రూములో ఉన్న కాంట్రాక్టరు పరికరాలు
సామగ్రిని దాచుకునేందుకు వినియోగం
తరగతి గదులు చాలక విద్యార్థుల అవస్థలు
బలిజిపేట రూరల్: తరగతి గదులు చాలక విద్యార్థులు అవస్థలు పడుతుంటే.. పాఠశాల భవనాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బలిజిపేట ఉన్నత పాఠశాలకు నాలుగేళ్ల క్రితం పైకా పథకం కింద భవన నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఇవి చాలవని పంచాయతీ నిధుల నుంచి రూ.లక్ష తీసి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ లోపలి భాగంలో గచ్చులు లేవు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీన్ని స్వాధీనం చేసుకోకపోవడంతో రెండేళ్లుగా నిరుపయోగమైంది. విద్యార్థుల క్రీడా పరికరాలను భద్రపరిచేందుకు పైకా పథకం కింద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ భవనాలను మంజూరు చేశారు. నిర్మాణాలు పూర్తయినా నిరుపయోగంగా వదిలేశారు. ఈ భవనంలో ఒక కాంట్రాక్టర్ నిర్మాణ సామగ్రిని భద్రపరచుకుంటున్నారు. ఉన్నత పాఠశాలలో 750మందికి పైగా విద్యార్థులు, 17 సెక్షన్లు ఉన్నాయి. వీరిందరికీ సరిపడా తరగతి గదులు లేవు. వీరందరికీ ఉపయోగించాల్సిన గదిని కాంట్రాక్టర్‌కు అప్పగించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
వరండాల్లో ఇబ్బందిగా ఉంది: రాజేష్, విద్యార్థి
పాఠశాలకు తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నాం. వరండాలలో కూర్చుని పాఠాలు వింటున్నారు. దీంతో అందరికీ ఇబ్బందిగా ఉంటోంది. ఆట పరికరాలను భద్రపరిచేందుకు సరైన గది కూడా లేదు.
అప్పగించమని కోరాం: త్రినాథ, ప్రధానోపాధ్యాయుడు, బలిజిపేట ఉన్నత పాఠశాల.
పైకా భవనాన్ని అప్పగించమని కాంట్రాక్టర్‌ను కోరాం. తరగతి గదికి, ఆటపరికరాలను భద్రపరిచేందుకు వినియోగిస్తామని తెలిపాం. భవనం అప్పగించగానే వినియోగించుకుంటాం.