న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిపోయిన ఏఎన్–32 విమానంలో ఉన్న 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం ధ్రువీకరించింది. గురువారం దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాల కోసం సహాయక బృందం గాలింపులో ఈ విషయం వెల్లడైంది. ‘జూన్ 3న జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన వైమానిక వీరులకు భారత వైమానిక దళం నివాళులు అర్పిస్తోంది. వారి ఆత్మ శాంతించాలి. వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ అని వాయుసేన అధికార ప్రతినిధి ఒకరు గురువారం పేర్కొన్నారు.
రష్యాలో తయారైన ఏఎన్–32 విమానం అస్సాంలోని జొహ్రాట్ ప్రాంతం నుంచి చైనా సరిహద్దులోని మెంచుకాకు జూన్ 3న బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి గాలించగా 8 రోజుల తర్వాత సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దులో మంగళవారం ఈ విమాన శకలాలు దొరికాయి. 13 మంది యుద్ధవీరులు అందించిన సేవలను దేశం ఎప్పుడూ మరిచిపోదని ట్విటర్‌లో కాంగ్రెస్ పేర్కొంది. వారి మృతిపట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం పది విమానాలను భారత వాయుసేన కోల్పోయింది. కోల్పోయిన విమానాల్లో ఒక మిరాజ్, ఒక జాగ్వార్, ఒక ఎంఐ17వీ5 హెలికాప్టర్, రెండు హాక్ రకం విమానాలు, రెండు మిగ్ రకం విమానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment