వాషింగ్టన్: అమెరికా స్కూళ్లలో కాల్పుల ఘటనలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా టెక్సస్ రాష్ట్రం శాంటాఫే నగరంలోని శాంటాఫే హైస్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 9మంది విద్యార్థులు, ఒక టీచర్ చనిపోయారు. శుక్రవారం ఉదయం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయుధాలు ధరించిన ఓ విద్యార్థి ఆర్ట్స్ తరగతి గదిలోకి ప్రవేశించి యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10మంది చనిపోయారని, ఒక పోలీసు అధికారి సహా 12 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసిన పోలీసులు న్రధాన నిందితుడితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి రైఫిల్, పిస్టల్, షాట్‌గన్, పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. శాంటా ఫే హైస్కూలులో సుమారు 1,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో స్కూళ్లలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఇది మూడోది కాగా ఈ ఏడాది జరిగిన 22వ కాల్పుల ఘటన అని పోలీసులు తెలిపారు. తాజా ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment