
పత్రిక నిర్వహణ ఆషామాషీ కాదు. చేయితిరిగిన రచయితలు, పాత్రికేయులు సైతం పత్రికను స్వయంగా నిర్వహించాలంటే, వెనుకాడుతారు. అలాంటిది కొందరు హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో మాసపత్రికను తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ముప్పయిమూడు సంచికలను వారు విజయవంతంగా ప్రచురించారు. ఇటీవల ప్రచురించిన ముప్పయిమూడో సంచికను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు.
లెక్కల మాస్టారి చొరవతో ప్రారంభం
విద్యార్థులు నడుపుతున్న ఈ మాసపత్రిక పేరు ‘మంగళ విద్యావాణి’. మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు, గణిత అవధాని అరుణ్‌శివప్రసాద్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో 2018లో ఈ పత్రికను ప్రారంభించారు. సొంత ఖర్చులతో తొలి సంచికను ప్రచురించారు.
తొలి నాలుగు నెలలు 8 పేజీలు, ఆ తరువాత 12 పేజీలు, ప్రస్తుతం 16 పేజీలతో మాసపత్రిక నడుస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో 20, 24, 28 పేజీలతో కూడా సంచికను వెలువరించారు. మాసపత్రిక నిర్వహణలో ముఖ్యపాత్ర అరుణ్‌శివప్రసాద్‌దే. పత్రిక రూపకల్పన, ఆవిష్కరణ, దాతలను సంప్రదించడం వంటి కార్యక్రమాలను ఆయనే చూసుకుంటున్నారు. పత్రికను 16 పేజీలతో తేవడానికి రూ.4 వేలు ఖర్చవుతోంది.
మాసపత్రిక ప్రచురణ ఖర్చులను దాతల నుంచి స్వీకరిస్తుంటారు. ప్రతి నెలా 250 ప్రతులను ముద్రిస్తున్నారు. ఈ పత్రికను పాఠశాలలో రెండువందల మందికి ఉచితంగా అందిస్తున్నారు. మిగిలిన ప్రతులను పరిసర ప్రాంతాలలోని ఉన్నత పాఠశాలలకు అందిస్తున్నారు. సొంత ముద్రణాలయం లేనందున ఇతరుల చేత డీటీపీ చేయించి, జిరాక్స్ చేసి పంపిణీ చేస్తున్నారు. కవర్‌పేజీ కన్నా సెంటర్ పేజీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సెంటర్ పేజీల్లో విద్యార్థులు గీసిన చిత్రాలు, పాఠశాల కార్యక్రమాల ఫొటోలను ప్రచురిస్తున్నారు.
ఉపాధ్యాయుల సహకారం
పత్రిక ప్రచురణలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అన్నివిధాలా సహకరిస్తున్నారు. పత్రికలో ప్రచురించే రచనలకు తగిన అంశాలపై సూచనలు చేయడమే కాకుండా, వాటిలో అక్షరదోషాల సవరణ బాధ్యతలను ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకుని, పూర్తిగా విద్యార్థులే ఈ పత్రికకు రచనలు చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు, మంత్రులు, వారి శాఖలు, శాస్త్రవేత్తల చరిత్రలు, క్రీడలపై కథనాలు, కవితలు వంటి రచనలతో పత్రికను ముచ్చటగా తీసుకొస్తున్నారు. విద్యార్థుల చిత్రలేఖనానికి ప్రత్యేకంగా పేజీని కేటాయించి, ప్రోత్సహిస్తున్నారు. చివరి పేజీలో పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల ఫొటోలను, వారి వివరాలను ప్రచురిస్తున్నారు.
పఠనాసక్తిని పెంపొందించడానికే!: అరుణ్‌శివప్రసాద్
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికను ప్రారంభించాం. విద్యార్థుల్లో రచనాసక్తిని పెంపొందించడం, వారిలోని కళానైపుణ్యాన్ని వెలికి తీయడం, పోటీ తత్త్వాన్ని పెంపొందించడం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు విద్యార్థులు భవిష్యత్తులో ఎదుర్కొనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు దోహదపడేలా పత్రికను తీసుకొస్తున్నాం.
సహకారం అందిస్తున్న దాతలు
మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వారా నడుపుతున్న ‘మంగళ విద్యావాణి’ పత్రిక మొదటి సంచికను వ్యవస్థాపకుడు అరుణ్‌శివప్రసాద్ సొంత ఖర్చులతో ప్రారంభించారు. తరువాత సహోపాధ్యాయులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, వివిధ పాఠశాలల యాజమాన్యంతో పాటు ఇతర దాతలు పత్రిక ముద్రణకు సహకరిస్తున్నారు.
అమెరికాలో ఉన్న అరుణ్‌శివప్రసాద్ స్నేహితుడు పార్థసారధి సహకారంతో 18వ మాసపత్రికను 50 వేలతో గణిత సూత్రాలతో ప్రత్యేక సంచికగా విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిని ఉచితంగా పంపిణీ చేశారు.
మేధావుల ప్రశంసలు
విద్యార్థులే రచయితలుగా వ్యవహరిస్తూ మాసపత్రికను నడుపుతున్న మంగళపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే ప్రప్రథమమని పలువురు మేధావులు కొనియాడుతున్నారు. పాఠశాలలో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లె శ్రీనివాసులు, మాసపత్రికను ఆవిష్కరించేందుకు విచ్చేసిన విఠపు బాలసుబ్రమణ్యం ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికపై ప్రశంసలు కురిపించారు.
అదే విధంగా 25వ సంచికను ఆనాటి కలెక్టర్ సగిలి షన్మోహన్, 27వ సంచికను ప్రస్తుత ఎమ్మెల్యే మురళిమోహన్, ప్రముఖ శతావధాని ఆముదాల మురళి ‘మంగళ విద్యావాణి’ సంచికలను ఆవిష్కరించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. గత ఏడాది ‘హిందీ దివస్’ సందర్భంగా మాసపత్రికను పూర్తిగా హిందీలోనే ప్రచురించడాన్ని అభినందించారు. గత డిసెంబర్‌లో 28 పేజీలతో భారత గణిత శాస్త్రవేత్తల చరిత్రను గురించి ప్రత్యేక సంచిక వెలువరించడం ప్రశంసనీయమని కొనియాడారు.
బాబన్నగారి శివశంకర్, బంగారుపాళెం
(చదవండి: వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..)
Comments
Please login to add a commentAdd a comment