ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న గిరిజనులు
సాక్షి, జియ్యమ్మవలస: గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపే. వారికి కనీస సౌకర్యాలను కల్పించడంలో ఎప్పుడూ అశ్రద్ధే. అందుకే వారు జనజీవనంలోకి అంతతొందరగా రాలేకపోతున్నారు. నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మిపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో చాలా గ్రామాలకు రహదారులు లేక ఇబ్బంది పడుతుంటే, మరికొన్ని గ్రామాల్లో పక్కా రహదారులున్నా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
నియోజకవర్గంలోని 137 పంచాయతీలుండగా 40 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. జియ్యమ్మవలస మండలంలో 31 పంచాయతీల్లో 5 పంచాయతీలు పూర్తిగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మిగతా అన్ని గ్రామాలకు తారురోడ్డు ఉన్నా బస్సులు మాత్రం రావు. పీటీమండ, టీకే జమ్ము, కొండచిలకాం పూర్తి అటవీ ప్రాంతం ఉన్న గ్రామాలు, ఈ గ్రామాల్లో కనీసం ఆటోలు కూడా వెళ్లవంటే అతిశయోక్తి కాదు. కొండచిలకాం పంచాయతీలో ద్రాక్షణి, నిడగళ్లు గూడ, పీటీమండ పంచాయతీలో నడిమిసిరిపి, బాపన్నగూడ, దీశరగూడ, టీకే జమ్ము తదితర గ్రామాల్లో తారురోడ్డు ఉన్నప్పటికీ బస్సులు రావడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.
గిట్టుబాటు కాదని...
కొన్ని గ్రామాలకు పక్కా రహదారులున్నా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ విముఖత చూపుతోంది. ఈపీకే ( ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్) గిట్టుబాటు కాకనే బస్సులు నడపడం లేదని అధికారులు గిరిజనులతో చెబుతున్నట్లు సమాచారం. ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నామని, అన్నీ లాభపేక్షతో చూస్తే ప్రభుత్వం దేనికని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
రైతులకు తప్పని ఇక్కట్లు
రైతులు పండించే పంటలను మార్కెట్‌కు తరలించాలంటే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల ప్రజలు కాలినడకన పట్టణానికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఏదో ఒక పనిమీద పట్టణానికి పోవాల్సిందే. అయితే సర్వీసులు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను నడపాలని గిరిజనులు కోరుతున్నారు.
తారురోడ్డు ఉన్నా బస్స సౌకర్యం లేదు
పీటీమండ, టీకే జమ్ము, పాండ్రసింగి గ్రామాలకు తారురోడ్డు ఉన్నా బస్సులు నడవడం లేదు. ఆటోలు కూడా సక్రమంగా నడవలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెలుగు సర్వీసులను నిలపాలి.
– కొండగొర్రి భూమేష్, పీటీమండ
అధికారులకు వినతులు ఇచ్చినా...
రహదారులున్నా బస్సులు నడపడం లేదని వినతులు అందించినా పట్టించుకోవడం లేదు. మా సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎందుకు చిన్నచూపో అర్థం కావడం లేదు.
– కడ్రక బలరాం, మాజీ జెడ్పీటీసీ,కొండచిలకాం
Comments
Please login to add a commentAdd a comment