Ilambariti
-
జనవరి నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
ఖమ్మం జెడ్పీసెంటర్: జవవరి నెల నుంచి జిల్లాలో గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతుందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి పేర్కొన్నారు. గ్యాస్ నగదు బదిలీపై అయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, డీలర్లు, ఎల్డీఎం, పౌరసరఫరాలశాఖాధికారులతో శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్పిజీ గ్యాస్ నగదు బదిలీ పొందేందుకు వినియోగదారులందరూ తప్పనిసరిగా ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలను సంబంధింత గ్యాస్ డీలర్‌కు అందజేయాలన్నారు. నగదు బదిలీ పొందేందుకు గ్యాస్ డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి వారి ఆధార్, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను సేకరించాలన్నారు. ఆధార్ అనుసంథానం చేసుకొని వారు వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 3 లక్షల 61వేల 28 మంది ఆయా డీలర్ల వద్ద సీడింగ్ చేయించుకున్నారని, 2లక్షల 48వేల 61 మంది వివిధ బ్యాంకులతో సీడింగ్ చే యించుకున్నారని కలెక్టర్ తెలిపారు. జనవరి నుంచి నగదు బదిలీ అమలు జరుగుతుందని, అనుసంధానం చేయించుకొని వారికి నగదు బదిలీ సబ్సీడీ వర్తింపులో జాప్యం జరుగుతుందని అన్నారు. వెంటనే అందరు ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలను డీలర్లకు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎల్డీఎం శ్రీనివాస్, డీఎస్వో గౌరీ శంకర్ పాల్గొన్నారు. -
అప్రమత్తంగానే ఉన్నాం..
భద్రాచలం : గోదావరి వరదలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగానే ఉందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి చెప్పారు. వరద పరిస్థితిని పరిశీలించేందుకు భద్రాచలం వచ్చిన ఆయన సోమవారం స్థానిక అధికారులతో కలసి కరకట్ట, నిమజ్జనం ప్రాంతం, తానీషా కల్యాణ మండపం ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి పరివాహక మండలాల్లో పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదిక చేపట్టాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. సెక్టోరియల్, జోనల్, మండల స్థాయి అధికారులంతా స్థానికంగానే ఉండి ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వరద పెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రభావం ఎక్కువగా ఉండే మండల కేంద్రాల్లో సరిపడా బియ్యం, ఇతర నిత్యావసర నిల్వలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 20 లాంచీలను సిద్ధంగా ఉంచామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భద్రాచలం కరకట్ట వద్ద స్లూయీస్‌ల వద్ద నీరు లీకవుతున్నందున ఐటీసీ నుంచి ప్రత్యేకంగా మోటార్లు తెప్పించి ఎప్పటికప్పుడు నీటిని బయటకు తోడేలా చర్యలు చే పట్టామని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వరద సహాయక చర్యలకు సంబంధించిన అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులంతా భద్రాచలంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షించేలా తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష... వరద ఉధృతి క్రమేపీ పెరుగుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ జిల్లా స్థాయి అధికాారులతో సమీక్షించారు. ముంపు ప్రాంత ప్రజానీకాన్ని సత్వరమే సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వరద తగ్గుముఖం పట్టగానే ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తానీషా కల్యాణ మండపంలో బస చేసిన గుంటూరు నాగార్జున విశ్వ విద్యాలయ 10వ బెటాలియన్‌కు చె ందిన జాతీయ విపత్తు స్పందన ఫోర్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, ఆర్డీవో అంజయ్య, ఇరిగేషన్ ఈఈ శ్రావ ణ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ సరస్వతి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. -
రుణమాఫీకి ‘ఆధార్’ తప్పనిసరి
ఖమ్మం జెడ్పీసెంటర్: బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం తిరిగి చెల్లిం చేందుకు బ్యాంకుఖాతాలకు ఆధార్‌నంబర్‌ను అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి తెలిపారు. రుణమాఫీ పథకం లబ్ధిదారుల జాబితా, ఈజీఎస్ కూలీల వేతనాలు, పెన్షన్ తదితర వివరాలపై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పది రోజు ల్లో రైతుల ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఆధార్ అనుసంధానం అయితేనే రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన రైతులందరికీ ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతోనే ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈజీ ఎస్ వేతనాలు, పెన్షన్లను ఆన్లైన్లోనే చెల్లిం చేందుకు ఆధార్‌ను అనుసంధానించాలన్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తోపాటు ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయాలన్నారు. సమగ్ర సర్వే మాదిరిగా పీఎం జన్‌ధన్ యోజన డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని ప్రజలకు జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లు తెరుస్తారన్నారు. పంచాయతీల వారీగా ఆధార్ ఉన్నవారు లేనివారిని వేర్వేరుగా విభజించి ఆధార్‌కార్డులు కలిగిన వారికి బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ భాస్కర్‌రావు, ఎల్డీఎం శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు. -
రుణమాఫీపై కసరత్తు!
ఖమ్మం వ్యవసాయం : పంట రుణాలమాఫీపై బ్యాంకర్లు కసరత్తు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఆదేశాల మేరకు బ్యాంకర్లు పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితా, వ్యవసాయ భూమి పాస్‌బుక్ ఆధారంగా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల జాబితాలను వేర్వేరుగా తయారు చేస్తున్నారు. జిల్లాలో 4,56,286 మంది రైతులు రూ.2,682 కోట్ల పంటరుణాలు తీసుకున్నారని అధికారుల ప్రాథమిక అంచనా. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ఆధారంగా పంటరుణాల మాఫీకి అర్హుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ గురువారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. 2014 మార్చి 31 తేదీకి ముందు ఉన్న పంటరుణాల బకాయిలను గుర్తించాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని 106 సంఘాలకు చెందిన 33 బ్రాంచీలు, ఏపీజీవీబీ, వాణిజ్య బ్యాంకులైన ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఇండియన్‌బ్యాంకు తదితర బ్యాంకుల్లో రైతులు రుణాలు తీసుకున్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన మొత్తం 325 బ్రాంచీలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫామ్-ఏ, ఫామ్-బీ, ఫామ్-సీల వారీగా పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను నింపే కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి చేపట్టారు. జిల్లాలోని ఏడు ముంపు మండలాల బ్యాంకుల్లో పంట రుణాల మాఫీని ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు. నిర్ణీత సమయంలో నమోదయ్యేనా..? రైతుల రుణాల వివరాలను శనివారం సాయంత్రంలోగా తామిచ్చిన ప్రఫార్మా ప్రకారం అందజేయాలని కలెక్టర్ సూచించారు. కానీ, కంప్యూటర్లు, సిబ్బంది కొరత, ఇతరత్ర కారణాలతో నిర్దేశిత గడువులోగా అది పూర్తయ్యే పరిస్థితి లేదు. అదనంగా మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారి జాబితాలను తయారు చేసి సమర్పిస్తే 24, 25, 26 తేదీల్లో మండలస్థాయిలో తహశీల్దార్ల అధ్యక్షతన ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి, అర్హులైన వారి జాబితాపై సమీక్షించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఆ తర్వాత సామాజిక తనిఖీ కోసం ఈ జాబితాలను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. 31వ తేదీన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో జాబితాలను కలెక్టర్‌కు అందజేయాలి. ఆ తర్వాత రుణమాఫీకి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. కానీ ఇది నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా లేదనే ఆరోపణ లొస్తున్నాయి. -
4,56,286 మంది రైతులకు రుణమాఫీ
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో పంటరుణాలు తీసుకున్న 4, 56, 286 మంది రైతులకు రూ. 2,682 కోట్లు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి తెలిపారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పంటరుణాల మాఫీపై గురువారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకున్న పంట రుణాలలో ఒక్కో కుటుంబానికి రూ. లక్ష లోపు మాఫీ అవుతుందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఈనెల 13న జీవో 69ని విడుదల చేసిందన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,682 కోట్లు మాఫీ కానున్నట్లు వెల్లడించారు. రుణాలు తీసుకున్న రైతుల వివరాలను నిర్ణీత నమూనాలో ఈ నెల 23 లోపు సిద్ధం చేయాలని ఆదేశించారు. కుటుంబ యాజమాని, భార్య, వారిపై ఆధారపడి జీవించే పిల్లలంతా ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. జిల్లాలో రుణమాఫీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. 2014 మార్చి 31 వరకు ఉన్న పాత పంటరుణాల బకాయిలు, వడ్డీలు కలిపి రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయం కోసం తీసుకున్న పంట రుణాలు, బంగారు రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. ఎస్‌హెచ్‌జీ, టైఅప్, గోదాము, కోల్డ్‌స్టోరేజీ రుణాలకు మాఫీ వర్తించదని తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 లోగా పంట రుణాలు చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించదని, అయితే మార్చి 31 తరువాత రుణాలు తిరిగి చెల్లించిన వారికి వర్తిస్తుందని చెప్పారు. 24, 25, 26 తేదీల్లో మండలస్ధాయిలో తహశీల్దార్ల అధ్యక్షతన ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి, అర్హుల జాబితాపై సమీక్షించాలని సూచించారు. ఒక్కో రైతు కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో ఎంత మేరకు పంట రుణాలు తీసుకున్నదనే వివరాలను నిర్ణీత ఫార్మాట్లో నమోదు చేయాలన్నారు. సామాజిక తనిఖీ కోసం ఈ జాబితాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ఈనెల 31న జరిగే జిల్లా స్థాయిలోబ్యాంకర్ల సమావేశంలో జాబితాను అందజేయాలని చెప్పారు. ఈ నివేదికను తాము ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఆధార్ నంబర్ ఉన్న రైతులు బ్యాంక్లలోఆధార్ జిరాక్స్ ఇచ్చి తమ ఖాతాలకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. జిల్లాలో 39 మండలాలకే రుణమాఫీ వర్తిస్తుందని, పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించామని, ఆ మండలాల్లో రుణమాఫీ వర్తించదని వివరించారు. ఈ ఖరీఫ్‌లో రైతులు కొత్తగా పంట రుణాలు తీసుకోవడానికి, పంటల బీమా సౌకర్యం వినియోగించుకోవడానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, వ్యవసాయశాఖ సంచాలకులు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యాభివృద్ధికి కృషి చేయాలి...
ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల సమగ్ర సమాచారాన్ని కంప్యూటరైజ్డ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ ఇలంబరితి డీఈఓను ఆదేశించారు. విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలపై సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సకాలంలో, సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిధులు సక్రమంగా ఖర్చు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను వినియోగించాలని, మధ్యాహ్న భోజన బియ్యాన్ని తనిఖీ చేస్తుండాలని డీఎస్వో గౌరీశంకర్‌ను ఆదేశించారు. బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలును పర్యవేక్షించాలని, కంప్యూటర్ విద్యను నేర్చుకునేలా బోధన ఉండాలని అన్నారు. బాలికా విద్యకు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. కస్తూర్బా గాంధీ, బాలికల పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణంలో అలసత్వం చూపే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వారిని తొలగించాలని అన్నారు. ఆర్వీఎం ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ప్రతి పాఠశాలకు కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఏజెన్సీతో పాటు ఇతరప్రాంతాల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ నియామకాలపై సత్వర చర్యలు చేపట్టాలని ఆర్వీఎం పీఓను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, ఏజెన్సీడీఈఓ రాజేష్, డిప్యూటీ డీఈఓలు బస్వారావు, రాములు, డైట్ ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీపీ ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ఈ నెల 6న జరుగనున్న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను పంచాయతీరాజ్ చట్టం నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఆదేశించారు. మండల పరిషత్ ఎన్నికలు, 19వ తేదీన నిర్వహించనున్న ఇంటిం టి సర్వే, మండల పరిషత్‌లతో గ్రీవెన్స్ తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞసమావేశ మందిరంలో ఎంపీడీఓలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ, 11గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ, అనంతరం నామినేషన్ల జాబితా ప్రచురణ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణ, ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక, అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాలన్నారు. అలాగే ఈ నెల 19న జరుగనున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో వందశాతం సర్వే పూర్తి చేసేందుకు అధికారులు తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సర్వే డేటా నికచ్చిగా ఉండాలని, ఏదైనా తేడా ఉంటే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. డబుల్ హౌస్ హోల్డర్లు, గోస్టు హౌస్ హోల్డర్లు ఉండవద్దన్నారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. మండల స్థాయి గ్రీవెన్స్ పటిష్టంగా నిర్వహించాలన్నారు. ప్రతి సామాన్యుడితో మాట్లాడి ఆ సమస్యను తెలుసుకోవాలన్నారు. దానికి పరిష్కార మార్గం ఉందో లేదో సూచించాలన్నారు. ప్రతి అధికారి తప్పని సరిగా కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ర్యాండమ్ తనిఖీలు చేపడతామని, విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, జిల్లా పరిషత్ ఏఓ అప్పారావు పాల్గొన్నారు.