జోగిపేట, న్యూస్‌లైన్: ఎన్నికలు దగ్గర పడుతున్నా అందోల్ టీఆర్‌ఎస్‌లో మాత్రం విభేదాలు కొలిక్కి రావడం లేదు. తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి బాబూమోహన్ ఒక వర్గం వారినే ప్రోత్సహిస్తున్నారని చాలాకాలంగా పార్టీ జెండాలు మోస్తున్న వారిని పట్టించుకోవడంలేదని టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అందోల్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీపై కేసీఆర్, హరీష్‌రావుకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
రాష్ట్ర టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు స్వయంగా వచ్చి ఇరువురితో చర్చలు జరిపినా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అందోల్, పుల్కల్, అల్లాదుర్గం మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల జోగిపేటలో సమావేశం నిర్వహించి బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డిలను ఆహ్వనించారు. సమావేశంలో పార్టీలో మొదటి నుంచి ఉంటున్న నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బాబూమోహన్ తాను టీడీపీ నుంచి ప్రత్యేకమైన పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌లో చేరానని, తనతోపాటే మిగతా టీడీపీ కార్యకర్తలంతా వచ్చారని, ఇంకా టీడీపీ ఎక్కడుందని, మనమంతా ఒక్క తల్లిబిడ్డలమేనంటూ కలుపుగోలుగా మాట్లాడారు.
దీంతో విభేదాలు తొలగిపోయాయని అందరూ భావించారు. అయితే రెండు రోజుల క్రితం జోగిపేటకు వచ్చిన జహీరాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌తో కొంత మంది పాత టీఆర్‌ఎస్ నాయకులు బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. సమస్యలు తొలగేదాకా జోగిపేటలో ప్రచారం చేపట్టవద్దని ఒక వర్గం బాబూమోహన్ వర్గీయులకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. 5 రోజుల క్రితం అందోల్ టీఆర్‌ఎస్‌కు చెందిన యువకులు గ్రామాల్లో ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించి జోగిపేట మీదుగా వెళ్లారు. దీంతో పట్టణానికి చెందిన యువజన విభాగం టీఆర్‌ఎస్ నాయకులు తమకు చెప్పకుండా ఎలా ర్యాలీ నిర్వహిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం 5 రోజులే ఉన్నా పట్టణంలో ఊపు కనిపించడంలేదు. స్థానికంగా టీఆర్‌ఎస్ నాయకులు మాత్రమే పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు.
అందోల్ టీఆర్‌ఎస్‌లో అయోమయం
Published Thu, Apr 24 2014 12:05 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement