
సాయంత్రం 5 వరకు హైస్కూళ్ల నిర్వహణకు సన్నాహాలు
పైలట్ ప్రాజెక్టుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపిక
సాక్షి, అమరావతి/కదిరి: ఉన్నత పాఠశాలల పనివేళల్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్న వీటిని 5 గంటల వరకు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే పనివేళలను గత ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మార్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజుకు 7 పీరియడ్స్ ఉండేవి.
ఇకమీదట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు 8 పిరియడ్‌ల్లో హైస్కూల్ నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు చేయాలని, ఆ జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలను ఎంపిక చేయాలని ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపిక చేసిన పాఠశాలల జాబితాను ఈ నెల 20లోగా తెలియజేయాలని ఆదేశించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహిస్తారు.
ఇది సక్సెస్ అయిందని ప్రభుత్వం భావిస్తే వెంటనే ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. కాగా, పాఠశాలల పనివేళల పెంపు తలకు మించిన భారంగా మారుతుందని..విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం (అపస్) అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు.
అలాగే, ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని మార్చాలన్న నిర్ణయం సరైంది కాదని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమయాలు పిల్లల సైకాలజీకి అనుగుణంగా ఉన్నాయని, మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రతిపాదిత టైం టేబుల్ ఇలా..
» ఉదయం 9కి మొదటి గంట, 9.05కు రెండోగంట, 9.05 నుంచి 9.25 వరకు ప్రార్థన.
» 9.25–10.15 వరకు మొదటి పీరియడ్, 10.15–11 వరకు రెండో పిరియడ్.
» 11–11.15 వరకు విరామం.
» 11.15 నుంచి మధ్యాహ్నం 12 వరకు మూడో పిరియడ్, 12–12.45 వరకు నాలుగో పీరియడ్...12.45–1.45 వరకు భోజన విరామం.
» 1.45–2.30 వరకు ఐదో పీరియడ్, 2.30–3.15 వరకు ఆరో పీరియడ్. 3.15–3.30 వరకు చిన్న విరామం.
» 3.30–4.15 వరకు ఏడో పీరియడ్, 4.15–5 గంటల వరకు 8వ పీరియడ్.
Comments
Please login to add a commentAdd a comment