ఆకలి చదువులు
ఆకలి చదువులు
గుంటూరు ఎడ్యుకేషన్
,పరీక్షలకు సిద్ధ మవుతున్న పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతుల్లో అల్పాహారం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఓ పక్క పరీక్షలు ముంచుకొస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ హైస్కూళ్లలో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు అల్పాహారం అందించే విషయమై అధికారులు ఇప్పటి వరకూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
మార్చి 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 28 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
గతేడాది ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ హైస్కూళ్ల విద్యార్థులకు జెడ్పీ నిధులతో పరీక్షలకు రెండు నెలల ముందు నుంచే అల్పాహారం అందించారు. ఈ ఏడాది మరో 40 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నా ఇప్పటి వరకు అల్పాహారం పంపిణీ చేపట్టలేదు. ఓ వైపు సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో తరగతులు సక్రమంగా జరుగక విద్యార్థులు చదువులో వెనుకబడే పరిస్థితులుండగా, మరో వైపు అదనపు తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందించి ప్రోత్సహించడంలో అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సాధారణ, అదనపు తరగతుల నిమిత్తం ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకూ పాఠశాలలకే విద్యార్థులు పరిమితమవుతున్నారు. పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు రాత్రి వరకు నీరసించకుండా గతేడాది ఉప్మా, చపాతీ, ఇడ్లీ తదితరాలు సాయంత్రం వేళల్లో అందించారు. ఈ ఏడాది ఇంకా అల్పాహారం పంపిణీ చేపట్టకపోవడంతో విద్యార్థులు రాత్రి వరకూ ఉత్సాహంగా చదువులో నిమగ్నమవడం సాధ్యం కావడం లేదు. ఇకనైనా టెన్‌త విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
మున్సిపల్ స్కూళ్లల్లో ఇప్పటికే..
గుంటూరు నగరపాలకసంస్థతోపాటు పలు మున్సిపాల్టీల పరిధిలోని హైస్కూల్లో ఆయా మున్సిపాల్టీల నిధులతో డిసెంబర్ నుంచే విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గతేడాది వరకూ జెడ్పీ నిధులతోనే అల్పాహారం అందించగా, ప్రస్తుతం ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల విద్యార్థులకే పరిమితం చే యనున్నట్టు తెలిసింది. ఫలితంగా ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందే పరిస్థితులు లేవు.
నిధులు విడుదల..
పదో తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్ నిధులతోనే ప్రతి యేటా అల్పాహారం అందిస్తున్నాం. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి అల్పాహారం అందజేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన మేరకు జెడ్పీ అధికారులు నిధులు విడుదల చేశారు. ఈనెల 20 నుంచి అల్పాహారం అందించే అవకాశముంది.
-డి.ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖాధికారి