అందని విద్య మిథ్య | khed students going other state for study | Sakshi
Sakshi News home page

అందని విద్య మిథ్య

Published Tue, Feb 9 2016 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

అందని విద్య మిథ్య

అందని విద్య మిథ్య

♦  భవిష్యత్తు అంధకారం ఉన్నత పాఠశాలల లేమి
♦ పొరుగు రాష్ట్రాలకు ఖేడ్ విద్యార్థులు
♦ తలెత్తుతున్న ‘స్థానికత’ సమస్య
♦ రెండుచోట్లా నిబంధనల చిక్కులు
♦ కొరగాకుండాపోతోన్న చదువులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ;ఈడొచ్చిన పోరగాళ్లు ముళ్లుకర్ర పట్టాలి. ఎద్దు నాగలితో ఎవుసం చేయాలి.. అడ్డపంచె కట్టి ‘అయ్య’వారి ఇంటి ముందు నిలబడాలె.. నారాయణఖేడ్ బడి పిల్లల జీవితమిదే. ఒకవైపు దేశంలో నిర్బంధ విద్య అమలవుతోంటే ఇక్కడి పల్లెల్లో పుట్టిన పిల్లలు మాత్రం బలవంతంగా చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. స్థానికంగా పాఠశాలలు లేక పొరుగు రాష్ట్రం పాఠశాలల్లో చేరుతున్నారు. ఎలాగో కష్టపడి ఉన్నత చదువులు చదివినా ఉద్యోగవేటలో ‘స్థానికత’ వేటు పడుతోంది. దీంతో అక్కడా ఇక్కడా కొరగాకుండా పోతున్నారు. పాఠశాల విద్య కోసం సొంత రాష్ట్రం వదిలి బీదర్, ఔరద్, జమ్గీ, సంతపూర్ లాంటి కర్ణాటక, మహారాష్ట్ర బడుల్లో చదివిన వారి భవిష్యత్తు అంధకారమైపోతున్న తీరుపై ‘సాక్షి’ పరిశీలనాత్మక కథనం.

 కంగ్టి మండలంలో 2014-15 విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకు 5,524 విద్యార్థులు చదివారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి మూడు ఉన్నత పాఠశాలల్లో కలిపి ఆరు నుంచి 10వ తరగతి వరకు 1,367 మందే మిగిలారు. ఏటా సగటున ఐదో తరగతిలో 1500 మంది విద్యార్థులు పై తరగతికి వెళ్తున్నారు. టెన్త్‌కి వచ్చేసరికి వీరి సంఖ్య 300కి పడిపోతోంది. ఈ విద్యా సంవత్సరంలో కంగ్టి, తడ్కల్, వాసర్ ఉన్నత  పాఠశాల్లో 281 మందే టెన్త్ విద్యార్థులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా 75 శాతం మంది విద్యార్థులు ఎటుపోతున్నారు? నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోనూ ఇదే పరిస్థితి.

 అటూ ఇటూ.. ఎటైనా సమస్యే!
కంగ్టి మండలంలో క్లస్టర్‌కు ఒక పాఠశాల చొప్పున మూడే ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మనూరు మండలంలో ఆరు ఉన్నాయి. ఇవి విద్యార్థుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఏళ్లకేళ్లుగా ఇక్కడి పాలకులు, ప్రజాప్రతినిధులు ప్రాథమికోన్నత, ఉన్నత విద్య గురిం చి పట్టించుకోలేదు. తగిన న్ని పాఠశాలలు లేక పొరు గు రాష్ట్రాలైన కర్ణాటక, మ హారాష్ట్రకు విద్యార్థులు వల స వెళ్లిపోతున్నారు. అక్కడి పాఠశాలల్లో చేరి చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచే పిల్లలు గది అద్దెకు తీసుకునో.. బం ధువుల ఇంట ఉంటూనో చదువుకోవులు కొనసాగిస్తున్నారు. ఆడపిల్లలను చిన్న వయసులో అంత దూరం పంపలేక.. తల్లిదండ్రులు బడి మాన్పించి ఇంటి, వంట పనులు పురమాయిస్తున్నారు. ఇక్కడే 50 శాతం విద్యార్థులకు ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలల చదువుకు ఫుల్‌స్టాప్ పడుతోంది.

కంగ్టి మండలం నాగుర్ (కే), (బీ), తురకవడగాం, తడకల్ చాప్టా (బీ), చాప్టా (కే) గ్రామాల్లో వందలాది మంది విద్యార్ధులు బడి మానేశారు. కొందరు పొరుగు రాష్ట్రం స్కూళ్లో చేరి చదువుకోబో తే అక్కడ భాషాపరమైన సమస్య తలెత్తుతోంది. స్థానిక గ్రామాల్లో ఐదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వారు.. కర్ణాటక వెళ్లగానే కన్నడంలో, మ హారాష్ట్రలో మరాఠీలో చదవాల్సి వస్తోంది. ఆ భాషల్లో చదవలేక, రాయలేక దాదాపు 50 శాతం మంది వెనుదిరుగుతున్నారు. నాగుర్ (కే)కి చెందిన సుభాకర్‌ను పలకరి స్తే.. ‘కన్నడం రాయలేక 7వ తగతిలోనే బ డి మానేసి వ్యవసాయం చేసుకుంటున్నా.. ఇప్పుడు నా కొడుకు ఏడు చదువుతుండు, పన్నాలాల్ హీరాలాల్ స్కూల్‌లో చేర్పించిన, వాడూ కన్నడ రాయరాట్లేదు అని చెప్తుండు’ అని చెప్పాడు.

 ని‘బంధనాల’ సుడిలో విద్యార్థులు
మన రాష్ట్రంలో రెవెన్యూ, విద్యాశాఖ నిబంధనల ప్రకారం 6 నుంచి 10వ తరగతి వర కు వరుసగా ఎక్కడైతే విద్యార్థి చదువుకుం టాడో అక్కడే స్థానికత వర్తిస్తుంది. ఈ నిబంధన ఖేడ్ విద్యార్థులకు శాపమైంది. పొరుగు రాష్ర్టంలో చదివిన విద్యార్థులు ఇటు మన రాష్ట్రంలోనూ, అటు పొరుగు రాష్ట్రాల్లోనూ ‘స్థానికులు’ కాకుండాపోయి ఉద్యోగాలకు దూరమవుతున్నారు. మన రాష్ట్ర నిబంధనల ప్రకారం వరుసగా ఐదేళ్లు పొరుగు రాష్ట్రంలో చదివిన వారు ఆయా రాష్ట్రాల్లోనే స్థానికులవుతారు. కానీ పొరు గు రాష్ట్రాలేమో.. స్థానికత, ఆధార్, ఓటర్ ధ్రువపత్రాల ఆధారంగా స్థానికతను గుర్తిస్తున్నాయి.

వీటిని చూసినప్పుడు వారికి ఈ మూడు గుర్తింపు కార్డులు కూడా తెలంగాణలో ఉంటున్నాయి. దీంతో వారు స్థాని క ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు. చదువుకున్న చోటే ఉద్యోగం తీసుకుందామనే ఆలోచనతో తెలంగాణ విద్యార్థులు కర్ణాటక రాష్ట్రంలో స్థానికత పొందేందుకు అక్క డ వారి బంధువుల ఇళ్ల అడ్రసులు పెట్టి ఆధార్, ఓటరు కార్డు, స్థానికత ధ్రువపత్రా లు తీసుకుంటే ఆన్‌లైన్ విధానం వచ్చాక వాటిని అక్కడా.. ఇక్కడా  ఏరివేశారు. దీంతో విద్యార్థులు రెండుచోట్లా కొరగా కుండా పోతున్నారు.

స్థానికేతరులమట..
ఒకటి నుంచి 7 వరకు మనూరు మండలం కారముంగిలో చదివిన. 8 నుంచి టెన్త్ వరకు కర్నాటకలోని ఔరాద్ తాలుకా జమ్గిలో చదువుకున్నా. ఇంటర్మీడియట్ అనంతరం డీఎడ్ చేశాను. నేను ఉపాధ్యాయున్ని కావాలి కానీ నాకు స్థానికత అడ్డువస్తోంది. పోనీ  తెలంగాణలో ఒకటీ రెండు కన్నడ మీడియం పోస్టులున్నా వాటికి కూడా మాకు అవకాశాలు రావటం లేదు.- జీవన్‌రావు, కారాముంగి

వేరేచోట చదివి ఎవుసం చేస్తున్నాం
మాకు సదువుదాం అంటే ఏమీ సోయి (సౌకర్యాలు) లేకుండె. కర్ణాటక్‌లోని సంత్‌పూర్‌లో సదువుకుంటే ఆ సదువేమీ పనిచేయలేదు. ఇక్కడ తెలుగులో పది పాసైతేనే నౌకరీలు ఇస్తామన్నారు. అక్కడ  మీరు మా రాష్ర్టంలోని వారు కాదనడంతో ఏమీ చేయలేక వ్యవసం చేస్తున్నాం. ఇక్కడ చదివిద్దామంటే సాలెలో సార్లు లేక ఇంకా అక్కడే పిల్లలను చదివిస్తున్నాం. - మేత్రి మల్గొండ, నాగుర్ (కే)

బ్యాక్‌లాగ్ పోస్టులైనా ఇవ్వొచ్చుగా..
ఇక్కడ బడి లేకుంటే కర్ణాటక పోయి చదువుకున్నాం. మాకు కన్నడ వచ్చు. ఉద్యోగాలకు పోతే మమ్ముల్ని స్థానికేతరులు అంటున్నారు. కన్నడ మీడియంలో కొన్నేళ్లుగా 13కు పైగా ఉపాధ్యాయ పోస్టులు బ్యాక్‌లాగ్ అవుతూనే ఉన్నాయి. అవైనా మాకు ఇవ్వొచ్చు కదా.                                                                                    - గంగమణి, కారముంగి

అవకాశం కల్పించాలి
కన్నడ మీడియం చదివిన వారికి తెలంగాణలో ఇతర ఉద్యోగాలకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎంతో మంది కన్నడ మీడియం చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు లబిస్థాయి. తమకు ఇప్పటివరకు ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారు లేరు మా గ్రామంలో  - రాచమ్మ, కారముంగి

అందరిదీ అదే వ్యథ..
కంగ్టి మండలం నాగురు (కే) గ్రామంలో అడివప్ప పాటిల్ (45) అనే వ్యక్తిని కదిలిస్తే.. ‘మా నాయిన మాలి పటేల్. నన్ను చదివించాలని మా నాయినకు బాగుండే. ఇక్కడ చూస్తే బడులు లేవు. కర్ణాటక  బడిలో చేర్పించుండు. బీదర్ భూంరెడ్డి కాలేజీలో బీఏ పాసైన. ఇక్కడికొచ్చి ఉద్యోగాలకు ఎంట్రెన్స్‌లు రాయబోతే నేను స్థానికున్ని కాదని చెప్పి అనర్హున్ని అన్నరు. పోనీ మా నాయిన పని మాలి పటేల్‌గిరి చేద్దామనుకుంటే ఎన్టీఆర్ పటేల్ వ్యవస్థను రద్దు చేసె.. దిక్కు లేక వ్యవసాయం చేస్తున్నా’ అని తన గతాన్ని గుర్తు చేశారు. తాజాగా ఆయన కొడుకు అతీష్ పాటిల్‌దీ అదే పరిస్థితి. అతనిని పలకరిస్తే...‘మా గావ్‌లో సాళె లేక బీదర్‌వోయి చదివిన.

2007లనే పీయూసీ సదివి ఉద్యోగానికి పోతే.. అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్.. రెండూ ఉద్యోగానికి అర్హున్ని కాదని చెప్పినయి. అదేంది అంటే 6 నుంచి 10 దాకా వరుసగా కర్ణాటకలో చదివిన కాబట్టి ఏపీలో నాన్‌లోకల్ అని, ఏపీలో ఆధార్, ఓటరు కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి కాబట్టి నువ్వు కర్ణాటక రాష్ట్రంలో నాన్‌లోకల్ అని చెప్పి పంపారు. రెండుచోట్లా ఉద్యోగాలు రాక వ్యవసాయం పనులు చేసుకుంటున్నం.మా సదువులు నష్టం అయినా పిల్లలను తెలంగాణలో చదివించి మంచి ప్రయోజకులను చేయాలను కొంటున్నాం’ అని చెప్పాడు. నాగుర్ బీ గ్రామంలో దత్తును కదిలిస్తే.. ‘కర్ణాటకలో పీయూసీ చేసిన. పోలీసు అవుదామని అప్లై చేస్తే స్థానికుడిని కాదన్నారు. చేసేది లేక కరెంటు వైరింగ్ పని చేసుకుంటున్నా’ అని వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement