సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వాయుగుండం ఎఫెక్ట్‌తో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంది. వరద నీరు పెరగడంతో అలర్ట్ అయిన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే తాజాగా కురిసిన వర్షం కారణంగా ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి వరద కూడా పెరుగుతున్న క్రమంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇక, తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో వరద పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 9.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, ఆరు లక్షల 61వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలవుతోంది. 1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరా అవుతోంది. వర్షాల కారణంగా వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment