాప్రభో అంటే బకాయిల సాకుగా చూపి ఆ ఒక్కటీ అడగొద్దంటూ బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారు. దీంతో జిల్లాలో రానున్న సీజన్లో రుణాలు విరివిగా మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ ఉన్నా అప్పులిచ్చేవారు..స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా ఇంటిలో ఎవరి పేరునైనా సరే విరివిగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం అంటూ బంగారం కుదవ పెట్టి అప్పులడిగితే ఆభరణాల విలువలో 75 శాతం మొత్తం రుణాలుగా ఇచ్చేవారు. వీటిపై 33 పైసలు మాత్రమే వడ్డీ వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయ అవసరాల కోసమని ఎవరైనా అప్పు కోసం బ్యాంకుకు వెళితే మేనేజర్లు పెడుతున్న ఆంక్షలు రైతులకు దిమ్మతిరిగిపోతుంది. నువ్వు రైతువా?నీకు భూమిఉందా? నీపేరు మీదే ఉందా? నీకు ఏ బ్యాంకులోనైనా అప్పు ఉందా? ఉంటే ఎంత? ఎంత చెల్లించావు? ఇంకా ఎంత చెల్లించాలి? అంటూ సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నారు. తన భార్య పేరు మీద భూమిఉందని చెబితే అయితే ఆమెనే తీసుకురా..ఆమె పేరుమీదే రుణం ఇస్తాం.. నువ్వు అడిగినంత ఇవ్వలేం. స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ఇక వ్యవసాయ అవసరాల కోసం భూమి పత్రాలతో పాటు బంగారం కుదువపెట్టి రుణం అడిగితే నీకు ఎకరం భూమి ఉండి.. కిలో బంగారం తీసుకొచ్చినా సరే గతంలో మాదిరి బంగారం విలువలో 75 శాతం మేర వ్యవసాయ రుణంగా ఇవ్వలేం. బంగారు రుణాలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఎకరాకు 24వేలకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. అంతకుమించి కావాలంటే బంగారాన్ని కుదవపెట్టుకుని రూపాయికి పావలా వడ్డీకి రుణాలిస్తామే తప్ప వ్యవసాయ రుణం పేరిట ఇవ్వలేమంటున్నారు. పైగా భూ మి, బంగారం తనదై ఉండాలంటూ మెలిక పెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఖరీఫ్‌లో రూ.650 కోట్లు, రబీలో రూ.312 కోట్ల రుణం ఇ వ్వాలని నిర్ణయిస్తే రుణమాఫీ పుణ్యమా ని అతికష్టం మీద ఖరీఫ్‌లో రూ.342 కోట్లు, రబీలో రూ.204కోట్ల మేర రుణాలివ్వగలిగారు. రానున్న 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో రూ.800కోట్లు, రబీలో రూ.300కోట్ల చొప్పున జిల్లాలో రైతులకు రూ.1100కోట్ల మేర రుణాలివ్వాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ రుణామాఫీ భూతం వెన్నాడుతున్నందున రానున్న వ్యవసాయసీజన్‌లో కూడా యాక్షన్ ప్లాన్‌కు తగ్గట్టుగా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చునని అధికారులే అంగీకరిస్తున్నారు. -
4,56,286 మంది రైతులకు రుణమాఫీ
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో పంటరుణాలు తీసుకున్న 4, 56, 286 మంది రైతులకు రూ. 2,682 కోట్లు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి తెలిపారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పంటరుణాల మాఫీపై గురువారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకున్న పంట రుణాలలో ఒక్కో కుటుంబానికి రూ. లక్ష లోపు మాఫీ అవుతుందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఈనెల 13న జీవో 69ని విడుదల చేసిందన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,682 కోట్లు మాఫీ కానున్నట్లు వెల్లడించారు. రుణాలు తీసుకున్న రైతుల వివరాలను నిర్ణీత నమూనాలో ఈ నెల 23 లోపు సిద్ధం చేయాలని ఆదేశించారు. కుటుంబ యాజమాని, భార్య, వారిపై ఆధారపడి జీవించే పిల్లలంతా ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. జిల్లాలో రుణమాఫీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. 2014 మార్చి 31 వరకు ఉన్న పాత పంటరుణాల బకాయిలు, వడ్డీలు కలిపి రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయం కోసం తీసుకున్న పంట రుణాలు, బంగారు రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. ఎస్‌హెచ్‌జీ, టైఅప్, గోదాము, కోల్డ్‌స్టోరేజీ రుణాలకు మాఫీ వర్తించదని తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 లోగా పంట రుణాలు చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించదని, అయితే మార్చి 31 తరువాత రుణాలు తిరిగి చెల్లించిన వారికి వర్తిస్తుందని చెప్పారు. 24, 25, 26 తేదీల్లో మండలస్ధాయిలో తహశీల్దార్ల అధ్యక్షతన ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి, అర్హుల జాబితాపై సమీక్షించాలని సూచించారు. ఒక్కో రైతు కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో ఎంత మేరకు పంట రుణాలు తీసుకున్నదనే వివరాలను నిర్ణీత ఫార్మాట్లో నమోదు చేయాలన్నారు. సామాజిక తనిఖీ కోసం ఈ జాబితాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ఈనెల 31న జరిగే జిల్లా స్థాయిలోబ్యాంకర్ల సమావేశంలో జాబితాను అందజేయాలని చెప్పారు. ఈ నివేదికను తాము ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఆధార్ నంబర్ ఉన్న రైతులు బ్యాంక్లలోఆధార్ జిరాక్స్ ఇచ్చి తమ ఖాతాలకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. జిల్లాలో 39 మండలాలకే రుణమాఫీ వర్తిస్తుందని, పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించామని, ఆ మండలాల్లో రుణమాఫీ వర్తించదని వివరించారు. ఈ ఖరీఫ్‌లో రైతులు కొత్తగా పంట రుణాలు తీసుకోవడానికి, పంటల బీమా సౌకర్యం వినియోగించుకోవడానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, వ్యవసాయశాఖ సంచాలకులు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
60 వేల కోట్లతో వార్షిక రుణప్రణాళిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం హోటల్ మేరియట్లో జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా బ్యాంకర్ల సమావేశం జరుగుతోంది. వ్యవసాయం, మహిళా సంఘాలకు రుణాలు, ప్రాధాన్య రంగాలకు ఏ మేరకు రుణాలు ఇవ్వాలనేది ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. దాదాపు రూ. 60 వే ల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. ఇందులో వ్యవసాయ రుణాలు 28 వేల కోట్లు, మహిళా సంఘాలకు ఐదువేల కోట్లకు పైగా రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలో పొందుపర్చారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ.. రుణ మాఫీ వివరాలు అందించాలని మాత్రమే కోరారు. కాగా, శుక్రవారం జరిగే సమావేశంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ మేరకు రుణాలు అందిస్తారో ఖరారు చేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొంటారు. -
కేసీఆర్‌పై గరం... గరం..
రుణ మాఫీపై మాట తప్పారంటూ అన్నదాతల ఆగ్రహావేశం పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం, ధర్నాలు రుణ మాఫీకి పరిమితులు విధిస్తూ బ్యాంకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై అన్నదాతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. రైతులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల శనివారం కేసీఆర్ దిష్టిబొమ్మలను రైతులు దహనం చేశారు. ధర్నా నిర్వహించారు. రుణ మాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రఘునాధపాలెం, న్యూస్‌లైన్: రుణ మాఫీ అమలుకు షరతులు విధించడానిన నిరసిస్తూ రఘునాధపాలెం మండలంలోని పాపటపల్లి గ్రామ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్నిటినీ బేషరతుగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగణ, టీడీపీ నాయకులు వెంకటనారాయణ, మల్లిఖార్జునరావు, రామచంద్రు, కొండయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మణుగూరులో.. మణుగూరు రూరల్: మణుగూరులోని అంబేద్కర్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. రుణ హామీని బేషరతుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బచ్చల భారతి, పార్టీ నాయకులు పాయం నర్సింహారావు, ముత్యంబాబు, వల్లభనేని రమణ, కొమరం పాపారావు, బాబు జానీ, విజయలక్ష్మి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గార్లలో... గార్ల: లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్న డిమాండుతో సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో గార్లలోని ఎస్బీహెచ్ ఎదుట రైతులు గంటపాటు ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కోనేటి సుశీల, సీపీఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాసరావు, రైతులు కె.మహేశ్వరరావు, ఇమ్మడి గోవింద్, ఈశ్వర్‌లింగం, గిరిప్రసాద్, పోటు వీరభద్రం, ఆనంద్, లింగారెడ్డి, లక్ష్మి, కవిత, సుజాత, రమ, తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలో... బయ్యారం: రైతుల రుణ హామీ మాఫీ చేయాలని కోరుతూ తహశీల్దార్ భిక్షంకు సీపీఎం నాయకులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మండా రాజన్న, నంబూరి మధు, మేర్గు వెంకన్న, బల్లెం ఆనందరావు, కత్తి సత్యం, ప్రసాదరావు పాల్గొన్నారు. కామేపల్లిలో... కామేపల్లి: లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేయాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం, తహశీల్దారుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాదావత్ శ్రీను, నాయకులు వింజం నాగభూషణం, ఉప్పతల వెంకన్న, గుండా వెంకటరెడ్డి, అంబటి శ్రీనివాసరెడ్డి, ఎల్.రాంసింగ్, మేడ నాగేశ్వరరావు, అనంతరాములు, మేదర లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందులో... ఇల్లెందు: పంట రుణాలన్నిటినీ ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలన్న డిమాండుతో రైతు సంఘం (సీపీఎం అనుబంధం) ఆధ్వర్యంలో తహాశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. తహాశీల్దారుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దేవులపల్లి యాకయ్య, ఎస్ఎ.నబీ, ఆలేటి కిరణ్, సర్వయ్య, వెంకన్న, రాందాస్, లక్ష్మయ్య, పాపారావు, సూర్య, సాయిలు, నారాయణ, భిక్షం తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురంలో... అశ్వాపురం: అశ్వాపురంలోని ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను టీడీపీ, బీజేపీ నాయకులు శనివారం దహనం చేశారు. ముందుగా, తె లుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి స్టేట్ బ్యాంక్ మీదుగా గౌతమి నగర్ కాలనీ గేటు వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం, తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహశీల్దారుకు వినతిపత్రమిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు టి.లత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముస్కు శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, నాయకులు వాసిరెడ్డి రమేష్‌బాబు, తుళ్ళూరి ప్రకాశ్, ఆదినారాయణ, రామకృష్ణ, కె.సత్యం, సత్యనారాయణ, ఏనుగు కృష్ణారెడ్డి, షరీఫ్, కర్నాటి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.