ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల సమగ్ర సమాచారాన్ని కంప్యూటరైజ్డ్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ ఇలంబరితి డీఈఓను ఆదేశించారు. విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలపై సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సకాలంలో, సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిధులు సక్రమంగా ఖర్చు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను వినియోగించాలని, మధ్యాహ్న భోజన బియ్యాన్ని తనిఖీ చేస్తుండాలని డీఎస్వో గౌరీశంకర్‌ను ఆదేశించారు. బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలును పర్యవేక్షించాలని, కంప్యూటర్ విద్యను నేర్చుకునేలా బోధన ఉండాలని అన్నారు. బాలికా విద్యకు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. కస్తూర్బా గాంధీ, బాలికల పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణంలో అలసత్వం చూపే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వారిని తొలగించాలని అన్నారు. ఆర్వీఎం ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.
తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ప్రతి పాఠశాలకు కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఏజెన్సీతో పాటు ఇతరప్రాంతాల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ నియామకాలపై సత్వర చర్యలు చేపట్టాలని ఆర్వీఎం పీఓను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, ఏజెన్సీడీఈఓ రాజేష్, డిప్యూటీ డీఈఓలు బస్వారావు, రాములు, డైట్ ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి కృషి చేయాలి...
Published Tue, Aug 12 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement