ఈటానగర్ : ఈనెల 3వ తేదీన గల్లంతైన వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా పయూమ్ పరిధిలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోయినట్లు వారం రోజుల క్రితమే గుర్తించినప్పటికి.. ఇన్ని రోజులు అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడానికి అధికారులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ఆరు మృత దేహాలను, మరో ఏడుగురి శరీర భాగాలను గుర్తించారు. విమానం కూలిపోయిన సంగతి తెలిసిన తర్వాత అక్కడకు వెళ్లడానికి వాతావరణం అనుకూలించలేదు. దాంతో సంఘటన స్థలానికి వెళ్లిన గరుడ్ కమాండోలకు అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మృతదేహాలను గుర్తించడం కోసం వారితోపాటు పోర్టర్లు, వేటగాళ్లు కూడా పర్వతం మీదకు నడుకుచుంటూ వెళ్లారు. ఎట్టకేలకు గురువారం నాటికి విమానం కూలిన ప్రదేశానికి చేరుకోగలిగారు. 12 వేల అడుగుల ఎత్తులో ఈ మృతదేహాలను గుర్తించారు.
జూన్ 3న మధ్యాహ్నం 12.25గంటలకు అస్సాంలోని జోర్హాట్ నుంచి బయలుదేరిన ఏఎన్-32 విమానం ఆచూకీ కొద్దిసేపటికే గల్లంతయ్యింది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉండగా, సియాంగ్ జిల్లా పయూమ్‌లో కూలిపోయింది. ప్రమాదం సంభవించినప్పుడు విమానంలో ఎనిమిది మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులతో సహా మొత్తం 13మంది ప్రయాణిస్తున్నారు. గత కొద్ది రోజులుగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్)తో పాటు, ఆర్మీ కూడా ఈ విమానం గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ సాయంతో విమానం ఆచూకీ కోసం వెతుకుతుండగా సియాంగ్ జిల్లాలో గుర్తించారు. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారని కొన్ని రోజుల క్రితం వైమానిక దళం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment