నిధుల్లో అధికభాగం విద్యుత్‌ బిల్లులకే.. | Electricity bills of high school | Sakshi
Sakshi News home page

నిధుల్లో అధికభాగం విద్యుత్‌ బిల్లులకే..

Published Mon, Aug 7 2017 11:09 PM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటు, విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు నిధుల కొరతను తీర్చడం

► హైస్కూళ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్‌ఎంఎస్‌ గ్రాంటు విడుదల
► సైన్స్‌ పరికరాలు, డిజిటల్‌ తరగతుల నిర్వహణకు సగం నిధులు
► విద్యుత్‌ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తేనే మేలంటున్న ఉపాధ్యాయులు
► ఉమ్మడి జిల్లాలోని 462 ఉన్నత పాఠశాలలకు రూ. 2.31 కోట్లు



మోర్తాడ్‌(బాల్కొండ):
ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటు, విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు నిధుల కొరతను తీర్చడం కోసం ప్రభుత్వం రాష్ట్రీయ మాధ్యమిక మిషన్‌ ద్వారా నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ. 50 వేల చొప్పున నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 462 పాఠశాలలకు రూ. 2.31 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే ఈ నిధుల్లో సింహ భాగం విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికే సరిపోతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలను కేటగిరి 7లో ఉంచడం వల్ల ఒక యూనిట్‌కు రూ. 2 నుంచి రూ. 4 చార్జీ చేయబడుతుంది.

దీనివల్ల ప్రతి పాఠశాలకు నెలకు విద్యుత్‌ బిల్లుల భారం ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక్కో పాఠశాలకు రూ. 2,500ల నుంచి రూ. 3,500వరకు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రీయ మాధ్యమిక మిషన్‌ ద్వారా కేటాయించిన నిధుల్లో ఎక్కువ శాతం విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి సరిపోతుండడంతో ల్యాబ్‌ సామగ్రి, పుస్తకాలు, దినపత్రికలు, డిజిటల్‌ తరగతుల నిర్వహణ కష్టమవుతోంది. పాఠశాలలకు కేటాయించిన గ్రాంటులో 50 శాతం నిధులను బోధన కోసం వినియోగించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కానీ పాఠశాలల్లో ఫ్యాన్లు, బోరు మోటారు వినియోగం, డిజిటల్‌ తరగతుల నిర్వహణ, కంప్యూటర్‌ ల్యాబ్‌ నిర్వహణ రెగ్యులర్‌గా కొనసాగుతుండడంతో విద్యుత్‌ చార్జీ ఎక్కువ అవుతుంది.

పాఠశాలలకు గ్రాంటును కేటాయించడం వల్ల విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోతే అధికారులు విద్యుత్‌ సౌకర్యం నిలిపివేస్తారనే ఉద్దేశ్యంతో చార్జీల చెల్లింపును పూర్తి చేస్తున్నారు. దీంతో విద్యాశాఖ సూచించిన విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా సౌకర్యాలను కల్పించలేకపోతున్నారు. అలాగే ఈ గ్రాంటు నుంచి పాఠశాలల మరమ్మతులు, నీటి సౌకర్యం కోసం వినియోగించాలని సూచిస్తున్నారు. కానీ మంజూరైన నిధుల శాతం తక్కువగా ఉండడంతో మౌలిక వసతులను కల్పించలేకపోతున్నారు. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఒక్కో పాఠశాలకు కేటాయించే రూ.7 వేల నిధులను కేవలం మెయింటెనెన్స్‌ కోసం వినియోగించాలి.

కానీ రాజీవ్‌ మాధ్యమిక విద్యామిషన్‌ పథకం కింద కేటాయించే నిధులను మాత్రం విద్యార్థులకు ప్రయోజనం కలిగించే పనులకు వినియోగించాల్సి ఉంది. నిధుల వినియోగంలో ఎలాంటి పొరపాట్లు చేసినా కఠిన చర్యలు తీసుకొనే అధికారం ఉన్నతాధికారులకు ఉంది. నిధులను పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాలో జమ చేశారు. 2017–18 విద్యా సంవత్సరం కోసం కేటాయించిన నిధులను ఈ విద్యా సంవత్సరంలోనే ఖర్చు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా పాఠశాలల విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే భరిస్తే పాఠశాలలకు భారం తప్పుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన గ్రాంటును పూర్తిగా విద్యా బోధన కోసం వినియోగించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement