power shok
-
Water Heater: విద్యుత్ షాక్‌తో నర్సు మృతి
ఖైరతాబాద్: గదిలో హీటర్ పెట్టుకునే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై యువతి మృతిచెందిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన కె.సౌమ్య (20) ఖైరతాబాద్‌లో నివాసం ఉంటూ వాసవీ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా సౌమ్య స్నేహితుడు ప్రశాంత్ ఆమెకు ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో రాత్రి 7.30గంటల ప్రాంతంలో గదికి వచ్చి తలుపు తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా గదిలో బాత్రూం పక్కనే సౌమ్య హీటర్ మీదపడి అచేతనంగా కని్పంచింది. వెంటనే హీటర్ స్విచ్ ఆఫ్ చేసి ఆమెను హాస్పిటల్‌కు తరలించగా డ్యూటీ డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. గదిలో హీటర్ స్విచ్ఆన్ చేసి బకెట్లో వేసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. శరీరంపై హీటర్ వల్ల కాలిన గాయాలు ఉన్నాయి. ఈ మేరకు మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుదా ఘాతానికి గురై మహిళ మృతి
అడ్డగుట్ట: స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లిన నవ వధువు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరి«ధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ షాహీద్ పాషా తెలిపిన మేరకు.. లాలాపేటలోని ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన మౌనిక(26)కు నాచారం లోని చిలుకనగర్ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. శనివారం మౌనిక తండ్రి తన కూతురు, అల్లుడిని ఆర్యనగర్‌లోని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆల్లుడు రమేష్ రాత్రి వరకు ఉండి భోజనం చేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం మౌనిక స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లి బోర్‌కు మోటర్ ఆన్ చేసింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురై పెద్ద కేకలు వేసి పడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు బాత్రూమ్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా వారికి కూడా షాక్ కొడుతుండడంతో వెంటనే మెయిన్ ఆఫ్ చేసి మౌనికను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బోర్ మోటర్‌కు సంబంధించిన వైర్లు తెగిపోయి ఉన్నాయని, సరిగా టేప్ కూడా వేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌కు గురై ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
నన్ను క్షమించురా బిడ్డా..
కాలం పగబట్టింది రా కన్నా... ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదురా బిడ్డ క్షమించు రా నాన్నా..! ఏ లోకంలో ఉన్నా.. ఈ అమ్మ ప్రాణం నీకోసమే.. మంచిర్యాల: మండలంలోని కోమటిచేనుకు చెందిన బెడ్డల మౌనిక (28) విద్యుత్‌షాక్‌తో బుధవారం మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వాటర్‌ట్యాంక్‌లో నీటిని పరిశీలించేందుకు ఇంటిపైకి ఎక్కింది. అయితే తెగిపోయిన విద్యుత్ వైరు ఇనుప రేకులకు తాకింది. వాటిని తాకిన మౌనికకు విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి జాడి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంటికొచ్చిన కొద్ది గంటల్లోనే.. మౌనిక తల్లి రెండేళ్ల కిందట మృతి చెందింది. ఇంట్లో పనులు చేసేందుకు మూడు రోజుల కిందట ముత్యంపల్లిలోని తల్లిగారి నివాసానికి మౌనిక వెళ్లింది. బుధవారం శ్రీరామ నవమి కావడంతో ఉదయాన్నే అత్తగారి ఇంట్లో మౌనికను తండ్రి దింపివేసి వెళ్లారు. కొద్దిగంటల్లోనే కుమార్తె మరణ వార్త రావడంతో తండ్రి రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఆమెకు భర్త రాజేశ్, కుమారుడు గౌతమ్ ఉన్నారు. -
పెళ్లయి ఏడాది గడవకముందే విషాదం..
వట్పల్లి(అందోల్): పెళ్లయి ఏడాదైనా గడవకముందే ఓ వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందింది. రోజూ అందరినీ పలకరిస్తూ, కలిసిమెలసి ఉండే ఆమెను అంతలోనే మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన అందోల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మాసానిపల్లికి చెందిన బంటు పవిత్ర (21) ఆదివారం ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచి, వాకిలి శుభ్రం చేసి వాటర్ హీటర్‌తో నీటిని వేడి చేసుకుంది. ఆ నీటితో స్నానం చేసి బట్టలు మార్చుకునే సమయంలో విద్యుత్ సరఫరా అవుతున్న హీటర్ తాకింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన ఆమె పెద్దగా కేక వేస్తూ కిందపడిపోయింది. పక్కనే మంచంపై నిద్రిస్తున్న భర్త నవీన్ లేచి భార్యను పట్టుకోబోయాడు. అతనికీ షాక్ తగిలినట్లు అనిపించడంతో వెంటనే హీటర్ ప్లగ్‌ను తొలగించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పవిత్రను ఆటోలో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు పరీక్షించి ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించాడు. దీంతో అక్కడే ఉన్న భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి వందలాదిగా బంధువులు పవిత్ర మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న మృతదేహాన్ని పట్టుకుని తల్లి సుశీల గుండెలు అవిసేలా రోదించింది. ముద్దులు పెడుతూ పవిత్రా.. నువ్వు ఇక లేవా బిడ్డా.. అంటూ ఏడ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారంతా కంటతడి పెట్టారు. తహసీల్దార్ కోసం 3గంటలు నిరీక్షణ పవిత్రను ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె చనిపోయినట్లు అరగంటలో డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలి భర్త నవీన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే స్థానికంగా తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో మృతురాలి బంధువులు 3గంటలు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు డీటీ చంద్రశేఖర్, తహసీల్దారు అంటోనీలు వచ్చి పంచనామా చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వంట మేస్త్రిని కాపాడబోయి అనంతలోకాలకు..
పెనమలూరు: విద్యుత్‌షాక్‌తో హోటల్ నిర్వాహకురాలు మృతి చెందిన ఘటన యనమలకుదురులో చోటుచేసుకుంది. తాడిగడప డొంక రోడ్డులో నాగిడి వెంకటేశ్వరరావు, నాగిడి దివ్యశ్రీ (35) దంపతులకు ఇద్దరు సంతానం. దివ్యశ్రీ తాడిగడప డొంక రోడ్డులో శ్రీనివాస టిఫిన్ హోటల్ నిర్వహిస్తున్నారు. భర్త రాడ్ బెండింగ్ పనులు చేస్తాడు. గురువారం రాత్రి హోటల్లో దివ్యశ్రీ కుమార్తె కావ్యశ్రీ కౌంటర్లో కూర్చున్న సమయంలో వర్షం పడింది. పక్కనే విద్యుత్ తీగలు ఉన్నాయి. ఆ కౌంటర్‌ను అవి తాకుతూ వెళ్లాయి. దీంతో దివ్యశ్రీకి స్వల్పంగా కరెంట్ షాక్ కొట్టింది. అక్కడే ఉన్న వంట మేసీ్త్ర నారాయణ కౌంటర్ జరిపే యత్నం చేయగా అతనికి కరెంట్ షాక్ కొట్టింది. హోటల్ యజమానురాలు దివ్యశ్రీ అది చూసి వంట మేస్త్రి నారాయణను కాపాడటానికి కౌంటర్‌ను లాగే యత్నం చేయగా ఆమెకు విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయింది. ప్రమాదస్థితిలో ఉన్న ఆమెను పటమటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచనలతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న దివ్యశ్రీ ఆస్పత్రిలో గురువారం రాత్రి మృతి చెందింది. ఘటనపై మృతురాలి భర్త వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పెనమలూరు ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
భార్యాపిల్లలను కాపాడి.. తాను మృత్యు ఒడికి
అనంతపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన భార్య, పిల్లలను కాపాడే ప్రయత్నంలో వైఎస్సార్సీపీ నేత ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. నార్పలకు చెందిన బాలనాగి బాలకృష్ణ (40)కు భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాడు. ఈ క్రమంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున భాగ్యలక్ష్మి పోటీ చేసి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందింది. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. విద్యుత్ తీగపై పడి మంగళవారం ఉదయం భార్య, పిల్లలను పిలుచుకుని పొలానికి బాలకృష్ణ వెళ్లారు. అక్కడ మొక్కజొన్న పంటకు బాలకృష్ణ పురుగు మందు పిచికారీ చేస్తుండగా పిల్లలను పిలుచుకుని గట్టు పక్కగా భాగ్యలక్ష్మి నడుచుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో చిన్న కుమారుడు అదుపు తప్పి పక్క రైతు పొలం వైపు గట్టును ఓ చేతితో తాకాడు. అప్పటికే అడవి పందుల బెడద నుంచి దానిమ్మ పంటను కాపాడుకునేందుకు పక్క పొలం రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగలడంతో చిన్న కుమారుడితో పాటు అతని చేతిని పట్టుకున్న పెద్ద కుమారుడు, భాగ్యలక్ష్మికి విద్యుత్ ప్రసారం జరిగి షాక్‌కు గురై, గట్టిగా కేకలు వేశారు. సమీపంలోనే ఉన్న బాలకృష్ణ ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే తన పంచెను తీసి చిన్న కుమారుడి మెడకేసి బలంగా లాగాడు. ఆ ధాటికి విద్యుత్ షాక్ నుంచి తల్లి, కుమారులు బయటపడ్డారు. అయితే కుమారుడిని లాగే ప్రయత్నంలో బాలకృష్ణ అదుపు తప్పి నేరుగా వెళ్లి విద్యుత్ తీగపై పడ్డాడు. కుటుంబసభ్యుల కేకలు విన్న చుట్టుపక్కల రైతులు వెంటనే విద్యుత్ సరఫరా ఆపి బాలకృష్ణను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పలువురి నివాళి బాలకృష్ణ మృతిచెందినట్లు తెలియగానే శింగనమల, అనంతపురం ఎమ్మెల్యేలు జొన్నలగడ్డ పద్మావతి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు నార్పల సత్యనారాయణరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. సర్వజనాస్పత్రికి ఎమ్మెల్యే పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి, సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రఘునాథ్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరావు తదితరులు చేరుకుని బాలకృష్ణ మృతదేహానికి నివాళులర్పించారు. నార్పలకు మృతదేహాన్ని తరలించిన అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడికి నివాళులర్పించారు. అలాగే సాయంత్రం ఎంపీ రంగయ్య సైతం నార్పలకు చేరుకుని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. -
సత్యసాయి జిల్లా: ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం
సాక్షి, సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 5 మంది మహిళా కూలీలు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడిపోయాయి. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న ఐదు మంది మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: ‘దృశ్యం’ సినిమాను తలపించిన ప్రీప్లాన్డ్ కిడ్నాప్ డ్రామా.. -
ఆకలితో వెళ్లి.. మృత్యువుతో తల్లడిల్లి.. ఈ పాపం ఎవరిదీ?
సాక్షి, కడప: ఆకలి మాటున మృత్యువు పొంచి ఉందని తెలియని ఆవులు తనువులు చాలించాయి. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై తల్లడిల్లుతూ ప్రాణాలు వదిలాయి. కడప వైవీ స్ట్రీట్ రెండో గాంధీ విగ్రహంవద్ద డీసీసీ బ్యాంకు బ్రాంచ్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తగిలి రెండు ఆవులు మృతి చెందాయి. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పాపం ఎవరిదీ? అని అక్కడ జరిగిన సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. విద్యుత్‌షాక్‌తో కాలిపోయిన మరో ఆవు నగరంలో ప్రధాన కూడలిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు కంచె లేదా రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వాపోయారు. ట్రాన్స్ఫార్మర్కు పక్కనే చెత్త డంపును ఏర్పాటు చేయడంతో ఆవులు ఆకలితో ఏదైనా తినేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో మృతిచెంది ఉంటాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్కు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చదవండి: నెట్టింట్లో హల్చల్ చేస్తోన్న అరుదైన జాతి దూడ -
వలస జీవుల విషాద గీతిక
సాక్షి, రాజవొమ్మంగి (తూర్పుగోదావరి) : ఉన్నచోట ఉపాధి లభించకపోవడంతో పనులను వెతుక్కుంటూ వలసపోక తప్పదు. అదే పరిస్థితి రాజవొమ్మంగి మండలం గింజర్తి గ్రామంలో నెలకొంది. ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామానికి చెందిన పదిమంది నిరుద్యోగ యువకులు కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్ పనులకోసం వలస వెళ్లారు. కోలారు జిల్లాలోని మలబాగుల తాలూకా విరూపాక్ష గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ కొండెం చిన్నబాబు (28), మిరియాల బాలరాజు (29) విద్యుదాఘాతానికి గురై మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గింజర్తి గ్రామానికి చెందిన కొడెం చిన్నబాబు (28), మిరియాల బాలరాజు (29), కించు సత్యనారాయణ, ఆవూరి రాజ్‌కుమార్ కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగుల తాలుకా, విరూపాక్ష గ్రామంలో విద్యుత్తులైన్ల పనికి వెళ్లారు. వీరిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ‘పావని కంట్రోల్స్ అండ్ ప్యానల్ లిమిటెడ్’ పనుల్లో పెట్టుకొంది. విరూపాక్ష గ్రామంలో ఆది వారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్తంభం ఎక్కి విద్యుత్లైన్ల ఏర్పాటులో నిమగ్నమై ఉన్న చిన్నబాబుకు షాక్ తగిలింది. అతను విలవిలలాడుతుండగా బాలరాజు స్తంభం ఎక్కి చిన్నబాబును కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే విద్యుత్తుషాక్ నుంచి బయటపడ్డ చిన్నబాబు కిందపడి అక్కడికక్కడే మరణించగా అతనిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన బాలరాజు విద్యుదాఘాతానికి గురై స్తంభానికి అతుక్కు పోయి అక్కడే మరణించాడు. వీరిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన మరో యువకుడు కించు సత్యనారాయణ విద్యుత్ షాక్‌తో కింద పడి గాయాల పాలయ్యాడు. అతని కుడికాలు విరిగిపోగా ప్రాణాలు దక్కాయి. పక్కనే గల మరో స్తంభంపై పనిచేస్తున్న ఆవూరి రాజ్‌కుమార్ తనకు కూడా ఎక్కడ షాక్ తగులుతుందో అని భయపడి అక్కడ నుంచి దూకేశాడు. దాంతో రాజ్‌కుమార్ కూడా గాయాలపాలయ్యాడు. ఈ సమాచారాన్ని ఆ కంపెనీ వర్గాలు మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం ఉదయానికి ఇక్కడకు వస్తాయని మృతుల కుటుంబసభ్యులు సోమవారం తెలిపారు. స్థానిక మాజీ సర్పంచ్ ఆవూరి శుభలక్ష్మి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శోక సంద్రంలో తల్లిదండ్రులు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న తమ పిల్లలు మరో రాష్ట్రానికి వెళ్లి విగతజీవులుగా తిరిగివస్తున్నారని తెలిసి ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. వారిని ఊరడించడం ఎవరి వల్ల కాకపోయింది. ఈ ఏడాది మే నెల 13వ తేదీన పనులకు వెళ్లిన వీరు మరో వారంరోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నారనగా ఇలా జరగడంతో చిన్నబాబు, బాలరాజుల తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. చిన్నబాబు తండ్రి నాలుగు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న చిన్నబాబు తల్లిదండ్రులకు భారంకాలేక ఉన్న ఊరు, కన్నతల్లిని వీడి కర్ణాటకకు పనుల కోసం వలస వెళ్లాడు. అక్కడ రోజుకు రూ.400 సంపాదిస్తూ తను తినగా మిగిలినదానిని తల్లిదండ్రులకు పంపించేవాడు. చిన్నబాబు గతంలో మిలటరీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకొన్నాడు. అన్నిట విజయం సాధించినప్పటికీ మెడికల్ చెకప్‌లో నెగ్గుకురాలేకపోయాడు. దాంతో ఆ ఉద్యోగం వరించలేదు. పోలీసు కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకొన్న చిన్నబాబు శారీరక దారుఢ్యపరీక్షల్లో నెగ్గుకు వచ్చినప్పటికీ రాత పరీక్షలో పాస్ కాలేకపోయాడు. పోలీసు కావాలనే కోరిక ఉన్నప్పటికీ అర్థిక పరిస్థితులు కలసిరాక, తన కొడుకు కోచింగ్‌కు కూడా వెళ్లలేకపోయాడని తండ్రి వెంకటేశ్వర్లు ‘సాక్షి’ వద్ద వాపోయాడు. ఇలా ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించిన తన ఒక్కగానొక్క కుమారుడు సుదూర ప్రాంతానికి పనులకు వెళ్లి అర్ధాంతరంగా మరణించడం ఏనాడో నేను చేసుకొన్న పాపమంటూ అతను బోరున విలపించాడు. కొడుకు రేపో మాపో వస్తాడని ఎదురు చూస్తున్న చిన్నబాబు కన్నతల్లి లీలావతి ఈ మరణ వార్త విని కుప్పకూలింది. తమకు దిక్కెవరని కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తున్న లీలావతిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ సంఘటనలో మరణించిన ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు మిరియాల బాలరాజు తల్లిదండ్రులు వరకుమారి, వెంకటేశ్వర్లులది నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని వీరికి ఎదిగివచ్చిన కొడుకు ఆసరాగా నిలిచాడు. పని కోసం వలస వెళ్లిన బాలరాజు ఇంటిఖర్చులకు సొమ్ములు పంపిస్తూ ఆదుకుంటున్నాడని వారు సంబరపడుతున్నారు. ఆ సమయంలో విగత జీవిగా మారాడనే సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందా అని కంటిమీద కునుకులేకుండా మృతుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
సాక్షి, సదాశివనగర్(నిజామాబాద్) : మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కరెంట్ షాక్ రూపంలో యువకుడు అకాల మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం మండలంలోని మర్కల్ మల్లన్న గుట్ట వద్ద గల మిషన్ భగీరథ పంప్ హౌస్‌లో చోటు చేసుకుంది. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ గ్రామానికి చెందిన బొప్పారం నర్సింలు(36) అనే యువకుడు ఆరు నెలలుగా పంప్‌హౌస్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో దానికి సమీపంలో ఉన్న పవర్ హౌస్‌లో భారీ శబ్ధం వినిపించడంతో అక్కడికి వెళ్లి పవర్‌ను సరిదిద్దుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోసానిపేట్‌వాసులు పెద్ద ఎత్తున మల్లన్నగుట్టకు తరలివచ్చారు. మృతుడికి భార్య రజిత ఉంది. కుటుంబీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తరలివచ్చిన ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంతోనే నర్సింలు మృతి చెందాడని పోసానిపేట్‌వాసులు భారీగా వచ్చి ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని శవంతో పంప్‌హౌస్ వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు. ఈ మేరకు పవర్‌హౌస్ నుంచి రూ.4లక్షలు, మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.5లక్షలు అందిస్తామని, మృతుడి భార్య రజితకు మిషన్ భగీరథలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. ఘటనా స్థలాన్ని పోసానిపేట్ సర్పంచ్ గీరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్ రావు సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తన్న, సీఐ రామాంజనేయులు, ఎస్ఐ, పోలీసులు పాల్గొన్నారు. ప్రాణం ఖరీదు రూ.9లక్షలు..! అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై చనిపోతే ఆ మనిషి శవాన్ని రూ.9లక్షలు ఖరీదు చేశారు. మని షి విలువ ఇంతేనా అని పలువురు అనుకోవడం చర్చనీయాంశంగా మారింది. మనిషి చనిపోతే బాధిత కుటుంబానికి చెల్లించే పరిహారం ఎందుకు పని చేయదని వారు పేర్కొంటున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకో వాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో
చింతపల్లి (పాడేరు)/సాక్షి, అమరావతి/నర్సీపట్నం: సంతలో సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న గిరిజనులను మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వైర్లు తెగి మీద పడడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ చెరువూరుకు చెందిన 11 మంది గిరిజనులు ఆదివారం కోరుకొండ వారపు సంతకు నిత్యావసరాల సరుకులు కొనుగోలు కోసం వచ్చారు. సరుకులు తీసుకొని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. కాసేపట్లో గ్రామానికి చేరుకుంటామనగా ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిపై విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై వంజురబ గంగరాజు (37), లోత బొంజిబాబు (30) ఆటో డ్రైవర్ వంతల కృష్ణారావు (25), తడ్డపల్లికి చెందిన జనుగూరు ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఏడుగురిని లోతుగెడ్డ ఆస్పత్రికి తరలించగా అక్కడ వంజురబ చిట్టిబాబు (55) మరణించాడు. మిగతా గాయపడిన వారిలో మృతుడు ప్రసాద్ కుమారుడు వివేక్ (1), వంజురబ చిన్నబ్బాయి (45) వండలం రామ్మూర్తి (40), లోత వరలక్ష్మి (30) పాతున జానుబాబు (2), వెచ్చంగి దావీదు (2) ఉన్నారు. వారిని అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి సంఘటన వివరాలు తెలుసుకుని మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. పాడేరు సబ్‌కలెక్టర్ వెంకటేష్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో కలెక్టర్ హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. సత్వరమే వైద్య సేవలు అందేలా చూశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రమాదంలో విద్యుత్ షాక్‌తో కాలిపోయి తీవ్రంగా గాయపడిన చిన్నారులు దావీద్, వికాస్, జానుబాబులతో పాటు వి.చిన్నబ్బాయి వి.రామ్మూర్తి, ఎల్.వరలక్ష్మిలకు ఏరియా ఆస్పత్రిలో చికిత్సనందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. చనిపోయిన వారిలో ఇన్సూ్యరెన్స్ ఉన్న వారికి రూ. 5 లక్షలు బీమా వర్తిస్తుందని తెలిపారు. లేని వారికి ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన చిన్న పిల్లలు 40 నుంచి 50 శాతం వరకు కాలిపోయారన్నారు. పెద్దవారు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. ప్రా«థమిక వైద్యం అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చెరువూరు ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘటనపై జిల్లా కలెక్టర్‌తో సీఎం మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సూచించారు. -
పంట పొలాల్లో మృత్యుహేల
వేమనపల్లి(బెల్లంపల్లి): విద్యుత్ తీగలు యమపాశాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఖరీదు మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. విద్యుత్ స్తంభాలు వేస్తుండగా పై నున్న హైటెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ సరఫరా కావడంతో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వేమనపల్లి మండలంలోని ముల్కలపేట గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామానికి చెందిన గొండె చిన్నరామన్న(60), చిన్న సురేందర్(22), వశాఖ భీంరావ్(25) బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ముల్కలపేట శివారులో ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ లైన్ కోసం చిన్నగొడె రామన్న, రామగిరి పున్నం, సూసర్ల రమేశ్, జంబోజి వెంకటస్వామి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తలా ఎకరం, అర ఎకరం పొలాలున్నాయి. ఒక్కో రైతు మామూళ్ల కింద సుమారు రూ.25వేలు చొప్పున అధికారులకు చెల్లించారు. వీరికి గతేడాది విద్యుత్ లైన్ మంజూరయింది. ఆరు నెలల క్రితం మండల ఏఈ ట్రాన్స్ఫార్మర్ అందజేశారు. రైతులే సబ్‌స్టేషన్‌కు వెళ్లి తెచ్చుకున్నారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌కో కాంట్రాక్టర్ విద్యుత్ లైన్ అమర్చాలి. కనెక్షన్ ఇవ్వడంలో కాలయాపన.. రైతులు ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కాంట్రాక్టర్ వచ్చి విద్యుత్‌లైన్ అమర్చాలంటే ఆలస్యం అవుతుందని ఏఈ మాట దాటవేస్తూ వచ్చాడు. దీంతో రైతులే లైన్ నిర్మాణానికి ముందుకు వచ్చారు. ఏఈ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నీల్వాయికి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ వర్కర్ శంకర్ లైన్ అమర్చేందుకు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తానే కూలీలను తీసుకొచ్చి లైన్, ట్రాన్స్ఫార్మర్ అమర్చుతానని 15 రోజులుగా తిప్పుకుంటున్నాడు. కాని కూలీలను తీసుకురాకుండా రైతులతోనే స్తంభాల కోసం గోతులు తవ్విం చాడు. రైతులతోనే ట్రాన్స్ఫార్మర్కు ప్లాట్‌ఫారమ్(గద్దె) కట్టించాడు. తాళ్ల సహాయంతో ఆదివారం ఆరు స్తంభాలను గోతుల్లోకి దించి నిలబెట్టారు. ఎల్సీ తీసుకోకుండానే స్తంభాలను లైన్‌గా సరిచేస్తున్నారు. పైన ఉన్న లెవన్కేవీ(మేన్లైన్)కు విద్యుత్ లైన్‌కు సరఫరా ఉండడంతో స్తంభంలో ఉన్న చువ్వలకు విద్యుత్ సరఫరా అయింది. దీంతో స్తంభం చేతితో పట్టుకుని సరి చేస్తున్న చిన్నగొండె రామన్న, అతని సోదరుడు పోచన్న కొడుకు సురేందర్, వెంట వచ్చిన కూలీ వశాఖ భీంరావ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తాడు సహాయంతో అదే స్తంభాన్ని పట్టుకున్న తేర్కరి లచ్చన్న, రామగిరి పున్నం, జంబోజి వెంకటస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు రైతులు బోర్కుటి పరవేశి, కొండ్ర రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రాత్రి దాకా ఆందోళన.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బంధువులు మృతదేహాలతో రాత్రి వరకూ పొలాల్లోనే ఆందోళనకు దిగారు. మృతుల కుటంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్‌రూరల్ సీఐ జగదీష్, నీల్వాయి, చెన్నూర్, కోటపల్లి ఎస్సైలు భీమేష్, ప్రమోద్, వెంకన్న ఆందోళనకారుల వద్దకు వెళ్లి సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. రాత్రి జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి, బెల్లంపల్లి ట్రాన్స్‌కో డీఈ ఘటనా స్థలానికి వెళ్లి నచ్చజెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం, రైతుబీమా, ఆపద్బంధు సాయం, డబుల్ బెడ్రూం ఇండ్లు అందేలా సహకరిస్తామన్నారు. కాంట్రాక్టర్, సంబధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యంతోనే... బెల్లంపల్లి: ఆరు నెలల క్రితం విద్యుత్ లైన్ వేసి ఉంటే ఆ ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసేవి కావు. ముమ్మాటికీ విద్యుత్ అధికారులు, విద్యుత్ కాం ట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యం వల్లే మూడు నిండు ప్రాణా లు బలయ్యాయి. వాస్తవంగా విద్యుత్ లైన్‌ను కాంట్రాక్టర్‌తో ఏర్పాటు చేయించాల్సి ఉంది. కాని తీవ్ర కాలయాపన చేయడంతో రైతులే ముం దుకొచ్చి లైన్ వేసుకునే పనులకు సిద్ధపడ్డారు. లైన్ ఏర్పాటు చేయడంలో రైతులు, కూలీలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అనూహ్యంగా ప్రమాదం జరిగి మృతుల కుటుం బాల్లో తీవ్ర వేదన మిగిల్చింది. సదరు రైతులకు వ్యవసాయ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం కోసం కాంట్రాక్టర్ కేదారినాథ్‌తో విద్యుత్ అధికారులు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కాని కాంట్రాక్టర్ సకా లంలో విద్యుత్ లైన్ పనులు చేపట్టకుండా జాప్యం చేసినట్లు ఆరోపణలు న్నాయి. ఆ ప్రాంతంలో ఆరునెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అదే క్రమంలో రైతులకు విద్యుత్ లైన్ వేయడానికి కరెంట్ మెటీరియల్‌ను కూడా కొన్ని నెలల క్రితమే కాంట్రాక్టర్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. కాని మృతి చెందిన రైతులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఆరునెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినప్పుడే విద్యుత్‌లైన్ వేసి, కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇప్పడు ఆ ప్రమాదం జరిగి ముగ్గురు మృతిచెంది, మరో ఐదుగురు గాయపడే వారు కాదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అంటున్నారు. అక్కల పెళ్లి ఎప్పుడు చేస్తవ్ తమ్మి.. ‘అక్కల పెళ్లి చేయందే తాను పెళ్లి చేసుకోనంటివి. అందరినీ అనాథలను చేసి అందని లోకాలకు పోతివా.. తమ్మీ’ అంటూ విద్యుత్ శాఖలో దినసరి కూలీగా పనిచేస్తూ మృత్యువాత పడిన వశాఖ భీంరావ్ నలుగురు అక్కలు మృతదేహంపై పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన ప్రమాద స్థలంలో పలువురి గుండెలను పిండేసింది. నీల్వాయికి చెందిన భీంరావ్ పదేళ్లుగా విద్యుత్ శాఖలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. తండ్రి బిక్కుమేర చిన్ననాటనే చనిపోయాడు. తల్లి మల్లక్క వృద్ధురాలు. ఇద్దరు సోదరులు పెద్ద అన్న వెంకటేశ్ మానసిక వికలాంగుడు. చిన్న అన్న మధునయ్య వేరే కాపురం ఉంటున్నాడు. నలుగురు అక్కలు శంకరక్క, సత్తక్క, లక్ష్మి, రమకు వివాహం కాలేదు. వీరందరూ భీంరావ్ చేసే కూలీ పని పైనే ఆధారం. -
విద్యుద్ఘాతంతో విద్యార్థి మృతి
కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అడవి పందుల నుంచి రక్షణ కోసం పొలానికి వేసిన విద్యుత్ కంచె తగిలి ఓ విద్యార్థి బలైపోయాడు. ఈ ఘటన జిల్లాలోని కుల్కచర్ల మండలంలోని కుర్సపల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రాజు (16) అనే విద్యార్ధి పొలాల సమీపంలోంచి వెళుతుండగా చేనుకు వేసిన కంచె తగిలింది. దీంతో రాజు విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు స్తానిక పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నాడు.