వలస జీవుల విషాద గీతిక | Two People Died With Power Circuit In East Godavari | Sakshi
Sakshi News home page

వలస జీవుల విషాద గీతిక

Published Tue, Jul 30 2019 10:15 AM | Last Updated on Tue, Jul 30 2019 10:15 AM

Two People Died With Power Circuit In East Godavari - Sakshi

చిన్నబాబు తల్లిదండ్రులు లీలావతి, వెంకటేశ్వర్లు, కుటుంబసభ్యులు

సాక్షి, రాజవొమ్మంగి (తూర్పుగోదావరి) : ఉన్నచోట ఉపాధి లభించకపోవడంతో పనులను వెతుక్కుంటూ వలసపోక తప్పదు. అదే పరిస్థితి రాజవొమ్మంగి మండలం గింజర్తి గ్రామంలో నెలకొంది. ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామానికి చెందిన పదిమంది నిరుద్యోగ యువకులు కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్‌ పనులకోసం వలస వెళ్లారు.   కోలారు జిల్లాలోని మలబాగుల తాలూకా విరూపాక్ష గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుత్‌   కొండెం చిన్నబాబు (28), మిరియాల బాలరాజు (29)  విద్యుదాఘాతానికి గురై మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..  గింజర్తి గ్రామానికి చెందిన కొడెం చిన్నబాబు (28), మిరియాల బాలరాజు (29), కించు సత్యనారాయణ, ఆవూరి రాజ్‌కుమార్‌ కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా ములబాగుల తాలుకా, విరూపాక్ష గ్రామంలో విద్యుత్తులైన్ల పనికి వెళ్లారు. వీరిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ‘పావని కంట్రోల్స్‌ అండ్‌ ప్యానల్‌ లిమిటెడ్‌’ పనుల్లో పెట్టుకొంది.

విరూపాక్ష  గ్రామంలో ఆది వారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్తంభం ఎక్కి విద్యుత్‌లైన్ల ఏర్పాటులో నిమగ్నమై ఉన్న చిన్నబాబుకు షాక్‌ తగిలింది. అతను విలవిలలాడుతుండగా బాలరాజు స్తంభం ఎక్కి చిన్నబాబును కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే విద్యుత్తుషాక్‌ నుంచి బయటపడ్డ చిన్నబాబు కిందపడి అక్కడికక్కడే మరణించగా అతనిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన బాలరాజు విద్యుదాఘాతానికి గురై  స్తంభానికి అతుక్కు పోయి అక్కడే మరణించాడు. వీరిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన మరో యువకుడు కించు సత్యనారాయణ విద్యుత్‌ షాక్‌తో కింద పడి గాయాల పాలయ్యాడు. అతని కుడికాలు విరిగిపోగా ప్రాణాలు దక్కాయి. పక్కనే గల మరో స్తంభంపై పనిచేస్తున్న ఆవూరి రాజ్‌కుమార్‌ తనకు కూడా ఎక్కడ షాక్‌ తగులుతుందో అని భయపడి అక్కడ నుంచి దూకేశాడు. దాంతో రాజ్‌కుమార్‌ కూడా గాయాలపాలయ్యాడు. ఈ సమాచారాన్ని ఆ కంపెనీ వర్గాలు మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం ఉదయానికి ఇక్కడకు వస్తాయని  మృతుల కుటుంబసభ్యులు సోమవారం తెలిపారు. స్థానిక మాజీ సర్పంచ్‌ ఆవూరి శుభలక్ష్మి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 

శోక సంద్రంలో తల్లిదండ్రులు
కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న తమ పిల్లలు మరో రాష్ట్రానికి వెళ్లి విగతజీవులుగా తిరిగివస్తున్నారని తెలిసి ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. వారిని ఊరడించడం ఎవరి వల్ల కాకపోయింది.  ఈ ఏడాది మే నెల 13వ తేదీన పనులకు వెళ్లిన వీరు మరో వారంరోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నారనగా ఇలా జరగడంతో చిన్నబాబు, బాలరాజుల తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. చిన్నబాబు తండ్రి నాలుగు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న చిన్నబాబు తల్లిదండ్రులకు భారంకాలేక ఉన్న ఊరు, కన్నతల్లిని వీడి కర్ణాటకకు  పనుల కోసం వలస వెళ్లాడు. అక్కడ రోజుకు రూ.400 సంపాదిస్తూ తను తినగా మిగిలినదానిని తల్లిదండ్రులకు పంపించేవాడు. చిన్నబాబు గతంలో మిలటరీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకొన్నాడు. అన్నిట విజయం సాధించినప్పటికీ మెడికల్‌ చెకప్‌లో నెగ్గుకురాలేకపోయాడు. దాంతో ఆ ఉద్యోగం వరించలేదు. పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకొన్న చిన్నబాబు శారీరక దారుఢ్యపరీక్షల్లో నెగ్గుకు వచ్చినప్పటికీ రాత పరీక్షలో పాస్‌ కాలేకపోయాడు.

పోలీసు కావాలనే కోరిక ఉన్నప్పటికీ అర్థిక పరిస్థితులు కలసిరాక, తన కొడుకు కోచింగ్‌కు కూడా వెళ్లలేకపోయాడని తండ్రి వెంకటేశ్వర్లు ‘సాక్షి’ వద్ద వాపోయాడు. ఇలా ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించిన తన ఒక్కగానొక్క కుమారుడు సుదూర ప్రాంతానికి పనులకు వెళ్లి  అర్ధాంతరంగా మరణించడం ఏనాడో నేను చేసుకొన్న పాపమంటూ అతను బోరున విలపించాడు. కొడుకు రేపో మాపో వస్తాడని ఎదురు చూస్తున్న చిన్నబాబు కన్నతల్లి లీలావతి ఈ మరణ వార్త విని కుప్పకూలింది. తమకు దిక్కెవరని కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తున్న లీలావతిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ సంఘటనలో మరణించిన ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు మిరియాల బాలరాజు తల్లిదండ్రులు వరకుమారి, వెంకటేశ్వర్లులది నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని వీరికి ఎదిగివచ్చిన కొడుకు ఆసరాగా నిలిచాడు. పని కోసం వలస వెళ్లిన బాలరాజు ఇంటిఖర్చులకు సొమ్ములు పంపిస్తూ ఆదుకుంటున్నాడని వారు సంబరపడుతున్నారు. ఆ సమయంలో విగత జీవిగా మారాడనే సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందా అని కంటిమీద కునుకులేకుండా మృతుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement