సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
కాగా, భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గోదావరిలో నీటి మట్టం పెరిగింది. దీంతో, రానున్న 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం అలాగే కొనసాగుతోంది. ఇక, భద్రాచలం వద్ద ఈరోజు ఉదయం ఆరు గంటలకు గోదావరి వరద 53.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులకు నేడు సెలవును రద్దు చేశారు. అధికారులందరూ నేడు విధుల్లోనే ఉండనున్నారు.
మరోవైపు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. గోదావరి నీటి మట్టం 15 అడుగులు నమోదైంది. దీంతో, 14 లక్షల 83 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వెళ్తోంది. ఇక, అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, గోదావరి వరద రోజుల తరబడి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అప్పన రాముని లంక, గంటి పెదపూడి లంకల వద్ద అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన లంక ప్రాంతాల్లో ట్రాక్టర్లు, కాలినడకన లంకవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment