ఇది శిక్షణ కాదు.. శిక్షే..! | Teachers are in concern | Sakshi
Sakshi News home page

ఇది శిక్షణ కాదు.. శిక్షే..!

Published Tue, Oct 14 2014 11:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

ఇది శిక్షణ కాదు.. శిక్షే..! - Sakshi

ఇది శిక్షణ కాదు.. శిక్షే..!

వికారాబాద్: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ఆధ్వర్యంలో వృత్యంతర శిక్షణ శిబిరానికి హాజరైన ఉపాధ్యాయులకు ప్రభుత్వ నిబంధనల మేరకు టీఏ, డీఏలు చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్, పీఆర్‌టీయూ, ఎస్‌టీయూ, ఎస్‌టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షులు మాణిక్‌రెడ్డి, హెచ్. శివకుమార్, సదానందం గౌడ్, పోచయ్య డిమాండ్ చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో ధన్నారం అన్వర్ ఉలూమ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ వృత్యంతరం శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయా సంఘాల నేతలతో కలిసి వారు సందర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏ చెల్లించనందుకు నిరసనగా శిక్షణ  తరగతుల నుంచి బయటకు వచ్చి ఉపాధ్యాయులు తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఏ నియోజకవర్గం పరిధిలోని ఉపాధ్యాయులకు, ఆ నియోజవర్గంలో శిక్షణ ఇవ్వకపోవడంతో దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు రావాల్సి వచ్చిందన్నారు. బషీరాబాద్ నుంచి వచ్చేవారు తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరి రావాల్సివచ్చిందన్నారు. సౌకర్యంగా ఉండే చోట శిక్షణ శిబిరం ఏర్పాటు చేయకుండా రెండు మూడు చోట్ల మారే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారని మండిపడ్డారు. తమకు ఇది శిక్షణ ఇచ్చినట్లు లేదని.. శిక్ష విధించినట్లు ఉందన్నారు. ధన్నారంలోని ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లాలంటే రోజుకు ఒక్కరికి రాను పోను రూ.60 ప్రయాణ చార్జీలు  అవుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు తాము పని చేస్తున్న చోట నుంచి వెళ్లి తిరిగిరావడం ఆరు గంటల లోపైతే సగం రోజు భత్యం, 12 గంటలు అయితే ఒక్కరోజు భత్యం చెల్లించాల్సి ఉంటుందని జీవో నంబర్ 129 స్పష్టం చేస్తోందన్నారు.

కానీ జిల్లా విద్యాధికారి రమేష్ మాత్రం రోజుకు టీఏ, డీఏ కింద రూ.80 చెల్లించి చేతులు దులుపేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు టీఏ, డీఏ కింద రోజుకు రూ.350 చెల్లించాలని  డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు చెన్నకేశవరెడ్డి, ఆంజనేయులు, వివిధ సంఘాల నాయకులు వెంకటరత్నం, చంద్రశేఖర్, ప్రతాప్, రామకృష్ణారెడ్డి, నరహరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement