చింతపల్లి (పాడేరు)/సాక్షి, అమరావతి/నర్సీపట్నం: సంతలో సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న గిరిజనులను మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వైర్లు తెగి మీద పడడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ చెరువూరుకు చెందిన 11 మంది గిరిజనులు ఆదివారం కోరుకొండ వారపు సంతకు నిత్యావసరాల సరుకులు కొనుగోలు కోసం వచ్చారు. సరుకులు తీసుకొని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. కాసేపట్లో గ్రామానికి చేరుకుంటామనగా ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిపై విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి.
దీంతో విద్యుదాఘాతానికి గురై వంజురబ గంగరాజు (37), లోత బొంజిబాబు (30) ఆటో డ్రైవర్ వంతల కృష్ణారావు (25), తడ్డపల్లికి చెందిన జనుగూరు ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఏడుగురిని లోతుగెడ్డ ఆస్పత్రికి తరలించగా అక్కడ వంజురబ చిట్టిబాబు (55) మరణించాడు. మిగతా గాయపడిన వారిలో మృతుడు ప్రసాద్ కుమారుడు వివేక్ (1), వంజురబ చిన్నబ్బాయి (45) వండలం రామ్మూర్తి (40), లోత వరలక్ష్మి (30) పాతున జానుబాబు (2), వెచ్చంగి దావీదు (2) ఉన్నారు. వారిని అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి సంఘటన వివరాలు తెలుసుకుని మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. పాడేరు సబ్‌కలెక్టర్ వెంకటేష్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.
మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో కలెక్టర్ హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. సత్వరమే వైద్య సేవలు అందేలా చూశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రమాదంలో విద్యుత్ షాక్‌తో కాలిపోయి తీవ్రంగా గాయపడిన చిన్నారులు దావీద్, వికాస్, జానుబాబులతో పాటు వి.చిన్నబ్బాయి వి.రామ్మూర్తి, ఎల్.వరలక్ష్మిలకు ఏరియా ఆస్పత్రిలో చికిత్సనందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు.
చనిపోయిన వారిలో ఇన్సూ్యరెన్స్ ఉన్న వారికి రూ. 5 లక్షలు బీమా వర్తిస్తుందని తెలిపారు. లేని వారికి ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన చిన్న పిల్లలు 40 నుంచి 50 శాతం వరకు కాలిపోయారన్నారు. పెద్దవారు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. ప్రా«థమిక వైద్యం అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
చెరువూరు ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘటనపై జిల్లా కలెక్టర్‌తో సీఎం మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment