ఆచూకీ కష్టమన్న కేంద్రం | 25 Days, No Sign Of Plane Or Debris, Missing Case Filed For AN-32 Aircraft | Sakshi
Sakshi News home page

ఆచూకీ కష్టమన్న కేంద్రం

Published Wed, Aug 17 2016 10:55 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

ఆచూకీ కష్టమన్న కేంద్రం

ఆచూకీ కష్టమన్న కేంద్రం

ఏఎన్-32 విమానం ఆచూకీ కష్టమన్న కేంద్రం
‘ఎన్‌ఏడీ’ బాధిత కుటుంబాల్లో ఆందోళన
 
విశాఖపట్నం: సరిగ్గా 25 రోజుల క్రితం.. అంటే గత నెల 22న తమిళనాడులోని తాంబరం నుంచి పోర్టుబ్లెయిర్ వెళ్తూ ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమైంది. అందులో ఉన్న 29 మంది జాడ తెలియకుండా పోయింది. వీరిలో 8 మంది విశాఖ ఎన్‌ఏడీకి చెందిన సివిల్ ఉద్యోగులున్న సంగతి తెలిసిందే.. విమానం ఎయిర్ ట్రాఫిక్‌తో సంబంధాలు తెగిపోయిన ప్రాంతంలో (చెన్నైకి తూర్పున 151 నాటికల్ మైళ్ల దూరంలో) నాటి నుంచి నేటి వరకు ఆ విమానం కోసం సుదీర్ఘంగా గాలిస్తూనే ఉన్నారు.

ఇస్రో సాయం కూడా తీసుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఆ విమానం ఏమయిందో.. అందులో ఉన్న వారెమయ్యారో ఇసుమంతైనా తెలియరాలేదు. ఇప్పటిదాకా దాదాపు వెయ్యి గంటలకు పైగా జరిపిన  శోధనలో నీటిపై తేలియాడుతూ కనిపించిన 30 వస్తువులు, 24 ట్రాన్స్‌మిషన్ సిగ్నల్స్‌ను గుర్తించారు. అయినా అవేమీ అదృశ్యమైన ఏఎన్32 విమానానికి సంబంధించిన కావని నిర్ధారించారు.

దేశ చరిత్రలోనే అతి సుదీర్ఘ గాలింపుగా నిలిచిపోయిన ఈ ఘటనపై తాజాగా కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ రామ్‌రావు భామ్రే లోక్‌సభలో చేసిన ప్రకటన బాధిత కుటుంబాల్లో తీవ్ర అలజడిని రేపుతోంది. విమాన ప్రమాదంలో ఇన్ని రోజుల తర్వాత ఎవరూ సురక్షితంగా ఉండే అవకాశం లేదని మంత్రి ప్రకటించారు. దీంతో తమ వారి కోసం కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.

రోజూ ఎన్‌ఏడీకి చెందిన అధికారులు బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ వస్తున్నారు. మంగళవారం కూడా కొంతమంది ఉన్నతాధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి మనోస్థైరాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఒకపక్క తమ వారి జాడ తేలకపోవడం, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనల నేపథ్యంలో అదృశ్యమైన కుటుంబ సభ్యు ల పరిస్థితి అగమ్యగోచరంగా, అయోమయంగా తయారైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement