ఈటానగర్ : భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్–32 రకం విమాన ఆచూకీని ఎంఐ–17 విమానాలు కనుగొన్నాయి. విమాన శకలాలను అరుణాచల్‌ప్రదేశ్‌లోని లిపోకి 16 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. అయితే విమానంలో ఉన్న సిబ్బంది పరిస్థితి గురించి త్వరలో తెలియజేయనున్నట్లు ఓ ట్వీట్‌లో ఐఏఎఫ్ తెలిపింది. జూన్ 3న 13 మందితో బయలుదేరిన ఏఎన్32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాంలోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. గల్లంతైన ఏఎన్32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది.
పదేళ్ల క్రితమూ ఇలాగే..
అది 2009 సంవత్సరం జూన్ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్‌బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్–32 రకం విమానం కూలిపోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment