Manik Reddy
-
ఆకట్టుకుంటున్న ‘కన్నుల్లోన...’ సాంగ్
మహేశ్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్ధార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘స్వ’. మను పీవీ దర్శకత్వం వహించారు. జి.ఎం.ఎస్ గాలరీ ఫిల్మ్స్ సంస్థలో జి.ఎం. సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. కరణం శ్రీ రాఘవేంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కన్నుల్లోన..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. వినోద్ శర్మ, నాదప్రియ పాడారు. జీ.ఎం. సురేష్ మాట్లాడుతూ–‘‘మా చిత్రం ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నుల్లోన..’ పాట బాగా అలరిస్తోంది. ‘స్వ’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిని చేసింది ఆయనే!
జోగిపేట(అందోల్) : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి (77) ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన అందోలు మండలం డాకూరు గ్రామంలో నిర్వహించారు. సీఎం కే.చంద్రశేఖర్‌రావు మాణిక్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం డాకూరుకు రోడ్డు మార్గంలో వస్తున్నట్లు ముందుగానే సమాచారం రావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖమంత్రి టీ.హరీష్‌రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు íపీ.బాబూమోహన్, చింతాప్రభాకర్, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, భూపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదొద్దిన్, భూపాల్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ నిఖిలారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ, ఎంపీలు బీబీ పాటిల్, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్లు సుభాష్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి బీ.సంజీవరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర టీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు బక్కి వెంకటయ్య, సపానదేవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి, సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వర్షంలోనే అంత్యక్రియలు మాణిక్‌రెడ్డి మృతదేహాన్ని అంత్యక్రియలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వర్షంలోనే అంత్యక్రియలు జరిపారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అలాగే ముందుకు కదిలారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అక్కడే ఉన్నారు. అంత్యక్రియలకు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది తరలి వచ్చారు. మాణిక్‌రెడ్డి మరణం తీరనిలోటు : వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు జోగిపేట(అందోల్): మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి ఆకస్మిక మరణం జిల్లాకు తీరనిలోటని రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సంజీవరావు అన్నారు. ఆదివారం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు డాకూరు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 38 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని, మంచి అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయామన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ పదవి వరకు ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాట్లు తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు పరిపూర్ణ, రాజు, నరేష్, బాగయ్యలతో పాటు పలువురు ఉన్నారు.జిల్లా రాజకీయాల్లో కీలక పాత్రజోగిపేట(అందోల్): మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంపాదించారు. ఒకస్థాయిలో జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు ఎదిగారు. మాజీ మంత్రి రాజనర్సింహ శిష్యుడిగా రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పంచాయతీ సమితి అధ్యక్ష పదవి కోసం నియోజవర్గంలో ఎంతో మంది ఆశ పడ్డ ఆయన మాణిక్‌రెడ్డికే మద్దతు ఇవ్వడంతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఆ పదవి దోహదపడిందని చెప్పవచ్చు. యూత్ కాంగ్రేస్ జిల్లా నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక పదవిలో ఉండి అధికారంలో ఉన్నారు. అప్పటి కేంద్రమంత్రి శివశంకర్‌పై పోటీ చేసి గెలుపొందడంతో ఢిల్లీలో మంచి గుర్తింపు పొందారు. రాజీవ్ గాంధీపై భూఫోర్స్ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో ఏడాది కాలం మిగిలి ఉండగానే ఎన్టీరామారావు ఆదేశానుసారం తన రాజీనామా లేఖను అందరి కంటే ముందుగానే లోకసభ స్పీకర్‌కు అందజేసి దేశ స్థాయిలో గుర్తింపు పొందారు. కేసీఆర్‌తో అనుబంధం ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో మాణిక్‌రెడ్డికి చాలా దగ్గరి అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలకుపైగా కలిసి పని చేశారు. ఉమ్మడి జిల్లాకు కూడా టీడీపీ అధ్యక్షుడిగా మాణిక్‌రెడ్డి పని చేశారు. 1998లో జరిగిన అందోలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బాబూమోహన్ గెలుపు బాధ్యతను చేపట్టిన కేసీఆర్ అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో 26 రోజుల పాటు మాణిక్‌రెడ్డి స్వగ్రామమైన డాకూర్లోనే మకాం ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిని చేసింది మాణిక్రెడ్డియే.. రాష్ట్రంలో 1994వ సంవత్సరంలో తిరిగి టీడీపీ అధికారాన్ని చేపట్టిన తర్వాత కొంత కాలానికే పార్టీలో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాణిక్‌రెడ్డి రాష్ట్ర కమిటీలో కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఆయన రెవెన్యూ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు. అప్పటికప్పుడు మాణిక్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు నాయుడిను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు. రాష్ట్ర ఏర్పాటు సంబరాలు అందోలులోనే.. తెలంగాణ రాష్ట్రం కోసం సుధీర్ఘంగా పోరాటం చేసిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబరాలను మొదటగా అందోలు నియోజకవర్గంలోనే చేపట్టారు. ఈ సభకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ హజరయ్యారు. ఈ సభ విజయవంతం చేసే బాధ్యతను మాజీ ఎంపీ మాణిక్రెడ్డియే తీసుకున్నారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఈ సభ విజయవంతం కావడంతో కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేసి మాణిక్‌రెడ్డిని అభినందించారు. ఈ సభలోనే ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. -
ఇది శిక్షణ కాదు.. శిక్షే..!
వికారాబాద్: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ఆధ్వర్యంలో వృత్యంతర శిక్షణ శిబిరానికి హాజరైన ఉపాధ్యాయులకు ప్రభుత్వ నిబంధనల మేరకు టీఏ, డీఏలు చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ, ఎస్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షులు మాణిక్‌రెడ్డి, హెచ్. శివకుమార్, సదానందం గౌడ్, పోచయ్య డిమాండ్ చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో ధన్నారం అన్వర్ ఉలూమ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ వృత్యంతరం శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయా సంఘాల నేతలతో కలిసి వారు సందర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏ చెల్లించనందుకు నిరసనగా శిక్షణ తరగతుల నుంచి బయటకు వచ్చి ఉపాధ్యాయులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఏ నియోజకవర్గం పరిధిలోని ఉపాధ్యాయులకు, ఆ నియోజవర్గంలో శిక్షణ ఇవ్వకపోవడంతో దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు రావాల్సి వచ్చిందన్నారు. బషీరాబాద్ నుంచి వచ్చేవారు తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరి రావాల్సివచ్చిందన్నారు. సౌకర్యంగా ఉండే చోట శిక్షణ శిబిరం ఏర్పాటు చేయకుండా రెండు మూడు చోట్ల మారే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారని మండిపడ్డారు. తమకు ఇది శిక్షణ ఇచ్చినట్లు లేదని.. శిక్ష విధించినట్లు ఉందన్నారు. ధన్నారంలోని ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లాలంటే రోజుకు ఒక్కరికి రాను పోను రూ.60 ప్రయాణ చార్జీలు అవుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు తాము పని చేస్తున్న చోట నుంచి వెళ్లి తిరిగిరావడం ఆరు గంటల లోపైతే సగం రోజు భత్యం, 12 గంటలు అయితే ఒక్కరోజు భత్యం చెల్లించాల్సి ఉంటుందని జీవో నంబర్ 129 స్పష్టం చేస్తోందన్నారు. కానీ జిల్లా విద్యాధికారి రమేష్ మాత్రం రోజుకు టీఏ, డీఏ కింద రూ.80 చెల్లించి చేతులు దులుపేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు టీఏ, డీఏ కింద రోజుకు రూ.350 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు చెన్నకేశవరెడ్డి, ఆంజనేయులు, వివిధ సంఘాల నాయకులు వెంకటరత్నం, చంద్రశేఖర్, ప్రతాప్, రామకృష్ణారెడ్డి, నరహరి పాల్గొన్నారు. -
అందోల్ టీఆర్ఎస్లో అయోమయం
జోగిపేట, న్యూస్‌లైన్: ఎన్నికలు దగ్గర పడుతున్నా అందోల్ టీఆర్ఎస్లో మాత్రం విభేదాలు కొలిక్కి రావడం లేదు. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి బాబూమోహన్ ఒక వర్గం వారినే ప్రోత్సహిస్తున్నారని చాలాకాలంగా పార్టీ జెండాలు మోస్తున్న వారిని పట్టించుకోవడంలేదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అందోల్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీపై కేసీఆర్, హరీష్‌రావుకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకుడు స్వయంగా వచ్చి ఇరువురితో చర్చలు జరిపినా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అందోల్, పుల్కల్, అల్లాదుర్గం మండలాలకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల జోగిపేటలో సమావేశం నిర్వహించి బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్రెడ్డిలను ఆహ్వనించారు. సమావేశంలో పార్టీలో మొదటి నుంచి ఉంటున్న నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బాబూమోహన్ తాను టీడీపీ నుంచి ప్రత్యేకమైన పరిస్థితుల్లో టీఆర్ఎస్లో చేరానని, తనతోపాటే మిగతా టీడీపీ కార్యకర్తలంతా వచ్చారని, ఇంకా టీడీపీ ఎక్కడుందని, మనమంతా ఒక్క తల్లిబిడ్డలమేనంటూ కలుపుగోలుగా మాట్లాడారు. దీంతో విభేదాలు తొలగిపోయాయని అందరూ భావించారు. అయితే రెండు రోజుల క్రితం జోగిపేటకు వచ్చిన జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌తో కొంత మంది పాత టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. సమస్యలు తొలగేదాకా జోగిపేటలో ప్రచారం చేపట్టవద్దని ఒక వర్గం బాబూమోహన్ వర్గీయులకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. 5 రోజుల క్రితం అందోల్ టీఆర్ఎస్కు చెందిన యువకులు గ్రామాల్లో ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించి జోగిపేట మీదుగా వెళ్లారు. దీంతో పట్టణానికి చెందిన యువజన విభాగం టీఆర్ఎస్ నాయకులు తమకు చెప్పకుండా ఎలా ర్యాలీ నిర్వహిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం 5 రోజులే ఉన్నా పట్టణంలో ఊపు కనిపించడంలేదు. స్థానికంగా టీఆర్ఎస్ నాయకులు మాత్రమే పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు. -
బరిలో ఎవరిని దింపుదాం
నామినేషన్లు ముగిసినా తేల్చుకోలేక పోతున్న పార్టీలు ఎంపికపై నేతల తర్జనభర్జన టెన్షన్లో అభ్యర్థులు జోగిపేట, న్యూస్‌లైన్: నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసినా, ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జోగిపేటలోని 20 వార్డులకు గాను 268 మందినామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఏ వార్డులో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్నది ఇంతవరకూ తేలలేదు. ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థుల జాబితాను తెప్పించుకున్న ఆయా పార్టీల నేతలు దామోదర్ రాజనర్సింహ, పి.బాబూమోహన్, మానిక్రెడ్డిలు గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురైదుగురు అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దామోదర రాజనర్సింహ, మిగతా అభ్యర్థుల విషయంలో స్థానిక సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పందించే అవకాశం కనిపిస్తోంది. వారు ప్రకటిస్తే చూద్దాం ప్రస్తుతం నేతలంతా ముందుగా ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే వారిని ఎదుర్కొనే సత్తా ఉన్న వారినే బరిలో దించాలని దాదాపు అన్ని పార్టీల నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఇప్పటివరకూ ఏ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన నాయకులకు నగర పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదని మాజీమంత్రి బాబూమోహన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పాతవారికి టీడీపీ గ్రీన్‌సిగ్నల్ కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉన్న మాజీ వార్డు సభ్యులు పట్లోళ్ల ప్రవీణ్‌కుమార్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకుని బాబూమోహన్ కలిసి తన అభిప్రాయాన్ని తెలిపారు. అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బాబూమోహన్ 10,11 వార్డుల్లో ఆయనతో పాటు ఆయన సతీమణికి కూడా టికెట్టు కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు ఖరారుకానున్న నేపథ్యంలో టీడీపీ కూడా ఆచితూచి స్పందిస్తోంది. ముఖ్యులందరికీ ఇచ్చేద్దాం కాంగ్రెస్ పార్టీ తరఫునపట్టణంలోని ముఖ్య నాయకులందరికీ టి కెట్లు కేటాయించేందుకు దామోదర రాజనర్సింహ అంగీకరించినట్లు తెలుస్తోంది. సోమవారం తుది జాబితాను ఆయన విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. ఏ పార్టీ అయినా సరే ఈనెల 18వ తేదీలోగా తమ అభ్యర్థులకు బీఫాంలు అందించాల్సి ఉండడంతో నామినేషన్ వేసిన వారంతో టెన్షన్ పడిపోతున్నారు. ‘‘నామినేషన్లయితే వేశాం..భీపాంలు ఇస్తారా? ఇవ్వకపోతే ఏం చేయాలి’’ అని ఆలోచిస్తున్న అభ్యర్థులంతా చివరి నిమిషంలో ఏనిర్ణయం తీసుకోవాలో ఇప్పుడే డిసైడ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
వట్టిమీనపల్లి సొసైటీ చైర్మన్‌గా మాణిక్‌రెడ్డి
నవాబుపేట, న్యూస్‌లైన్ : వట్టిమీనపల్లి ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా కొంపల్లి మాణిక్‌రెడ్డి ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక గురువారం వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎన్నికల అధికారి తకీహుస్సేన్ ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయ 9 నుంచి 11 గంటల వరకు చైర్మన్, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. చైర్మన్ పదవికి కాంగ్రెస్‌లో కాలె యాదయ్య వర్గానికి చెందిన కొంపల్లి మాణిక్ రెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి వర్గానికి చెందిన రాంరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి టీడీపీకి చెందిన లింగన్నొల ప్రమూకమ్మ, కాంగ్రెస్‌లో మల్లారెడ్డి వర్గానికి చెందిన మాణిక్‌రెడ్డి నామినేషన్లు వేశారు. వీటిని పరిశీలించిన ఎన్నికల అధికారి నామినేషన్ల ఉపసంహరణకు అరగంట గడువిచ్చి, గుర్తులు కేటాయించారు. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి మరో అరగంట వ్యవధి ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడించారు. మొత్తం 13 ఓట్లలో చెరి 7 చొప్పున ఓట్లు సాధించిన కొంపల్లి మాణిక్‌రెడ్డి చైర్మన్‌గా, ప్రమూకమ్మ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఉత్కంఠగా ఎన్నిక... గత బుధవారం వట్టిమీనపల్లి పీఏసీఎస్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ పార్టీలోని రెండు వర్గాల విభేదాలతో అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోలేని పరిస్థితి. మొత్తం 13వార్డుల్లో కాలె యాదయ్య వర్గానికి 3వార్డులు, చిట్టెపు మల్లారెడ్డి వర్గానికి 5వార్డులు దక్కాయి. కాగా టీడీపీకి 3వార్డులు, టీఆర్ఎస్కు 2వార్డులు దక్కాయి. గురువారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఎవరికీ మెజారిటీ స్థానాలు దక్కని పరిస్థితిలో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో యాదయ్య వర్గానికి చెందిన ముగ్గురు సభ్యులు వ్యూహాత్మకంగా టీడీపీ, టీఆర్ఎస్ సభ్యుల మద్దతు కూడగట్టారు. టీడీపీకి చెందిన ఓ సభ్యుడు మాత్రం మల్లారెడ్డి వర్గంవైపు మొగ్గు చూపారు. దీంతో ఆ వర్గానికి చెందిన రాంరెడ్డికి ఆరు ఓట్లు లభించాయి. ఒక్క ఓటు ఆధిక్యంతో కొంపల్లి మాణిక్‌రెడ్డి చైర్మన్‌గా, ఉపాధ్యక్షురాలిగా ప్రమూకమ్మ విజయం సాధిం చారు. ఎన్నికైన వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలో విజయోత్సవ ఊరేగింపు నిర్వహించారు. భారీ బందోబస్తు... పోలింగ్ రోజున జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని చైర్మన్ ఎన్నిక సందర్భంగా పీఏసీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ డీఎస్పీ పి.నర్సింలు, ట్రైనీ డీఎస్పీ హర్ష, సీఐ విజయ్లాల, ఎస్ఐలు చతుర్వేది, మోహినోద్దిన్, శిక్షణ ఎస్ఐలు వెంకటేశ్వర్ గౌడ్, శంషోద్దిన్, రమేష్, నర్సింలు ఆధ్వర్యంలో 52 మంది ఏఆర్, సివిల్ సిబ్బందిని మోహరిం చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
మాణిక్‌రెడ్డి, తుమ్మల కార్లపైకి కాల్పులు
సాక్షి,హైదరాబాద్/జోగిపేట: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పి.మాణిక్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్రావు కార్లపైకి కాల్పులు జరిగినట్లుగా భావిస్తున్న వరుస ఘటనలు కలకలం రేపాయి. అయితే వారిద్దరికీ ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా జోగిపేటలో మంగళవారం టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి హాజరైన మాణిక్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా రాత్రి 7.15 ప్రాంతంలో ముత్తంగి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా కొల్లూరు గ్రామం వద్దకు చేరుకునే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారులో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో భయపడిన వారు తమ వాహనాన్ని పక్కకు నిలిపి చూడగా వెనుక సీటులోని అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. ఈ విషయమై మాణిక్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ... అతివేగంగా పెద్ద శబ్దంతో అద్దాల నుంచి దూసుకుపోయిందని, అది తప్పకుండా బుల్లెటే అయి ఉంటుందన్నారు. ఈ ఘటనపై తాను సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి చెప్పానన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ విజయకుమార్‌ను వివరణ అడగ్గా ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల సంఘటన ఏదీ జరగలేదన్నారు. మరోవైపు అదే స్థలంలో మరికొద్ది సేపట్లోనే ఖమ్మం టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్రావు ప్రయాణిస్తున్న కారుపై కూడా దుండగులు కాల్పులు జరిపారు. తుమ్మల తన కుమార్తె ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఆయనకు ఏ ప్రమాదం జరగనప్పటికీ, కారులోని మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై తుమ్మల పీ.ఏ. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మాజీ ఎంపీ మాణిక్రెడ్డిపై హత్యాయత్నం!
మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత దాకూరి మాణిక్రెడ్డిపై మంగళవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ మేరకు మాణిక్‌రెడ్డి సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మాణిక్రెడ్డిపై దాడికి నిరసనగా రేపు జోగిపేట బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇది దొంగలపనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం మాణిక్‌రెడ్డి ఎదుగుదలను చూసి తట్టుకోలేనివారే ఆయనపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.