మాణిక్‌రెడ్డి, తుమ్మల కార్లపైకి కాల్పులు
సాక్షి,హైదరాబాద్/జోగిపేట: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ పి.మాణిక్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్‌రావు కార్లపైకి కాల్పులు జరిగినట్లుగా భావిస్తున్న వరుస ఘటనలు కలకలం రేపాయి. అయితే వారిద్దరికీ ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా జోగిపేటలో మంగళవారం టీఆర్‌ఎస్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి హాజరైన మాణిక్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా రాత్రి 7.15 ప్రాంతంలో ముత్తంగి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా కొల్లూరు గ్రామం వద్దకు చేరుకునే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారులో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో భయపడిన వారు తమ వాహనాన్ని పక్కకు నిలిపి చూడగా వెనుక సీటులోని అద్దాలు పగిలిపోయి ఉన్నాయి.
ఈ విషయమై మాణిక్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ... అతివేగంగా పెద్ద శబ్దంతో అద్దాల నుంచి దూసుకుపోయిందని, అది తప్పకుండా బుల్లెటే అయి ఉంటుందన్నారు. ఈ ఘటనపై తాను సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి చెప్పానన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ విజయకుమార్‌ను వివరణ అడగ్గా ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల సంఘటన ఏదీ జరగలేదన్నారు. మరోవైపు అదే స్థలంలో మరికొద్ది సేపట్లోనే ఖమ్మం టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రయాణిస్తున్న కారుపై కూడా దుండగులు కాల్పులు జరిపారు. తుమ్మల తన కుమార్తె ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఆయనకు ఏ ప్రమాదం జరగనప్పటికీ, కారులోని మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై తుమ్మల పీ.ఏ. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.