high school
-
విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!
పత్రిక నిర్వహణ ఆషామాషీ కాదు. చేయితిరిగిన రచయితలు, పాత్రికేయులు సైతం పత్రికను స్వయంగా నిర్వహించాలంటే, వెనుకాడుతారు. అలాంటిది కొందరు హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో మాసపత్రికను తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ముప్పయిమూడు సంచికలను వారు విజయవంతంగా ప్రచురించారు. ఇటీవల ప్రచురించిన ముప్పయిమూడో సంచికను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు.లెక్కల మాస్టారి చొరవతో ప్రారంభంవిద్యార్థులు నడుపుతున్న ఈ మాసపత్రిక పేరు ‘మంగళ విద్యావాణి’. మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు, గణిత అవధాని అరుణ్శివప్రసాద్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో 2018లో ఈ పత్రికను ప్రారంభించారు. సొంత ఖర్చులతో తొలి సంచికను ప్రచురించారు. తొలి నాలుగు నెలలు 8 పేజీలు, ఆ తరువాత 12 పేజీలు, ప్రస్తుతం 16 పేజీలతో మాసపత్రిక నడుస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో 20, 24, 28 పేజీలతో కూడా సంచికను వెలువరించారు. మాసపత్రిక నిర్వహణలో ముఖ్యపాత్ర అరుణ్శివప్రసాద్దే. పత్రిక రూపకల్పన, ఆవిష్కరణ, దాతలను సంప్రదించడం వంటి కార్యక్రమాలను ఆయనే చూసుకుంటున్నారు. పత్రికను 16 పేజీలతో తేవడానికి రూ.4 వేలు ఖర్చవుతోంది. మాసపత్రిక ప్రచురణ ఖర్చులను దాతల నుంచి స్వీకరిస్తుంటారు. ప్రతి నెలా 250 ప్రతులను ముద్రిస్తున్నారు. ఈ పత్రికను పాఠశాలలో రెండువందల మందికి ఉచితంగా అందిస్తున్నారు. మిగిలిన ప్రతులను పరిసర ప్రాంతాలలోని ఉన్నత పాఠశాలలకు అందిస్తున్నారు. సొంత ముద్రణాలయం లేనందున ఇతరుల చేత డీటీపీ చేయించి, జిరాక్స్ చేసి పంపిణీ చేస్తున్నారు. కవర్‌పేజీ కన్నా సెంటర్ పేజీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సెంటర్ పేజీల్లో విద్యార్థులు గీసిన చిత్రాలు, పాఠశాల కార్యక్రమాల ఫొటోలను ప్రచురిస్తున్నారు.ఉపాధ్యాయుల సహకారంపత్రిక ప్రచురణలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అన్నివిధాలా సహకరిస్తున్నారు. పత్రికలో ప్రచురించే రచనలకు తగిన అంశాలపై సూచనలు చేయడమే కాకుండా, వాటిలో అక్షరదోషాల సవరణ బాధ్యతలను ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకుని, పూర్తిగా విద్యార్థులే ఈ పత్రికకు రచనలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు, మంత్రులు, వారి శాఖలు, శాస్త్రవేత్తల చరిత్రలు, క్రీడలపై కథనాలు, కవితలు వంటి రచనలతో పత్రికను ముచ్చటగా తీసుకొస్తున్నారు. విద్యార్థుల చిత్రలేఖనానికి ప్రత్యేకంగా పేజీని కేటాయించి, ప్రోత్సహిస్తున్నారు. చివరి పేజీలో పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల ఫొటోలను, వారి వివరాలను ప్రచురిస్తున్నారు.పఠనాసక్తిని పెంపొందించడానికే!: అరుణ్శివప్రసాద్ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికను ప్రారంభించాం. విద్యార్థుల్లో రచనాసక్తిని పెంపొందించడం, వారిలోని కళానైపుణ్యాన్ని వెలికి తీయడం, పోటీ తత్త్వాన్ని పెంపొందించడం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు విద్యార్థులు భవిష్యత్తులో ఎదుర్కొనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు దోహదపడేలా పత్రికను తీసుకొస్తున్నాం. సహకారం అందిస్తున్న దాతలుమంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వారా నడుపుతున్న ‘మంగళ విద్యావాణి’ పత్రిక మొదటి సంచికను వ్యవస్థాపకుడు అరుణ్శివప్రసాద్ సొంత ఖర్చులతో ప్రారంభించారు. తరువాత సహోపాధ్యాయులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, వివిధ పాఠశాలల యాజమాన్యంతో పాటు ఇతర దాతలు పత్రిక ముద్రణకు సహకరిస్తున్నారు. అమెరికాలో ఉన్న అరుణ్శివప్రసాద్ స్నేహితుడు పార్థసారధి సహకారంతో 18వ మాసపత్రికను 50 వేలతో గణిత సూత్రాలతో ప్రత్యేక సంచికగా విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిని ఉచితంగా పంపిణీ చేశారు.మేధావుల ప్రశంసలువిద్యార్థులే రచయితలుగా వ్యవహరిస్తూ మాసపత్రికను నడుపుతున్న మంగళపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే ప్రప్రథమమని పలువురు మేధావులు కొనియాడుతున్నారు. పాఠశాలలో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లె శ్రీనివాసులు, మాసపత్రికను ఆవిష్కరించేందుకు విచ్చేసిన విఠపు బాలసుబ్రమణ్యం ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా 25వ సంచికను ఆనాటి కలెక్టర్ సగిలి షన్మోహన్, 27వ సంచికను ప్రస్తుత ఎమ్మెల్యే మురళిమోహన్, ప్రముఖ శతావధాని ఆముదాల మురళి ‘మంగళ విద్యావాణి’ సంచికలను ఆవిష్కరించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. గత ఏడాది ‘హిందీ దివస్’ సందర్భంగా మాసపత్రికను పూర్తిగా హిందీలోనే ప్రచురించడాన్ని అభినందించారు. గత డిసెంబర్లో 28 పేజీలతో భారత గణిత శాస్త్రవేత్తల చరిత్రను గురించి ప్రత్యేక సంచిక వెలువరించడం ప్రశంసనీయమని కొనియాడారు. బాబన్నగారి శివశంకర్, బంగారుపాళెం(చదవండి: వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..) -
8వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య
-
సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్‌కి నాట్స్ విరాళం
భాషే రమ్యం.. సేవే గమ్య అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన సేవా భావాన్ని మరోసారి చాటింది. ఫిలడెల్ఫియాలో నాట్స్ విభాగం స్థానిక సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్‌కి ఆరు వేల డాలర్లను విరాళంగా అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఈ చెక్కును సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్ ప్రిన్సిపల్ జాసన్ హెచ్ బుచర్‌కు అందించారు. నాట్స్ అందించిన విరాళం ద్వారా సెంట్రల్ బక్స్ సౌత్‌లో కార్యకలాపాలను మరింత ముమ్మరంగా చేయనుంది. నాట్స్ పూర్వ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, నాట్స్ బోర్డు సభ్యుడు వెంకట్, నాట్స్ జాతీయ కార్యక్రమాల సమన్వయకర్త రమణ రకోతు, నాట్స్ యూత్ సభ్యురాలు అమృత శాఖమూరి ఈ విరాళాన్ని అందించిన వారిలో ఉన్నారు. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం చేసిన దాతృత్వం సమాజంలో సేవా స్ఫూర్తిని నింపుతుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. నాట్స్ ఫిలడెల్ఫియా సభ్యులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు.(చదవండి: 13 ఏళ్లకే రెండు శతకాలు రాసిన సంకీర్త్) -
ఆ హైస్కూల్లో ఒంటిగంటకే ఫైనల్ బెల్
రాజంపేట: మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు.. ఆ హైస్కూల్లో ఫైనల్ బెల్ కొట్టేస్తారు. వేసవి సహా కాలం ఏదైనా.. సోమ, మంగళ, బుధ ఏ రోజైనా ఆ స్కూల్‌కు రోజూ ఒంటిపూట బడే. అన్నమయ్య జిల్లా నందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఒంటిపూటే నడిచే ఏకైక హైస్కూల్‌గా రికార్డులకెక్కింది. 1908లో నందలూరులో బోర్డు హైస్కూల్ ఏర్పాటైంది. 1954లో జిల్లా పరిషత్ హైస్కూల్.. ఆ తర్వాత 1962లో జిల్లా హయ్యర్ సెకండరీ హైస్కూల్‌గా ఆవిర్భవించింది.ఒకప్పుడు విశాలమైన గదులు, లైబ్రరీ, ల్యాబ్, క్రీడా పరికరాలతో పాటు నాణ్యమైన బోధన, ఉత్తమ ఉపాధ్యాయులతో క్రమశిక్షణకు మారుపేరుగా హైస్కూల్ ఖ్యాతిగాంచింది. ఎందరో ఐఏఎస్‌లను అందించి చరిత్రలో నిలిచింది. ఇక్కడి హైస్కూల్లో తరగతులు ఉదయం 7.45కు ప్రారంభిస్తారు. మధ్నాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. జూనియర్ కళాశాల రాకతో హైస్కూల్ విద్యకు గ్రహణంనందలూరు బస్టాండు నుంచి సౌమ్యనాథ ఆలయానికి వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ఈ హైస్కూల్ ఉంది. భవనాల కొరతతో 1982లో నందలూరులోని జూనియర్ కళాశాలను ఇక్కడికి మార్చారు. సొంతభవనాల నిర్మాణం వరకు అని చెప్పిన ఇంటర్ బోర్డు నేటి వరకు ఇక్కడే కళాశాలను కొనసాగిస్తోంది. ఇక్కడి నుంచి కళాశాలను తరలించాలని జెడ్పీ హైస్కూల్ యాజమాన్యం మొత్తుకున్నా.. కలెక్టర్లు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. 274 మంది విద్యార్థులున్న ఈ హైస్కూల్లో మధ్యాహ్నం వరకు తరగతులు సాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇంటర్ విద్యను కొనసాగిస్తున్నారువ్యతిరేకిస్తున్న అధ్యాపకులుఏదో ఒక పూట వస్తున్నాం..పాఠాలు చెప్పిపోతున్నాం.. అక్కడికి తరలిస్తే రెండు పూటలా కాలేజీకి రావాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో. ఇంటర్ కళాశాలను తరలింపును కొందరు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. మండల కాంప్లెక్స్ సమీపంలోని ఎస్సీ హాస్టల్ భవనాలు దూరమని.. అక్కడికి వెళితే ఇంటర్ బాలికలకు రక్షణ ఉండదని ప్రచారం చేశారు. నిజానికి మండల కాంప్లెక్స్ ఆవరణ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడే వందలాదిమంది బాలికలతో బీసీ గురుకుల పాఠశాల కూడా ఉంది.కేవలం తమ స్వార్థం కోసం అధ్యాపకులు చేసిన వ్యవహారం వల్ల తరలింపు ఆగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, డీఈవో, ఇంటర్ ఆర్జెడీ ఒకతాటిపైకి వచ్చి హైస్కూల్‌కు ఒంటిపూట బడి నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా...ఐఏఎస్‌లను.. గొప్ప రాజకీయ నాయకులను దేశానికి అందించిన స్కూల్‌గా ఈ ఇది ఖ్యాతి గడించింది. -
బడి వేళల పెంపునకు కసరత్తు
సాక్షి, అమరావతి/కదిరి: ఉన్నత పాఠశాలల పనివేళల్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్న వీటిని 5 గంటల వరకు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే పనివేళలను గత ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మార్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజుకు 7 పీరియడ్స్ ఉండేవి. ఇకమీదట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు 8 పిరియడ్ల్లో హైస్కూల్ నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు చేయాలని, ఆ జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలను ఎంపిక చేయాలని ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపిక చేసిన పాఠశాలల జాబితాను ఈ నెల 20లోగా తెలియజేయాలని ఆదేశించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహిస్తారు. ఇది సక్సెస్ అయిందని ప్రభుత్వం భావిస్తే వెంటనే ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. కాగా, పాఠశాలల పనివేళల పెంపు తలకు మించిన భారంగా మారుతుందని..విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం (అపస్) అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని మార్చాలన్న నిర్ణయం సరైంది కాదని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమయాలు పిల్లల సైకాలజీకి అనుగుణంగా ఉన్నాయని, మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతిపాదిత టైం టేబుల్ ఇలా..» ఉదయం 9కి మొదటి గంట, 9.05కు రెండోగంట, 9.05 నుంచి 9.25 వరకు ప్రార్థన. » 9.25–10.15 వరకు మొదటి పీరియడ్, 10.15–11 వరకు రెండో పిరియడ్. » 11–11.15 వరకు విరామం. » 11.15 నుంచి మధ్యాహ్నం 12 వరకు మూడో పిరియడ్, 12–12.45 వరకు నాలుగో పీరియడ్...12.45–1.45 వరకు భోజన విరామం. » 1.45–2.30 వరకు ఐదో పీరియడ్, 2.30–3.15 వరకు ఆరో పీరియడ్. 3.15–3.30 వరకు చిన్న విరామం. » 3.30–4.15 వరకు ఏడో పీరియడ్, 4.15–5 గంటల వరకు 8వ పీరియడ్. -
అమెరికా స్కూల్లో కాల్పుల మోత
విండర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్ పట్టణంలో అపలాచీ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. అయితే 30 మంది గాయపడినట్లు తొలుత వార్తలొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు స్కూల్లో కాల్పులు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్‌బాల్ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెల్సి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరిపింది 14 ఏళ్ల టీనేజర్ అని మీడియాలో వార్తలొచ్చాయి. అతను ఆ స్కూల్ విద్యార్థేనా అనేది తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ‘‘ తుపాకీ శబ్దాలు వినిపించినపుడు రసాయనశాస్త్ర తరగతి గదిలో ఉన్నా. ఒక టీచర్ పరుగున వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. గడియ పెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎవరో వచ్చి తలుపు తెరవండని గట్టిగా పలుమార్లు అరిచారు. మేం తీయలేదు. తర్వాత కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. మేం తర్వాత దగ్గర్లోని ఫుట్‌బాల్ మైదానంలోకి పరుగులు తీశాం’ అని ప్రత్యక్ష సాక్షి, 17 ఏళ్ల విద్యార్థి సెర్గియో కాల్డెరా చెప్పారు. విషయం తెల్సి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. ఘటనపై దేశాధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘అమెరికా విద్యార్థులు చదవడం, రాయడం అనే వాటితోపాటు దాక్కోవడం, తమను తాము కాపాడుకోవడం అనేవి నేర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అమెరికాలో కాల్పులు మామూలే అనే ధోరణిని ఆమోదించబోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
పాఠశాల నుంచే దాడి?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్‌నగర్ డాబాకొట్ల సెంటర్లో వివేకానంద సెంటినరీ హైస్కూల్ నుంచే ఎయిర్‌గన్‌తో దాడికి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాడి సమయంలో ఈ పాఠశాల వెనుక వైపున రోడ్డులోనే సీఎం జగన్ యాత్ర సాగుతోంది. సీఎం జగన్ ఉన్న బస్సుకు, పాఠశాల కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. పాఠశాల ఉన్న రామకృష్ణ సమితికి చెందిన ఈ జీ+2 భవనం మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వాచ్మెన్ భద్రత లేదు. దీంతో గేటు దూకి ఎవరైనా సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడి నుంచే దాడికి పాల్పడి, సులభంగా తప్పించుకొని పోయే అవకాశం ఉంది. ఈ పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఆఫీసు ఉండటం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 59వ డివిజన్‌కు చెందిన ఓ టీడీపీ నాయకుడి అనుచరుల్లో బ్లేడ్ బ్యాచ్, ఎయిర్గన్లు, క్యాటర్‌బాల్, ఇతర మారణాయుధాలు వాడేవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో సీఎం జగన్ రోడ్‌షోను చిత్రీకరించిన స్థానికుల నుంచి వీడియోలు సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. -
కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు
వాషింగ్టన్: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలోని ఆక్స్ఫర్డ్ హైసూ్కల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. -
తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!
చదవాలన్న కోరిక ఉంటే వయసు పెద్ద సమస్య కాదని ప్రూవ్ చేసింది ఈ బామ్మ. వివిధ అనారోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకునే వయసులో పట్టుదలతో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి శభాష్ అనిపించుకుంది. తల్లిదండ్రులు అన్ని సదుపాయాలు సమకూర్చి చదువుకోమన్న చదవని యువతకు ఆదర్శం ఈ బామ్మ. ఈ వయసులో చదువుకోవడానికి కారణం?. ఇంతటి వృధాప్య వయసులో ఏజ్ రీత్యా వచ్చే సమస్యలను అధిగమించి మరీ మాస్టర్ డిగ్రీని ఎలా పూర్తి చేసింది అంటే.. యూఎస్‌కి చెందిన ఈ బామ్మ మిన్నీ పేన్. ఆమె తల్లిదండ్రులు చదువుకోని వస్త్ర కార్మికులు. ఆమె హైస్కూల్ చదువును మాత్రేమ పూర్తి చేసింది. ఆమె దక్షిణ కెరొలిన టెక్స్టైల్ మిల్లు వాతావరణంలోనే పెరిగింది. సరిగ్గా 1950లో తన హైస్కూల్ విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థలో క్లర్క్‌గా పనిచేసింది. అంతకుముందు ఓ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. 1961లో డేల్‌ని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇంట్లో కొన్నాళ్లు తల్లిగా పిల్లల ఆలనాపాలన చూసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యాయురాలిగా కెరియర్ ప్రారంభించింది. ఆ బామ్మ ట్రాన్స్క్రిపషినిస్ట్ వర్డ్ ప్రాసెసర్‌గా 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ కొనసాగించి 68 ఏళ్ల వయసులో విరమణ తీసుకుంది. ఆ తర్వాత టెక్సాస్ ఉమెన్స్ యూనివర్సిటీలో చేరాలనుకుంది. తాను చదవుకోలేకపోయిన కాలేజ్ చదువుని పొందాలనుకుంది. ఇక అండర్ గ్రాడ్యుయేట్లో భాగంగా జర్నలిజం, బిజినెస్ కోర్సులను తీసుకుంది. 73 ఏళ్ల వచ్చేటప్పటికీ అండర్ గ్రాడ్యుయేషన్‌ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఆ బామ్మ ఇంటర్ డిసిప్లీనరీ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి, అత్యంత వృద్ధ వయసులో పీజీ చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అంతేగాదు తన మనవడితో కలసి స్టేజ్‌పైకి వెళ్లి డిగ్రీని అందుకోవడం విశేషం. తన తోటి గ్రాడ్యుయేట్లు ఆమెను చూసి స్ఫూర్తి పొందడమేగాక ఎంతగానో అభిమానించేవారు. చదువుకునే వయసులో ఉన్నత చదువులు చదివే అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ తన కోరికను నెరవేర్చుకుంది. చాలామంది నేను అలా చేయాలనుకున్నాను, ఇది చేద్దామనుకున్నా.. అని కబుర్లు చెబుతూ నిటూర్పులు విడుస్తారు. సంయమనం, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు ఏదో రకంగా అవకాశాన్ని దొరకబుచ్చుకుని మరీ తమ కలను సాకారం చేసుకుంటారనడానికీ ఈ బామ్మే ఉదాహరణ. (చదవండి: ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?) -
3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ«ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. -
సార్... దిస్ అబ్బాయి బీట్ మీ... బట్ ఐయామ్ నాట్ తిరిగి బీట్!
అస్సాంలోని పచిమ్ నగామ్ గ్రామంలోని ‘న్యూ లైఫ్ హైస్కూల్’లో పిల్లలు ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. క్లాస్ టీచర్ వారిని పిలిపించి ‘టెల్ మీ, వాట్ హ్యాపెన్డ్?’ అని అడిగారు. ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని ఒకరు చెప్పాలనుకున్నారు. ‘ఇతడు నా తలపై పంచ్ ఇచ్చాడు’ అని మరొకరు చెప్పాలనుకున్నారు. అట్టి విషయాన్ని పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో చెప్పలేక సైన్ లాంగ్వేజ్‌ను కూడా అప్పు తెచ్చుకొని కాస్తో కూస్తో ఇంగ్లిష్‌లో ఆ పిల్లలు చెబుతున్న మాటలు నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తాయి. -
బడిలో ‘బైలింగ్యువల్’ భళా!
గుంటూరు చౌత్ర సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 545 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే 40 మంది పెరిగారు. ప్రవేశాలు ఇంకా నమోదవుతున్నాయి. గతంలో ఇక్కడ ఉర్దూ మీడియం మాత్రమే ఉండగా ఇప్పుడు ఇంగ్లిష్‌లోనూ బోధిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు ఇంగ్లి ష్–ఉర్దూలో ఉండడంతో ఆంగ్ల భాషను సులభంగా ఆకళింపు చేసుకుంటున్నారు. నగరంలోని రెండు ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఇటీవల ప్రభుత్వం సమకూర్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ద్వారా మరింత మెరుగ్గా బోధన కొనసాగుతోంది. గుంటూరు నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి:సంస్కరణలు చేపట్టి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలుగేతర మాతృభాష విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను రూపొందించింది. రెండో అధికార భాషకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ 5,286 ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 62,777 మంది విద్యార్థులకు బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను సమకూర్చింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని స్కూళ్లలో చదివే విద్యార్థుల సౌలభ్యం కోసం కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో బైలింగ్యువల్ పుస్తకాలను ముద్రించి అందిస్తోంది. నాలుగు మైనర్ భాషల్లో 85,469 మంది బడికెళ్లే వయసున్న ప్రతి చిన్నారి చదువుకోవాలన్న సంకల్పంతో తెలుగేతర మాతృభాషల విద్యార్థులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తమిళం మాతృభాషగా ఉన్న 1,316 మంది విద్యార్థుల కోసం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. ఒడియా మాధ్యమంలో 8,599 మంది, కన్నడలో 10,485 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరు నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వీరి కోసం కూడా ప్రభుత్వం బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ, కన్నడ, ఒడియా, తమిళం భాషల్లో 85,469 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. దేశంలో మైనర్ భాషల్లో బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర విద్యాశాఖ ప్రశంసలు అందుకుంది. కచ్చితంగా మెరుగైన ఫలితాలు.. గతంలో సైన్స్ పాఠం ఎన్నో ఉదాహరణలతో చెప్పినా చాలామందికి అంతుబట్టేది కాదు. విద్యార్థులు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకునేవారు. ఇప్పుడు ఐఎఫ్‌పీ స్క్రీన్లు వచ్చాక ప్రతి అంశాన్ని విపులంగా ఆడియో, వీడియో రూపంలో చెప్పగలుగుతున్నాం. విద్యార్థులు బాగా అర్థం చేసుకుంటున్నారు. కచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో మరుగుదొడ్లు లేక బాలికలు చదువులకు దూరమైన సందర్భాలున్నాయి. ఇప్పుడు అన్ని వసతులు ఉండడంతో గౌరవంగా చదువుకుంటున్నారు. – డి.యల్లమందరావు (ఫిజిక్స్ ఉపాధ్యాయుడు), ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు వేగంగా అద్భుతమైన మార్పులు.. గతంలో ఉర్దూ మీడియం విద్యార్థులు అదే భాషలో రాసేవారు. ఇప్పుడు బైలింగ్యువల్ పుస్తకాలు ఉర్దూ–ఇంగ్లిష్‌లో ఉండడంతో బోధన, అర్థం చేసుకోవడంలో చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో ప్రతి అంశాన్ని చక్కగా గ్రహించి ఇంగ్లిష్‌లోనే నోట్స్ రాస్తున్నారు. తక్కువ సమయంలోనే అద్భుతమైన మార్పు వచ్చింది. – అబ్దుల్ కయ్యూమ్, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు ఇప్పుడెంతో బాగుంది.. మా ఇంట్లో మాకంటే ముందు చదువుతున్న వారు పుస్తకాలు కొనేందుకు చాలా ఇబ్బంది పడేవారు. మాకు అలాంటి పరిస్థితి లేదు. బ్యాగు నుంచి పుస్తకాలు, యూనిఫారం వరకు అన్నీ ప్రభుత్వమే ఇస్తోంది. మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నారు. వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉన్నాయి. బడిలో దేనికీ లోటు లేదు. కొత్తగా ఐఎఫ్‌పీ స్క్రీన్లతో పాఠాలు చెప్పడం ఎంతో బాగుంది. – మహ్మద్ తనాజ్, పదో తరగతి విద్యార్థిని, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు -
నెల్లూరులోని కేఎన్ఆర్ స్కూల్ లో అడ్మిషన్స్ ఫుల్
-
ఉన్నత విద్యకు లిప్
కొండాపూర్(సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం హైస్కూల్ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యం తగ్గింది. ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు సైతం వెల్లడించాయి. ఈ క్రమంలోనే ప్రాథమిక స్థాయిలో తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే తరహాలో ఉన్నత పాఠశాలలో కూడా కనీస అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుండి లిప్ (లర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం) అమలుకు కసరత్తు చేస్తున్నారు. ● కరోనా కారణంగా 2020–21 సంవత్సరం నుంచి విద్యార్థులు రెండేళ్లు పాఠశాలలకు వెళ్లలేదు. దీంతో డిజిటల్ తరగతులు నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ● తెలుగు, హిందీ, ఆంగ్లం చదవడం, రాయడం రాని వారు కూడా 9వ తరగతిలోనూ ఉన్నారని, అదే విధంగా చిన్నచిన్న కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాలు రానివారు కూడా ఉన్నారని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ● ఇలాంటి విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఈ లిప్ కార్యక్రమం ఉపయోగపడనుంది. ● గత సంవత్సరం విద్యాశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే ఇదే తరహాలో తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రస్తుతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ● విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యార్థుల ను చదివించడం, రాయించడం, పాఠాలు వినేలా చేయడం, సాధనల్లో పిల్లల భాగస్వామం, ప్రతి స్పందనలు, స్లిప్ టెస్ట్‌లు వంటి వాటిని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 192 ప్రాథమికోన్నత పాఠశాలలు, 240 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు 11 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 92 వేల మంది ఉన్నారు. విద్యార్థులకు ఉపయోగకరం కరోనా నేపథ్యంలో విద్యార్థులు రెండు సంవత్సరాలుగా డిజిటల్ తరగతులకే పరిమితమమాయ్యరు. దీంతో చాలా మంది విద్యార్థులకు చదవడం, రాయడం కూడా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం ద్వారా రాయడం, చదవడం వంటి వాటిని నేర్పించారు. ఈ తరహాలోనే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు లిప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. -
చిన్నప్పటి బడికి రాష్ట్రపతి
భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నప్పుడు తాను చదువుకున్న పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కందగిరిలోని తపోబన హైస్కూల్‌ను ఆమె శుక్రవారం సందర్శించారు. ‘‘నా చదువు సొంతూరు ఉపార్బెడాలో మొదలైంది. గడ్డితో కప్పిన గుడిసెలో చదువుకున్నా. చుట్టూ పేడ, చెత్తను ఊడ్చి మేమే శుభ్రం చేసేవాళ్లం.’’ అన్నారు. అనంతరం 8 నుంచి 11వ తరగతి వరకు తాను చదువుకున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. చదువుకునే రోజుల్లో తానున్న కుంతల కుమారీ ఆదివాసీ హాస్టల్‌ను సందర్శించారు. 13 మంది చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. -
‘కృష్ణంరాజు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే వింతగా చూసేవారు!’
కరప(కాకినాడ జిల్లా): యండమూరులోని చిన్నమ్మ, చిన్నాన్నల ఇంటి వద్ద ఉండి సినీనటుడు కృష్ణంరాజు పాఠశాల విద్యనభ్యసించారు. 9, 10వ తరగతి వరకూ పెద్దాపురప్పాడు హైస్కూల్లో చదువుకున్నట్టు ప్రజలు చెబుతున్నారు. కృష్ణంరాజు మరణవార్త వినగానే యండమూరులో విషాదచాయలు అలముకొన్నాయి. కృష్ణంరాజుతో కొద్దిగా పరిచయమున్న, పెద్దలు అంబడి వీర్రాజు, షేక్ మౌలానా, వాసంశెట్టి అప్పారావు, మీసాల చక్రం, షేక్ దరియా తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి కృష్ణంరాజు మొగల్తూరులో చదువుకునేటప్పుడు అల్లరిగా తిరుగుతున్నాడని తల్లిదండ్రులు యండమూరులో ఉంటున్న చిన్నాన్న, చిన్నమ్మలైన శ్రీకాకర్లపూడి వెంకటేశ్వరరాజు, సుభద్రాదేవి(అమ్మాజీ)ల ఇంటికి పంపించారు. యండమూరులో హైస్కూల్ లేకపోవడంతో పెద్దాపురప్పాడు హైస్కూలో చేర్పించారు. 10వ తరగతిలో ఉండగా సైకిల్‌పై వెళ్లేవారని, అప్పట్లో ఎవరూ సైకిల్‌పై వెళ్లక కృష్ణంరాజు తొక్కుకుంటూ వెళుతుంటే వింతగా చూసేవారని కొందరు తెలిపారు. ఒకసారి కబడ్డీ ఆడుతుండగా భాషా అనే కుర్రాడు కృష్ణంరాజును వీపుపై కొడితే గాయమైందని, చిన్నాన్న వెంకటేశ్వరరాజు కోప్పడడంతో అప్పటి నుంచి ఆటలాడటం మానేసినట్టు వాసంశెట్టి అప్పారావు తెలిపారు. కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన తర్వాత గ్రామానికి తీసుకొచ్చి, సత్కరించినట్టు యండమూరు వాసులు తెలిపారు. తర్వాత యండమూరులోని చిన్నాన్న, చిన్నమ్మల ఇల్లు విక్రయించగా, కృష్ణంరాజు వారి కుటుంబానికి సహాయం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. -
‘సర్దుబాటు’తో అపరిమిత ప్రయోజనాలు
మార్పు నిరంతర ప్రక్రియ. పాత వాటి స్థానంలో అంత కన్నా మెరుగైన కొత్త విధానాలు, వ్యవస్థలు రావడం అనివార్యం, అభిలషణీయం కూడా. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా మన రాష్ట్రంలో పాఠశాలల సర్దుబాటుకు చూపుతున్న చొరవను ఇందులో భాగంగానే చూడాలి. అర్థం చేసుకోకుండా ఒక విధానాన్ని వ్యతిరేకించడం సరైన చర్య కాదని విద్యార్థుల తల్లిదండ్రులు, విమర్శకులూ గ్రహించాలి. కొంతమంది ‘మా పాఠశాలను తరలించవద్దు’ అంటూ ధర్నాలకు దిగడం మనం చూస్తున్నాం. ప్రభుత్వం పాఠశాలలను తరలిస్తున్నామని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. మరి ఈ ఆందోళనకారులను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? మన రాష్ట్రంలో చాలా గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారు ఒకటి నుండి 5వ తరగతి వరకు రోజుకు 9 నుండి 18 సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుందనే విషయం తల్లిదండ్రులకు చాలామందికి తెలియదు. బోధనేతర పనులైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు, టాయిలెట్ మెయింటెనెన్స్, పాఠశాల ఆవరణ శుభ్రత వంటి పనులను కూడా వీరు రోజూ పర్యవేక్షించాలి. ఈ పరిస్థితుల్లో పిల్లలకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం సాధ్యంకాదు. ఒక సబ్జెక్టును దానిలో నిష్ణాతుడైన ఒక టీచర్ బోధించినప్పుడే పిల్లలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్న నూతన విధానం. ఇది తెలియక పాఠశాలల ముందు ధర్నా చేస్తున్నారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మన రాష్ట్రంలో విద్యా విధానంలో మరిన్ని మార్పులు వస్తాయి. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్, హై స్కూల్, హై స్కూల్ ప్లస్‌లు విద్యా విధానంలో ప్రవేశిస్తాయి. ఈ విధానంలో ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లు... హైస్కూల్ ప్లస్‌లుగా మారిపోతాయి. ఈ ప్లస్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. అంటే మూడవ తరగతి నుంచీ ఇంటర్మీడియట్ వరకూ మన ప్రభుత్వ పాఠశాలలు ఒకే చోట విద్యను బోధిస్తాయన్నమాట. ఎన్ఈపీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న అప్పర్ ప్రైమరీ లేదా హైస్కూల్లో చేర్చుతారు. దీనర్థం ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేస్తారని కాదు. ప్రైవేటు పాఠశాలల్లో ఉండే ఎల్కేజీ, యూకేజీల్లాగానే గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీ పైమరీ–1(పీపీ–1), ప్రీ పైమరీ–2 (పీపీ–2) క్లాసులు ఏర్పాటు చేస్తారు. అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ తరగతులు కూడా ఉంటాయి. ఈ పాఠశాలల్లో రెండవ తరగతి వరకూ చదువుకున్న తర్వాత పిల్లలను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న హైస్కూల్లో చేర్చుకుంటారు. ఇందువల్ల పిల్లలకు అపరిమిత ప్రయోజనాలు చేకూరుతాయి. మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూళ్ళలో సర్దుబాటు చేయడం ద్వారా పిల్లలకు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉంటారు. కాబట్టి, అక్కడ హైస్టాండర్డ్తో సబ్జెక్టు బోధించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదివించడానికి ఏడెనిమిది మైళ్ల దూరంలో ఉన్న స్కూళ్లకు పంపించడంలో లేని ఇబ్బందులను మూడు కిలోమీటర్ల లోపలే... అన్ని హంగులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి బాధపడటం సరికాదేమో తల్లిదండ్రులు ఆలోచించాలి. పాఠశాలల సర్దుబాటు విషయంలో టీచర్లు కూడా అపోహాలను తొలగించుకోవాలి. వారి ఉద్యోగాలకు వచ్చే ముప్పు ఏమీ ఉండదు. కాంప్లెక్స్ లెవల్లో ఉపాధ్యాయులకు సర్దుబాటు, ఎన్ఈపీపై ప్రత్యక్ష తరగతులు అవసరం. - వి. వి. రమణ సామాజిక విశ్లేషకులు -
AP: జెడ్పీ హైస్కూల్లో మాల్ ప్రాక్టీస్.. స్పందించిన విద్యాశాఖ
సాక్షి, కృష్ణా జిల్లా: పసుమర్రు జెడ్పీ హైస్కూల్లో మాల్ ప్రాక్టీస్‌పై విద్యా శాఖ స్పందించింది. ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్తున్నాయని టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ వచ్చిందని డిఈవో తాహిరా సుల్తానా తెలిపారు. ఐదుగురు టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు గుర్తించామన్నారు. టీచర్ల ఫోన్లు పోలీసులకు అప్పగించామన్నారు. ఆరుగురు టీచర్లను సస్పెండ్ చేసినట్లు డిఈవో వెల్లడించారు. చదవండి: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి.. -
ప్రశ్నపత్రం..పచ్చ కుట్ర
అనంతపురం విద్య/ సిటీ/ కదిరి: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి అందరి మన్ననలు పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అంటూ పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లాలో పదో తరగతి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో షేర్ చేసిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇదంతా కుట్ర అని పోలీసులు సాక్ష్యాధారాలతో సహా తేల్చారు. ప్రశ్నపత్రం ఫొటో తీసి తన సన్నిహితుడికి పంపించిన నల్లచెరువు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కె.విజయకుమార్‌ను అరెస్టు చేసి..రిమాండ్‌కు పంపించారు. ఈయన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట ప్రసాద్ ప్రధాన అనుచరుడు. దీన్నిబట్టి చూస్తే పచ్చ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా ఫొటో తీసిన విజయ్‌కుమార్ 2006లో రివాల్వర్ కేసులో అనంతపురం వన్‌టౌన్ పోలీసులు టీడీపీ నేత కందికుంట ప్రసాద్‌తో పాటు విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసులో వీరు నెల రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. అప్పుడు సస్పెండ్ అయిన విజయ్‌కుమార్ రెండేళ్ల తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం నల్లచెరువు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎంగా ఉండగా.. పదోతరగతి పరీక్షల నేపథ్యంలో గాండ్లపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌గా అధికారులు నియమించారు. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్ ప్రశ్నపత్రం ఫొటో తీసి.. తనకు బాగా సన్నిహితుడైన నల్లచెరువు ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ద్వారా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయించారు. శ్రీనివాసరావు బంధువుల అమ్మాయి పదో తరగతి పరీక్ష రాస్తుండగా.. ఆమెకు సహకరించే కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరావు మొబైల్‌ను పరీక్ష కేంద్రంలోకి పంపించారు. స్వయంగా విజయ్‌కుమారే ప్రశ్నపత్రం ఫొటో తీసి పంపించారు. ఇదే అదనుగా భావించిన శ్రీనివాసరావు పరీక్ష ప్రారంభమైన తర్వాత దాన్ని ఓడీచెరువు వైఎస్సార్సీపీ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. ఆ విషయాన్ని వారే మీడియాకు చేరవేసి... వైఎస్సార్సీపీ నాయకులే ఇదంతా చేశారనే విధంగా దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్రలో భాగంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష ప్రారంభమయ్యాక ప్రశ్నపత్రం ప్రత్యక్షం తొలిసారిగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా జరుగుతున్నాయి. ప్రశ్న పత్రాలను ఇప్పటికే పరీక్ష కేంద్రానికి దగ్గర్లో ఉన్న పోలీస్స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష సమయానికి గంట ముందు అంటే ఉదయం 8:30 గంటలకు ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కలిసి ప్రశ్నపత్రాలను స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి విత్‌డ్రా చేసుకుంటారు. 9 గంటలకు పరీక్ష కేంద్రానికి తీసుకెళతారు. అక్కడ ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షంలో ఉదయం 9:15 గంటలకు సీల్ తీస్తారు. 9:25 గంటలకు గదుల్లోకి పంపుతారు. 9:30 గంటలకు విద్యార్థుల చేతికి అందిస్తారు. అయితే విజయ్‌కుమార్ ప్రశ్నపత్రం ఫొటో తీయగా..దాన్ని శ్రీనివాసరావు పరీక్ష ప్రారంభమయ్యాక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఆ తర్వాత ప్రశ్నపత్రం లీక్ అంటూ దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా వెళ్లినా... విద్యార్థులందరూ పరీక్ష కేంద్రంలోనే ఉంటారు కాబట్టి వారికి ముందే తెలిసే అవకాశం ఉండదు. కేవలం రాజకీయ కుట్రకోణంలో భాగంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేసినట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. హెచ్ఎం, జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ పదో తరగతి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి పంపిన వ్యవహారంలో హెచ్ఎం కె.విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ వెంకట కృష్ణా రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాసరావు అలియాస్ అమడగూరు స్వామిని సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్ సీఈఓ భాస్కర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. మరోవైపు ఈ ఘటనలో సూత్రధారులతో పాటు పాత్రధారులపైనా పోలీసు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరికీ కదిరి టీడీపీ నాయకులతో సత్సంబంధాలు ఉండడంతో వారి పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తొలి నుంచీ వివాదాస్పదమే ఆంగ్ల ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన ఉదంతంలో సస్పెండైన నల్లచెరువు మండల పరిషత్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాసరావు అలియాస్ అమడగూరు స్వామి వ్యవహారం తొలి నుంచీ వివాదాస్పదమే. అమడగూరు ఉన్నత పాఠశాలలో పని చేస్తూ జూనియర్ అసిస్టెంట్‌గా ఇటీవలే పదోన్నతి పొందిన శ్రీనివాసరావును నల్లచెరువు మండల పరిషత్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయితే అక్కడ చేరడం ఇష్టం లేని అతను తన పలుకుబడి ఉపయోగించి మళ్లీ అమడగూరు హైస్కూల్‌కు డిప్యుటేషన్ వేయించుకున్నాడు. అతని వ్యవహారం నచ్చని అక్కడి హెడ్మాస్టర్... శ్రీనివాసరావును జాయిన్ చేసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో విధిలేక తిరిగి నల్లచెరువు మండల పరిషత్ కార్యాలయంలో చేరిపోయాడు. ఈ క్రమంలో కదిరి ప్రాంతంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల వారితో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. వారు విద్యాశాఖ కార్యాలయాల్లో తమ పనుల కోసం స్వామిని ఆశ్రయించేవారు. కమీషన్లు తీసుకొని కావాల్సిన పనులను స్వామి చక్కబెట్టేవాడని తెలుస్తోంది. విద్యా శాఖతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పని చేసే అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లకు పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లు వేయిస్తానంటూ భారీగా వసూలు చేసేవాడని జెడ్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆంగ్ల ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో పంపిన శ్రీనివాసరావు.. శుక్రవారం విధులకు గైర్హాజరైనట్లు జెడ్పీ అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఎంపీడీఓను అడగ్గా.. సెలవు చీటి పెట్టకపోగా, కనీసం అనుమతి కూడా తీసుకోకుండానే గైర్హాజరైనట్లు సమాధానం చెప్పారు. శ్రీనివాసరావు వ్యవహారాలపై లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉంది. (చదవండి: మృత్యువులోనూ వీడని బంధం) -
పాఠశాలలో పిస్తోల్ కలకలం.. తరగతి గదులను మాస్టారు ఆధీనంలోనే ఉంచుకుని..
భువనేశ్వర్: సంబల్పూర్ జిల్లా, జొమొనొకిరా సమితి, రెంగుముండా ప్రాథమికోన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో నాటు పిస్తోలు లభించడం చర్చనీయాంశమైంది. సోమవారం ఉదయం తరగతి గది శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్యకర్తలకు అక్కడి పిస్తోలు కనిపించింది. వీరు ఈ విషయం ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీకాంత్ బాగ్ దృష్టికి తీసుకువెళ్లారు. నిన్నమొన్నటి వరకు ఈ పిస్తోలు లభించిన తరగతి గది సహాయ ఉపాధ్యాయుడు గోవిందు భొయి ఆధీనంలో ఉండేది. ఇక్కడి నుంచి బదిలీ అయ్యేంత వరకు పాఠశాలలో రెండు తరగతి గదులను ఆయన తన ఆధీనంలోనే ఉంచుకుని, వినియోగించారు. తనకు వేరే చోటుకు బదిలీ అయిన తర్వాత ఆ గది తాళాలు అప్పగించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాళాలు తెరిచి, గది శుభ్రం చేస్తుండగా ఈ పిస్తోలు తారసపడినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. (చదవండి: పెద్దాయన పబ్లిసిటి పిచ్చి.. తిక్క కుదిర్చిన కన్సుమర్ కోర్టు ) -
చదువులమ్మకు చక్కనైన గుడి.. కృత్తివెంటి పాఠశాల
రామచంద్రపురం: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపు దిద్దుకుంటుందన్న మాటకు సజీవసాక్ష్యంగా నిలుస్తుంది ఆ పాఠశాల. ఎంతోమంది విభిన్న రంగాల్లో రాణించడానికి ఇక్కడే పునాది పడింది. అదే రామచంద్రపురంలోని శత వసంతాల సరస్వతీ నిలయం.. కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాల. ఈ పాఠశాల వార్షికోత్సవం ఆదివారం జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. పునాదిరాళ్లు పడ్డాయిలా.. కృష్ణా జిల్లా మచిలీపట్నం చెంతన ఉన్న కృత్తివెన్ను గ్రామానికి చెందిన కృత్తివెంటి కృష్ణారావు కుమారుడు పేర్రాజు పంతులు 1852లో కాకినాడలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా స్థిరపడిన ఆయన ఒక కేసు వాదించేందుకు రామచంద్రపురం వచ్చారు. ఆ కేసు విషయంలో నిరక్షరాస్యులైన ఇద్దరు అన్నదమ్ములు తీరు ఆయను కలచివేసింది. గుర్రపు బగ్గీలో కాకినాడ తిరిగి వెళ్తూ.. తన బంట్రోతుతో పేర్రాజు పంతులు ‘‘కాటన్ దొర ఆనకట్ట కట్టారు. దీనివల్ల ఈ ప్రాంతంలో పంటలు పండుతున్నాయి. కానీ దానితో సమానంగా ఇక్కడి వారి బుర్రలు మాత్రం పెరగడం లేదు. నాడు : 1906 ప్రాంతంలో పాఠశాల ఇలా.. విద్య లేని విత్తం అనర్థదాయకం. ఇక్కడొక పాఠశాల ఉంటే బాగుండును’’ అని అన్నారట. ఇందులో భాగంగానే ఆయన 1905లో జాతీయ పాఠశాల పేరుతో రామచంద్రపురంలో మిడిల్ స్కూల్‌ను స్థాపించారు. 1910 వరకూ ఆయనే పర్యవేక్షించే వారు. తరువాత 1920 వరకూ జిల్లా బోర్డు నియమించిన కమిటీ, 1921 – 1969 మధ్య జిల్లా బోర్డు ఈ పాఠశాలను పర్యవేక్షించేవి. తొలి ప్రధానోపాధ్యాయునిగా వీఎస్ రామదాసు పంతులు నియమితులయ్యారు. అప్పట్లో ఇక్కడ 4 నుంచి 8వ తరగతి వరకూ బోధించేవారు. ఆలమూరు, అనపర్తి, వేళంగి, కోటిపల్లి తదితర సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ స్కూల్లో చేరారు. ఎంతోమంది కృషితో.. ఆరంభంలోనే అందరినీ ఆకట్టుకున్న ఈ మిడిల్ స్కూల్ 1906లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. దీనికి పేర్రాజు పంతులు 94 ఎకరాల 21 సెంట్ల భూమిని దానం చేసి, పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టం చేశారు. 1909 తరువాత వచ్చిన సీకే గోవిందరావు సుమారు 23 ఏళ్ల పాటు ప్రధానోపాధ్యాయునిగా పని చేసి కృత్తివెంటి పాఠశాల శిల్పిగా చరిత్రలో నిలిచిపోయారు. పాఠశాల రజతోత్సవాన్ని పూర్తి చేసి, స్వర్ణోత్సవ కాలానికి అంకురార్పణ చేసిన గోవిందరావును ఆర్నాల్డ్‌తో పోల్చారు. దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ పాఠశాల.. పూర్వ విద్యార్థి, ఎమ్మెల్యే అయిన నందివాడ సత్యనారాయణరావు, అప్పటి మున్సిపల్ చైర్మన్ అడ్డూరి పద్మనాభరాజుల కృషితో కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలగా మారింది. పాఠశాలకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన సందర్భంలో.. కపిలేశ్వరపురం జమీందార్ ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు కృషితో 1969లో జూనియర్ కళాశాలగా ఆవిర్భవించింది. ఇంకా పూర్వ విద్యార్థులైన శ్రీ రాజా కాకర్లపూడి రాజగోపాల నరసరావు, రాజా రామచంద్ర బహుద్దూర్, అడ్డూరి పద్మనాభరాజు, నందివాడ సత్యనారాయణరావు, చుండ్రు శ్రీహరిరావు తదితరుల కృషితో కృత్తివెంటి విద్యాసంస్థలు ఎంతో అభివృద్ధి చెందాయి. 2006లో శత వసంతాలను పూర్తి చేసుకుంది. 2009లో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గానికి తొలి మంత్రి అయిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పాఠశాలను సందర్శించారు. తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్ హయాంలోనే కృత్తివెంటి ఉద్యాన పాలిటెక్నిక్, కృత్తివెంటి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హయాంలో కృత్తివెంటి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. సినీ ప్రముఖులు మిత్తిపాటి కామేశ్వరరావు (గులేబకావళి కథ ఫేం), మాస్టర్ రాజు (తెనాలి రామకృష్ణ ఫేం), ఫొటోల నారాయణస్వామి (వింధ్యారాణి ఫేం), ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు, క్యారెక్టర్ నటుడు రాళ్లపల్లి, ప్రఖ్యాత ఛాయాగ్రాహ దర్శకుడు చోటా కె. నాయుడు, మెజీషియన్ బీవీ పట్టాభిరామ్, ఇంకా రావులపర్తి భద్రిరాజు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, పైడిపాల, ప్రముఖ సినీ గేయ రచయిత అదృష్ట దీపక్, వైణిక విద్వాంసుడు ద్విభాష్యం నగేష్‌బాబు, వెదురుపాక విజయదుర్గా పీఠం గాడ్... వీరే కాకుండా రాజవంశానికి చెందిన రాజగోపాల నరసరావు, రాజ బహుద్దూర్ రామచంద్రరాజు, రాజా గోపాలబాబు, నందివాడ సత్యనారాయణరావు వంటి వారెందరో ఇక్కడే విద్యనభ్యసించారు. ఎంతో ఖ్యాతి.. ► కృత్తివెంటి పేర్రాజు పంతులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించారు. ఆయన దానం చేసిన కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానం రామచంద్రపురం నడిబొడ్డున ఉంది. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణం బాస్కెట్‌బాల్‌కు అంతర్జాతీయ స్ధాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ హయాంలో జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ► ఈ పాఠశాలలో మధురకవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి తదితర ఎంతో మంది ప్రముఖులు అధ్యాపకులుగా సేవలందించారు. ► భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో తన ప్రాణాన్ని అర్పించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఈ స్కూలులో 6వ తరగతి చదివారు. -
హైదరాబాద్: పాఠశాలలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: గౌలిపురలోని శ్రీనివాస హైస్కూల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమయానికి స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో స్కూల్లో 50 మంది విద్యార్థులు పాఠశాలలో ఉండగా, వారందరూ.. సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి. (చదవండి: ప్రేమికులు రోజు బహుమతంటూ వల వేస్తారు..) -
క్లాస్‌రూమ్‌లో కర్కశత్వం..
సాక్షి, హైదరాబాద్ : నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో ఓ విద్యార్థిపై టీచర్ ప్రతాపం చూపించారు. 4వ తరగతి చదువుతున్న ఎన్.సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ప్లాస్టిక్ స్కేల్‌తో చేయి, వీపు భాగంలో కొట్టడంతో బాలుడి చర్మం ఎర్రగా కందిపోయింది. విద్యార్థి నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా టీచర్ కర్కశంగా వ్యవహరించింది. అరగంట పాటు తమ బిడ్డను టీచర్ చితక్కొట్టిందని విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపించారు. టీచర్ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. దిక్కున్నచోట చెప్పుకోండి అని బెదిరించారని వాపోయారు. ‘ప్రతి క్లాస్ రూమ్‌లో సీసీటీవీ ఉంది. ఆ రికార్డులను పరిశీలించి టీచర్‌పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
హైస్కూల్లో రికార్డింగ్ డ్యాన్సు చిందులు రచ్చ..రచ్చ!
చిత్తూరు, గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె జెడ్పీ హైస్కూల్ వివాదం కాస్త రచ్చకెక్కింది. డిసెంబర్ 31న రాత్రి హైస్కూల్లో రికార్డింగ్ డ్యాన్సు కార్యక్రమం నిర్వహించడంతో పాటు పలు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయంటూ హెడ్మాస్టర్పై కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు– హెడ్మాస్టర్..కొందరు తనపై కక్ష కట్టి, వేధించడంతోపాటు, విధులకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులతో ఈ ఉదంతం మరింత వేడెక్కింది. వివరాలు..స్థానిక జెడ్పీ హైస్కూల్లో గత ఏడాది డిసెంబర్ 31న రాత్రి పెద్ద ఎత్తున డీజే(రికార్డింగ్ డ్యాన్సులు) నిర్వహించారు. యూత్ అంతా డ్యాన్సులతో చిందులేశారు. పవిత్రమైన పాఠశాలల్లో అర్ధరాత్రి వరకు ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ కొందరు అడ్డుకోవడంతో అప్పట్లో వాగ్వాదానికి దారితీసింది. ఈ ఘటనపై కొందరు సోషియల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. అంతేకాకుండా హెడ్మాస్టర్ హైస్కూల్లో అనైతిక కార్యకలాపాలకు రూములు ఇస్తున్నాడని, గతంలోనూ విద్యార్థులచేత పలు చేయరాని పనులు చేయించారని, కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా హైస్కూల్‌ను మద్యం సేవించడానికి, రికార్డింగ్ డ్యాన్సులకు, జూదం నిర్వహించుకోవడానికి ఇచ్చారని ఆరోపిస్తూ కొందరు గ్రామస్తులు ఇటీవలే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదలా ఉంచితే, కొంత కాలంగా హైస్కూల్లో కొందరు ఉపాధ్యాయుల విధులకు భంగం కలిగిస్తుండడంతో పాటు తమను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొంటూ హెడ్మాస్టర్ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై కొందరు నాయకులు అసభ్యకరమైన పోస్టింగ్‌లు సామాజిక మాధ్యమాల్లో పెట్టారని, గత నెల 31న తాను సెలవుపై వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు ఆకతాయిలు ప్రహరీ గోడపై కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని, వీరికి కొందరు నాయకులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించినప్పటి నుంచి కొందరు తమపై కక్షగట్టారని, ఈ సంఘటనపై విచారణ చేసి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసు నమోదు చేశాం హైస్కూల్ వివాదంపై హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు రెడ్డిరాజా అనే వ్యక్తిపై ప్రస్తుతానికి కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామస్తులు, విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను కూడా విచారణ చేస్తాం. ఇందులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం.– చిన్నరెడ్డెప్ప, ఎస్ఐ, గుర్రంకొండ -
అబిడ్స్ పాఠశాలలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : అబిడ్స్‌లోని అల్సెన్స్ హైస్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లంచ్ అవర్ కావడంతో పేను ప్రమాదం తప్పింది. వివరాలు.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పాఠశాలలోని పరేడ్ స్టేజ్ క్రింద ఉన్న గది నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వెలువడింది. ఈ సమయంలో స్కూల్ ఆవరణలో దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే లంచ్ అవర్ కాండంతో భారీ ప్రమాదం తప్పింది. కానీ దట్టమైన పోగ రావడం వల్ల ఏడుగురు విద్యార్థులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వీరిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుంది. సమాచారం తెలుసుకున్న అగ్రిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పొగను అదుపులోకి తీసుకోచ్చారు. ఈ సంఘటన గురించి యాజమాన్యం మాట్లాడుతూ..‘ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉంది. విద్యార్థులేవరికి ఏమి కాలేదు. కానీ దట్టమైన పోగ వల్ల కొందరు విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించాం. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళన పడవద్దని కోరుకుంటున్నాం’ అని తెలిపారు. -
హైస్కూల్లో దుండగుల బీభత్సం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు దుండగులు తీవ్ర అలజడి రేపారు. రాడ్లు పట్టుకుని తిరుగుతూ సినీ ఫక్కీలో బీభత్సం సృష్టించారు. తెలుగు ఉపాధ్యాయుడు కారును ధ్వంసం చేశారు. వివరాలివి. ఇక్కడి హైస్కూల్లో సనపల ఉమాపతి తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన ఎప్పటిలాగే మంగళవారం పాఠశాలకు వచ్చి కారును పార్కింగ్‌లో పెట్టారు. తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా, స్కూల్లోకి నలుగురు దుండగులు రాడ్లతో ప్రవేశించారు. కారు ముందు ఇద్దరు కాపు కాయగా, ఇద్దరు వ్యక్తులు రాడ్లతో కారు వెనుక అద్దాన్ని ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. ఉన్మాదంగా ప్రవర్తించి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేసి పరారయ్యారు. జరిగిన సంఘటనతో ఉమాపతి నిర్ఘాంతపోయారు. వెంటనే గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నలుగురు వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి రాడ్లు, రాళ్లతో వీరంగం చేశారని సంఘటనను గమనించిన వారంతా చెబుతున్నారు. ఉమాపతి కారునే అగంతకులు ఎందుకు టార్గెట్ చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోపాలపట్నం మెయిన్‌రోడ్డులో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. మునుపెన్నడూ లేని సంఘటన ఇలా జరగడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కొంత కాలంగా అపరిచితులు పాఠశాలలోకి ప్రవేశించి మద్యం, గంజాయి వంటి మత్తు మందులు సేవించడం, ప్రశ్నిస్తే తిరగబడుతుండడం చేస్తున్నట్లు అటెండరు వాపోయాడు. క్రీడా మైదానం, స్కూల్ పరిసరాల్లో పోలీసు నిఘా పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
విద్యార్థులు లేని బడికి 9 మంది టీచర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: 10 తరగతి గదులు, 9 మంది ఉపాధ్యాయులు.. పేరుకు పెద్దబడే. కానీ ఏం లాభం. ఒక్కడంటే ఒక్క విద్యార్థి కూడా లేడు. వరంగల్ రూరల్ జిల్లా నలబెల్లి మండలం ముచ్చింపుల జెడ్పీ హైస్కూల్ పరిస్థితి ఇది. ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న దీన్ని 2002లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. 2013 తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గత ఏడాది 6 నుంచి 10వ తగరతి వరకు ఒక్కొక్క తరగతిలో ఒక్క విద్యార్థి చొప్పున ఐదుగురు విద్యార్థులున్నారు. ఈ ఏడాది నలుగురు విద్యార్ధులు టీసీలు తీసుకొని వేరే పాఠశాలలో చేరిపోయారు. 10వ తరగతి చదివే ఒకే ఒక బాలిక మాత్రమే జూలై వరకు స్కూల్‌కు వచ్చింది. తర్వాత ఆమె కూడా టీసీ తీసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేడు. కానీ.. హెడ్మాస్టర్ శ్రీనివాస్‌తోపాటు మరో 8 మంది ఉపాధ్యా యులు రోజూ పాఠశాలకు వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోతున్నారు. 900 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 18 మంది హై స్కూల్ విధ్యనభ్యసించే విద్యార్థులు ఉన్నారు. సమీప గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలకే వెళ్లడంతో ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. దీనిపై హెడ్మాస్టర్, జిల్లా సైన్స్ అధికారి కె.శ్రీనివాస్ వివరణ కోరగా తెలుగు మీడియం పాఠశాల కావడంతో గ్రామంలో ఉన్న కొద్దిమంది విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళ్తున్నారన్నారు. -
అమెరికా స్కూల్లో కాల్పులు
వాషింగ్టన్: అమెరికా స్కూళ్లలో కాల్పుల ఘటనలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా టెక్సస్ రాష్ట్రం శాంటాఫే నగరంలోని శాంటాఫే హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో 9మంది విద్యార్థులు, ఒక టీచర్ చనిపోయారు. శుక్రవారం ఉదయం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయుధాలు ధరించిన ఓ విద్యార్థి ఆర్ట్స్ తరగతి గదిలోకి ప్రవేశించి యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10మంది చనిపోయారని, ఒక పోలీసు అధికారి సహా 12 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసిన పోలీసులు న్రధాన నిందితుడితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి రైఫిల్, పిస్టల్, షాట్‌గన్, పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. శాంటా ఫే హైస్కూలులో సుమారు 1,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో స్కూళ్లలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఇది మూడోది కాగా ఈ ఏడాది జరిగిన 22వ కాల్పుల ఘటన అని పోలీసులు తెలిపారు. తాజా ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. -
15 నుంచి ఒంటి పూట బడులు
-
కక్షగట్టి కాల్పులు..
వాషింగ్టన్: అమెరికా మరోసారి తుపాకీ మోతకు ఉలిక్కిపడింది. 19 ఏళ్ల మాజీ విద్యార్థి తాను చదివిన పాఠశాలలోనే విచ్చలవిడిగా కాల్పులకు దిగి 17 మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఓ భారతీయ విద్యార్థి సహా మరో 15 మందిని గాయపరిచాడు. ఫ్లోరిడా రాష్ట్రంలో పార్క్‌లాండ్ నగరంలోని మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో బుధవారం ఈ దారుణం జరిగింది. నిందితుడు నికోలస్ క్రూజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు జరగడం ఇది 18వ సారి కావడం గమనార్హం. క్రమశిక్షణారాహిత్యానికి గతేడాది స్కూల్ నుంచి బహిష్కరణకు గురైన క్రూజ్ కక్షగట్టి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అతని సోషల్ మీడియా అకౌంట్లలో హింసను ప్రేరేపించే చిత్రాలున్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఎఫ్‌బీఐ అధికారుల సాయంతో స్థానిక పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. అలారం లాగి..అలజడి సృష్టించి..: గ్యాస్ ముసుగు, స్మోక్ గ్రెనేడ్లు ధరించి, ఏఆర్–15 తుపాకీని వెంట తెచ్చుకున్న క్రూజ్ ముందుగా ఫైర్ అలారంను లాగి పాఠశాలలో అలజడి సృష్టించాడు. భయంతో విద్యార్థులు, సిబ్బంది బయటకు పరుగులు పెడుతుండగా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో విద్యార్థులు ఎందరు ఉన్నారన్నది తెలియరాలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఆ స్కూల్లో ఇండో–అమెరికన్ విద్యార్థుల సంఖ్య ఎక్కువే అని తెలిసింది. షూటింగ్‌కు పాల్పడే ముందు క్రూజ్ తన సామాజిక మాధ్యమాల అకౌంట్లలో రెచ్చగొట్టే సందేశాలు అప్లోడ్ చేశాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అతని వద్ద చాలా తుపాకీ మేగజీన్లు కూడా ఉన్నాయని తెలిపారు. కాల్పులు ముగిసిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తన మాజీ ప్రియురాలి కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో గొడవకు దిగినందుకు క్రూజ్‌ను స్కూల్ నుంచి బహిష్కరించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అభద్రంగా ఉన్నామని భావించొద్దు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాఠశాలలో కాల్పుల ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ట్రంప్..పిల్లలు, ఉపాధ్యాయులెవరూ కూడా అమెరికా పాఠశాలలో అభద్రంగా ఉన్నామని భావించొద్దని అన్నారు. నిందితుడి మానసిక ఆరోగ్యంపై సందేహం వ్యక్తం చేశారు. ‘ఇది అమెరికాలో విషాదకర దినం. బాధితుల కోసం ఇండో–అమెరికన్లందరం ప్రార్థిస్తున్నాం’ అని కాల్పుల్లో గాయపడిన భారత విద్యార్థి తండ్రి స్నేహితుడు శేఖర్ రెడ్డి అన్నారు. 31 వేల జనాభా ఉన్న పార్క్లాండ్కు 2016లో అత్యంత సురక్షితమైన పట్టణంగా గుర్తింపు దక్కడం గమనార్హం. -
నరరూప రాక్షసుడికి ఇదే సరైన శిక్ష
వాషింగ్టన్ : సంచలనం సృష్టించిన పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. అలెక్స్ హ్రిబల్కు 60 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కిరాతకంగా 21మంది తోటి విద్యార్థులను బలి తీసుకున్న హిబ్రల్(20)కు సంఘంలో తిరిగే హక్కు ఎంత మాత్రం లేదని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో పెన్సల్వేనియా కోర్టు హల్ విద్యార్థుల తల్లిదండ్రుల చప్పట్లతో మారుమ్రోగిపోయింది. హ్రిబల్ మానసిక స్థితి సరిగ్గా లేదని.. అతనికి జైలు శిక్ష విధిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని అతని తరపు న్యాయవాది వాదించాడు. ఆ వాదనతో ఏకీభవించని జడ్జి ‘ఇలాంటి నరరూప రాక్షసుడితో సమాజానికి ఎప్పటికైనా ప్రమాదమే. తల్లిదండ్రులను కూడా చంపేందుకు యత్నించాడు. అతని మానసిక స్థితి ఆధారంగానే మరణ శిక్ష విధించటం లేదు. అతనికి ఇదే సరైన శిక్ష’ అని వ్యాఖ్యానించారు. కావాలంటే శిక్ష అనుభవించే ముందు హిబ్రల్‌కు మానసిక వైద్యం అందించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. అయితే హిబ్రల్ మాత్రం శిక్షను అనుభవించేందుకు నేరుగా జైలుకు వెళ్లాడు. ఇక బాధితులకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత హిబ్రల్ తల్లిదండ్రులకు లేదన్న న్యాయవాది వాదనతో జడ్జి ఏకీభవించారు. 2004 ఏప్రిల్ 9న ముర్రేస్విల్లెలోని ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో తాను చదివే స్కూల్లోనే కత్తులతో వీరంగం వేసిన అలెక్స్ హ్రిబల్ తోటి విద్యార్థులపై దాడి చేశాడు. రెండు వంట గది కత్తులతో 21 మంది విద్యార్థులను, ఒక వ్యక్తిని విచక్షణరహితంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన మరికొందరిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన హిబ్రల్.. తాను మరింత మందిని చంపాల్సి ఉందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ వ్యాఖ్యల ఆధారంగానే కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. -
19 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులా?
♦ వడ్లకొండ ఉన్నత పాఠశాల ఎత్తివేస్తాం ♦ అందరు ఏకమైతేనే సర్కారు స్కూళ్లు బతుకుతాయి ♦ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పర్వతగిరి(వర్ధన్నపేట): నెలకు సుమారు రూ.5లక్షలు జీ తాలు చెల్లించి 19 మంది విద్యార్థులకు చదువు చెప్పించటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని వడ్లకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతు సమస్వయ సమితి ఏర్పాటు కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షత జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల్లో 19 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉన్న విషయం తెలుసుకున్న మంత్రి బడిబాటలో ఎందుకు ఎల్‌రోల్ మెం ట్ కావటం లేదని ఎంఈఓ అజామోహీనొద్దీన్‌ను అడిగా రు. దగ్గరలో ప్రైవేట్ స్కూల్ ఉండడంతో పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు రావటం లేదని చెప్పగా.. ఉపాధ్యాయుల పనితీరు సరిగా లేక, బడికి సక్రమంగా హాజరు కాకపోవటం వల్లే విద్యార్థులు రావటం లేదని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 90 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ స్కూల్‌కు వెళ్తుంటే ప్రజలు ఎందుకు అడ్డుకోవటం లేదని ప్రశ్నించారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చది వించాలనే చిత్తశుద్ధి తల్లిదండ్రుల్లో లేదని, పాఠశాలను ఎత్తివేసి విద్యార్థులను పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఉపాధ్యాయులను మరో చోటికి మారుస్తామన్నారు. పాఠశాలను మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు నడిపించరు.. గ్రామస్తులే నడిపించాలి.. కొన్ని గ్రామాల్లో గ్రా మస్తులు ఏకమై పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ప్రైవేట్ స్కూళ్ల బస్సులను అడ్డుకుంటున్నారని చెప్పారు. అందరూ ఐక్యంగా ఉండి పిల్లలను పంపినప్పుడే సర్కారు స్కూళ్లు బతుకుతాయని పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉన్నారని, వాటి విషయంలో డీఈఓ, ఎంఈఓలతో చర్చించి ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేసి ఉన్నత పాఠశాలను ఎత్తివేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్‌రెడ్డి, డైరెక్టర్ యుగేందర్‌రావు, జెడ్పీటీసీ మదాసి శైలజ, ఆర్డీఓ మహేందర్‌జీ, పశు సంవర్థక శాఖ జేడీ వెంకయ్యనాయుడు, ఎంపీటీసీ పట్టాపురం తిరుమల, రైతులు పాల్గొన్నారు. -
నిధుల్లో అధికభాగం విద్యుత్ బిల్లులకే..
► హైస్కూళ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్ఎంఎస్ గ్రాంటు విడుదల ► సైన్స్ పరికరాలు, డిజిటల్ తరగతుల నిర్వహణకు సగం నిధులు ► విద్యుత్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తేనే మేలంటున్న ఉపాధ్యాయులు ► ఉమ్మడి జిల్లాలోని 462 ఉన్నత పాఠశాలలకు రూ. 2.31 కోట్లు మోర్తాడ్(బాల్కొండ): ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటు, విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు నిధుల కొరతను తీర్చడం కోసం ప్రభుత్వం రాష్ట్రీయ మాధ్యమిక మిషన్ ద్వారా నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ. 50 వేల చొప్పున నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 462 పాఠశాలలకు రూ. 2.31 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే ఈ నిధుల్లో సింహ భాగం విద్యుత్ బిల్లులు చెల్లించడానికే సరిపోతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలను కేటగిరి 7లో ఉంచడం వల్ల ఒక యూనిట్‌కు రూ. 2 నుంచి రూ. 4 చార్జీ చేయబడుతుంది. దీనివల్ల ప్రతి పాఠశాలకు నెలకు విద్యుత్ బిల్లుల భారం ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక్కో పాఠశాలకు రూ. 2,500ల నుంచి రూ. 3,500వరకు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రీయ మాధ్యమిక మిషన్ ద్వారా కేటాయించిన నిధుల్లో ఎక్కువ శాతం విద్యుత్ బిల్లులు చెల్లించడానికి సరిపోతుండడంతో ల్యాబ్ సామగ్రి, పుస్తకాలు, దినపత్రికలు, డిజిటల్ తరగతుల నిర్వహణ కష్టమవుతోంది. పాఠశాలలకు కేటాయించిన గ్రాంటులో 50 శాతం నిధులను బోధన కోసం వినియోగించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కానీ పాఠశాలల్లో ఫ్యాన్లు, బోరు మోటారు వినియోగం, డిజిటల్ తరగతుల నిర్వహణ, కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణ రెగ్యులర్‌గా కొనసాగుతుండడంతో విద్యుత్ చార్జీ ఎక్కువ అవుతుంది. పాఠశాలలకు గ్రాంటును కేటాయించడం వల్ల విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే అధికారులు విద్యుత్ సౌకర్యం నిలిపివేస్తారనే ఉద్దేశ్యంతో చార్జీల చెల్లింపును పూర్తి చేస్తున్నారు. దీంతో విద్యాశాఖ సూచించిన విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా సౌకర్యాలను కల్పించలేకపోతున్నారు. అలాగే ఈ గ్రాంటు నుంచి పాఠశాలల మరమ్మతులు, నీటి సౌకర్యం కోసం వినియోగించాలని సూచిస్తున్నారు. కానీ మంజూరైన నిధుల శాతం తక్కువగా ఉండడంతో మౌలిక వసతులను కల్పించలేకపోతున్నారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఒక్కో పాఠశాలకు కేటాయించే రూ.7 వేల నిధులను కేవలం మెయింటెనెన్స్ కోసం వినియోగించాలి. కానీ రాజీవ్ మాధ్యమిక విద్యామిషన్ పథకం కింద కేటాయించే నిధులను మాత్రం విద్యార్థులకు ప్రయోజనం కలిగించే పనులకు వినియోగించాల్సి ఉంది. నిధుల వినియోగంలో ఎలాంటి పొరపాట్లు చేసినా కఠిన చర్యలు తీసుకొనే అధికారం ఉన్నతాధికారులకు ఉంది. నిధులను పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాలో జమ చేశారు. 2017–18 విద్యా సంవత్సరం కోసం కేటాయించిన నిధులను ఈ విద్యా సంవత్సరంలోనే ఖర్చు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా పాఠశాలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తే పాఠశాలలకు భారం తప్పుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన గ్రాంటును పూర్తిగా విద్యా బోధన కోసం వినియోగించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
మొండిగోడల మధ్య అఆఇఈ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం హైస్కూల్లో తరగతి గదులు శిథిలా వస్థకు చేరి పైకప్పు కూలిపోయింది. దీంతో విద్యార్థులు మొండిగోడల మధ్య చదువు కుంటున్నారు. పాఠశాల భవనం కూలి నాలుగేళ్లయినా కొత్త భవనం నిర్మిం చకపోవడంతో చెట్లకిందే విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. వర్షం వస్తే ఇంటిబాట పడుతున్నారు. తరగతి గదులు నిర్మిస్తామని స్వయంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి హామీ ఇచ్చినప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. ఇక్కడ పది తరగతి గదులు అవసరం ఉండగా మూడు మాత్రమే ఉన్నాయి. – తొర్రూరు రూరల్ -
‘అప్‌గ్రేడ్’ పోస్టులపై చిక్కుముడి!
• ఆ పోస్టుల్లో ఎస్జీటీలకు అవకాశమివ్వద్దంటున్న పండిట్లు • జీవో నంబర్లు 11, 12లను సవరించాలని డిమాండ్ • నిబంధనల ప్రకారం తమను నియమించాలంటున్న ఎస్జీటీలు సాక్షి, హైదరాబాద్: ఉన్నత పాఠశాలల్లో భాషా పండిత పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మరో చిక్కుముడి పడుతోంది. విద్యాహక్కు చట్టం నేపథ్యంలో కొన్నేళ్ల కింద జారీ అయిన జీవో నంబర్ 11, 12లతో కొత్త సమస్య తెరపైకి వస్తోంది. అప్‌గ్రేడ్ అయ్యే పోస్టుల్లో అర్హతలు కలిగిన భాషా పండితులనే నియమిస్తారా.. లేక పండిత శిక్షణ కోర్సుతో సంబంధం లేకుండా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా నియమితులై బీఈడీ, సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసినవారినీ నియమిస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) కేడర్ ఉపాధ్యాయులు.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) పనిచేయాలి. అయితే భాషా పండితుల్లో గ్రేడ్-1, గ్రేడ్-2 అనే రెండు రకాల పోస్టులు ఉన్నాయి. పీజీ కలిగిన పండిట్లకు గ్రేడ్-1, భాషా పండిత కోర్సులు మాత్రమే చేసినవారికి గ్రేడ్-2 పండిట్ హోదా ఇచ్చారు. గ్రేడ్-1 పండిట్‌ను ఎస్ఏ హోదాతో సమానంగా పరిగణిస్తారు. వారికి కొన్నేళ్ల కిందే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ (ఎస్ఏఎల్) హోదా కూడా ఇచ్చారు. గ్రేట్-2 పండితులు ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్నా వారికి ఎస్ఏ హోదా లేదు. అయితే విద్యా హక్కు చట్టం నేపథ్యంలో గ్రేడ్-2 పండిట్ పోస్టులను కూడా ‘స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్’ హోదా గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ కలిగిన వారిని స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌గా మార్చుతామంటూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే ఎస్జీటీగా నియమితులైనా కూడా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉంటే.. వారికి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పోస్టులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో గ్రేడ్-2 భాషా పండిత ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. తొలి నుంచీ డిమాండ్.. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 6 వేల మంది గ్రేడ్-2 భాషా (తెలుగు, ఉర్దూ, హిందీ) పండితులు.. అప్‌గ్రేడ్ చేసే పోస్టుల్లో పండిత శిక్షణ కోర్సుతో పాటు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వారిని నియమించాలని తొలి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జీవో 11, 12లను సవరించాలని కోరుతున్నారు. ఆ జీవోలను సవరిస్తేనే భాషా పండితులకు న్యాయం జరుగుతుందని పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్రీయ పండిత పరిషత్తు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా, జగదీశ్‌లు పేర్కొన్నారు. ఎస్జీటీలకు అవకాశమిస్తే భాషా పండితులకు అన్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు ప్రస్తుత నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన తమకు ఎస్ఏఎల్గా అవకాశమివ్వాల్సిందేనని ఎస్జీటీలు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలలోని ఒక తరగతి గది పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. అయితే, ఆసమయంలో విద్యార్థులెవరూ అక్కడ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సాయంత్రం సెలవు ప్రకటించారు. -
తొమ్మిది మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన 9 మంది టీచర్లను కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఎంపికైన వారి పేర్లను మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఉంచింది. ప్రాథమిక పాఠశాలల నుంచి నలుగురిని, ఉన్నత పాఠశాలల నుంచి ముగ్గురిని, సీబీఎస్ఈ స్కూళ్ల నుంచి ఇద్దరిని ఎంపిక చేసింది. ప్రైమరీ స్కూల్ టీచర్లు.. ► బొల్లేపల్లి మధుసూదనరాజు, స్కూల్ అసిస్టెంట్, ఎంపీయూపీఎస్, సిద్ధారం, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా ► ఆర్ రమేశ్ బాబు, సెకండరీ గ్రేడ్ టీచర్, యూపీఎస్ గంజాల్, నిర్మల్, ఆదిలాబాద్ ► మీనపురెడ్డి బుచ్చిరెడ్డి, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, ఎంపీపీఎస్ దోనూరు, మిడ్జిల్ మండలం, మహబూబ్‌నగర్ ► కె.గోవింద్, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్, సీపీఎస్ కందనెల్లి, పేద్దేముల్ మండలం, రంగారెడ్డి ఉన్నత పాఠశాలల టీచర్లు... ►మంగనూర్ వెంకటేశ్, జీహెచ్ఎంసీ, జెడ్పీహెచ్ఎస్ ముదుమల్, మగనూర్ మండలం, మహబూబ్‌నగర్ ►తూము శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ పిల్లలమర్రి, సూర్యాపేట్ మండలం, నల్లగొండ ►పరికిపండ్ల వేణు, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ పులుకుర్తి, ఆత్మకూరు మండలం, వరంగల్ సీబీఎస్ఈ టీచర్లు.. ►రంగి సత్యనారాయణ, టీజీటీ, (సంస్కృతం), కేంద్రియ విద్యాలయ నం.1, ఉప్పల్, రంగారెడ్డి జిల్లా ►ఎం.వరలక్ష్మి, ప్రిన్సిపాల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ -
పాఠశాల గదిలో కాంట్రాక్టర్ మకాం
సామగ్రిని దాచుకునేందుకు వినియోగం తరగతి గదులు చాలక విద్యార్థుల అవస్థలు బలిజిపేట రూరల్: తరగతి గదులు చాలక విద్యార్థులు అవస్థలు పడుతుంటే.. పాఠశాల భవనాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బలిజిపేట ఉన్నత పాఠశాలకు నాలుగేళ్ల క్రితం పైకా పథకం కింద భవన నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఇవి చాలవని పంచాయతీ నిధుల నుంచి రూ.లక్ష తీసి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ లోపలి భాగంలో గచ్చులు లేవు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీన్ని స్వాధీనం చేసుకోకపోవడంతో రెండేళ్లుగా నిరుపయోగమైంది. విద్యార్థుల క్రీడా పరికరాలను భద్రపరిచేందుకు పైకా పథకం కింద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ భవనాలను మంజూరు చేశారు. నిర్మాణాలు పూర్తయినా నిరుపయోగంగా వదిలేశారు. ఈ భవనంలో ఒక కాంట్రాక్టర్ నిర్మాణ సామగ్రిని భద్రపరచుకుంటున్నారు. ఉన్నత పాఠశాలలో 750మందికి పైగా విద్యార్థులు, 17 సెక్షన్లు ఉన్నాయి. వీరిందరికీ సరిపడా తరగతి గదులు లేవు. వీరందరికీ ఉపయోగించాల్సిన గదిని కాంట్రాక్టర్‌కు అప్పగించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వరండాల్లో ఇబ్బందిగా ఉంది: రాజేష్, విద్యార్థి పాఠశాలకు తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నాం. వరండాలలో కూర్చుని పాఠాలు వింటున్నారు. దీంతో అందరికీ ఇబ్బందిగా ఉంటోంది. ఆట పరికరాలను భద్రపరిచేందుకు సరైన గది కూడా లేదు. అప్పగించమని కోరాం: త్రినాథ, ప్రధానోపాధ్యాయుడు, బలిజిపేట ఉన్నత పాఠశాల. పైకా భవనాన్ని అప్పగించమని కాంట్రాక్టర్‌ను కోరాం. తరగతి గదికి, ఆటపరికరాలను భద్రపరిచేందుకు వినియోగిస్తామని తెలిపాం. భవనం అప్పగించగానే వినియోగించుకుంటాం. -
అస్వస్థతతో విద్యార్థిని మృతి
ధర్మసాగర్ : అస్వస్థతకు గురై విద్యార్థిని మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కాయిత లావణ్య (12) మల్లక్‌పల్లి హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం లావణ్య వాంతులు, తల నొప్పితో భాధపడటంతో కుటుంబసభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొం దుతూ మృతి చెందింది. కాగా నులిపురుగుల నివారణకు ఈనెల 10న వేసుకున్న మాత్రలు వికటించటంతోనేతమ కూతురు మృతి చెందిం దని తల్లిదండ్రులు ఆరోపించారు. -
రిటైర్మెంట్ వేడుకలో అపశృతి..
- 35 మందికి అస్వస్థత సారంగపూర్(ఆదిలాబాద్ జిల్లా) ఓ రిటైర్మెంట్ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. విషాహారం తిని 35 మంది అస్వస్థతకు గురయ్యారు.వివరాలు.. సారంగపూర్ మండలం చించోలి హైస్కూల్లో అటెండర్‌గా పనిచేస్తున్న నరసయ్య ఈరోజు( శుక్రవారం) రిటైర్ కాబోతున్నాడు. ఈ సందర్భంగా చిన్న వేడుక ఏర్పాటు చేశాడు. వేడుకలో తిన్న వంటకాలు విషపూరితం అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన విద్యార్థులను చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
అరవయ్యేళ్లకు కలిశారు!
చందర్లపాడు: పూర్వ విద్యార్థుల కలయికతో కృష్ణాజిల్లా చందర్లపాడు పులకించిపోయింది. ఆరు దశాబ్దాల క్రితం విడిపోయిన మిత్రుల కలయికకు స్థానిక యార్లగడ్డ సుబ్బారావు స్వగృహం వేదికగా మారింది. 1956లో స్థానిక వాసిరెడ్డి కోటయ్య మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ చదివిన విద్యార్థులు కలుసుకొని మధురానుభూతులు పంచుకున్నారు. వారి ఆప్తమిత్రుడు సుబ్బారావు 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారులు వెంకట్రావు, బాపయ్య, చంటి, బుల్లబ్బాయి, సత్యనారాయణప్రసాద్‌ల నుంచి ఆహ్వానం అందుకున్న పూర్వ విద్యార్థులు తమ మిత్రుడికి అంజలి ఘటించేందుకు సామూహికంగా తరలివచ్చారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒక్కటిగా కలుసుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. -
బడుల బాగుకు రూ. 100 కోట్లు
♦ ప్రతిపాదనలు సిద్ధం చేసిన జడ్పీ ♦ మౌలిక వసతులకు రూ. 64 కోట్లు ♦ అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 35 కోట్లు ♦ జిల్లా వ్యాప్తంగా సర్వే పాఠశాలల వారీగా వివరాల సేకరణ ♦ చైర్పర్సన్ ఆధ్వర్యంలో సీఎంను కలిసేందుకు నిర్ణయం సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం జడ్పీ పాలకవర్గం ప్రభుత్వాన్ని వందకోట్ల మేర నిధులు కోరనుంది. త్వరలో జడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ ఆధ్వర్యంలో సీఈఓ, సభ్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరనున్నారు. ఇది వరకే నిధుల విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఎంను కలిసి నిధులు అంశాన్ని ప్రస్తావిద్దామని జడ్పీ చైర్పర్సన్, సీఈఓకు సూచించినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు జిల్లా పరిషత్ హైస్కూల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. జడ్పీ ఉన్నతపాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల లేవు. ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. పాఠశాలల ప్రారంభానికి ముందే మండలాల్లో సర్వే నిర్వహించి జిల్లా పరిషత్ పాఠశాలల్లో సమస్యలకు, అవసరాలకు సంబంధించి వివరాలను సేకరించారు. జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో 596 అదనపు గదులు అవసరం. రాజీవ్ విద్యామిషన్ ద్వారా అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గదుల నిర్మాణానికి సుమారు రూ.35.76 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.64.15 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. అదనపు గదుల నిర్మాణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవు. విద్యార్థులు చెట్లకింద చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంబంధించి జడ్పీ యంత్రాంగం వివరాలు సేకరించింది. జిల్లాలో 596 జడ్పీ ఉన్నతపాఠశాలల్లో అదనపు తరగతి గదులు అవసరం ఉంది. నియోజకవర్గాల వారీగా అందోలులో 95, దుబ్బాకలో 12, మెదక్‌లో 51, నర్సాపూర్‌లో 139, సంగారెడ్డిలో 48, పటాన్చెరులో 30, జహీరాబాద్‌లో 22, సిద్దిపేటలో 21, గజ్వేల్‌లో 63, నారాయణఖేడ్‌లో 115 అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణానికి రూ.35.76 కోట్లు అవసరమని అంచనా. మౌలిక వసతులకు రూ.64.15 కోట్లు జిల్లాలోని 482 జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.64.15 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రహరీల నిర్మాణానికి రూ.19.03 కోట్లు, తరగతి గదుల మరమ్మతు పనులకు రూ.16.28 కోట్లు, కిటీకీలు, తలుపుల మరమ్మతుకు రూ.2.13 కోట్ల, కిచెన్‌షెడ్ నిర్మాణం పనులకు రూ.2.98 కోట్లు, బాలురు, బాలికల మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.8.11 కోట్లు నిధులు అవసరం అవుతాయని అధికారులు నిర్ణయించారు. అలాగే ఫర్నిచర్‌కు రూ.5.02 కోట్లు, బోర్ల తవ్వకం, కంప్యూటర్ల ఏర్పాటుకు రూ.2.56 కోట్లు, పాఠశాలల రంగులు వేయటానికి 5.43 కోట్లు, ఆయా పనులకు చేపట్టేందుకు పన్నులు ఇతర పద్దుల్లో డబ్బుల చెల్లించేందుకు రూ.2.57 కోట్లు నిధులు అవసరం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసిన జెడ్పీ అధికారులు త్వరలో ప్రభుత్వాన్ని నిధులు కోరనున్నారు. -
విద్యార్థినికి ఐఎస్ భూతం!
కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో ఓ పాఠశాల పొరపాటు చేసింది. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి అనుకోకుండా ఉగ్రవాద పేరు అంటగట్టింది. తమ పాఠశాల తరుపున విడుదల చేసిన ఇయర్ బుక్స్ లో ఓ విద్యార్ధిని ఫొటోను ప్రచరిస్తూ ఆమె ఫొటో కింద ఇస్లామిక్ స్టేట్ అంటూ ముద్రించింది. ఇది గుర్తించిన ఆ బాలిక సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ తప్పును సరిదిద్దుకునేందుక స్కూల్ యాజమాన్యం వేగంగా ముందుకు కదలింది. కాలిఫోర్నియాలోని రాంచో కుకమోంగా లోగల లాస్ ఓసోస్ హై స్కూల్ లో బయాన్ జెలిఫ్ అనే విద్యార్థిని చదువుతోంది. ఈ స్కూల్ యాజమాన్యం ప్రతి ఏడాది ఇయర్ బుక్ విడుదల చేస్తోంది. అందులో భాగంగా విద్యార్థుల ఫొటోలను కూడా ముద్రిస్తుంది. అయితే, జెలిఫ్ ఫొటోను ముద్రించిన స్కూల్ యాజమాన్యం ఆ ఫొటో కింద మాత్రం ఐఎస్ఐఎస్ ఫిలిప్ అనే పేరును ముద్రించారు. ఈ విషయం తర్వాత గుర్తించి అప్పటికే 300 మంది విద్యార్థులకు ఇచ్చేసిన పుస్తకాలు ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు. -
అందని విద్య మిథ్య
♦ భవిష్యత్తు అంధకారం ఉన్నత పాఠశాలల లేమి ♦ పొరుగు రాష్ట్రాలకు ఖేడ్ విద్యార్థులు ♦ తలెత్తుతున్న ‘స్థానికత’ సమస్య ♦ రెండుచోట్లా నిబంధనల చిక్కులు ♦ కొరగాకుండాపోతోన్న చదువులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ;ఈడొచ్చిన పోరగాళ్లు ముళ్లుకర్ర పట్టాలి. ఎద్దు నాగలితో ఎవుసం చేయాలి.. అడ్డపంచె కట్టి ‘అయ్య’వారి ఇంటి ముందు నిలబడాలె.. నారాయణఖేడ్ బడి పిల్లల జీవితమిదే. ఒకవైపు దేశంలో నిర్బంధ విద్య అమలవుతోంటే ఇక్కడి పల్లెల్లో పుట్టిన పిల్లలు మాత్రం బలవంతంగా చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. స్థానికంగా పాఠశాలలు లేక పొరుగు రాష్ట్రం పాఠశాలల్లో చేరుతున్నారు. ఎలాగో కష్టపడి ఉన్నత చదువులు చదివినా ఉద్యోగవేటలో ‘స్థానికత’ వేటు పడుతోంది. దీంతో అక్కడా ఇక్కడా కొరగాకుండా పోతున్నారు. పాఠశాల విద్య కోసం సొంత రాష్ట్రం వదిలి బీదర్, ఔరద్, జమ్గీ, సంతపూర్ లాంటి కర్ణాటక, మహారాష్ట్ర బడుల్లో చదివిన వారి భవిష్యత్తు అంధకారమైపోతున్న తీరుపై ‘సాక్షి’ పరిశీలనాత్మక కథనం. కంగ్టి మండలంలో 2014-15 విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకు 5,524 విద్యార్థులు చదివారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి మూడు ఉన్నత పాఠశాలల్లో కలిపి ఆరు నుంచి 10వ తరగతి వరకు 1,367 మందే మిగిలారు. ఏటా సగటున ఐదో తరగతిలో 1500 మంది విద్యార్థులు పై తరగతికి వెళ్తున్నారు. టెన్త్‌కి వచ్చేసరికి వీరి సంఖ్య 300కి పడిపోతోంది. ఈ విద్యా సంవత్సరంలో కంగ్టి, తడ్కల్, వాసర్ ఉన్నత పాఠశాల్లో 281 మందే టెన్త్ విద్యార్థులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా 75 శాతం మంది విద్యార్థులు ఎటుపోతున్నారు? నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోనూ ఇదే పరిస్థితి. అటూ ఇటూ.. ఎటైనా సమస్యే! కంగ్టి మండలంలో క్లస్టర్‌కు ఒక పాఠశాల చొప్పున మూడే ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మనూరు మండలంలో ఆరు ఉన్నాయి. ఇవి విద్యార్థుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఏళ్లకేళ్లుగా ఇక్కడి పాలకులు, ప్రజాప్రతినిధులు ప్రాథమికోన్నత, ఉన్నత విద్య గురిం చి పట్టించుకోలేదు. తగిన న్ని పాఠశాలలు లేక పొరు గు రాష్ట్రాలైన కర్ణాటక, మ హారాష్ట్రకు విద్యార్థులు వల స వెళ్లిపోతున్నారు. అక్కడి పాఠశాలల్లో చేరి చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచే పిల్లలు గది అద్దెకు తీసుకునో.. బం ధువుల ఇంట ఉంటూనో చదువుకోవులు కొనసాగిస్తున్నారు. ఆడపిల్లలను చిన్న వయసులో అంత దూరం పంపలేక.. తల్లిదండ్రులు బడి మాన్పించి ఇంటి, వంట పనులు పురమాయిస్తున్నారు. ఇక్కడే 50 శాతం విద్యార్థులకు ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలల చదువుకు ఫుల్స్టాప్ పడుతోంది. కంగ్టి మండలం నాగుర్ (కే), (బీ), తురకవడగాం, తడకల్ చాప్టా (బీ), చాప్టా (కే) గ్రామాల్లో వందలాది మంది విద్యార్ధులు బడి మానేశారు. కొందరు పొరుగు రాష్ట్రం స్కూళ్లో చేరి చదువుకోబో తే అక్కడ భాషాపరమైన సమస్య తలెత్తుతోంది. స్థానిక గ్రామాల్లో ఐదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వారు.. కర్ణాటక వెళ్లగానే కన్నడంలో, మ హారాష్ట్రలో మరాఠీలో చదవాల్సి వస్తోంది. ఆ భాషల్లో చదవలేక, రాయలేక దాదాపు 50 శాతం మంది వెనుదిరుగుతున్నారు. నాగుర్ (కే)కి చెందిన సుభాకర్‌ను పలకరి స్తే.. ‘కన్నడం రాయలేక 7వ తగతిలోనే బ డి మానేసి వ్యవసాయం చేసుకుంటున్నా.. ఇప్పుడు నా కొడుకు ఏడు చదువుతుండు, పన్నాలాల్ హీరాలాల్ స్కూల్లో చేర్పించిన, వాడూ కన్నడ రాయరాట్లేదు అని చెప్తుండు’ అని చెప్పాడు. ని‘బంధనాల’ సుడిలో విద్యార్థులు మన రాష్ట్రంలో రెవెన్యూ, విద్యాశాఖ నిబంధనల ప్రకారం 6 నుంచి 10వ తరగతి వర కు వరుసగా ఎక్కడైతే విద్యార్థి చదువుకుం టాడో అక్కడే స్థానికత వర్తిస్తుంది. ఈ నిబంధన ఖేడ్ విద్యార్థులకు శాపమైంది. పొరుగు రాష్ర్టంలో చదివిన విద్యార్థులు ఇటు మన రాష్ట్రంలోనూ, అటు పొరుగు రాష్ట్రాల్లోనూ ‘స్థానికులు’ కాకుండాపోయి ఉద్యోగాలకు దూరమవుతున్నారు. మన రాష్ట్ర నిబంధనల ప్రకారం వరుసగా ఐదేళ్లు పొరుగు రాష్ట్రంలో చదివిన వారు ఆయా రాష్ట్రాల్లోనే స్థానికులవుతారు. కానీ పొరు గు రాష్ట్రాలేమో.. స్థానికత, ఆధార్, ఓటర్ ధ్రువపత్రాల ఆధారంగా స్థానికతను గుర్తిస్తున్నాయి. వీటిని చూసినప్పుడు వారికి ఈ మూడు గుర్తింపు కార్డులు కూడా తెలంగాణలో ఉంటున్నాయి. దీంతో వారు స్థాని క ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు. చదువుకున్న చోటే ఉద్యోగం తీసుకుందామనే ఆలోచనతో తెలంగాణ విద్యార్థులు కర్ణాటక రాష్ట్రంలో స్థానికత పొందేందుకు అక్క డ వారి బంధువుల ఇళ్ల అడ్రసులు పెట్టి ఆధార్, ఓటరు కార్డు, స్థానికత ధ్రువపత్రా లు తీసుకుంటే ఆన్లైన్ విధానం వచ్చాక వాటిని అక్కడా.. ఇక్కడా ఏరివేశారు. దీంతో విద్యార్థులు రెండుచోట్లా కొరగా కుండా పోతున్నారు. స్థానికేతరులమట.. ఒకటి నుంచి 7 వరకు మనూరు మండలం కారముంగిలో చదివిన. 8 నుంచి టెన్త్ వరకు కర్నాటకలోని ఔరాద్ తాలుకా జమ్గిలో చదువుకున్నా. ఇంటర్మీడియట్ అనంతరం డీఎడ్ చేశాను. నేను ఉపాధ్యాయున్ని కావాలి కానీ నాకు స్థానికత అడ్డువస్తోంది. పోనీ తెలంగాణలో ఒకటీ రెండు కన్నడ మీడియం పోస్టులున్నా వాటికి కూడా మాకు అవకాశాలు రావటం లేదు.- జీవన్‌రావు, కారాముంగి వేరేచోట చదివి ఎవుసం చేస్తున్నాం మాకు సదువుదాం అంటే ఏమీ సోయి (సౌకర్యాలు) లేకుండె. కర్ణాటక్లోని సంత్పూర్లో సదువుకుంటే ఆ సదువేమీ పనిచేయలేదు. ఇక్కడ తెలుగులో పది పాసైతేనే నౌకరీలు ఇస్తామన్నారు. అక్కడ మీరు మా రాష్ర్టంలోని వారు కాదనడంతో ఏమీ చేయలేక వ్యవసం చేస్తున్నాం. ఇక్కడ చదివిద్దామంటే సాలెలో సార్లు లేక ఇంకా అక్కడే పిల్లలను చదివిస్తున్నాం. - మేత్రి మల్గొండ, నాగుర్ (కే) బ్యాక్లాగ్ పోస్టులైనా ఇవ్వొచ్చుగా.. ఇక్కడ బడి లేకుంటే కర్ణాటక పోయి చదువుకున్నాం. మాకు కన్నడ వచ్చు. ఉద్యోగాలకు పోతే మమ్ముల్ని స్థానికేతరులు అంటున్నారు. కన్నడ మీడియంలో కొన్నేళ్లుగా 13కు పైగా ఉపాధ్యాయ పోస్టులు బ్యాక్లాగ్ అవుతూనే ఉన్నాయి. అవైనా మాకు ఇవ్వొచ్చు కదా. - గంగమణి, కారముంగి అవకాశం కల్పించాలి కన్నడ మీడియం చదివిన వారికి తెలంగాణలో ఇతర ఉద్యోగాలకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎంతో మంది కన్నడ మీడియం చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు లబిస్థాయి. తమకు ఇప్పటివరకు ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారు లేరు మా గ్రామంలో - రాచమ్మ, కారముంగి అందరిదీ అదే వ్యథ.. కంగ్టి మండలం నాగురు (కే) గ్రామంలో అడివప్ప పాటిల్ (45) అనే వ్యక్తిని కదిలిస్తే.. ‘మా నాయిన మాలి పటేల్. నన్ను చదివించాలని మా నాయినకు బాగుండే. ఇక్కడ చూస్తే బడులు లేవు. కర్ణాటక బడిలో చేర్పించుండు. బీదర్ భూంరెడ్డి కాలేజీలో బీఏ పాసైన. ఇక్కడికొచ్చి ఉద్యోగాలకు ఎంట్రెన్స్‌లు రాయబోతే నేను స్థానికున్ని కాదని చెప్పి అనర్హున్ని అన్నరు. పోనీ మా నాయిన పని మాలి పటేల్‌గిరి చేద్దామనుకుంటే ఎన్టీఆర్ పటేల్ వ్యవస్థను రద్దు చేసె.. దిక్కు లేక వ్యవసాయం చేస్తున్నా’ అని తన గతాన్ని గుర్తు చేశారు. తాజాగా ఆయన కొడుకు అతీష్ పాటిల్దీ అదే పరిస్థితి. అతనిని పలకరిస్తే...‘మా గావ్‌లో సాళె లేక బీదర్వోయి చదివిన. 2007లనే పీయూసీ సదివి ఉద్యోగానికి పోతే.. అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్.. రెండూ ఉద్యోగానికి అర్హున్ని కాదని చెప్పినయి. అదేంది అంటే 6 నుంచి 10 దాకా వరుసగా కర్ణాటకలో చదివిన కాబట్టి ఏపీలో నాన్‌లోకల్ అని, ఏపీలో ఆధార్, ఓటరు కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి కాబట్టి నువ్వు కర్ణాటక రాష్ట్రంలో నాన్‌లోకల్ అని చెప్పి పంపారు. రెండుచోట్లా ఉద్యోగాలు రాక వ్యవసాయం పనులు చేసుకుంటున్నం.మా సదువులు నష్టం అయినా పిల్లలను తెలంగాణలో చదివించి మంచి ప్రయోజకులను చేయాలను కొంటున్నాం’ అని చెప్పాడు. నాగుర్ బీ గ్రామంలో దత్తును కదిలిస్తే.. ‘కర్ణాటకలో పీయూసీ చేసిన. పోలీసు అవుదామని అప్లై చేస్తే స్థానికుడిని కాదన్నారు. చేసేది లేక కరెంటు వైరింగ్ పని చేసుకుంటున్నా’ అని వాపోయాడు. -
సర్దుబాట్లపై స్పష్టతేదీ?
ప్రహసనంగా మారిన టీచర్ల సర్దుబాటు వివరాలు కోరుతున్న విద్యాశాఖ కమిషనర్ బదిలీలు ఉండవంటున్న ఎమ్మెల్సీలు ఉంటే టెన్త్ ఫలితాలపై ప్రభావం మచిలీపట్నం : ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం గందరగోళంగా మారింది. పదో తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ ఉపాధ్యాయుల బదిలీలు ఎంతమేరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. సర్దుబాటు బదిలీల అంశంపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో ఎమ్మెల్సీలు ఎ.ఎస్.రామకృష్ణ, బచ్చల పుల్లయ్య, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు మాట్లాడినప్పుడు బదిలీలు ఇప్పట్లో ఉండవని సూచనప్రాయంగా చెప్పారు. ఆచరణలో మాత్రం వేరే విధంగా ఉండడం వివాదాస్పదమవుతోంది. ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీల్లో వెసులుబాటు ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి చెబుతుండగా, మరో వైపు జాబితా సిద్ధం చేయాలంటూ విద్యాశాఖ కమిషనరేట్ నుంచి డీఈవో కార్యాలయానికి ఆదేశాలు వస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో సర్దుబాటు బదిలీలు జరుగుతాయా లేక వాయిదా పడతాయా అనే అంశంపై స్పష్టత లేకుండాపోయింది. మండలాల నుంచి వివరాల్లేవు సర్దుబాటు బదిలీలకు సంబంధించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి డీఈవో కార్యాలయానికి మిగులుగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలు పంపాల్సి ఉంది. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ మిగులు ఉన్నారో ఎంఈవోలు, డీవైఈవోల వద్ద వివరాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీలు ఇటీవల చేసిన ప్రకటనతో వాటిని డీఈవో కార్యాలయానికి పంపడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. ‘జరగని బదిలీలకు అంత తొందరెందుకు’ అంటూ సమాధానం ఎదురవుతోందని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. శుక్రవారం కూడా డీఈవో కార్యాలయానికి సర్దుబాటు బదిలీల వివరాలు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయి. మండలాల నుంచి వివరాలు రాకపోవడంతో కమిషనర్ కార్యాలయానికి ఏం పంపాలో తెలియక డీఈవో కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. స్పష్టత లేని విధివిధానాలు ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు సంబంధించి నివేదికలు విద్యాశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నా స్పష్టమైన విధివిధానాలు ఇంతవరకు ప్రకటించలేదు. బదిలీల వివరాలు ఆన్లైన్లో ఉంచాలని చెప్పడమే తప్ప మార్గదర్శకాలు ఇంతవరకు ఇవ్వలేదని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సర్దుబాటు బదిలీలు కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరగాల్సిఉంది. అలా జరగాలంటే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఉద్యోగంలో చేరిన తేదీ, సీనియర్, జూనియర్ టీచర్ల వివరాలు సేకరించాల్సి ఉంది. జిల్లాలో 350 మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నట్లు డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో అప్‌గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల అవసరం ఉందని, ఈ తరహా పాఠశాలలు 12కు మించి ఉండవని సిబ్బంది అంటున్నారు. మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఈ తరుణంలో వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే విద్యార్థులు ఇబ్బందిపడతారన్నది ఉపాధ్యాయుల వాదన. -
టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
మొయినాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని ఉన్నత పాఠశాలలో చేవెళ్ల ఎంపీ విశేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు టాయిలెట్లను శుభ్రం చేశారు. మంగళవారం విజయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని టాయిలెట్లను, మరుగుదొడ్లను పరిశీలించారు. గ్రామంలోని పాఠశాల మధ్యనే మురుగునీటి కాల్వ ప్రవహిస్తుండడంతో దానిపై ఎలాంటి కప్పు లేనందున అధికారులు వెంటనే స్పందించాలన్నారు. బీసీ స్లాబ్ వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, సర్పంచ్‌ను ఆదేశించారు. -
కామాంధుడికి రిమాండ్
చిత్తూరు (అర్బన్): చిత్తూరులోని ఓ ఉన్నత పాఠశాలలో చదివే బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడుగా ఉన్న శ్యామ్యూల్ ప్రఫుల్లా (54)ను సోమవారం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐ నిరంజన్‌కుమార్ వివరాలు వెల్లడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భర్త శామ్యూల్ ప్రఫుల్లా ఈ నెల 2న లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రఫుల్లాపై నిర్భయ యాక్టు, ఐపీసీ 376 (2), (ఐ), సెక్షన్ 4, 10, బాలికలపై లైగింక దాడుల నిరోధక చట్టం (పోక్సా)-2012 కింద కేసులు నమోదు చేశామన్నారు. బాలికను ఇప్పటికే వైద్య పరీక్షలకు పంపి, ఆధారాల కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలు పంపామన్నారు. నిందితుడి నుంచి సైతం రక్త నమూనాలు సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామన్నారు. కాగా నిందితున్ని చిత్తూరులోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా ఇతనికి 14 రోజుల రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిందితున్ని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. -
భోజనం మంటలు
తాండవ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వివాదాస్పదంగా మారింది. నిర్వాహకుల మధ్య వివాదం తలనొప్పిగా మారడంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయులు మూకుమ్మడి సెలవు పెట్టేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. - ఎండీఎం నిర్వాహకుల మధ్య వివాదం - ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారిన వైనం - మూకుమ్మడి సెలవుకు నిర్ణయం నాతవరం : తాండవ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ హైస్కూల్లో తొలుత మాదాలమ్మ డ్వాక్రా గ్రూపునకు చెందిన బంగారి అచ్చుతాంబ పథకం వంటలు చేస్తుండేది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మాదాలమ్మ, గంగాలమ్మ గ్రూపులకు చెందిన ఆరుగురు వంటలు చేస్తుండేవారు. నిర్వహణ విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతో అచ్చుతాంబ, సత్యకళ, వేగి సత్యవతి ఒక వర్గంగా, సుర్ల కొండమ్మ, రాజు, సత్యవతి మరో వర్గంగా విడిపోయి గతేడాది గొడవ పడ్డారు. అప్పట్లో ఈ విషయాన్ని హెచ్ఎం కామేశ్వరరావు మండల కమిటీకి ఫిర్యాదు చేశారు. తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్ఐ, విద్యాకమిటీ సభ్యుల సమక్షంలో సమావేశమయ్యారు. ఏడాదిపాటు ఒక వర్గం చొప్పున వంటలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభం రోజున ఇరువర్గాలు హైస్కూలుకు వచ్చి వంటలు చేసేందుకు పోటీపడి గొడవపడ్డారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో హెచ్ఎం కామేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవికుమార్ హైస్కూల్‌కు వెళ్లి తగదా లేకుండా చర్యలు తీసుకున్నారు. అదే రోజున డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎంఈవో అమృతకుమార్ భోజన పథకం నిర్వాహకులతో పాఠశాల సిబ్బంది సమావేశమయ్యారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ వారు తీరులో మార్పురాలేదు. తరచూ ఉపాధ్యాయులతో వారు గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయులు శుక్రవారం తహశీల్దార్ కనకారావును కలిసి సమస్యను వివరించారు. రెండు గ్రూపులను తొలగిస్తాం విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిధంగా వ్యవహరిస్తే రెండు గ్రూపులను తొలగించి, మరొకరికి మద్యాహ్నన భోజనం నిర్వహణ అప్పగిస్తాం. - లింగేశ్వరెడ్డి, డిప్యూటీ డీఈవో మాకే ఆదేశాలు ఉన్నాయి మాకు హైస్కూల్లో వంటలు చేసేందుకు డీఈవో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. అందుకే మేమే వంటలు చేస్తున్నాం. ఈ విషయంలో తగ్గేది లేదు. - అచ్చుతాంబ, సత్యకళ, సత్యవతి (మాదాలమ్మా డ్వాక్రా గ్రూపు) మేమే వంటలు చేయాలి గతంలో మేము వంటలు చేశాం. ఇప్పుడు మాకే అవకాశం ఇవ్వాలి. అవతలి గ్రూపువారు స్థానికంగా ఉండటం లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు తాండవ గ్రామంలో లేవు. - కొండమ్మ, రాజు, సత్యవతి (గంగాభవాని డ్వాక్రా గ్రూపు) మూకుమ్మడి సెలవే మార్గం నిర్వాహకుల వివాదాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించలేదు. వారినుంచి ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేక మూకుమ్మడి సెలవు పెట్టాలని నిర్ణయించి, తహశీల్దార్‌కు తెలియజేశాం. - డి.కామేశ్వరావు, హెచ్ఎం, తాండవ హైస్కూల్ -
స్కూల్లో అగ్ని ప్రమాదం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటలో ఓ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం కావటంతో విద్యార్థులు ఎవరూ లేరు. దాంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ ప్రమాదంతో దాదాపు రూ.6లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
స్కూల్లో విద్యుత్ షాక్... విద్యార్థిని మృతి
ఎలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం విలపకుర్రు హైస్కూల్లో విద్యుత్ షాక్‌కు గురై ఆరో తరగతి విద్యార్థిని మృతి చెందింది. చింతదిబ్బ గ్రామానికి చెందిన విద్యార్థిని మౌనిక సోమవారం ఉదయం స్కూల్ ఆవరణలోని నీటి ట్యాంక్ వద్దకు వెళ్లగా ఎర్త్‌వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. స్థానికులు హుటాహుటిన ఆమెను పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
కాలేజీలో హెడ్మాస్టర్ ఆత్మహత్య
మచిలీపట్నం: కృష్ణాజిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని శనివారం కళాశాల సిబ్బంది గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన డిగ్రీ కాలేజీకి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగాయలంక మండలం ఎదురుమొండి హైస్కూల్ హెడ్మాస్టర్గా పోలీసులు గుర్తించారు. హెడ్మాస్టర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘టెన్’షన్..
మందమర్రి : పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 25వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్ని పరీక్ష పత్రాలో తెలియకుండా.. పూర్తికాని సిలబస్.. సబ్జెక్ట్ కొరత నేపథ్యంలో విడుదలైన పరీక్షల షెడ్యూల్‌తో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు ఎలా రాసేదని మదనపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 417 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి అదనంగా ఏడు మోడల్ హై స్కూల్స్ పని చేస్తున్నాయి. ఆయా ఉన్నత పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్న వారున్నారు. 37 వేల మంది రె గ్యులర్ విద్యార్థులు పదో తరగతి చదువుతుం డగా మరో ఎనిమిది వేల మంది ప్రైవేట్ వారున్నారు. వీరంతా మార్చి నెలలో జరిగే పబ్లిక్ ప రీక్షలకు హాజరు కావాల్సి ఉంది. వాస్తవానికి డి సెంబర్ నెలాఖరులోగా అన్ని సబ్జెక్టుల్లో సిలబ స్ పూర్తి కావాల్సి ఉంది. జనవరి నుంచి రివిజన్ తరగతులు బోధించాలి. కానీ.. కొత్త పాఠ్యాంశాలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 70 హైస్కూళ్లలో అయోమయం... జిల్లాలోని మొత్తం 424 ఉన్నత పాఠశాలల్లో చాలా వాటిలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ము ఖ్యంగా గణితం, ఇంగ్లిష్, సామాన్యశాస్త్రం బో ధించే ఉపాధ్యాయులు లేరు. దాదాపు 70 నుం చి 80 ఉన్నత పాఠశాలల్లో ఈ సమస్య ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాచారాన్ని బట్టి తె లుస్తోంది. కేవలం సబ్జెక్టు టీచర్లు ఉన్నచోటే సి లబస్ పూర్తి కావొచ్చే దశలో ఉంది. వీరు లేనిచో ట పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్ప టికే ఆరు నెలల బోధన సమయం గడిచిపోయింది. మొన్నటి వరకు కామన్ కాంప్రినెన్స్ ఎ వాలేషన్(సీసీఈ)పై సమగ్ర శిక్షణ, స్పష్టత లే కుండా పోయింది. దేనికి ఎన్ని మార్కులు వే యాలన్నదీ తెలియని పరిస్థితి. ఎలాంటి క్లారిటీ లేక ఇటు సిలబస్ పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సైతం సతమతమవుతున్నారు. తుస్సుమన్న జీవో 6.. రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేపట్టాల్సి ఉంది. ఇందుకు జీవో నంబర్ 6ను ప్రభుత్వం విడుదల చేసింది. కా నీ.. ఎక్కడా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టింది లేదు. పర్యావసానంగా పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేరు.. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు. జీవో అమలు కాకపోయినా కనీసం స్కూల్ అసిస్టెంట్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేకపోయింది. పైగా అకాడమిక్ ఇన్స్పెక్టర్ల(ఏఐ)ను ఇస్తామన్న ప్రభుత్వం వారి ఊసే ఎత్తలేదు. అసలే పుస్తకాలు మారాయి. మారిన పుస్తకాలపై ఉపాధ్యాయులకు కనీసం శిక్షణ కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఏదో మొక్కుబడిగా నవంబర్ నెలలో నామమాత్రపు శిక్షణ ఇచ్చారు. మరోవైపు ఏఐల నియామకం లేదు. దీనికితోడు గతంలో మాదిరి విద్యవాలంటీర్ల నియామకాన్ని చేపట్టే వీలే లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీవీలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లేదని ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి ఎటూ పాలుపోని విధంగా మారింది. ప్రశ్నాపత్రాలపై గందరగోళం.. అసలే టీచర్ల కొరతతో సిలబస్ పూర్తికాక విద్యార్థులు తంటాలు పడుతుంటే మరోవైపు ప్రశ్నాపత్రాలపై గందరగోళం నెలకొంది. గతంలో 11 ప్రశ్నాపత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. 11 పేపర్లు కాకుండా ఏడు పేపర్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం తొమ్మిది పేపర్లకు నిర్ణయం మార్చుకుంది. ఇలా 15 రో జులకోమారు 9, 7, 11 పేపర్లు అంటూ ప్రకట నలు చేస్తుండడం విద్యార్థులను గందరగోళానికి దారితీసింది. ఎట్టకేలకు 11 పేపర్లు అన్నది స్పష్టం అయినా నేడు సిలబస్ సమస్యగా పరిణమించింది. ప్రాజెక్టు మార్కులెలా వేసేది..? పదో తరగతి పరీక్షలు అటు విద్యార్థులతోపా టు ఇటు ఉపాధ్యాయులకు సైతం ప్రహసనం గా మారాయి. ప్రధానంగా ప్రాజెక్టు మార్కులు ఎలా వేసేదని వారు తలలు పట్టుకుంటున్నా రు. కొత్తగా చేపట్టిన విధానంతో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు మార్కులను ఉన్నతాధికారులు రూ పొందించారు. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు ఉపాధ్యాయులే వేయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టు వారిగా ప్రాజెక్టు పని పూర్తి చేసిన విద్యార్థులకు సదరు మార్కులు వేయాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జిల్లాలోని చాలా ఉన్నత పాఠశాలల్లో ప్రాజెక్టులు తయారు చేసేందుకు అనుకూ ల వాతావరణం లేదు. ముఖ్యంగా సైన్స్ సబ్జె క్టు విషయానికొస్తే ల్యాబ్ తప్పనిసరి. ఈ సౌకర్యం పాత ఉన్నత పాఠశాలల్లో తప్ప మరెక్కడా లేదు. కేవలం 20 శాతం ఉన్నత పాఠశాలలకే ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రాజెక్టు ఇచ్చినా, వాటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన వారు లేరు. ఈ తరుణంలో 20 మార్కులు ఎలా వేసేదని ఉపాధ్యాయులే జుట్టు పీక్కుంటున్నారు. జనవరి వరకు పూర్తి చేయొచ్చు... - కె.సత్యనారాయణరెడ్డి, డీఈవో, ఆదిలాబాద్ పదో తరగతి విద్యార్థులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. జనవరి 30వ తేదీ వరకు సిలబస్ పూర్తిచేయొచ్చు. సబ్జెక్టు టీచర్లు లేని మాట వాస్తవమే. దీన్ని అధిగమించేందుకు డి ప్యూటేషన్‌పై కొందరిని నియమిస్తున్నాం. అదేవిధంగా బీఈడీ పూర్తి చేసి ఉన్న వారితో బోధిం చేందుకు చర్యలు తీసుకుంటున్నం.ప్రాజెక్టులకో సం బాధ లేదు. అన్ని పాఠశాలల్లో మెటీరియల్ ఉంది. ల్యాబ్‌లు ఉండాల్సిన అవసరం లేదు. పది పరీక్షలు కష్టమే - టి.ఇన్నారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు కష్టమే. ఉపాధ్యాయులు, పిల్లలు సత మతమవుతున్నారు. ప్రాజెక్టు మార్కులు ఎలా వేసేదో తెలియడం లేదు. ప్రాజెక్టు చేయకుండా విద్యార్థిని ఎలా అంచనా వేస్తాం. మార్కులెలా వేస్తాం. ఈ ఏడాదికి ప్రాజెక్టు విధానం తీసేయాలని ఉన్నతాధికారులను కోరాం. పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని సూచించిన ఎవరూ పట్టించుకోవడం లేదు. మొత్తానికి పరీక్షలు ప్రశ్నార్థకంగానే మారాయి. -
వంట రగడ
‘ఏజెన్సీ’ వివాదం గ్రామ యువకుల జోక్యంపై హెచ్ఎం వ్యాఖ్యలు ఆగ్రహంతో రగిలినస్థానికులు చర్చలతో సర్దుబాటు గట్టు : మండల కేంద్రమైన గట్టులోని ఉ న్నత పాఠశాలలో వంట ఏజన్సీ వ్యవహా రంపై సోమవారం ఉన్నత పాఠశాలలో గ్రామస్తులకు, పాఠశాల హెడ్మాస్టర్ మేరమ్మకు మధ్య రగడ జరిగింది. దీంతో ఉద్రికత్తత పరిస్థితులు నెలకొనగా మధ్యలో విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉన్నత పాఠశాలలో పాత వంట ఏజన్సీ వారు వంటను సక్రమంగా తయారు చేయడం లేదంటూ వారిని తొలగించేందుకు హెడ్మాస్టర్ మేరమ్మ ప్రయత్నించారు. ఈ క్రమంలో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్త వంట ఏజన్సీ వారితో పాటుగా పాత వంట ఏజన్సీ వారు అక్కడి చేరుకున్నారు. తాము వంట చేయడానికి సిద్ధంగా ఉన్నా, హెడ్మాస్టర్ తమకు బియ్యం ఇవ్వడం లేదని, తమను తొలగించినట్లుగా రాత పూర్వకంగా ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని పాత వంట ఏజన్సీ వారు భీష్మించుకుకూర్చున్నారు. ఈ సమయణంలో గ్రామ యువకులు జోక్యం చేసుకుని, విద్యార్థులు పస్తులుండకుండా పాత వంట ఏజన్సీకి బియ్యం అందించాలని, అందరం కూర్చొని చర్చిం చుకుని సమస్యను పరిష్కరించుకుందామని అన్నారు. ఈ క్రమంలో కొందరు యువకులను ఉద్ధేశించి హెడ్మాస్టర్ మేరమ్మ జులాయిలు అనే పదం ఉపయోగించడంతో యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెడ్మాస్టర్ను నిలదీశారు. హెడ్మాస్టర్ క్షమాపణ చేప్పే దాకా వదిలేది లేద ంటూ మండి పడ్డారు. ఈ వ్యవహారం ఇన్చార్జ్ తహశీల్దార్ తిరుపతయ్య, ఎంఈఓ రాంగోపాల్ దాకా వెళ్లింది. వారు ఉన్నత పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, యువకులు, హెడ్మాస్టర్తో కలసి మరో మారు చర్చలకు కూర్చున్నారు. మధ్యే మార్గంగా ఎంఈఓ పాత వంట ఏజన్సీకి 30 రోజుల గడువు ఇచ్చి చూద్దామని, వారి పని తీరును ఎంపీడీఓ, తహశీల్దార్, ఎంఈఓలతో కూడిన త్రీమెన్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. పాఠశాలలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. వేరే గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చి ంది. కాగా హెడ్మాస్టర్ మేరమ్మ తమకు వద్దని, ఆమెను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి సరెండర్ చేయాలన్న తీర్మాణించిన కొందరు ఆ కాపీని ఎంఈఓ రాంగోపాల్‌కు అందజేశారు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
సిద్దిపేట రూరల్/చిన్నకోడూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో మంగళవారం వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా.. సిద్దిపేట మండలం లింగారెడ్డి గ్రామానికి చెందిన దేశెట్టి భద్రయ్య (68) భార్య రాఘవ్వతో కలిసి ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారం రోజులుగా వడదెబ్బకు గురైన తీవ్ర అస్వస్థతకు గురైన భద్రయ్య ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వర్షం వస్తుండడంతో నివాసం ఉంటున్న గుడిసె కూలిపోయింది. కాగా అంతకు మందే అతను ఇంటి ముందు కూర్చుని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారు ఆర్థికంగా లేకపోవడంతో గ్రామస్తులు పలువురు చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రాఘవ్వ ఉంది. దీంతో ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బొండ్ల రామస్వామి, మాజీ సర్పంచ్ రాజయ్య, నాయకులు పరశురాములు, రామాగౌడ్లు కోరారు. వడదెబ్బతో మహిళా కూలీ మృతి చిన్నకోడూరు : వడదెబ్బతో మహిళా కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని విఠలాపూర్‌లో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన దండెబోయిన ఎల్లవ్వ (60) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు కావడంతో ఉపాధి హామీ కూలీ పనులకు వెళుతోంది. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. మంగళవారం చికిత్స నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించే క్రమంలో ఎల్లవ్వ మృతి చెందింది. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ సురేందర్‌రెడ్డి కోరారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ మండల కన్వీనర్ సుంచు రమేష్, నేతలు పుష్పలతలు పరామర్శించి ఓదార్చారు. -
హైస్కూళ్లకు రూ. 2.69 కోట్లు విడుదల
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) కార్యక్రమాల అమలుకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం రూ. 2.69 కోట్లు విడుదల చేసింది. ఆర్‌ఎంఎస్‌ఏ కార్యక్రమాల అమలుకు గుర్తించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉన్నత పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని పాఠశాలలకు ఈ నిధులు విడుదల చేశారు. ఈ నిధులు నేరుగా పాఠశాల యాజమాన్య, అభివృద్ధి కమిటీల (ఎస్ఎండీసీ) బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. పాఠశాల గ్రాంటు కింద ఒక్కో హైస్కూలుకు రూ.50 వేల చొప్పున 368 హైస్కూళ్లకు రూ.1.84 కోట్లు జమ చేశారు. అదేవిధంగా స్వల్ప మరమ్మతులకు ఒక్కో పాఠశాలకు రూ.25 వేల చొప్పున 341 పాఠశాలలకు రూ. 85.25 లక్షలిచ్చారు. మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు. నిధుల వినియోగానికి మార్గదర్శకాలివీ... ఉన్నత పాఠశాలలకు విడుదల చేసిన పాఠశాలల గ్రాంటు, మరమ్మతుల గ్రాంటును వినియోగించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాల గ్రాంటుగా విడుదల చేసిన రూ. 50 వేలల్లో రూ.25 వేలను పాఠశాలల్లో సైన్స్, గణితం కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. వీటితో ప్రయోగశాలల మరమ్మతులకు, ప్రయోగశాలల పాత సామగ్రిని తొలగించి కొత్త సామగ్రిని సమకూర్చుకునేందుకు, ప్రయోగశాలలో రోజువారీ ఉపయోగించే వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగించాలి. 9,10 తరగతుల విద్యార్థులకు ఉపయోగించే ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించేందుకు అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవాలి. పాఠశాలకు గ్రంథాలయ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు, దినపత్రికలు, ఇతర పీరియాడికల్స్ను పాఠశాలకు తెప్పించేందుకు రూ.10 వేలు వినియోగించుకోవాలన్నారు. కేంద్రియ విద్యాలయ సమితి (కేవీఎస్) సిఫార్సు చేసిన పుస్తకాలను కొనుగోలు చేయాలన్నారు. = పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ చార్జీలు, టెలిఫోన్ చార్జీలు, ఇంటర్నెట్ చార్జీలు, ఇతర చార్జీలకు రూ.15 వేలు వినియోగించాలి. = పాఠశాలల్లో స్వల్ప మరమ్మతులకు రూ.25 వేలు ఖర్చుచేయాలి. ఈ మొత్తంలో 50 శాతం నిధులను మాత్రమే సివిల్ వర్కులకు కేటాయించాలి. పక్కా భవనాల మరమ్మతులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. పాఠశాల భవనాల మరమ్మతులు, ఆట స్థలం, కంప్యూటర్ రూమ్‌లోని ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు, గోడలకు సున్నం వేయించడం, పెయింటిం గ్లు, శానిటరీ ఇతర ఫిట్టింగ్‌ల మరమ్మతులకు ఈ నిధులను వినియోగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల మేరకు నిధులు వినియోగించాలి. నిధులు కేటాయించిన అంశాలకు వినియోగించకుండా ఇతర అంశాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు. -
ఆకలి చదువులు
ఆకలి చదువులు గుంటూరు ఎడ్యుకేషన్ ,పరీక్షలకు సిద్ధ మవుతున్న పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతుల్లో అల్పాహారం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఓ పక్క పరీక్షలు ముంచుకొస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ హైస్కూళ్లలో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు అల్పాహారం అందించే విషయమై అధికారులు ఇప్పటి వరకూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మార్చి 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 28 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. గతేడాది ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ హైస్కూళ్ల విద్యార్థులకు జెడ్పీ నిధులతో పరీక్షలకు రెండు నెలల ముందు నుంచే అల్పాహారం అందించారు. ఈ ఏడాది మరో 40 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నా ఇప్పటి వరకు అల్పాహారం పంపిణీ చేపట్టలేదు. ఓ వైపు సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో తరగతులు సక్రమంగా జరుగక విద్యార్థులు చదువులో వెనుకబడే పరిస్థితులుండగా, మరో వైపు అదనపు తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందించి ప్రోత్సహించడంలో అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సాధారణ, అదనపు తరగతుల నిమిత్తం ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకూ పాఠశాలలకే విద్యార్థులు పరిమితమవుతున్నారు. పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు రాత్రి వరకు నీరసించకుండా గతేడాది ఉప్మా, చపాతీ, ఇడ్లీ తదితరాలు సాయంత్రం వేళల్లో అందించారు. ఈ ఏడాది ఇంకా అల్పాహారం పంపిణీ చేపట్టకపోవడంతో విద్యార్థులు రాత్రి వరకూ ఉత్సాహంగా చదువులో నిమగ్నమవడం సాధ్యం కావడం లేదు. ఇకనైనా టెన్త విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. మున్సిపల్ స్కూళ్లల్లో ఇప్పటికే.. గుంటూరు నగరపాలకసంస్థతోపాటు పలు మున్సిపాల్టీల పరిధిలోని హైస్కూల్లో ఆయా మున్సిపాల్టీల నిధులతో డిసెంబర్ నుంచే విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గతేడాది వరకూ జెడ్పీ నిధులతోనే అల్పాహారం అందించగా, ప్రస్తుతం ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల విద్యార్థులకే పరిమితం చే యనున్నట్టు తెలిసింది. ఫలితంగా ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందే పరిస్థితులు లేవు. నిధులు విడుదల.. పదో తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్ నిధులతోనే ప్రతి యేటా అల్పాహారం అందిస్తున్నాం. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి అల్పాహారం అందజేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన మేరకు జెడ్పీ అధికారులు నిధులు విడుదల చేశారు. ఈనెల 20 నుంచి అల్పాహారం అందించే అవకాశముంది. -డి.ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖాధికారి -
ఎంపీలపై దాడి అమానుషం
ఎంపీలపై దాడి అమానుషం సమైక్యాంధ్రను కోరుతూ లోక్‌సభలో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎంపీలపై కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడి అమానుషమని స్థానిక జెడ్పీ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయుడు పెద్దింటి సారంగపాణి అన్నారు. ఎంపీలపై దాడిని నిరసిస్తూ గురువారం సాయంత్రం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ైెహ స్కూలు నుంచి కట్టెల అడితీల సెంటర్‌మీదుగా ఐలాండ్ సెంటర్ చేరుకుని విద్యార్థులతో మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా జరిగిన దాడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఐలాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు సమైక్యాంధ్ర ఆకాంక్షను వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అప్పిరెడ్డి, నాగేశ్వరరావు, మల్లారెడ్డి, అబ్దుల్ రజాక్, ఖాశింపీరా, సాంబశివరావు, శంకరనారాయణ, ప్రసాద నారాయణ పాల్గొన్నారు. విద్యార్థి జేఏసీ ఖండన లోక్‌సభలో గురువారం సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడిని విద్యార్థి జేఏసీ నాయకులు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా విభజన నిర్ణయం తీసుకోవడమే కాకుండా అడిగినవారిపై దాడులకు పాల్పడ డం దారుణమని జేఏసీ నాయకులు ఎండీ అలీం పేర్కొన్నారు. టీ బిల్లు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేవరకు ఆందోళనను ఆపేది లేదన్నారు. ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో జేఏసీ నాయకులు మణిదీప్, కిరణ్, ఫిరోజ్, కరీమ్, నాగుల్, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
ముద్ద అన్నం
ముద్ద అన్నం తినలేకపోతున్నాం.. కారంపూడి... అన్నం ముద్దగా, సంకటి కంటే అధ్వానంగా ఉండడంతో తినలేకపోతున్నామని ఎంపీడీవో వై రాజగోపాల్, ఎంఈవో వీవీ ఆచారికి స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఫిర్యాదుచేశారు. పదో తరగతి కు అధికారులు బుధవారం పరీక్షలపై పలు మార్గదర్శక సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అన్నం, కూరలను రుచి చూశారు. అన్నం ముద్దగా ఉండడాన్ని అధికారులు గమనించారు. రోజూ ఇలాగే వుంటోందా అని విద్యార్థులను ఆరాతీశారు. కొద్దిరోజుల నుంచి ఇలాగే ఉంటున్నదని, తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. బియ్యాన్ని మార్చి సరఫరా చేయాలని కోరారు. తహశీల్ధార్ దృష్టికి తీసుకెళ్లి మంచి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. పరీక్షలు దగ్గరకొస్తున్న దృష్ట్యా విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి ఉంటుందని రుచికరంగా వండి పెట్టాలని వంటవాళ్లకు సూచించారు. ఇక్కడ 220 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు వంటవాళ్ళు తెలిపారు. నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి అంతకుముందు పాఠశాలలో చదువుతున్న 180 మంది పదో తరగతి విద్యార్థులకు ఎంపీడీవో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉన్న 40 రోజులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఒత్తిడి లేకుండా, కచ్చితమైన సమయపాలనతో ఇష్టపడి చదువుకోవాలన్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించి మండలానికి మంచిపేరు తేవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంఇవో వీవీ ఆచారి, హెచ్ఎం కోమలాదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పొలికేక విజయవంతం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం నిర్వహించిన ‘ప్రొద్దుటూరు పొలికేక’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ సభను నిర్వహించారు. సభకు సమన్వయకర్తలుగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉషారాణి, ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డిలు సభ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. నాలుగు రోజుల ముందు ఇందు కోసం ప్రత్యేకంగా పొలిటికల్, నాన్ పొలిటికల్, ఉపాధ్యాయ జేఏసీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గం అంతా విస్తృత ప్రచారం చేయడంతో సభకు లక్ష మందికిపై జనం హాజరయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు ఉద్యోగుల వేషధారణ ప్రత్యక ఆకర్షణగా నిలిచాయి. మరికొంత మంది విద్యార్థులు, ఉద్యోగులు దేశభక్తి గేయాలు ఆలపించారు. యూకేజీ విద్యార్థి జేసుతోపాటు టీచర్ వెంకటేశ్వరరెడ్డిలు అల్లూరి సీతారామరాజు, వీఆర్ఓ రాజశేఖరరెడ్డి శ్రీకృష్ణదేవరాయులు వేషధారణలు, వంగపండు ఉష సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.