సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.... ఈ పథకం కింద పనిచేసే వారి వేతనాలను ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లించనున్నారు. వచ్చే నెల నుంచి ఉపాధి వేతనాలను నేరుగా కూలీల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఉపాధి కూలీలకు ఆన్‌లైన్ వేతనాలను ఇచ్చే ప్రాజెక్టును పైలట్‌గా మన జిల్లా నుంచే ప్రారంభించనున్నారు.
ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలని, ఉపాధి జాబ్‌కార్డులున్న కూలీలందరి ఆధార్ వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి సంబంధిత అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టినందున ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.
5.90 లక్షల జాబ్‌కార్డులు...
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 5.90 లక్షల జాబ్‌కార్డులున్నాయి. వీరికి చట్టం ప్రకారం ఏటా 100 పనిదినాలను కల్పించాలి. వీరు చేసిన పనికిగాను ఇప్పుడు రోజుకు రూ.169 చెల్లిస్తున్నారు. ఈ కార్డుల ద్వారా పనిచేసే కూలీలకు వేతనాలను ప్రస్తుతం నగదు రూపంలో నేరుగా చెల్లిస్తున్నారు. దీంతో వేతనాలను చెల్లించే క్రమంలో కొంతమేర అవకతవకలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి వచ్చింది. ఉపాధి హామీ పథకంపై జరిపిన సామాజిక తనిఖీల్లోనూ ఇదే అంశం వెల్లడయింది.
ఈ నేపథ్యంలో ఉపాధి హామీ కూలీల వేతనాలను ప్రభుత్వ సిబ్బంది ద్వారా కాకుండా నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో వేసి అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లానే పైలట్‌గా ఎంచుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జాబ్‌కార్డులున్న వ్యక్తుల ఆధార్ వివరాలను స్థానిక యంత్రాంగం సేకరిస్తోంది.
ఈ వివరాలను ఆన్‌లైన్‌లో అనుసంధానిస్తుంది. ఇప్పటికే బ్యాంకు అకౌంట్ ఉంటే ఆ వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుంది. అయితే, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 65 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని సమాచారం. ఇక, మిగిలిన 35 శాతం మంది కూలీల ఆధార్, బ్యాంకు అకౌంట్ల వివరాల సేకరణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 8.26 లక్షల మంది కూలీలుండగా, వారిలో 5.52 లక్షల మంది ఆధార్ వివరాలను అనుసంధానం చేశారు. అందులో 1.90 లక్షల మంది బ్యాంకు అకౌంట్లను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
గ్రామాల వారీగా ఆధార్ అనుసంధానం కాని కూలీల వివరాలు సేకరించి వారి గ్రామానికే ఆధార్ వ్యాన్ పంపిస్తారు. అక్కడే ఆధార్ నమోదు చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఆధార్ వ్యాన్‌తో పాటు బ్యాంకర్లను కూడా అప్పుడే గ్రామాలకు పంపనున్నట్టు జిల్లా కలెక్టర్ ఇలంబరితి ‘సాక్షి’తో చెప్పారు. పనిలో పనిగా వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన జన్‌ధన్ యోజన కింద బ్యాంకు అకౌంట్ కూడా ఇప్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. జిల్లాలో 100 శాతం ఆధార్ అనుసంధానం ఈ నెలలోనే పూర్తి చేస్తామని, వచ్చే నెల నుంచి ఉపాధి హామీ కూలీలందరికీ ఆన్‌లైన్‌లోనే వేతనాలు చెల్లిస్తామని జిల్లా అధికారులు చెపుతున్నారు.
అన్ని పథకాలకూ ఆన్‌లైన్ చెల్లింపులే..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు నగదు ఇవ్వడాన్ని రద్దు చేసి ఆన్‌లైన్‌లోనే చెల్లించేందుకు కలెక్టర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో సామాజిక పింఛన్లు పొందుతున్న 2.62 లక్షల మందికి, ఇందిరా క్రాంతి పథం సిబ్బందికి, నీటి యాజమాన్య సంస్థ పీడీ ద్వారా చేసే చెల్లింపులను కూడా ఆన్‌లైన్‌లోనే చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు లేదా మూడు నెలల్లో దాదాపు అన్ని సంక్షేమ పథకాల చెల్లింపులను ఆన్‌లైన్‌లోనే చేస్తామని, మాన్యువల్ చెల్లింపులకు చెక్‌పెడతామని అధికారులు చెపుతున్నారు.
ఇక ఆన్‌లైన్‌లో ‘ఉపాధి’ వేతనాలు
Published Sat, Sep 13 2014 1:55 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement
Advertisement