బడికెళ్లాలంటే.. 10 కి.మీ. నడవాల్సిందే..
వారికి చదువంటే చాలా ఇష్టం.. కానీ తమ గ్రామం నుంచి మండలకేంద్రంలోని పాఠశాలకు చేరుకోవాలంటే సుమారు పది కిలోమీటర్లు నడవాల్సిందే.. ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ విద్యార్థులు కాలినడకనే పాఠశాలకు వెళుతున్నారు.. ఎండకు, వానకు తట్టుకుని చదువుపై మక్కువతో నిత్యం కాలినడక సాగిస్తున్నారు.. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు..
మద్నూర్ : మండలంలోని మొగా, పెద్ద శక్కర్గా, మారెపల్లి, శేఖాపూర్, హండేకేలూర్, అవాల్‌గావ్, చిన్న ఎక్లార తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నిత్యం సుమారు 10 కి.మీ. కాలినడకన పాఠశాలకు వెళ్తున్నారు. ప్రై వేట్ వాహనాలున్నా కొన్నిసార్లు అవి కూడా అందుబాటులో ఉండకపోవడంతో వారికి కాలినడక తప్పడంలేదు.. మొగా, శేఖాపూర్, మారెపల్లి, లచ్మాపూర్ గ్రామాల విద్యార్థులు మేనూర్‌లోని ఉన్నత పాఠశాలకు, పెద్ద శక్కర్గా, చిన్న శక్కర్గా, హండేకేలూర్, అవాల్‌గావ్ గ్రామాల విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు, దన్నూర్, సోమూర్, ఖరగ్, చిన్న తడ్గూర్, కొడిచెర, అంతాపూర్ గ్రామాల విద్యార్థులు పెద్ద తడ్గూర్ ఉన్నత పాఠశాలకు వస్తారు. చిన్న ఎక్లార, రూపేగావ్, లచ్చన్, సుల్తాన్‌పేట్ విద్యార్థులు పెద్ద ఎక్లారలోని ఉన్నత పాఠశాలకు వస్తారు. దీంతో ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, రోజూ నడుచుకుంటూ వెళ్లిరావడంతో అలసిపోతున్నామని ఆ విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఆడపిల్లలను బడికి పంపాలంటే తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.