అల్లిపురం (విశాఖ దక్షిణం)/యడ్లపాడు (చిలకలూరిపేట): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వెళుతున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలొదిలిన ఘటన విశాఖపట్నంలో ఆదివారం వేకువజామున జరిగింది. బైక్‌పై వెళుతున్న ఆ ఇద్దరు యువకులు కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో నవ వధువు మృత్యువాత పడగా, ఆమె భర్త ఆస్పత్రి పాలయ్యారు. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మహారాణిపేట పోలీసుల కథనం ప్రకారం.. జన్ని సుధీర్ (21), పెనుమత్స వినయవర్మ (22) స్నేహితులు. శనివారం రాత్రి వారు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో సరదాగా గడిపారు.
అక్కడ నుంచి స్నేహితుడి బైక్ తీసుకుని జగదాంబ సెంటర్ నుంచి సిరిపురం వైపు వేగంగా వెళుతూ ఆదివారం తెల్లవారుజామున అపోలో ఆస్పత్రి సమీపంలో డివైడర్ మధ్యలో ఉన్న సెంటర్ లైటింగ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఘటనలో వాహనం నడుపుతున్న వినయవర్మ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. గాయపడ్డ సుధీర్‌ను అపోలో ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్‌పై తీసుకెళుతుండగా మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిపించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సుధీర్ నగరంలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ, వినయవర్మ పీజీ చదువుతున్నారు.
నవ వధువును కాటేసిన మృత్యువు
బైక్‌పై వెళ్తున్న నవ దంపతులను వెనుక నుంచి కారు ఢీకొనడంతో భార్య మృతి చెందగా.. భర్త తీవ్ర గాయాల పాలయ్యాడు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోలాలపూడి గ్రామానికి చెందిన గుడిపల్లి శ్రీనివాసరావు, పద్మ దంపతుల రెండో కుమారుడైన కారు డ్రైవర్ గుడిపల్లి కోటేశ్వరరావుకు తెనాలి సమీపంలో గల యడ్లపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్, పోలేరమ్మ దంపతుల ఏకైక కుమార్తె శ్రావణితో మూడు నెలల కిందట వివాహమైంది. పది రోజుల కిందట శ్రావణి బంధువుల వివాహం ఉండటంతో పెళ్లి నిమిత్తం ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆదివారం శ్రావణి ఫోన్ చేయడంతో ఉదయం 11 గంటలకు కోటేశ్వరరావు తన గ్రామం నుంచి బయలుదేరి వెళ్లాడు.
మధ్యాహ్నం ఒంటిగంటకు అత్తారింటికి చేరుకున్న కోటేశ్వరరావు రెండు గంటలు ఉండి, భార్య శ్రావణితో బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న బైక్ యడ్లపాడు మండలం తిమ్మాపురం వసంత నూలు మిల్లు వద్దకు చేరుకోగా.. గుర్తు తెలియని కారు ఆ బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనగా.. దంపతులిద్దరూ సర్వీస్ రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరినీ చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే భార్య శ్రావణి మృతి చెందింది. భర్త కోటేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మూడు నెలల కిందట పెళ్‌లైన శ్రావణి గర్భం దాల్చినట్టు తెలిసిందని.. ఆస్పత్రికి వెళ్లి ఆ విషయాన్ని నిర్థారించుకునేలోపే ఆమె తనకు దూరమైందని భర్త కోటేశ్వరరావు కుమిలిపోతూ తన మిత్రులకు చెప్పుకోవడం చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. యడ్లపాడు ఎస్సై జె.శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. హైవే అంబులెన్స్ వచ్చేంత వరకు అక్కడే ఉండి. వారి బంధువులకు సమాచారం అందించే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment