అప్రమత్తంగానే ఉన్నాం.. | 20 launches to relief efforts | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగానే ఉన్నాం..

Published Tue, Sep 9 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

20 launches to relief efforts

భద్రాచలం : గోదావరి వరదలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగానే ఉందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి చెప్పారు. వరద పరిస్థితిని పరిశీలించేందుకు భద్రాచలం వచ్చిన ఆయన సోమవారం స్థానిక అధికారులతో కలసి కరకట్ట, నిమజ్జనం ప్రాంతం, తానీషా కల్యాణ మండపం ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి పరివాహక మండలాల్లో పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదిక చేపట్టాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు.

సెక్టోరియల్, జోనల్, మండల స్థాయి అధికారులంతా స్థానికంగానే ఉండి ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వరద పెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రభావం ఎక్కువగా ఉండే మండల కేంద్రాల్లో సరిపడా బియ్యం, ఇతర నిత్యావసర నిల్వలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 20 లాంచీలను సిద్ధంగా ఉంచామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

 భద్రాచలం కరకట్ట వద్ద స్లూయీస్‌ల వద్ద నీరు లీకవుతున్నందున ఐటీసీ నుంచి ప్రత్యేకంగా మోటార్‌లు తెప్పించి ఎప్పటికప్పుడు నీటిని బయటకు తోడేలా చర్యలు చే పట్టామని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వరద సహాయక చర్యలకు సంబంధించిన అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులంతా భద్రాచలంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షించేలా తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు.

 జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష...
 వరద ఉధృతి క్రమేపీ పెరుగుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ జిల్లా స్థాయి అధికాారులతో సమీక్షించారు. ముంపు ప్రాంత ప్రజానీకాన్ని సత్వరమే సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వరద తగ్గుముఖం పట్టగానే ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అత్యవసరమైతే తానీషా కల్యాణ మండపంలో బస చేసిన గుంటూరు నాగార్జున విశ్వ విద్యాలయ 10వ బెటాలియన్‌కు చె ందిన జాతీయ విపత్తు స్పందన ఫోర్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, ఆర్‌డీవో అంజయ్య, ఇరిగేషన్ ఈఈ శ్రావ ణ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ సరస్వతి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement