ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో పంటరుణాలు తీసుకున్న 4, 56, 286 మంది రైతులకు రూ. 2,682 కోట్లు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి తెలిపారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పంటరుణాల మాఫీపై గురువారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకున్న పంట రుణాలలో ఒక్కో కుటుంబానికి రూ. లక్ష లోపు మాఫీ అవుతుందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఈనెల 13న జీవో 69ని విడుదల చేసిందన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,682 కోట్లు మాఫీ కానున్నట్లు వెల్లడించారు. రుణాలు తీసుకున్న రైతుల వివరాలను నిర్ణీత నమూనాలో ఈ నెల 23 లోపు సిద్ధం చేయాలని ఆదేశించారు.
కుటుంబ యాజమాని, భార్య, వారిపై ఆధారపడి జీవించే పిల్లలంతా ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. జిల్లాలో రుణమాఫీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. 2014 మార్చి 31 వరకు ఉన్న పాత పంటరుణాల బకాయిలు, వడ్డీలు కలిపి రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయం కోసం తీసుకున్న పంట రుణాలు, బంగారు రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. ఎస్‌హెచ్‌జీ, టైఅప్, గోదాము, కోల్డ్‌స్టోరేజీ రుణాలకు మాఫీ వర్తించదని తెలిపారు.
ఈ ఏడాది మార్చి 31 లోగా పంట రుణాలు చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించదని, అయితే మార్చి 31 తరువాత రుణాలు తిరిగి చెల్లించిన వారికి వర్తిస్తుందని చెప్పారు. 24, 25, 26 తేదీల్లో మండలస్ధాయిలో తహశీల్దార్ల అధ్యక్షతన ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి, అర్హుల జాబితాపై సమీక్షించాలని సూచించారు. ఒక్కో రైతు కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో ఎంత మేరకు పంట రుణాలు తీసుకున్నదనే వివరాలను నిర్ణీత ఫార్మాట్‌లో నమోదు చేయాలన్నారు. సామాజిక తనిఖీ కోసం ఈ జాబితాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు.
ఈనెల 31న జరిగే జిల్లా స్థాయిలోబ్యాంకర్ల సమావేశంలో జాబితాను అందజేయాలని చెప్పారు. ఈ నివేదికను తాము ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఆధార్ నంబర్ ఉన్న రైతులు బ్యాంక్‌లలోఆధార్ జిరాక్స్ ఇచ్చి తమ ఖాతాలకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. జిల్లాలో 39 మండలాలకే రుణమాఫీ వర్తిస్తుందని, పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించామని, ఆ మండలాల్లో రుణమాఫీ వర్తించదని వివరించారు. ఈ ఖరీఫ్‌లో రైతులు కొత్తగా పంట రుణాలు తీసుకోవడానికి, పంటల బీమా సౌకర్యం వినియోగించుకోవడానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, వ్యవసాయశాఖ సంచాలకులు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
4,56,286 మంది రైతులకు రుణమాఫీ
Published Fri, Aug 22 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement