అస్సాం నుంచి ఖమ్మంకు తెప్పించుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
పసిగట్టిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టెక్నికల్ వింగ్
డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.
అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్‌లోని హిడెన్ వెబ్‌సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆ పార్సిల్‌లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్‌లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment