ఈటానగర్ : భారత వాయుసేనకు సంబంధించిన ఏఎన్ - 32 విమానం రెండు రోజుల క్రితం గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి కూడా విమానం ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో టంబిన్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విమానం గల్లంతుకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారు. ఏఎన్ - 32 విమానం గల్లైంతన రోజు మధ్యాహ్నం ఓ కొండ ప్రాంతంలో దట్టమైన పొగ రావడాన్ని గమనించినట్లు చెప్పారు. సియాంగ్ జిల్లా మోలో గ్రామానికి సమీపంలోని ఓ కొండ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగ రావడం తాము చూసినట్లు గ్రామస్థులు వెల్లడించారు. దాంతో అధికారులు ఆ గ్రామస్థులు చెప్పిన మార్గంలో అన్వేషించేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే గల్లంతైన విమానం ఆచూకీ కనిపెట్టడం కోసం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ వెస్ట్ సియాంగ్, లోయర్ సియాంగ్, షివోమి జిల్లా డిప్యూటి కమిషనర్ల అధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూడు టీమ్‌లు విమానం తప్పిన పోయిన మార్గంలోని కొండ ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నాయి.
13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైంది. అస్సాంలోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment