no bus
-
‘‘పల్లె వెలుగు’’ కలేనా..?
సాక్షి, జియ్యమ్మవలస: గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపే. వారికి కనీస సౌకర్యాలను కల్పించడంలో ఎప్పుడూ అశ్రద్ధే. అందుకే వారు జనజీవనంలోకి అంతతొందరగా రాలేకపోతున్నారు. నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మిపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో చాలా గ్రామాలకు రహదారులు లేక ఇబ్బంది పడుతుంటే, మరికొన్ని గ్రామాల్లో పక్కా రహదారులున్నా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలోని 137 పంచాయతీలుండగా 40 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. జియ్యమ్మవలస మండలంలో 31 పంచాయతీల్లో 5 పంచాయతీలు పూర్తిగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మిగతా అన్ని గ్రామాలకు తారురోడ్డు ఉన్నా బస్సులు మాత్రం రావు. పీటీమండ, టీకే జమ్ము, కొండచిలకాం పూర్తి అటవీ ప్రాంతం ఉన్న గ్రామాలు, ఈ గ్రామాల్లో కనీసం ఆటోలు కూడా వెళ్లవంటే అతిశయోక్తి కాదు. కొండచిలకాం పంచాయతీలో ద్రాక్షణి, నిడగళ్లు గూడ, పీటీమండ పంచాయతీలో నడిమిసిరిపి, బాపన్నగూడ, దీశరగూడ, టీకే జమ్ము తదితర గ్రామాల్లో తారురోడ్డు ఉన్నప్పటికీ బస్సులు రావడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు కాదని... కొన్ని గ్రామాలకు పక్కా రహదారులున్నా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ విముఖత చూపుతోంది. ఈపీకే ( ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్) గిట్టుబాటు కాకనే బస్సులు నడపడం లేదని అధికారులు గిరిజనులతో చెబుతున్నట్లు సమాచారం. ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నామని, అన్నీ లాభపేక్షతో చూస్తే ప్రభుత్వం దేనికని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు తప్పని ఇక్కట్లు రైతులు పండించే పంటలను మార్కెట్కు తరలించాలంటే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల ప్రజలు కాలినడకన పట్టణానికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఏదో ఒక పనిమీద పట్టణానికి పోవాల్సిందే. అయితే సర్వీసులు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను నడపాలని గిరిజనులు కోరుతున్నారు. తారురోడ్డు ఉన్నా బస్స సౌకర్యం లేదు పీటీమండ, టీకే జమ్ము, పాండ్రసింగి గ్రామాలకు తారురోడ్డు ఉన్నా బస్సులు నడవడం లేదు. ఆటోలు కూడా సక్రమంగా నడవలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెలుగు సర్వీసులను నిలపాలి. – కొండగొర్రి భూమేష్, పీటీమండ అధికారులకు వినతులు ఇచ్చినా... రహదారులున్నా బస్సులు నడపడం లేదని వినతులు అందించినా పట్టించుకోవడం లేదు. మా సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎందుకు చిన్నచూపో అర్థం కావడం లేదు. – కడ్రక బలరాం, మాజీ జెడ్పీటీసీ,కొండచిలకాం -
టీడీపీ మొక్కుబడి దీక్షలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో చేపట్టిన దీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల మంత్రులు ఎమ్మెల్యేలు దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలు మొక్కుబడిగా సాగాయి. ఉదయం ఏడుగంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ సాగాల్సి ఉండగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి ఐదు గంటలకు ముగించేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన దీక్షకు మంత్రి జవహర్ వచ్చేసరికి దీక్షా శిబిరం ఖాళీగా దర్శనమిచ్చింది. జిల్లాలో ఎక్కడా కూడా ఈ దీక్షలకు ప్రజల నుంచి మద్దతు లభించలేదు. కార్యకర్తలను, డ్వాక్రా మహిళలను తీసుకువచ్చి కూర్చోపెట్టే ప్రయత్నం చేసినా వారు కూడా ఎక్కువ సేపు టీడీపీ మొక్కుబడి దీక్షలు ఉండకుండా వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకే దీక్ష శిబిరాలు సగానికి పైగా ఖాళీ అయిపోయాయి. విజయవాడలో జరిగిన ముఖ్యమంత్రి దీక్షకు జిల్లా నుంచి 169 బస్సుల్లో కార్యకర్తలను, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలను తరలించారు. పెళ్లిళ్ల సీజన్ కావడం, విద్యార్థుల పరీక్షలతో ప్రజలు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రధాన రోడ్లను ఒకవైపు మూసివేసి రోడ్డుపై దీక్షలకు దిగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. తణుకు బస్ డిపో పరిధిలో మొత్తం 78 బస్సులకుగాను, 27 బస్సులను అమరావతి చంద్రబాబు దీక్షా శిబిరానికి తరలించారు. ఒక పక్క పెళ్ళిళ్ల సీజన్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రోడ్డుపై కోర్టు ఎదురుగా శిబిరం ఏర్పాటు చేశారు. ఒకవైపు రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. నిడదవోలు ఆర్టీసీ డిపోలో 36 బస్సులకుగాను 14 బస్సులు అమరావతి దీక్షా శిబిరానికి తరలించారు. దీంతో జంగారెడ్డిగూడెం, నర్సాపురం, రాజమండ్రి ఏరియాలకు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో పాటిమీద సెంటర్లో ధర్మపోరాట దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పార్టీ నాయకులు ఒక రోడ్డును బ్లాక్ చేసి దీక్షా శిబిరం చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తాడేపల్లిగూడెం డిపోకు 74 బస్సులుండగా దానిలో 28 బస్సులు ధర్మదీక్షా శిబిరానికి తరలించారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు తాడేపల్లిగూడెం– భీమవరం వెళ్ళేందుకు ఇబ్బందులు పడ్డారు. జంగారెడ్డిగూడెం డిపోకు 80 బస్సులున్నాయి. 21 బస్సులను విజయవాడ పంపగా, ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల విజయవాడ సర్వీసులను నిలిపివేశారు. దీంతో విజయవాడ వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడ్డారు. ఏలూరు డిపోలో మొత్తం 146 బస్సులుండగా వాటిలో 109 పల్లె వెలుగు బస్సులున్నాయి. వీటిలో 30 బస్సులను మూడు దఫాలుగా ధర్మపోరాట దీక్షకు తరలిం చారు. ఈ కారణంగా వివిధ రూట్లల్లో రెండు, మూడుసార్లు తిరగాల్సిన బస్సులను ఒక్కసారికే పరిమితం చేయగా సమయానికి బస్సులందక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరం డిపో నుంచి 30 బస్సులు ధర్మపోరాటదీక్షకు తరలించారు. దీనివల్ల పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నర్సాపురం రూట్లల్లో సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏలూరు జిల్లా కేంద్రంలో మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, ఎంపీలు సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ నూర్జహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలుగు జాతి జోలికి వస్తే ఎవరైనా మాడిమసైపోతారని, న్యాయంగా పోరాటం చేస్తున్న తెలుగుజాతిని అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్రానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
పల్లెకు రాని బస్సు
ఆదిలాబాద్రూరల్ : ఆర్టీసీ బస్సు చేరని గ్రామాలు ఈ రోజుల్లో కూడా అనేకం ఉన్నాయి. ప్రతి గ్రామానికి బస్సు నడిపించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రోడ్డు మార్గం ఉన్న గ్రామాలకు బస్సు నడపడంలో ఆసక్తి కనబర్చడం లేదు. బస్సు నడపాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మండలంలోని ఖండాల గ్రామ పరిధిలో సుమారు 18 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. రోడ్డు వేసి ఏడాదవుతున్నా ఆ గ్రామాలకు నేటికి బస్సు సౌకర్యం లేదు. కాలినడకనే శరణ్యం... మండంలంలోని పలు మారమూల గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు ఆ గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పదుల కిలో మీటర్ల చొప్పున కాలినడకన వస్తున్నారు. జిల్లా కేంద్రానికి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి రోజు రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఆర్టీసీ బస్సు నడవకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు నిర్వహించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. అత్యవసర సమయాల్లోనైతే నానా అవస్థలు పడావల్సిన పరిస్థితి ఉందని ప్రయాణీకులు వాపోతున్నారు. నేటికీ బస్సు రాని గ్రామాలు... మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి. పిప్పల్ధరి గ్రామ పంచాయతీ నుంచి ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కాలినడకన వెళ్తున్నారు. ఖండాల పంచాయతీ పరిధిలోని సుమారు 14 గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం బీటీ రోడ్డు సౌకర్యం కల్పించింది. బీటీ రోడ్డు మార్గం వేసి సుమారు ఏడాది గడుస్తున్నా రాజుగూడ, పోతగూడ–1, పోతగూడ–2, ఖండాల తండా, ఖండాల గూడ, ధర్లొద్దీ, మొలాలగుట్ట–1, మొలాల గుట్ట–2, లోహర, జాంగూడ, ఎస్సీ గూడ, చిలాటీగూడ, సాలాయిగూడ, శివగూడ గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్న బస్సు మాత్రం వెళ్లడం లేదు. ప్రయాణీకులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ గ్రామాల్లన్నీ ఒకే రోడ్డు మార్గంలో ఉన్నాయి. అధికారులు స్పందించి బస్సును నడిపించేలా చూడాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నాం తమ గ్రామాలకు వెళ్లేందుకు బీటీ రోడ్డు వేసిన్నప్పటికీ ఆర్టీసీ బస్సు రావడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాలు ఆటోలు, జీపుల్లో రాకపోకలను నిర్వహిస్తున్నాం. అత్యవసర సమయాల్లోనైతే ఆ వాహనాలు రాకపోవడంతో కాలినడకన రాకపోకలు నిర్వహిస్తున్నాం. అధికారులు స్పందించి బస్సు నడిపిస్తే బాగుంటుంది. - నైతం శంభు, ఖండాల, ఆదిలాబాద్ ఆఫీసర్లకు చెప్పిండ్రాట తమ గ్రామానికి రాకపోకలు నిర్వహిచేందుకు గవర్నమెంట్ రోడ్డు వేసింది. కానీ బస్సు మాత్రం రావడం లేదు. మా ఊళ్లకు బస్సు నడపాలని మా ఊరోళ్లు ఆఫీసర్లకు చెప్పిండ్రాటా. కానీ ఇంత వరకు బస్సు నడవడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కనక రమేష్, ఖండాల, ఆదిలాబాద్ -
బడికెళ్లాలంటే.. 10 కి.మీ. నడవాల్సిందే..
వారికి చదువంటే చాలా ఇష్టం.. కానీ తమ గ్రామం నుంచి మండలకేంద్రంలోని పాఠశాలకు చేరుకోవాలంటే సుమారు పది కిలోమీటర్లు నడవాల్సిందే.. ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ విద్యార్థులు కాలినడకనే పాఠశాలకు వెళుతున్నారు.. ఎండకు, వానకు తట్టుకుని చదువుపై మక్కువతో నిత్యం కాలినడక సాగిస్తున్నారు.. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.. మద్నూర్ : మండలంలోని మొగా, పెద్ద శక్కర్గా, మారెపల్లి, శేఖాపూర్, హండేకేలూర్, అవాల్గావ్, చిన్న ఎక్లార తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నిత్యం సుమారు 10 కి.మీ. కాలినడకన పాఠశాలకు వెళ్తున్నారు. ప్రై వేట్ వాహనాలున్నా కొన్నిసార్లు అవి కూడా అందుబాటులో ఉండకపోవడంతో వారికి కాలినడక తప్పడంలేదు.. మొగా, శేఖాపూర్, మారెపల్లి, లచ్మాపూర్ గ్రామాల విద్యార్థులు మేనూర్లోని ఉన్నత పాఠశాలకు, పెద్ద శక్కర్గా, చిన్న శక్కర్గా, హండేకేలూర్, అవాల్గావ్ గ్రామాల విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు, దన్నూర్, సోమూర్, ఖరగ్, చిన్న తడ్గూర్, కొడిచెర, అంతాపూర్ గ్రామాల విద్యార్థులు పెద్ద తడ్గూర్ ఉన్నత పాఠశాలకు వస్తారు. చిన్న ఎక్లార, రూపేగావ్, లచ్చన్, సుల్తాన్పేట్ విద్యార్థులు పెద్ద ఎక్లారలోని ఉన్నత పాఠశాలకు వస్తారు. దీంతో ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, రోజూ నడుచుకుంటూ వెళ్లిరావడంతో అలసిపోతున్నామని ఆ విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఆడపిల్లలను బడికి పంపాలంటే తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.