Rashtriya Madhyamik Shiksha Abhiyan
-
‘ఆదర్శ’ విద్య.. వసతి మిథ్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకంలో భాగంగా తలపెట్టిన ఆదర్శ పాఠశాలల లక్ష్యం గాడి తప్పింది. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత వసతితో కూడిన బోధన అందించడం ఈ పాఠశాలల ముఖ్యోద్దేశం. ఇవి ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా.. విద్యార్థులకు మాత్రం వసతి కల్పించకుండా.. కేవలం రోజువారీగా పాఠ్యాంశ బోధన (డే స్కాలర్)తో సరిపెడుతున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల వసతిపై సర్కారు ఇప్పటివరకూ ఊసెత్తలేదు. దీంతో ఈ ఏడాది కూడా విద్యార్థులకు హాస్టల్ వసతి మిథ్యేనని తెలుస్తోంది. పన్నెండు పాఠశాలలే.. విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం మండలానికో ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది. రెండు విడతల్లో 25 పాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో తొలివిడతగా 19 పాఠశాలలు మంజూరు కాగా.. అందులోనూ కేవలం 12 పాఠశాలలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్, చేవెళ్ల, మర్పల్లి, బంట్వారం, నవాబుపేట్, గండేడ్, కుల్కచర్ల, పూడూరు మండలాల్లో ఈ పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిలో రోజువారీగా విద్యార్థులు తర గతులకు హాజరవుతున్నారు. వాస్తవానికి వసతితో కూడిన విద్యనందించేలా వీటి స్థాపన జరిగినప్పటికీ.. హాస్టల్ భవన నిర్మాణాలు సైతం ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో ఆదర్శ పాఠశాలలు లక్ష్యం కుదేలయింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం పాఠశాల భవనాలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. ‘ఆదర్శ’ విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాలల నిర్మాణం మొదలై ఐదేళ్లు పూర్తయింది. కానీ ఆ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 19 పాఠశాలలకుగాను 12 పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో ఇప్పటివరకు ఐదు పాఠశాలల్లోనే హాస్టల్ భవనాలు పూర్తి చేసినట్లు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్ మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణ పనులు కొలిక్కివచ్చాయి. మిగతా ఏడు పాఠశాలల్లో నిర్మాణాలు ఇప్పటికిప్పుడు పూర్తయ్యేలా లేవు.కేవలం భవన నిర్మాణాల పూర్తితో హాస్టళ్లు కొనసాగించే వీలు లేదు. హాస్టళ్లలో వార్డెన్‌తో సహా ఇతర కేటగిరీలకు సంబంధించి ఉద్యోగులను నియమించాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ వసతిగృహాల అంశాన్ని ప్రస్తావించడం లేదు. మరోవైపు ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ పథకంపై కేంద్ర సర్కారు చేతులెత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించాల్సి ఉంది. కానీ సర్కారు వసతిగృహాల నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది ఆదర్శ విద్యార్థులకు వసతి కలగానే మిగలనుంది. -
మోడల్ స్కూళ్ల భారం మీదే!
- ‘మోడల్ స్కూళ్ల’ పథకాన్ని రాష్ట్రాలే నిర్వహించుకోవాలని కేంద్రం సూచన - ఇప్పటికే నిధులు కేటాయించిన పాఠశాలల పనులపై స్పష్టత ఇవ్వని వైనం - నిధులరాకపై అనుమానం - అయోమయంలో ఆరు మోడల్ స్కూళ్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: మాధ్యమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి తేల్చిచెప్పారు. ఈ పథకం కింద కొనసాగుతున్న ఆదర్శ పాఠశాలల నిర్వహణ సంగతి అటుంచితే.. ఇప్పటికే మంజూరై నిర్మాణాలకు నోచుకోని మోడల్ స్కూళ్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఆర్‌ఎంఎస్‌ఏ పథకంలో భాగంగా జిల్లాకు 25 ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. జిల్లాలో 37 మండలాలుండగా.. విద్య పరంగా వెనకబడిన ప్రాంతాలను గుర్తిస్తూ 25 మండలాలను ఎంపిక చేయగా.. వాటికి కేంద్ర ప్రభుత్వం 2010-11లో తొలివిడత కింద 19 పాఠశాలలు మంజూరు చేసింది. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా.. 2012 -13 వార్షిక సంవత్సరంలో మంజూరైన ఆరు పాఠశాలలపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఆర్‌ఎంఎస్‌ఏ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే మంజూరుచేసి నిధులు విడుదల చేయని వాటిపై స్పందించకపోవడంతో వాటి పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. రూ.19.32 కోట్ల సంగతేంటి? ఆర్‌ఎంఎస్‌ఏ రెండో విడతలో వికారాబాద్, మొయినాబాద్, దోమ, యాలాల, ధారూరు, మోమీన్‌పేట మండలాలకు ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.3.2 కోట్ల చొప్పున మొత్తం రూ.19.2 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో అధికారులు కాంట్రాక్టర్లను సైతం ఎంపిక చేసి పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధుల విడుదలపై తాత్సారం చేసింది. ఫలితంగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటి నిర్మాణాల సంగతి సందిగ్ధంలో పడింది. వాస్తవానికి 2012- 13 సంవత్సరంలో పనులు మంజూరు చేసినందున కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలి. కానీ అప్పట్లో నిధులు విడుదల చేయకపోగా.. ప్రస్తుతం పథకాన్ని వదిలించుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే తప్ప నిర్మాణాల ప్రక్రియ కొలిక్కి రావడం కష్టమే. -
ఇది శిక్షణ కాదు.. శిక్షే..!
వికారాబాద్: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ఆధ్వర్యంలో వృత్యంతర శిక్షణ శిబిరానికి హాజరైన ఉపాధ్యాయులకు ప్రభుత్వ నిబంధనల మేరకు టీఏ, డీఏలు చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ, ఎస్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షులు మాణిక్‌రెడ్డి, హెచ్. శివకుమార్, సదానందం గౌడ్, పోచయ్య డిమాండ్ చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో ధన్నారం అన్వర్ ఉలూమ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ వృత్యంతరం శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయా సంఘాల నేతలతో కలిసి వారు సందర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏ చెల్లించనందుకు నిరసనగా శిక్షణ తరగతుల నుంచి బయటకు వచ్చి ఉపాధ్యాయులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఏ నియోజకవర్గం పరిధిలోని ఉపాధ్యాయులకు, ఆ నియోజవర్గంలో శిక్షణ ఇవ్వకపోవడంతో దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు రావాల్సి వచ్చిందన్నారు. బషీరాబాద్ నుంచి వచ్చేవారు తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరి రావాల్సివచ్చిందన్నారు. సౌకర్యంగా ఉండే చోట శిక్షణ శిబిరం ఏర్పాటు చేయకుండా రెండు మూడు చోట్ల మారే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారని మండిపడ్డారు. తమకు ఇది శిక్షణ ఇచ్చినట్లు లేదని.. శిక్ష విధించినట్లు ఉందన్నారు. ధన్నారంలోని ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లాలంటే రోజుకు ఒక్కరికి రాను పోను రూ.60 ప్రయాణ చార్జీలు అవుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు తాము పని చేస్తున్న చోట నుంచి వెళ్లి తిరిగిరావడం ఆరు గంటల లోపైతే సగం రోజు భత్యం, 12 గంటలు అయితే ఒక్కరోజు భత్యం చెల్లించాల్సి ఉంటుందని జీవో నంబర్ 129 స్పష్టం చేస్తోందన్నారు. కానీ జిల్లా విద్యాధికారి రమేష్ మాత్రం రోజుకు టీఏ, డీఏ కింద రూ.80 చెల్లించి చేతులు దులుపేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు టీఏ, డీఏ కింద రోజుకు రూ.350 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు చెన్నకేశవరెడ్డి, ఆంజనేయులు, వివిధ సంఘాల నాయకులు వెంకటరత్నం, చంద్రశేఖర్, ప్రతాప్, రామకృష్ణారెడ్డి, నరహరి పాల్గొన్నారు. -
ఆదర్శ బడుల్లో ప్రవేశానికి ఎంపిక
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న 10 ఆదర్శ పాఠశాలల్లో 2014-15 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపికను మంగళవారం నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. విద్యార్థుల ఎంపిక కమిటీ చైర్మన్, అదనపు జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్ లాటరీ తీసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో దర్శి, ముండ్లమూరు, ఉలవపాడు, మార్కాపురం, కనిగిరి, రాచర్ల, వలేటివారిపాలెం, కందుకూరు, లింగసముద్రం, దోర్నాలలో ఆదర్శ పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో 80 సీట్ల చొప్పున మొత్తం 800 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. దర్శి ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి అత్యధికంగా 431 మంది దరఖాస్తు చేయగా, దోర్నాలలోని పాఠశాలకు అతి తక్కువగా 111 దరఖాస్తులు అందాయి. ముండ్లమూరుకు 239, ఉలవపాడు 215, మార్కాపురం 209, కనిగిరి 196, రాచర్ల 193, వలేటివారిపాలెం 184, కందుకూరు 174, లింగసముద్రం పాఠశాలకు 125 మంది దరఖాస్తు చేశారు. 29న ఆయా పాఠశాలల్లోని నోటీసు బోర్డులో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల వివరాలను ప్రకటిస్తారు. ఈ నెల 30 నుంచి జూన్ 7వ తేదీలోపు ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల (విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణలు, ఇతర పత్రాలు)ను ఆయా పాఠశాలల్లో సమర్పించి ప్రవేశం పొందాలి. విద్యార్థుల ఎంపిక జాబితాతో పాటు వెయిటింగ్ లిస్టును కూడా తయారు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులెవరైనా చేరకపోతే వారి స్థానంలో వెయిటింగ్ లిస్టులోని వారికి ప్రవేశం కల్పిస్తారు. కార్యక్రమంలో ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హైస్కూళ్లకు రూ. 2.69 కోట్లు విడుదల
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) కార్యక్రమాల అమలుకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం రూ. 2.69 కోట్లు విడుదల చేసింది. ఆర్‌ఎంఎస్‌ఏ కార్యక్రమాల అమలుకు గుర్తించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉన్నత పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని పాఠశాలలకు ఈ నిధులు విడుదల చేశారు. ఈ నిధులు నేరుగా పాఠశాల యాజమాన్య, అభివృద్ధి కమిటీల (ఎస్ఎండీసీ) బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. పాఠశాల గ్రాంటు కింద ఒక్కో హైస్కూలుకు రూ.50 వేల చొప్పున 368 హైస్కూళ్లకు రూ.1.84 కోట్లు జమ చేశారు. అదేవిధంగా స్వల్ప మరమ్మతులకు ఒక్కో పాఠశాలకు రూ.25 వేల చొప్పున 341 పాఠశాలలకు రూ. 85.25 లక్షలిచ్చారు. మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు. నిధుల వినియోగానికి మార్గదర్శకాలివీ... ఉన్నత పాఠశాలలకు విడుదల చేసిన పాఠశాలల గ్రాంటు, మరమ్మతుల గ్రాంటును వినియోగించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాల గ్రాంటుగా విడుదల చేసిన రూ. 50 వేలల్లో రూ.25 వేలను పాఠశాలల్లో సైన్స్, గణితం కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. వీటితో ప్రయోగశాలల మరమ్మతులకు, ప్రయోగశాలల పాత సామగ్రిని తొలగించి కొత్త సామగ్రిని సమకూర్చుకునేందుకు, ప్రయోగశాలలో రోజువారీ ఉపయోగించే వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగించాలి. 9,10 తరగతుల విద్యార్థులకు ఉపయోగించే ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించేందుకు అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవాలి. పాఠశాలకు గ్రంథాలయ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు, దినపత్రికలు, ఇతర పీరియాడికల్స్ను పాఠశాలకు తెప్పించేందుకు రూ.10 వేలు వినియోగించుకోవాలన్నారు. కేంద్రియ విద్యాలయ సమితి (కేవీఎస్) సిఫార్సు చేసిన పుస్తకాలను కొనుగోలు చేయాలన్నారు. = పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ చార్జీలు, టెలిఫోన్ చార్జీలు, ఇంటర్నెట్ చార్జీలు, ఇతర చార్జీలకు రూ.15 వేలు వినియోగించాలి. = పాఠశాలల్లో స్వల్ప మరమ్మతులకు రూ.25 వేలు ఖర్చుచేయాలి. ఈ మొత్తంలో 50 శాతం నిధులను మాత్రమే సివిల్ వర్కులకు కేటాయించాలి. పక్కా భవనాల మరమ్మతులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. పాఠశాల భవనాల మరమ్మతులు, ఆట స్థలం, కంప్యూటర్ రూమ్‌లోని ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు, గోడలకు సున్నం వేయించడం, పెయింటిం గ్లు, శానిటరీ ఇతర ఫిట్టింగ్‌ల మరమ్మతులకు ఈ నిధులను వినియోగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల మేరకు నిధులు వినియోగించాలి. నిధులు కేటాయించిన అంశాలకు వినియోగించకుండా ఇతర అంశాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు.