అనంతపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన భార్య, పిల్లలను కాపాడే ప్రయత్నంలో వైఎస్సార్‌సీపీ నేత ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. నార్పలకు చెందిన బాలనాగి బాలకృష్ణ (40)కు భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాడు. ఈ క్రమంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున భాగ్యలక్ష్మి పోటీ చేసి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందింది. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు.
విద్యుత్ తీగపై పడి
మంగళవారం ఉదయం భార్య, పిల్లలను పిలుచుకుని పొలానికి బాలకృష్ణ వెళ్లారు. అక్కడ మొక్కజొన్న పంటకు బాలకృష్ణ పురుగు మందు పిచికారీ చేస్తుండగా పిల్లలను పిలుచుకుని గట్టు పక్కగా భాగ్యలక్ష్మి నడుచుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో చిన్న కుమారుడు అదుపు తప్పి పక్క రైతు పొలం వైపు గట్టును ఓ చేతితో తాకాడు. అప్పటికే అడవి పందుల బెడద నుంచి దానిమ్మ పంటను కాపాడుకునేందుకు పక్క పొలం రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగలడంతో చిన్న కుమారుడితో పాటు అతని చేతిని పట్టుకున్న పెద్ద కుమారుడు, భాగ్యలక్ష్మికి విద్యుత్ ప్రసారం జరిగి షాక్‌కు గురై, గట్టిగా కేకలు వేశారు. సమీపంలోనే ఉన్న బాలకృష్ణ ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే తన పంచెను తీసి చిన్న కుమారుడి మెడకేసి బలంగా లాగాడు.
ఆ ధాటికి విద్యుత్ షాక్ నుంచి తల్లి, కుమారులు బయటపడ్డారు. అయితే కుమారుడిని లాగే ప్రయత్నంలో బాలకృష్ణ అదుపు తప్పి నేరుగా వెళ్లి విద్యుత్ తీగపై పడ్డాడు. కుటుంబసభ్యుల కేకలు విన్న చుట్టుపక్కల రైతులు వెంటనే విద్యుత్ సరఫరా ఆపి బాలకృష్ణను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పలువురి నివాళి
బాలకృష్ణ మృతిచెందినట్లు తెలియగానే శింగనమల, అనంతపురం ఎమ్మెల్యేలు జొన్నలగడ్డ పద్మావతి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు నార్పల సత్యనారాయణరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. సర్వజనాస్పత్రికి ఎమ్మెల్యే పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి, సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ రఘునాథ్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరావు తదితరులు చేరుకుని బాలకృష్ణ మృతదేహానికి నివాళులర్పించారు. నార్పలకు మృతదేహాన్ని తరలించిన అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడికి నివాళులర్పించారు. అలాగే సాయంత్రం ఎంపీ రంగయ్య సైతం నార్పలకు చేరుకుని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment