- నామినేషన్‌లు ముగిసినా
- తేల్చుకోలేక పోతున్న పార్టీలు
- ఎంపికపై నేతల తర్జనభర్జన
- టెన్షన్‌లో అభ్యర్థులు
జోగిపేట, న్యూస్‌లైన్:
నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల పర్వం ముగిసినా, ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జోగిపేటలోని 20 వార్డులకు గాను 268 మందినామినేషన్‌లు దాఖలు చేశారు. అయితే ఏ వార్డులో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్నది ఇంతవరకూ తేలలేదు. ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థుల జాబితాను తెప్పించుకున్న ఆయా పార్టీల నేతలు దామోదర్ రాజనర్సింహ, పి.బాబూమోహన్, మానిక్‌రెడ్డిలు గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురైదుగురు అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దామోదర రాజనర్సింహ, మిగతా అభ్యర్థుల విషయంలో స్థానిక సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పందించే అవకాశం కనిపిస్తోంది.
వారు ప్రకటిస్తే చూద్దాం
ప్రస్తుతం నేతలంతా ముందుగా ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే వారిని ఎదుర్కొనే సత్తా ఉన్న వారినే బరిలో దించాలని దాదాపు అన్ని పార్టీల నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఇప్పటివరకూ ఏ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదని తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన నాయకులకు నగర పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదని మాజీమంత్రి బాబూమోహన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పాతవారికి టీడీపీ గ్రీన్‌సిగ్నల్
కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉన్న మాజీ వార్డు సభ్యులు పట్లోళ్ల ప్రవీణ్‌కుమార్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకుని బాబూమోహన్ కలిసి తన అభిప్రాయాన్ని తెలిపారు.
అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బాబూమోహన్ 10,11 వార్డుల్లో ఆయనతో పాటు ఆయన సతీమణికి కూడా టికెట్టు కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు ఖరారుకానున్న నేపథ్యంలో టీడీపీ కూడా ఆచితూచి స్పందిస్తోంది.
ముఖ్యులందరికీ ఇచ్చేద్దాం
కాంగ్రెస్ పార్టీ తరఫునపట్టణంలోని ముఖ్య నాయకులందరికీ టి కెట్లు కేటాయించేందుకు దామోదర రాజనర్సింహ అంగీకరించినట్లు తెలుస్తోంది. సోమవారం తుది జాబితాను ఆయన విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. ఏ పార్టీ అయినా సరే ఈనెల 18వ తేదీలోగా తమ అభ్యర్థులకు బీఫాంలు అందించాల్సి ఉండడంతో నామినేషన్ వేసిన వారంతో టెన్షన్ పడిపోతున్నారు. ‘‘నామినేషన్లయితే వేశాం..భీపాంలు ఇస్తారా? ఇవ్వకపోతే ఏం చేయాలి’’ అని ఆలోచిస్తున్న అభ్యర్థులంతా చివరి నిమిషంలో ఏనిర్ణయం తీసుకోవాలో ఇప్పుడే డిసైడ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.