people dead
-
ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది మృతి
రఫా: గాజాలోని దక్షిణ, మధ్య ప్రాంతాలపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. రఫాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, సెంట్రల్ గాజాలో 14 మంది చిన్నారులు, 8 మంది మహిళలు సహా మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రఫా చుట్టుపక్కల జరిగిన వైమానిక దాడుల్లో అల్ ఫరూక్ మసీదు నేలమట్టం అయింది. మరోవైపు, వెస్ట్‌బ్యాంక్ జాతీయరహదారిపై గురువారం ఉదయం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక ఇజ్రాయెల్ యువకుడు చనిపోగా మరో అయిదుగురు గాయప డ్డారు. ఇజ్రాయెల్ పోలీసుల కాల్పుల్లో ఇద్ద రు దుండగులు చనిపోయారు. మూడో వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ కాల్పులకు కారణమని ఎవరూ ప్రకటించుకోనప్పటికీ హమాస్ సాయుధబలగాలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులు ఆగి, స్వతంత్ర పాలస్తీనా అవతరించేదాకా ఇటువంటి మరిన్ని దాడులకు దిగాలని పిలుపునిచ్చారు. -
వద్దన్నా.. వినకుండా ఈవెంట్ బృందంతో వెళ్లి..
భువనేశ్వర్/ఆరిలోవ/బీచ్‌రోడ్డు(విశాఖపట్నం): ఓ వివాహ వేడుక నిర్వహణకు బయల్దేరిన ఈవెంట్ బృందంపై మృత్యువు పంజా విసిరింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురి ప్రాణాలను అనంతలోకాలకు తీసుకుపోయింది. గురువారం వేకువజామున ఒడిశా రాష్ట్రంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జంకియా స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఖుర్దా జిల్లా బొడొ పొఖొరియా గ్రామం వద్ద యూ టర్న్ తీసుకోబోయిన లారీ సాంకేతిక లోపంతో జాతీయ రహదారిపై మొరాయించింది. ఇంతలో వెనుక నుంచి దూసుకు వస్తున్న పెళ్లి ఈవెంట్ బృందం కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొని నుజ్జయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గురువారం వేకువజామున 4 గంటల సమయంలో పొగమంచు దట్టంగా కప్పి ఉండడంతో ఎదురుగా ఉన్న వాహనం కనిపించకపోవడంతోనే ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం. ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. జంకియా స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. మృతులు బి.లక్ష్మి (34), ఈవెంట్ మేనేజర్ మరియా ఖాన్(26), అహ్మది హిక్మతుల్లా(28), రాకేష్‌కుమార్ అలియాస్ రాఖీ(34)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వద్దన్నా.. వినకుండా ఇంట్లో వద్దన్నా పట్టించుకోకుండా ఈవెంట్ కవరేజీ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిందని బి.లక్ష్మి కుటుంబ సభ్యులు వాపోయారు. పెళ్లి కోసం వెళ్లాల్సిన బృందంలో ముందుగా మాట్లాడుకున్న.. బ్యూటీషియన్ రాకపోవడంతో లక్ష్మిని హుటాహుటిన బయల్దేరించారని తెలిపారు. దూర ప్రాంతం వెళ్లొద్దని నివారించినా.. పూరీలో పెళ్లితో పాటు జగన్నాథుడిని దర్శించుకుని తిరిగి వచ్చేస్తానని ఇంటి నుంచి వెళ్లి, తిరిగిరాని లోకాలకు తరలిపోయిందని విలపించారు. విశాలాక్షినగర్‌లో విషాదచాయలు ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాకేష్‌కుమార్ అలియాస్ రాఖీ(34)ది జీవీఎంసీ 9వ వార్డు పరిధి విశాలాక్షినగర్. ఈ విషయం తెలుసుకున్న తల్లి మీనాకుమారి, అక్క రాధికాదేవి కన్నీటి పర్యంతమవుతున్నారు. రాకేష్‌కుమార్ అయ్యప్ప స్వామి మాల ధరించారు. బుధవారం రాత్రి ఇంటి వద్ద స్వామి పూజ చేసుకుని నగరంలో మరో ముగ్గురితో కలసి పెళ్లి వేడుక కవర్ చేయడానికి రాత్రి 8.30 గంటలు సమయంలో కారులో ఒడిశా బయలుదేరారు. రాకేష్ ఫొటోగ్రాఫర్/కెమెరామన్. అలాగే హైదరాబాద్‌లోని హెచ్ఎస్బీసీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోం కావడంతో విశాలాక్షినగర్‌లో ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయంలో ఈవెంట్లకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో రాకేష్ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. రాకేష్ తల్లితో కలసి విశాలాక్షినగర్‌లో ఉంటుండగా.. అతని అక్క, బావ సీతమ్మధారలో నివాసముంటున్నారు. మారియా ఖాన్ ఆర్.కె బీచ్ సమీపంలోని పాండురంగాపురంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు. అహ్మది హిక్మతుల్లా(కబీర్) ఆఫ్గాన్ పౌరుడు కాగా ఎంవీపీకాలనీ సెక్టార్–2లోనూ, బి.లక్ష్మి రాజేంద్రనగర్‌లో నివాస ముంటున్నారు. -
రక్తమోడిన రోడ్లు
ఆళ్లగడ్డ/కావలి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని జాతీయ రహదారి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా శిరివెళ్లకు చెందిన ముల్లా అబ్దుల్‌కలాం (31), అఫ్జల్ (19) సెంట్రింగ్ పని నిమిత్తం సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వెళ్లారు. మిలాద్ ఉన్నబీ పర్వదినం జరుపుకునేందుకు మంగళవారం ఉదయం సొంత గ్రామానికి మోటార్ సైకిల్‌పై బయలు దేరారు. ఆళ్లగడ్డ శివారులోకి వచ్చేసరికి వారి గ్రామానికే చెందిన మిత్రులు ఉసేన్‌బాషా ఉరఫ్ జాబిర్(20), సులేమాన్ శిరివెళ్ల వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. మోటార్ సైకిల్ ఆపి వారితో మాట్లాడుతుండగా నంద్యాల వైపు నుంచి చాగలమర్రి వెళ్తున్న కారు ముందు టైరు పగిలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టి రోడ్డు పక్కనున్న వారిపై పడింది. ఈ ఘటనలో అబ్దుల్ కలాం, అఫ్జల్, ఉసేన్‌బాషా అక్కడికక్కడే మృ త్యువాత పడ్డారు. సులేమాన్ తీవ్రంగా గాయప డగా కర్నూలు వైద్యశాలకు తరలించారు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి.. తిరుపతి నగరం పద్మావతీ పురం కేఆర్ నగర్‌కు చెందిన తనమాల రవి, ఆయన భార్య భార్గవీలత (45), ఆయన తల్లి రాజేశ్వరమ్మ (65), వారి బంధువు ఇరగల వెంకటరమణయ్య (65), బంధువుల చిన్నారి సాయి కలసి కారులో ప్రకాశం జిల్లా ఉలవపాడులో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుభకార్యం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. కారును రవి నడుపుతున్నారు. కావలి పట్టణంలోని ముసునూరు వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొంది. కారు కంటైనర్ కిందభాగంలో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జు అయ్యింది. కారులో వెనుక సీట్లో కూర్చొని ఉన్న భార్గవీలత, రాజేశ్వరమ్మ, ముందు సీట్లో కూర్చొని ఉన్న వెంకటరమణయ్య అక్కడికక్కడే మరణించారు. రవి, ముందు సీట్లో కూర్చుని ఉన్న సాయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కావలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇండోనేషియాలో భూకంపం 8 మంది మృతి
మలాంగ్: ఇండోనేషియాలోని జావా దీవిలో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 7 గంటలకు (స్థానిక కాలమానం), 6.0 పరిణామంతో సంభవించిన ఈ భూకంపం కారణంగా 8 మంది మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. మలాంగ్ జిల్లాలకు 45 కిలోమీటర్ల దూరంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే దీని కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇండోనేషియా ఎర్త్‌క్వేక్ అండ్ సునామీ సెంటర్ రహ్మద్ త్రియోనో స్పష్టం చేశారు. భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలకు దగ్గరగా ఉండవద్దని, అవి విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూకంపం సమయంలో ప్రజలంతా భయపడుతూ భవనాల నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాలు అక్కడి టీవీల్లో కనిపించాయి. లుమజాంగ్ జిల్లాలో బైక్‌పై వెళుతున్న మహిళపై కొండ చరియలు విరిగిపడటంతో ఆమె మరణించింది. మరికొన్ని చోట్ల భవనాల కింద మరణించిన వారి శరీరాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. చదవండి: మరోసారి మయన్మార్ సైన్యం కాల్పులు, 82 మంది మృతి! -
అమెరికాలో కాల్పుల కలకలం
లాస్ ఏంజలస్/ఒక్లహామా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. సోమవారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 7 మంది మృతిచెందగా, 6 మంది గాయపడ్డారు. మొదటి ఘటన లాస్ ఏంజలస్‌కు 320 కిలోమీటర్ల దూరంలోని ఫ్రెస్నోలో జరిగింది. ఇక్కడ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మరోఘటన ఒక్లహామాలోని వాల్‌మార్ట్ స్టోర్ వద్ద జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు మరణించారు. -
రాజస్తాన్‌లో కూలిన పందిరి
బెర్మర్/జైపూర్: రాజస్తాన్‌లోని బెర్మర్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆలయం సమీపంలోని పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. జసోల్ ప్రాంతంలో ఉన్న రాణి భతియానీ ఆలయం వద్ద వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ పందిరిని ఏర్పాటుచేసిన నిర్వాహకులు ‘రామకథ’ నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో వేడుకకు హాజరైన వందలాది మంది ప్రజలు అక్కడే కూర్చుని రామకథను చూస్తుండగా బలమైన గాలులకు పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయమై ఏఎస్పీ రతన్‌లాల్ భార్గవ మాట్లాడుతూ.. ‘రామ కథ ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో పందిరి ఓవైపు నుంచి కూలిపోవడం ఆరంభమైంది. ఈ నాటకానికి నేతృత్వం వహిస్తున్న మురళీధర్ మహరాజ్ దీన్ని గమనించి భక్తులను అప్రమత్తం చేశారు. దీంతో అక్కడినుంచి బయటపడేందుకు అందరూ ఒకేసారి ప్రయత్నించడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే ఈ పందిరి భక్తులపై కుప్పకూలిపోయింది’ అని తెలిపారు. ఇనుపరాడ్లు–టెంట్ల కింద చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన తమకు విద్యుత్ షాక్ తగిలిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. 14 మంది చనిపోవడానికి గల కారణం పోస్ట్‌మార్టం తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రాజస్తాన్‌లోని బర్మర్లో పందిరి కూలిపోవడం నిజంగా దురదృష్టకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ ప్రమాద విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల వరకూ నష్టపరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రమాదంపై జోధ్‌పూర్ డివిజినల్ కమిషనర్ బీఎల్ కోఠారి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.అనంతరం ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
లోయలో పడిన బస్సు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో గురువారం ఓ ప్రైవేటు బస్సు (హెచ్‌పీ 66–7065) అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, మరో 34 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని బంజార్ తెహ్సిల్ వద్ద ఉన్న ధోత్ మోర్హ్ దగ్గర బస్సు 300 అడుగుల లోతున్న లోయలో పడిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. ఎక్కువ మందిని ఎక్కించడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నామని బంజార్ పట్వారీ షీతల్ కుమార్ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టాల్సిందిగా సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి గోవింద్ కులు జిల్లాకు బయలుదేరారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు జిల్లా యంత్రాంగం రూ. 50 వేల తక్షణ ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వం రోడ్లను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చోట్ల రోడ్డు వెడల్పును పెంచాలని సేవ్ లైఫ్ ఫౌండేషన్ సభ్యుడు పీయూష్ తివారీ డిమాండ్ చేశారు. కాలువలో వ్యాను బోల్తా ముగ్గురు పిల్లల మృతి లక్నో: పెళ్లి నుంచి తిరిగొస్తుండగా 29 మంది ప్రయాణిస్తున్న వ్యాను కాలువలో పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు పిల్లలు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృత దేహాలను గురువారం వెలికితీశారు. లక్నోకు సమీపంలోని నగ్రాం ప్రాంతంలోని ఇందిరా కెనాల్లో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాను బోల్తా పడింది. పొరుగున ఉన్న బారాబంకీ జిల్లాలో ఓ పెళ్లినుంచి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని లక్నో జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ తెలిపారు. ప్రమాదం తరువాత 22 మందిని రక్షించగలిగారు. 5 నుంచి 10 ఏళ్లలోపు ఏడుగురు పిల్లలు గల్లంతవ్వగా, గాలింపుల అనంతరం మూడు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన నలుగురిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. -
వారంతా అమరులయ్యారు
న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిపోయిన ఏఎన్–32 విమానంలో ఉన్న 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం ధ్రువీకరించింది. గురువారం దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాల కోసం సహాయక బృందం గాలింపులో ఈ విషయం వెల్లడైంది. ‘జూన్ 3న జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన వైమానిక వీరులకు భారత వైమానిక దళం నివాళులు అర్పిస్తోంది. వారి ఆత్మ శాంతించాలి. వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ అని వాయుసేన అధికార ప్రతినిధి ఒకరు గురువారం పేర్కొన్నారు. రష్యాలో తయారైన ఏఎన్–32 విమానం అస్సాంలోని జొహ్రాట్ ప్రాంతం నుంచి చైనా సరిహద్దులోని మెంచుకాకు జూన్ 3న బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి గాలించగా 8 రోజుల తర్వాత సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దులో మంగళవారం ఈ విమాన శకలాలు దొరికాయి. 13 మంది యుద్ధవీరులు అందించిన సేవలను దేశం ఎప్పుడూ మరిచిపోదని ట్విటర్లో కాంగ్రెస్ పేర్కొంది. వారి మృతిపట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం పది విమానాలను భారత వాయుసేన కోల్పోయింది. కోల్పోయిన విమానాల్లో ఒక మిరాజ్, ఒక జాగ్వార్, ఒక ఎంఐ17వీ5 హెలికాప్టర్, రెండు హాక్ రకం విమానాలు, రెండు మిగ్ రకం విమానాలు ఉన్నాయి. -
స్నేహాన్ని వీడి.. మృత్యు ఒడికి
అల్లిపురం (విశాఖ దక్షిణం)/యడ్లపాడు (చిలకలూరిపేట): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వెళుతున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలొదిలిన ఘటన విశాఖపట్నంలో ఆదివారం వేకువజామున జరిగింది. బైక్‌పై వెళుతున్న ఆ ఇద్దరు యువకులు కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో నవ వధువు మృత్యువాత పడగా, ఆమె భర్త ఆస్పత్రి పాలయ్యారు. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మహారాణిపేట పోలీసుల కథనం ప్రకారం.. జన్ని సుధీర్ (21), పెనుమత్స వినయవర్మ (22) స్నేహితులు. శనివారం రాత్రి వారు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో సరదాగా గడిపారు. అక్కడ నుంచి స్నేహితుడి బైక్ తీసుకుని జగదాంబ సెంటర్ నుంచి సిరిపురం వైపు వేగంగా వెళుతూ ఆదివారం తెల్లవారుజామున అపోలో ఆస్పత్రి సమీపంలో డివైడర్ మధ్యలో ఉన్న సెంటర్ లైటింగ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఘటనలో వాహనం నడుపుతున్న వినయవర్మ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. గాయపడ్డ సుధీర్‌ను అపోలో ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్‌పై తీసుకెళుతుండగా మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిపించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సుధీర్ నగరంలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ, వినయవర్మ పీజీ చదువుతున్నారు. నవ వధువును కాటేసిన మృత్యువు బైక్‌పై వెళ్తున్న నవ దంపతులను వెనుక నుంచి కారు ఢీకొనడంతో భార్య మృతి చెందగా.. భర్త తీవ్ర గాయాల పాలయ్యాడు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోలాలపూడి గ్రామానికి చెందిన గుడిపల్లి శ్రీనివాసరావు, పద్మ దంపతుల రెండో కుమారుడైన కారు డ్రైవర్ గుడిపల్లి కోటేశ్వరరావుకు తెనాలి సమీపంలో గల యడ్లపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్, పోలేరమ్మ దంపతుల ఏకైక కుమార్తె శ్రావణితో మూడు నెలల కిందట వివాహమైంది. పది రోజుల కిందట శ్రావణి బంధువుల వివాహం ఉండటంతో పెళ్లి నిమిత్తం ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆదివారం శ్రావణి ఫోన్ చేయడంతో ఉదయం 11 గంటలకు కోటేశ్వరరావు తన గ్రామం నుంచి బయలుదేరి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు అత్తారింటికి చేరుకున్న కోటేశ్వరరావు రెండు గంటలు ఉండి, భార్య శ్రావణితో బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న బైక్ యడ్లపాడు మండలం తిమ్మాపురం వసంత నూలు మిల్లు వద్దకు చేరుకోగా.. గుర్తు తెలియని కారు ఆ బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనగా.. దంపతులిద్దరూ సర్వీస్ రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరినీ చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే భార్య శ్రావణి మృతి చెందింది. భర్త కోటేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు నెలల కిందట పెళ్లైన శ్రావణి గర్భం దాల్చినట్టు తెలిసిందని.. ఆస్పత్రికి వెళ్లి ఆ విషయాన్ని నిర్థారించుకునేలోపే ఆమె తనకు దూరమైందని భర్త కోటేశ్వరరావు కుమిలిపోతూ తన మిత్రులకు చెప్పుకోవడం చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. యడ్లపాడు ఎస్సై జె.శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. హైవే అంబులెన్స్ వచ్చేంత వరకు అక్కడే ఉండి. వారి బంధువులకు సమాచారం అందించే ప్రయత్నం చేశారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో
చింతపల్లి (పాడేరు)/సాక్షి, అమరావతి/నర్సీపట్నం: సంతలో సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న గిరిజనులను మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వైర్లు తెగి మీద పడడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ చెరువూరుకు చెందిన 11 మంది గిరిజనులు ఆదివారం కోరుకొండ వారపు సంతకు నిత్యావసరాల సరుకులు కొనుగోలు కోసం వచ్చారు. సరుకులు తీసుకొని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. కాసేపట్లో గ్రామానికి చేరుకుంటామనగా ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిపై విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై వంజురబ గంగరాజు (37), లోత బొంజిబాబు (30) ఆటో డ్రైవర్ వంతల కృష్ణారావు (25), తడ్డపల్లికి చెందిన జనుగూరు ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఏడుగురిని లోతుగెడ్డ ఆస్పత్రికి తరలించగా అక్కడ వంజురబ చిట్టిబాబు (55) మరణించాడు. మిగతా గాయపడిన వారిలో మృతుడు ప్రసాద్ కుమారుడు వివేక్ (1), వంజురబ చిన్నబ్బాయి (45) వండలం రామ్మూర్తి (40), లోత వరలక్ష్మి (30) పాతున జానుబాబు (2), వెచ్చంగి దావీదు (2) ఉన్నారు. వారిని అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి సంఘటన వివరాలు తెలుసుకుని మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. పాడేరు సబ్‌కలెక్టర్ వెంకటేష్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో కలెక్టర్ హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. సత్వరమే వైద్య సేవలు అందేలా చూశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రమాదంలో విద్యుత్ షాక్‌తో కాలిపోయి తీవ్రంగా గాయపడిన చిన్నారులు దావీద్, వికాస్, జానుబాబులతో పాటు వి.చిన్నబ్బాయి వి.రామ్మూర్తి, ఎల్.వరలక్ష్మిలకు ఏరియా ఆస్పత్రిలో చికిత్సనందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. చనిపోయిన వారిలో ఇన్సూ్యరెన్స్ ఉన్న వారికి రూ. 5 లక్షలు బీమా వర్తిస్తుందని తెలిపారు. లేని వారికి ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన చిన్న పిల్లలు 40 నుంచి 50 శాతం వరకు కాలిపోయారన్నారు. పెద్దవారు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. ప్రా«థమిక వైద్యం అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చెరువూరు ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘటనపై జిల్లా కలెక్టర్‌తో సీఎం మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సూచించారు. -
‘‘పల్లె వెలుగు’’ కలేనా..?
సాక్షి, జియ్యమ్మవలస: గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపే. వారికి కనీస సౌకర్యాలను కల్పించడంలో ఎప్పుడూ అశ్రద్ధే. అందుకే వారు జనజీవనంలోకి అంతతొందరగా రాలేకపోతున్నారు. నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మిపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో చాలా గ్రామాలకు రహదారులు లేక ఇబ్బంది పడుతుంటే, మరికొన్ని గ్రామాల్లో పక్కా రహదారులున్నా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలోని 137 పంచాయతీలుండగా 40 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. జియ్యమ్మవలస మండలంలో 31 పంచాయతీల్లో 5 పంచాయతీలు పూర్తిగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మిగతా అన్ని గ్రామాలకు తారురోడ్డు ఉన్నా బస్సులు మాత్రం రావు. పీటీమండ, టీకే జమ్ము, కొండచిలకాం పూర్తి అటవీ ప్రాంతం ఉన్న గ్రామాలు, ఈ గ్రామాల్లో కనీసం ఆటోలు కూడా వెళ్లవంటే అతిశయోక్తి కాదు. కొండచిలకాం పంచాయతీలో ద్రాక్షణి, నిడగళ్లు గూడ, పీటీమండ పంచాయతీలో నడిమిసిరిపి, బాపన్నగూడ, దీశరగూడ, టీకే జమ్ము తదితర గ్రామాల్లో తారురోడ్డు ఉన్నప్పటికీ బస్సులు రావడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు కాదని... కొన్ని గ్రామాలకు పక్కా రహదారులున్నా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ విముఖత చూపుతోంది. ఈపీకే ( ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్) గిట్టుబాటు కాకనే బస్సులు నడపడం లేదని అధికారులు గిరిజనులతో చెబుతున్నట్లు సమాచారం. ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నామని, అన్నీ లాభపేక్షతో చూస్తే ప్రభుత్వం దేనికని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు తప్పని ఇక్కట్లు రైతులు పండించే పంటలను మార్కెట్‌కు తరలించాలంటే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల ప్రజలు కాలినడకన పట్టణానికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఏదో ఒక పనిమీద పట్టణానికి పోవాల్సిందే. అయితే సర్వీసులు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను నడపాలని గిరిజనులు కోరుతున్నారు. తారురోడ్డు ఉన్నా బస్స సౌకర్యం లేదు పీటీమండ, టీకే జమ్ము, పాండ్రసింగి గ్రామాలకు తారురోడ్డు ఉన్నా బస్సులు నడవడం లేదు. ఆటోలు కూడా సక్రమంగా నడవలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెలుగు సర్వీసులను నిలపాలి. – కొండగొర్రి భూమేష్, పీటీమండ అధికారులకు వినతులు ఇచ్చినా... రహదారులున్నా బస్సులు నడపడం లేదని వినతులు అందించినా పట్టించుకోవడం లేదు. మా సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎందుకు చిన్నచూపో అర్థం కావడం లేదు. – కడ్రక బలరాం, మాజీ జెడ్పీటీసీ,కొండచిలకాం -
ఒడిశా వర్షాలకు 20 మంది మృతి
భువనేశ్వర్: ఇటీవల ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల కనీసం 20 మంది మరణించారు. సుమారు 3 లక్షల మందిపై ఈ ప్రకృతి ప్రకోప ప్రభావం పడింది. రాష్ట్ర స్పెషల్ రీలీఫ్ కమిషనర్(ఎస్ఆర్సీ) కార్యాలయం బుధవారం ఈ వివరాలు వెల్లడించింది. ఈ నెల 15–16, 20–23 మధ్య రెండు దశల్లో కురిసిన వర్షాలు ఒడిశాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు పిడుగుపాటు, వర్షాల వల్ల మరణించగా, 15 మంది వరద సంబంధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ ఎస్ఆర్సీ ప్రవత్ రంజన్ మోహపాత్ర తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి
సాక్షి ముంబై: మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న తవేరా కారును ఓ ట్రక్కు ఢీకొనడంతో 11 మంది మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులతోపాటు నలుగురు మహిళలున్నారు. అర్ని పోలీసు స్టేషన్ పరిధిలోని కోస్‌దాని ఘాట్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులు నాందేడ్‌లోని గురుద్వారాను దర్శించుకునేందుకు తవేరాలో బయల్దేరినట్లు తెలిసింది. ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో తవేరా ముందు భాగం నుజ్జునుజ్జయింది. క్షణాల్లోనే బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
అమెరికా స్కూల్లో కాల్పులు
వాషింగ్టన్: అమెరికా స్కూళ్లలో కాల్పుల ఘటనలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా టెక్సస్ రాష్ట్రం శాంటాఫే నగరంలోని శాంటాఫే హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో 9మంది విద్యార్థులు, ఒక టీచర్ చనిపోయారు. శుక్రవారం ఉదయం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయుధాలు ధరించిన ఓ విద్యార్థి ఆర్ట్స్ తరగతి గదిలోకి ప్రవేశించి యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10మంది చనిపోయారని, ఒక పోలీసు అధికారి సహా 12 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసిన పోలీసులు న్రధాన నిందితుడితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి రైఫిల్, పిస్టల్, షాట్‌గన్, పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. శాంటా ఫే హైస్కూలులో సుమారు 1,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో స్కూళ్లలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఇది మూడోది కాగా ఈ ఏడాది జరిగిన 22వ కాల్పుల ఘటన అని పోలీసులు తెలిపారు. తాజా ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. -
వడదెబ్బతో 13 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: వడదెబ్బతో సోమవారం 13 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆరుగురు మృతిచెందారు. వైరా మండలం రెబ్బవరానికి చెందిన నాగేశ్వరరావు, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన భారతమ్మ, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలకు చెందిన ఏలయ్య, పాల్వంచకు చెందిన తవిటినాయుడు, కూసుమంచి మండలం బోడియాతండాకు చెందిన చినరాములు, కొత్తగూడెంలోని రామ వరం పద్మశాలి బస్తీకి చెందిన శ్రీనివాస్ మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలో చివ్వెంలకు చెందిన ఇమామ్ సాహెబ్, అర్వపల్లికి చెందిన వీరయ్య , మఠంపల్లి మండలం బక్కమంతులగూడేనికి చెందిన గోపయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన కొండ లచ్చమ్మ, జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన పద్మ, బుగ్గారం మండలం సిరికొండకు చెందిన పోచయ్య ఎండలకు తాళలేక ప్రాణాలొదిలారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో శివలక్ష్మి మృతి చెందింది. -
టొరంటొలో ఉన్మాది ఘాతుకం
-
కెనడాలో పాదచారులపై దూసుకెళ్లిన ట్రక్కు
టొరంటో: కెనడాలోని సెంట్రల్ టొరంటోలో ఓ తెలుపు రంగు ట్రక్కు సోమవారం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు. పాదచారుల్ని ఢీకొట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడన్నారు. చివరికి ట్రక్కుతో పారిపోతున్న నిందితుడ్ని అధికారులు చాకచక్యంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఇక్కడి సబ్వే ను మూసివేసిన పోలీసులు.. ఘటనాస్థలికి రావొద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పలువురు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. -
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. పీఏ పల్లి మండలం చినకమర్రిగేటు వద్ద బైక్‌పై వెళ్తున్న నలుగురు యువకులను వేగంగా వచ్చిన ఇన్నోవా ఢీకొంది ఈ దుర్ఘటనలోనలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా మల్లేపల్లి నుంచి మునావత్ తండాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను లక్పతి(35), నెహ్రు(25), భాస్కర్(26) శివ(22)లుగా గుర్తించారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ముందు వెళుతున్న ఇన్నోవాను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. ఇకమృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
-
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.మృతులు, క్షతగాత్రులు కృష్ణా, ఒంగోలు జిల్లాలకు చెందిన వారు. కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన తుమ్మల నరేంద్ర కుమార్తెకు ఆరునెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చెకప్ కోసం శనివారం ఉదయం నరేంద్ర తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లా డు. చికిత్స అనంతరం వీరి మిత్రుడు వంగపాటి వెంకటేశ్వర్లు(32)తో కలిసి రాత్రి విజయవాడకు బయలుదేరారు. నరేంద్ర డ్రైవింగ్ చేస్తుండగా వెంకటేశ్వర్లు అతని పక్కన ముం దు సీటులో కూర్చున్నాడు.నల్లబండగూడెం వద్ద రోడ్డుపక్కన ఆగిఉన్న ట్యాంకర్‌ను నరేం ద్ర గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముందు సీటులో కూర్చున్న వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందగా, నరేంద్ర, అతని భార్య శిరీష, కుమారుడు యశ్వంత్ సాయి, కుమార్తె కీర్తికకు గాయాల య్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ, కారు ఢీ.. చింతపల్లి:హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మెదిరిమెల్లే గ్రామానికి చెందిన మన్నె బసవయ్యచౌదరి (52) భార్య వెంకటరాజేశ్వరి స్వగ్రామానికి కారులో వెళ్లివస్తుండగా మార్గమధ్యలో చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ సమీపంలో మల్లెపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బసవయ్య అక్కడికక్కడే మృతిచెందగా వెంకటరాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థాని కులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.