ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) కార్యక్రమాల అమలుకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం రూ. 2.69 కోట్లు విడుదల చేసింది. ఆర్‌ఎంఎస్‌ఏ కార్యక్రమాల అమలుకు గుర్తించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉన్నత పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని పాఠశాలలకు ఈ నిధులు విడుదల చేశారు. ఈ నిధులు నేరుగా పాఠశాల యాజమాన్య, అభివృద్ధి కమిటీల (ఎస్‌ఎండీసీ) బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.
పాఠశాల గ్రాంటు కింద ఒక్కో హైస్కూలుకు రూ.50 వేల చొప్పున 368 హైస్కూళ్లకు రూ.1.84 కోట్లు జమ చేశారు. అదేవిధంగా స్వల్ప మరమ్మతులకు ఒక్కో పాఠశాలకు రూ.25 వేల చొప్పున 341 పాఠశాలలకు రూ. 85.25 లక్షలిచ్చారు. మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు.
నిధుల వినియోగానికి మార్గదర్శకాలివీ...
ఉన్నత పాఠశాలలకు విడుదల చేసిన పాఠశాలల గ్రాంటు, మరమ్మతుల గ్రాంటును వినియోగించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాల గ్రాంటుగా విడుదల చేసిన రూ. 50 వేలల్లో రూ.25 వేలను పాఠశాలల్లో సైన్స్, గణితం కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. వీటితో ప్రయోగశాలల మరమ్మతులకు, ప్రయోగశాలల పాత సామగ్రిని తొలగించి కొత్త సామగ్రిని సమకూర్చుకునేందుకు, ప్రయోగశాలలో రోజువారీ ఉపయోగించే వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగించాలి. 9,10 తరగతుల విద్యార్థులకు ఉపయోగించే ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించేందుకు అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవాలి. పాఠశాలకు గ్రంథాలయ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు, దినపత్రికలు, ఇతర పీరియాడికల్స్‌ను పాఠశాలకు తెప్పించేందుకు రూ.10 వేలు వినియోగించుకోవాలన్నారు. కేంద్రియ విద్యాలయ సమితి (కేవీఎస్) సిఫార్సు చేసిన పుస్తకాలను కొనుగోలు చేయాలన్నారు.
= పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ చార్జీలు, టెలిఫోన్ చార్జీలు, ఇంటర్నెట్ చార్జీలు, ఇతర చార్జీలకు రూ.15 వేలు వినియోగించాలి.
= పాఠశాలల్లో స్వల్ప మరమ్మతులకు రూ.25 వేలు ఖర్చుచేయాలి. ఈ మొత్తంలో 50 శాతం నిధులను మాత్రమే సివిల్ వర్కులకు కేటాయించాలి. పక్కా భవనాల మరమ్మతులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. పాఠశాల భవనాల మరమ్మతులు, ఆట స్థలం, కంప్యూటర్ రూమ్‌లోని ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు, గోడలకు సున్నం వేయించడం, పెయింటిం గ్‌లు, శానిటరీ ఇతర ఫిట్టింగ్‌ల మరమ్మతులకు ఈ నిధులను వినియోగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అన్ని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల మేరకు నిధులు వినియోగించాలి. నిధులు కేటాయించిన అంశాలకు వినియోగించకుండా ఇతర అంశాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు.
హైస్కూళ్లకు రూ. 2.69 కోట్లు విడుదల
Published Thu, Feb 27 2014 5:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement