విమానం జాడలేదు.. నాన్న కాల్ రాలేదు!
న్యూఢిల్లీ: బంగళాఖాతం సముద్రంలో తప్పిపోయిన భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) ఏఎన్-32 యుద్ధం విమానం ఆచూకీ కోసం ముమ్మరంగా జరుగుతున్న గాలింపులు ఆదివారం నాటికి మూడోరోజుకు చేరుకున్నాయి. అయినా ఇప్పటివరకు ఈ విమానం జాడ లభించలేదు. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతైంది. ఈ విమానంలో నలుగురు అధికారులు సహా.. మొత్తం 29మంది సిబ్బంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో గల్లంతైన విమానంలోని తమ వారి భద్రతపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారు క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ‘విమానంలో ఉన్న మా నాన్న, ఇతర సిబ్బంది క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. విమానానికి ఏమైందోనన్న ఆందోళన మమ్మల్ని వేధిస్తోంది. అది ఎక్కడ ఉందన్న విషయమై ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం అందలేదు’ అని అశుతోష్ సింగ్ తెలిపారు.
అశుతోష్ తండ్రి, ఐఏఎఫ్ అధికారి భూపత్ సింగ్ తప్పిపోయిన ఏఎన్ 32 యుద్ధవిమానంలో ఉన్నారు. ‘పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లగానే కాల్ చేస్తానని మా నాన్న చెప్పారు. కానీ ఆయన నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఆయన సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఆయనను మేం ఎంతగానో మిస్సవుతున్నాం’ అని అశుతోష్ చెప్పారు. విమానం మూడురోజులవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందకపోవడం తమను వేదనకు గురిచేస్తున్నదని తప్పిపోయిన విమానంలో ఉన్న మరో ఐఏఎఫ్ అధికారి భార్య సంగీత మీడియాకు తెలిపారు.