AN-32 aircraft
-
ఏఎన్ - 32 ప్రమాదం : 6 మృతదేహాలు లభ్యం
ఈటానగర్ : ఈనెల 3వ తేదీన గల్లంతైన వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా పయూమ్ పరిధిలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోయినట్లు వారం రోజుల క్రితమే గుర్తించినప్పటికి.. ఇన్ని రోజులు అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడానికి అధికారులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ఆరు మృత దేహాలను, మరో ఏడుగురి శరీర భాగాలను గుర్తించారు. విమానం కూలిపోయిన సంగతి తెలిసిన తర్వాత అక్కడకు వెళ్లడానికి వాతావరణం అనుకూలించలేదు. దాంతో సంఘటన స్థలానికి వెళ్లిన గరుడ్ కమాండోలకు అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మృతదేహాలను గుర్తించడం కోసం వారితోపాటు పోర్టర్లు, వేటగాళ్లు కూడా పర్వతం మీదకు నడుకుచుంటూ వెళ్లారు. ఎట్టకేలకు గురువారం నాటికి విమానం కూలిన ప్రదేశానికి చేరుకోగలిగారు. 12 వేల అడుగుల ఎత్తులో ఈ మృతదేహాలను గుర్తించారు. జూన్ 3న మధ్యాహ్నం 12.25గంటలకు అస్సాంలోని జోర్హాట్ నుంచి బయలుదేరిన ఏఎన్-32 విమానం ఆచూకీ కొద్దిసేపటికే గల్లంతయ్యింది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉండగా, సియాంగ్ జిల్లా పయూమ్‌లో కూలిపోయింది. ప్రమాదం సంభవించినప్పుడు విమానంలో ఎనిమిది మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులతో సహా మొత్తం 13మంది ప్రయాణిస్తున్నారు. గత కొద్ది రోజులుగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్)తో పాటు, ఆర్మీ కూడా ఈ విమానం గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ సాయంతో విమానం ఆచూకీ కోసం వెతుకుతుండగా సియాంగ్ జిల్లాలో గుర్తించారు. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారని కొన్ని రోజుల క్రితం వైమానిక దళం వెల్లడించింది. -
వారంతా అమరులయ్యారు
న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిపోయిన ఏఎన్–32 విమానంలో ఉన్న 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం ధ్రువీకరించింది. గురువారం దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాల కోసం సహాయక బృందం గాలింపులో ఈ విషయం వెల్లడైంది. ‘జూన్ 3న జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన వైమానిక వీరులకు భారత వైమానిక దళం నివాళులు అర్పిస్తోంది. వారి ఆత్మ శాంతించాలి. వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ అని వాయుసేన అధికార ప్రతినిధి ఒకరు గురువారం పేర్కొన్నారు. రష్యాలో తయారైన ఏఎన్–32 విమానం అస్సాంలోని జొహ్రాట్ ప్రాంతం నుంచి చైనా సరిహద్దులోని మెంచుకాకు జూన్ 3న బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి గాలించగా 8 రోజుల తర్వాత సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దులో మంగళవారం ఈ విమాన శకలాలు దొరికాయి. 13 మంది యుద్ధవీరులు అందించిన సేవలను దేశం ఎప్పుడూ మరిచిపోదని ట్విటర్లో కాంగ్రెస్ పేర్కొంది. వారి మృతిపట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం పది విమానాలను భారత వాయుసేన కోల్పోయింది. కోల్పోయిన విమానాల్లో ఒక మిరాజ్, ఒక జాగ్వార్, ఒక ఎంఐ17వీ5 హెలికాప్టర్, రెండు హాక్ రకం విమానాలు, రెండు మిగ్ రకం విమానాలు ఉన్నాయి. -
ఏఎన్- 32 విమాన శకలాలు లభ్యం
ఈటానగర్ : భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్–32 రకం విమాన ఆచూకీని ఎంఐ–17 విమానాలు కనుగొన్నాయి. విమాన శకలాలను అరుణాచల్‌ప్రదేశ్‌లోని లిపోకి 16 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. అయితే విమానంలో ఉన్న సిబ్బంది పరిస్థితి గురించి త్వరలో తెలియజేయనున్నట్లు ఓ ట్వీట్లో ఐఏఎఫ్ తెలిపింది. జూన్ 3న 13 మందితో బయలుదేరిన ఏఎన్32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాంలోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. గల్లంతైన ఏఎన్32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. పదేళ్ల క్రితమూ ఇలాగే.. అది 2009 సంవత్సరం జూన్ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్–32 రకం విమానం కూలిపోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
మోదీని అడిగితే.. ఆ 5 లక్షలు మిగిలేవి: ఒవైసీ
హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఏఎన్-32 విమానం అదృశ్యమైన నేపథ్యంలో రాడర్ల విషయమై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఒవైసీ ఎద్దేవా చేశారు. రాడర్ల గురించి నరేంద్రమోదీకి చాలాబాగా తెలుసునని, ఏఎన్-32 విమానం ఎక్కడ అదృశ్యమైందో ఐఏఎఫ్ మోదీని అడిగితే సరిపోయేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒవైసీ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ మోదీ ఒక మంచి శాస్త్రవేత్త. రాడార్ల నుంచి తప్పించుకోవడానికి మేఘాలు సాయం చేస్తాయంటూ ఆయన శత్రుదేశం భూభాగంలోకి ఐఏఎఫ్ జెట్ విమానాల్ని పంపిస్తారు. కానీ, ఇటీవల జూన్ 3న 13 మందితో ప్రయాణిస్తున్న ఒక ఐఏఎఫ్ విమానం తప్పిపోయింది. ఈ విమానం ఆచూకీ చెప్పినవారికి రూ. 5 లక్షలు ఇస్తామని ఐఏఎఫ్ ప్రకటించింది. ఆ విమానం ఎక్కడ ఉందో మోదీని ఐఏఎఫ్ అడిగితే సరిపోయేది. రూ. 5 లక్షలు ఆదా అయ్యేవి’అంటూ ఒవైసీ ఎద్దేవా చేశారు. తప్పిపోయిన ఐఏఎఫ్ ప్రయాణ విమానం ఏఎన్-32 ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో.. ఆ విమానం జాడ గురించి నమ్మకమైన సమాచారం ఇచ్చినవారికి రూ. 5 లక్షల నజరానా ఇస్తామని ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ ఆర్డీ మథూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘అక్కడ దట్టమైన పొగ రావడం చూశాం’
ఈటానగర్ : భారత వాయుసేనకు సంబంధించిన ఏఎన్ - 32 విమానం రెండు రోజుల క్రితం గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి కూడా విమానం ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో టంబిన్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విమానం గల్లంతుకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారు. ఏఎన్ - 32 విమానం గల్లైంతన రోజు మధ్యాహ్నం ఓ కొండ ప్రాంతంలో దట్టమైన పొగ రావడాన్ని గమనించినట్లు చెప్పారు. సియాంగ్ జిల్లా మోలో గ్రామానికి సమీపంలోని ఓ కొండ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగ రావడం తాము చూసినట్లు గ్రామస్థులు వెల్లడించారు. దాంతో అధికారులు ఆ గ్రామస్థులు చెప్పిన మార్గంలో అన్వేషించేందుకు నిర్ణయించుకున్నారు. అయితే గల్లంతైన విమానం ఆచూకీ కనిపెట్టడం కోసం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ వెస్ట్ సియాంగ్, లోయర్ సియాంగ్, షివోమి జిల్లా డిప్యూటి కమిషనర్ల అధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూడు టీమ్‌లు విమానం తప్పిన పోయిన మార్గంలోని కొండ ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నాయి. 13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైంది. అస్సాంలోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. -
వాయుసేన విమానం గల్లంతు.. ముమ్మరంగా గాలింపు
ఈటానగర్ : 13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. అస్సాం లోని జొర్హాత్ నుంచి సోమవారం మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని, ఆర్మీ అధికారులు తెలిపారు. తప్పిపోయిన విమానాన్ని గుర్తించేందుకు ఆర్మీతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలతో సమన్వయంతో గాలింపుచర్యలు చేపట్టినా మంగళవారం ఉదయం వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. 2009 జూన్ నెలలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే అరుణాచల్‌లో జరిగింది. ఏఎన్–32 రకం విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లోనే కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. -
వాయుసేన విమానం గల్లంతు
ఈటానగర్/న్యూఢిల్లీ: 13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైంది. అస్సాం లోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. ఐఏఎఫ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘కొన్నిచోట్ల విమానం కూలిపోయి ఉండొచ్చని మాకు సమాచారం రావడంతో అక్కడంతా గాలించాం. కానీ ఏఎన్–32 విమానం కానీ, దాని శకలాలు కానీ ఎక్కడా కనిపించలేదు. విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు’ అని తెలిపింది. తప్పిపోయిన విమానాన్ని గుర్తించేందుకు ఆర్మీతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నామని వాయుసేన వెల్లడించింది. రాత్రంతా గాలింపును కొనసాగిస్తామంది. విమానం గల్లంతైన ఘటనకు సంబంధించి ఐఏఎఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్ బహదూరియాతో తాను మాట్లాడినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. 2009 జూన్ నెలలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే అరుణాచల్‌లో జరిగింది. ఏఎన్–32 రకం విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లోనే కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. -
ఆచూకీ కష్టమన్న కేంద్రం
ఏఎన్-32 విమానం ఆచూకీ కష్టమన్న కేంద్రం ‘ఎన్ఏడీ’ బాధిత కుటుంబాల్లో ఆందోళన విశాఖపట్నం: సరిగ్గా 25 రోజుల క్రితం.. అంటే గత నెల 22న తమిళనాడులోని తాంబరం నుంచి పోర్టుబ్లెయిర్ వెళ్తూ ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమైంది. అందులో ఉన్న 29 మంది జాడ తెలియకుండా పోయింది. వీరిలో 8 మంది విశాఖ ఎన్‌ఏడీకి చెందిన సివిల్ ఉద్యోగులున్న సంగతి తెలిసిందే.. విమానం ఎయిర్ ట్రాఫిక్‌తో సంబంధాలు తెగిపోయిన ప్రాంతంలో (చెన్నైకి తూర్పున 151 నాటికల్ మైళ్ల దూరంలో) నాటి నుంచి నేటి వరకు ఆ విమానం కోసం సుదీర్ఘంగా గాలిస్తూనే ఉన్నారు. ఇస్రో సాయం కూడా తీసుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఆ విమానం ఏమయిందో.. అందులో ఉన్న వారెమయ్యారో ఇసుమంతైనా తెలియరాలేదు. ఇప్పటిదాకా దాదాపు వెయ్యి గంటలకు పైగా జరిపిన శోధనలో నీటిపై తేలియాడుతూ కనిపించిన 30 వస్తువులు, 24 ట్రాన్స్మిషన్ సిగ్నల్స్‌ను గుర్తించారు. అయినా అవేమీ అదృశ్యమైన ఏఎన్32 విమానానికి సంబంధించిన కావని నిర్ధారించారు. దేశ చరిత్రలోనే అతి సుదీర్ఘ గాలింపుగా నిలిచిపోయిన ఈ ఘటనపై తాజాగా కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ రామ్రావు భామ్రే లోక్‌సభలో చేసిన ప్రకటన బాధిత కుటుంబాల్లో తీవ్ర అలజడిని రేపుతోంది. విమాన ప్రమాదంలో ఇన్ని రోజుల తర్వాత ఎవరూ సురక్షితంగా ఉండే అవకాశం లేదని మంత్రి ప్రకటించారు. దీంతో తమ వారి కోసం కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. రోజూ ఎన్‌ఏడీకి చెందిన అధికారులు బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ వస్తున్నారు. మంగళవారం కూడా కొంతమంది ఉన్నతాధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి మనోస్థైరాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఒకపక్క తమ వారి జాడ తేలకపోవడం, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనల నేపథ్యంలో అదృశ్యమైన కుటుంబ సభ్యు ల పరిస్థితి అగమ్యగోచరంగా, అయోమయంగా తయారైంది. -
విమానం జాడలేదు.. నాన్న కాల్ రాలేదు!
న్యూఢిల్లీ: బంగళాఖాతం సముద్రంలో తప్పిపోయిన భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) ఏఎన్-32 యుద్ధం విమానం ఆచూకీ కోసం ముమ్మరంగా జరుగుతున్న గాలింపులు ఆదివారం నాటికి మూడోరోజుకు చేరుకున్నాయి. అయినా ఇప్పటివరకు ఈ విమానం జాడ లభించలేదు. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతైంది. ఈ విమానంలో నలుగురు అధికారులు సహా.. మొత్తం 29మంది సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో గల్లంతైన విమానంలోని తమ వారి భద్రతపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారు క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ‘విమానంలో ఉన్న మా నాన్న, ఇతర సిబ్బంది క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. విమానానికి ఏమైందోనన్న ఆందోళన మమ్మల్ని వేధిస్తోంది. అది ఎక్కడ ఉందన్న విషయమై ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం అందలేదు’ అని అశుతోష్ సింగ్ తెలిపారు. అశుతోష్ తండ్రి, ఐఏఎఫ్ అధికారి భూపత్ సింగ్ తప్పిపోయిన ఏఎన్ 32 యుద్ధవిమానంలో ఉన్నారు. ‘పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లగానే కాల్ చేస్తానని మా నాన్న చెప్పారు. కానీ ఆయన నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఆయన సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఆయనను మేం ఎంతగానో మిస్సవుతున్నాం’ అని అశుతోష్ చెప్పారు. విమానం మూడురోజులవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందకపోవడం తమను వేదనకు గురిచేస్తున్నదని తప్పిపోయిన విమానంలో ఉన్న మరో ఐఏఎఫ్ అధికారి భార్య సంగీత మీడియాకు తెలిపారు.