రోదనలు.. ఆక్రందనలు | Dead People Details in Massive explosion at Sigachi pharma unit leaves | Sakshi
Sakshi News home page

రోదనలు.. ఆక్రందనలు

Jul 2 2025 6:02 AM | Updated on Jul 2 2025 6:25 AM

Dead People Details in Massive explosion at Sigachi pharma unit leaves

వెలుగులోకి వస్తున్న మృతుల వివరాలు 

‘సిగాచి దుర్ఘటన’బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం 

గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆందోళన 

అధికారులు ఏమీ చెప్పడం లేదంటూ ఆవేదన

జిన్నారం (పటాన్‌చెరు)/పటాన్‌చెరు టౌన్‌: పదుల సంఖ్యలో కార్మికులు పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఉపాధి కోసం సిగాచి పరిశ్రమలో చేరారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. వీరిలో అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, నవ దంపతులు సైతం ఉన్నారు. సోమవారం ఊహించని విధంగా జరిగిన దుర్ఘటనలో వీరిలో అనేకమంది మృత్యువాత పడ్డారు. కారి్మకులు, కిందిస్థాయి సిబ్బంది మొదలు అధికారులు, ఉన్నతాధికారుల ప్రాణాలు కూడా క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. కొంతమంది ఆచూకీ తెలియకుండా పోయింది. కొందరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

మృతుల్లో ఏపీకి చెందిన అధికారి 
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన మర్రపు ప్రవీణ్‌కుమార్‌(46) సిగాచి పరిశ్రమలో డీజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పేలుడు తర్వాత ఆయన ఆచూకీ తెలియలేదు. అయితే 36 మృతదేహాలను అధికారులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రవీణ్‌కుమార్‌ మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. 

మంచిర్యాలకు చెందిన క్యూసీ మేనేజర్‌ 
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన వజ్జకేవుల నాగేశ్వరరావు క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మరణించారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకునేందుకు వచి్చన తమ్ముడు రవి విలపిస్తూ.. ఇందుకు సహకరించిన పోలీసులకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు. 

నాన్నా.. నువ్వు లేకుండా ఎలా బతకాలి? 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీర్జాపూర్‌ గ్రామానికి చెందిన జగదీశ్‌ (53) 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం భార్య కమలాదేవితో కలిసి ఇస్నాపూర్‌కు వచ్చాడు. సిగాచి పరిశ్రమ ఏర్పాటయ్యాక అందులో చేరాడు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సోమవారం జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. నాన్నా.. నువ్వు లేకుండా మేమంతా ఎలా బతకాలంటూ పిల్లలు రోదిస్తున్నారు.  

తండ్రి మృతితో రోడ్డున పడిన కుటుంబం 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బలియా జిల్లా రత్ననగర్‌కు చెందిన రామ్‌సింగ్‌ (50) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. ఇస్నాపూర్‌లో ఉంటున్న ఇతనికి భార్య, పెళ్లీడుకు వచి్చన ఇద్దరు సహా ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రామ్‌సింగ్‌ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది.  

నా ఇద్దరు చిన్నాన్నలు చనిపోయారు.. 
తన ఇద్దరు బాబాయిలతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చిన పవన్‌ నిసార్‌ ప్రస్తుతం ఒంటరిగా మిగిలాడు. ప్రమాదంలో తన చిన్నాన్నలు అఖిలేశ్‌ కుమార్‌ (35), విజయ్‌కుమార్‌ (30) మృతి చెందారంటూ పవన్‌ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. 

రెండురోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు
మహారాష్ట్రకు చెందిన సోని భర్త భీమ్‌రావు భార్యతో కలిసి బండ్లగూడలో ఉంటూ రెండురోజుల క్రితమే కంపెనీలో చేరాడు. సోమవారం ఉదయం 8 గంటలకు పనికి వెళ్లగా ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. దీంతో సోని కుటుంబసభ్యులతో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లింది. భర్త ఆచూకీ కోసం ప్రయతి్నస్తుంటే పటాన్‌చెరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు అక్కడివారు చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా భీమ్‌రావు తీవ్రంగా కాలిన గాయాలతో కని్పంచడంతో సోని బోరున విలపించింది. తన భర్తకు మంచి వైద్యం అందించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులను కోరుతోంది. 

మా అల్లుడి జాడ ఎవరూ చెప్పడం లేదు 
‘ప్రమాదంలో మా అల్లుడు ప్రశాంత్‌ మహాపాత్రో గల్లంతయ్యాడు. మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. తొలుత కాంట్రాక్ట్‌ లేబర్‌గా, ఇప్పుడు క్యాజువల్‌ కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం విధుల్లోనే ఉన్నాడని భావిస్తున్నాం. మరణించాడా? బతికున్నాడా? అనేది ఎవరూ చెప్పడం లేదు. అధికారుల వద్ద ఉన్న జాబితాలో మా అల్లుడి పేరు కనిపించడం లేదు..’అని ఒడిశాకు చెందిన కోక సాహు వాపోయాడు. 

నా కొడుకు కోసం వెతుకుతున్నా.. 
‘నా కొడుకు పేరు వెంకటేశ్‌. ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. మూడేళ్లుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆదివారం నా కొడుకుతో ఫోన్లో మాట్లాడాను. సోమవారం పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు ఆయన ఫోన్‌ పనిచేయడం లేదు, ఆచూకీ లభించడం లేదు. అధికారుల వద్ద ఉన్న ఏ జాబితాలోనూ నా కుమారుడి పేరు లేదు. నా కొడుకు సజీవంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా..’అని ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు అన్నాడు. 

అన్న ఆచూకీ కోసం తమ్ముడి ఆరా 
‘మా అన్న దాసరి సునీల్‌కుమార్‌ కనిపించడం లేదు. ఏడాదిన్నరగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. క్వాలిటీ చెక్‌ విభాగంలో పనిచేస్తుండేవాడు. ఇప్పటివరకు ఆయన ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం ఫోన్‌ రింగ్‌ అయింది. ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ అయింది. మా సోదరుడు ఆచూకీ చెప్పాలి..’అని ఏపీలోని ప్రకాశం జిల్లా వాసి దాసరి సంపత్‌ కోరారు.

నవ దంపతుల మృత్యువాత 
ప్రేమ వివాహం చేసుకున్న రెండు నెలలకే.. 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఇంతలోనే విధి వంచితులుగా మారారు. సోమవారం జరిగిన ప్రమాదం తర్వాత నవ దంపతుల ఆచూకీ తెలియకుండా పోయింది. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు పెనికలపాడుకు చెందిన నిఖిల్‌రెడ్డి ఎమ్మెస్సీ చదివాడు. ఏపీలోని ఎనీ్టఆర్‌ జిల్లా మాలపల్లికి చెందిన రామాల శ్రీరమ్య కూడా ఎమ్మెస్సీ చదివింది. తొలుత నిఖిల్‌రెడ్డి సిగాచిలో చేరగా, అక్కడే శ్రీరమ్య కూడా ఉద్యోగం సంపాదించుకుంది.

మంచి స్నేహితులుగా మారిన వాళ్లు పరస్పరం ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారని పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో పనిచేస్తున్న వీరిద్దరూ కన్పించక పోవడంతో మరణించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. విషయం తెలిసి పరిశ్రమ వద్దకు వచి్చన వారి కుటుంబీకులు.. ఆచూకీ లభించని వారి జాబితాలో వీరి పేర్లు చూసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం ఆస్పత్రి మార్చురీలో ఇద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు.  

నా భర్త ఏమయ్యాడో చెప్పండి 
ఏడు నెలల గర్భవతి ఆక్రందన 
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆచూకీ గల్లంతు 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆచూకీ గల్లంతైంది. ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆ కుటుంబానికి చెందిన పూజ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. బిహార్‌కు చెందిన పూజ భర్త నాగ పాశ్వాన్‌ (25), ఇతర కుటుంబసభ్యులు దీపక్‌ (19), దిలీప్‌ (45) ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వీరు ఐదునెలల క్రితమే పటాన్‌చెరుకు ఉపాధి నిమిత్తం వచ్చారు. ఈ పరిశ్రమలో పనికి కుదిరారు.

వీరు శిథిలాల్లో నలిగి కాలిపోయి ఉంటారేమోనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంధువుల సాయంతో పరిశ్రమ వద్దకు వచి్చన పూజ తన భర్త, ఇతర కుటుంబసభ్యుల ఆచూకీ చెప్పాలంటూ విలపించడం స్థానికులను సైతం కన్నీరు పెట్టించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశ్రమను సందర్శించిన సందర్భంగా పూజ గురించి ప్రస్తావించారు. కాగా తన భర్త ఏమయ్యాడో అధికారులు చెప్పడం లేదని పూజ రోదించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement