ఖమ్మం జెడ్పీసెంటర్ : భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్‌లు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ బదలాయింపు, భూమి హక్కుల రికార్డులు(ఆర్‌ఓఆర్), మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం వినియోగం, పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు, ఆహార భద్రత కార్డుల ప్రక్రియ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూటేషన్, ఆర్‌ఓఆర్ అప్పీళ్ల సత్వర పరిష్కారం కోసం ఆన్‌లైన్ చేస్తున్నట్లు వివరించారు.
45 రోజులు గడిచిన అప్పీళ్లన్నింటినీ ఆర్డీఓలు వారి పరిధిలో పరిష్కరించే వీలుందన్నారు. ప్రస్తుతం పాల్వంచ ఆర్డీఓ పరిధిలో 58, భధ్రాచలం ఆర్డీఓ పరిధిలో 12 మూటేషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బుధవారం నుంచి ఫైళ్ల క్లియరెన్స్ వీక్ (దస్త్రాల పరిష్కార వారోత్సవం) ప్రారంభిస్తున్నామని, ఆ సమయంలో పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి కేటాయించిన సన్నబియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దన్నారు. ఆ బియ్యానికి సంబంధించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తహశీల్దార్‌లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఇతర మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను విభజించుకుని దత్తత తీసుకోవాలని, ఆయా పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేయాలని చెప్పారు. పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి చదివించాలన్నారు.
స్థానికుల సహకారంతో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం సమకూర్చాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లాలో 70,300 ఆహారభద్రత కార్డులకు గాను 52,300 కార్డుల డేటా ఎంట్రీ పూర్తయిందని, మిగిలినవి ఈనెల 12లోగా పూర్తిచేసి 13, 14, 15 తేదీల్లో పంపిణీ చేయాలని అన్నారు. డీఈవో రవీంధ్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 36,728 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని, పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించామని తెలిపారు. వీసీలో డీఎస్‌ఓ హరిశంకర్, బీసీ సంక్షేమాధికారి వెంకటన ర్సయ్య, సాంఘిక సంక్షేమ అధికారి రాందాసు తదితరులు పాల్గొన్నారు.
భూ పంపిణి ప్రకియను వేగవంతం చేయండి
ఎస్సీలకు మూడెకరాల చొప్పున భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలంబరితి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం భూమి కొనుగోలు పథకంపై జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధిర, కూసుమంచి మండలాల పరిధిలో భూ గుర్తింపు సేకరణ వేగవంతం చేయాలన్నారు. రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్, భూగర్భజల శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. లబ్దిదారులకు పంపిణి చేసే భూమి వ్యవసాయానికి అనుకూలంగా, భూగర్భజలాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కూసుమంచి మండలంలో ఇంకా పంపిణీ చేయాల్సిన లబ్ధిదారులకు ప్రస్తుతం గుర్తించిన స్థలానికి బదులు మరోచోట సేకరించాలని ఆదేశించారు.
ఆన్‌లైన్‌లో భూ వివరాలు
Published Wed, Jan 7 2015 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement
Advertisement